“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, ఫిబ్రవరి 2011, శనివారం

జ్ఞానయోగంలో యోగసాధనా ప్రాధాన్యత

మన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు వేదములు మరియు వేదాంతం అనబడే ఉపనిషత్తులు. ఈ వేదములు మరలా కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా ఉన్నాయి.వీటిలోని జ్ఞానకాండనే వేదాంతమని ఉపనిషత్తులనీ అంటారు. అత్యున్నతమైన తత్త్వజ్ఞానం వీటిలో నిండి ఉంది.

ఉపనిషత్తులలో జ్ఞానోపనిషత్తులవలెనే యోగోపనిషత్తులు కూడా ఒక భాగంగా ఉన్నాయి. వాటిలో యోగశిఖోపనిషత్తు ఒకటి. యజుర్వేదాన్తర్గతమైన యోగశిఖోపనిషత్ యోగసాధనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అందులోని ఒక ప్రసిద్ధ శ్లోకం ఇలా చెప్తుంది.

శ్లో|| జ్ఞాననిష్టో విరక్తోపి ధర్మజ్ఞో విజితేన్ద్రియః
వినా యోగేన దేవోపి మోక్షం లభతే విధే ||

అర్ధం||జ్ఞాననిష్ఠ ఉన్నప్పటికీ, విరక్తి ఉన్నప్పటికీ, ధర్మం గురించి తెలిసిఉన్నప్పటికీ, ఇంద్రియజయం కలిగినప్పటికీ, యోగం లేకపోతే దేవతలకు కూడామోక్షం కలుగదు. 

జ్ఞానమొక్కటే మోక్షాన్నిచ్చుటకు సమర్ధము అని శంకరాది బ్రహ్మవేత్తలు చెప్పియున్నారు. "జ్ఞానాదేవతు కైవల్యమ్" అన్న వాక్యములు కూడా దీనినే ప్రతిపాదిస్తున్నవి. కాని యోగోపనిషత్తులు మాత్రం యోగమును పరమప్రమాణముగా చెప్పుటకు కారణమేమి అన్న విచికిత్స కలుగుతుంది. 'పుమాన్ జన్మాంతర శతైర్యోగేనైవ ప్రముచ్యతే'. మానవుడు వందల కొలది జన్మలను ఎత్తిన పిమ్మట యోగం చేతనే మోక్షాన్ని పొందుచున్నాడు. అని ఇంకొకచోట చెప్పడం వల్ల ఈ రెంటిలో ఏది సరియైనది అన్న మీమాంస తలెత్తుతుంది. 

భగవద్గీత లో శ్రీకృష్ణభగవానుడిలా చెప్పినట్లు మనం చూడవచ్చు.

శ్లో|| తపస్విభ్యాధికో యోగీ జ్జానిభ్యశ్చ మతోదికః
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||

యోగి అన్నవాడు తపస్వుల కన్ననూ, జ్ఞానుల కన్ననూ, కర్మిష్టుల కన్ననూ, అధికుడు. కనుక ఓ అర్జునా నీవుయోగివి కా. ఇటువంటి పరస్పర విరుద్ధ భావనలు అనేకులలో సందేహాలను కలిగిస్తాయి. జ్ఞానము యోగములలో ఏది శ్రేష్టము? ఏది ఉన్నతము అన్న విచికిత్స కలుగుతుంది.

జ్ఞానమనునది అంత తేలికగా కలుగునట్టిది కాదు. దానికి ఉన్నతములైనట్టి అర్హతలు సాధకునకు ఉండాలి. ఆ అర్హతలు ఏమి? అన్న విషయాన్ని వేదములే వివరించాయి. శమదమాది షట్క సంపత్తి, ఇహాముత్ర ఫలభోగవిరాగము, శ్రద్ద, తితిక్ష, ముముక్షుత్వము మొదలైన ఉన్నత లక్షణాలు సాధకునిలో ఉన్నపుడు అట్టివాడు "శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య:" అన్న ఉపనిషద్వాక్యానుసారం ఆత్మ తత్త్వాన్ని గురించి గురుముఖతా విని, ఆ విన్నదానిని మనన నిధిధ్యాసనాది ఉపాయములచేత నిరంతరమూ ధారణ చెయ్యడం ద్వారా అజ్ఞానభ్రాంతిని వదల్చుకొని, మాయావరణాన్ని భేదించుకొని, "భిద్యతే హృదయగ్రంధి: ఛిద్యన్తే సర్వసంశయా:" అని వేదమాత చెప్పినట్లు ఆత్మజ్ఞానమును పొందగలుగుతాడు. కాని, అట్టి మహత్తరమైన దైవీలక్షణసంపత్తి కోటిమందిలో ఒకరికి మాత్రమే ఉంటుందో? లేక అదీ ఉండదో? సంశయమే. అందరికీ అట్టి ఉత్తమలక్షణాలు ఉండవు. ఒక్క వివేకానందులో, ఒక్క శంకరులో, ఎక్కడో కోటానుకోట్లజనులలో ఉత్తమాధికారులుగా ఉద్భవిస్తారు.

కనుక మనవంటి మంధాధికారుల కొరకు, వారివారి దేహేంద్రియప్రాణమనస్సులను క్రమబద్ధీకరించుటకొరకు యోగసాధన విహితముగా చెప్పబడింది. లోకమంతా అల్పజ్ఞులతోనూ మందాధికారులతోను నిండి ఉన్నది కనుక అట్టివారికోసం వేదమాత యోగాన్ని ప్రమాణంగా సూచించింది. 'అథ తద్దర్శనాన్నుపాయో యోగః' అంటూ " పరమ సత్యాన్ని దర్శించే ఉపాయం యోగం" అని వేదం చెప్పింది. అంతేగాని ఉత్తమలక్షణసంపత్తి లేనటువంటి మందాధికారులకు కూడా జ్ఞానమే పరమప్రమాణము అని వేదమాత ఎక్కడా చెప్పలేదు. మనవంటివారు సరాసరి జ్ఞానసాధన చెయ్యబోతే "ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు" అన్న సామెత సార్ధకమౌతుంది.

ఈ విషయాన్ని వివరిస్తూ "వేదాంత పంచదశి " లో మాధవవిద్యారణ్యులు ఇలా అన్నారు

శ్లో|| బహువ్యాకుల చిత్తానాం విచారాత్తత్వ ధీనిహి
యోగో యుక్త స్తతస్తేషాం ధీ దర్పస్తేన శామ్యతి ||

అర్ధం|| అనేక విషయాలతో నిండిన వ్యాకుల చిత్తం కలిగిన వారికి ఉత్త (తార్కిక) జ్ఞాన విచారణ వల్ల ఫలితం లేదు. వారికి ఉన్నపాండిత్య దర్పం యోగం వల్లనే శాంతిస్తుంది. 

కనుక శమదమాది దైవీసంపద లేనట్టి మందాధికారులకు యమనియమాది క్రమానుగతమైన యోగసాధనము ఉపాయముగా చెప్పబడింది. ఉత్తమమైన సాధనా సంపత్తి సహజముగా కలిగినట్టి పుణ్యాత్ములకు సరాసరి జ్ఞానయోగసాధన ఉపకరిస్తుంది. యోగసాధన చేసి అనుభవాన్ని పొందకుండా ఉత్త ఉపనిషద్వాక్యాలను వల్లిస్తున్న పండితగురువులవల్లనే వేదాంతమనునది మెట్టవేదాంతముగా మారుతున్నది. వేదాంతమనునది బుద్ధిపరంగా అర్ధం చేసుకుని ఇతరులకు బోధించగలిగే ఎకాడమిక సబ్జక్ట్ కాదు. అది నియమితయోగసాధన, వివేక వైరాగ్యాది దైవీగుణములు, ఆత్మచింతనల ద్వారా పొందగలుగు అనుభవైక వేద్యమైన సత్యజ్ఞానం. ఈ విషయాన్ని చక్కగా అర్ధం చేసుకోవాలి.

యోగబీజమనే గ్రంధం ఇలా అంటుంది.

'తదా యోగేన రహితం జ్ఞానం మోక్షాయ నో భవేత్' 

యోగరహితమైన జ్ఞానం మోక్షాన్ని ఇవ్వలేదు. యోగము జ్ఞానము రెండూ కలిసినప్పుడే సత్యమైనట్టి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కనుక ఉత్తమాధికారులకు జ్ఞానయోగము సరాసరి ఉపకరిస్తుంది. మందాధికారులకు అష్టాంగయోగము సాధనమౌతున్నది. ఈ విధముగా ఎవని అర్హతను బట్టి వానికి ఉపాయమును సూచించటమే మన హిందూ ధర్మములోని విశిష్టతలలో ఒకటి. ఈ సూక్ష్మాన్ని చక్కగా తెలుసుకొంటే విచికిత్సకు తావులేకుండా ఉంటుంది.