“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జనవరి 2011, మంగళవారం

విశ్వాత్మ తత్త్వం ( చివరి భాగం )

"మరి అరవిందుల సంగతి ఏమిటంటారు ? ఆయనా చివరకు అనుకున్నది సాధించలేక నిరాశతోనే పోయారనుకుంటాను. " అడిగాను నేను.

"అవును. ఆయనా దారి తప్పినట్లే. ఫ్రెంచి వనిత అయిన మదర్ కు ప్రముఖ స్థానం ఇవ్వటం అంత సరి అయిన పని కాదు. ఆమె శక్తివంతురాలని మేమూ ఒప్పుకుంటాము. కాని అంతగా స్థాయిలో ఆమెను కూచోపెట్టటం సరికాదు. అరవిందులకూ రమణ మహర్షికీ కొన్ని అభిప్రాయ భేదాలుండేవి. శిరస్సుపైన ఉన్న వెలుగును హృదయంలోకి దించాలని అరవిందులన్నారు. ఇదే విషయాన్ని ఎవరో రమణ మహర్షిని అడిగితే " మరి శిరస్సుకూ హృదయానికీ మధ్యలో ఏముందిట? " అని ఆయన ప్రశ్నించారు. విషయాన్ని మళ్ళీ అరవిందులకు ఎవరో చేరవేశారు. తదుపరిఅరవిందులు తన ఒకానొక శిష్యుని ద్వారా రమణ మహర్షిని ప్రశ్నింప చేసారు .

"ఏమని ప్రశ్నించారు" అడిగాను నేను.

"మధ్యలో ఏమున్నది అని ప్రశ్నిస్తున్నది ఎవరు? " అని అడిగించారు.దానికి మహర్షి మౌనం వహించారు. మాటకుజవాబు లేదు. అది అనుభవైక వేద్యం. అంతే. విధంగా వారిమధ్యకూడా కొంత మాటలయుద్ధం నడిచిందనిచెప్పవచ్చు. గొడవలలో కపాలిశాస్త్రివంటి కొందరు శిష్యులు రమణమహర్షిని వదిలిపెట్టి అరవిందుల వద్దకు చేరారు. రకంగా ఎవరి లోపాలు వారివద్ద ఉన్నాయి.

విశ్వాత్మ గారు సాలోచనగా నవ్వారు.

"క్రియాయోగం పరిస్థితి పైన మీ అభిప్రాయం ఏమిటి?" అడిగాను నేను.

" అదీ అంతే. ప్రస్తుతం ఉన్న క్రియా యోగం అసలైనదని చెప్పలేము. దానిలో కూడా ఏన్నోశాఖలు ఉపశాఖలు తయారైనాయి. ఎందఱో కొత్త గురువులు పుట్టుకొచ్చారు. నేను హిమాలయాలలో ఉన్నపుడు బాబాజీ కలిశారు. మాటల మధ్యలో ఆయనిలా అన్నారు. " నేను లాహిరీకి క్రియా యోగాన్ని చెప్పాను. తర్వాత ఏమి జరిగిందో నాకుతెలియదు. నాకు లాహిరీ వరకే తెలుసు. తరువాతి వారు తెలియదు " అన్నారు. మరి ఇప్పటి క్రియాయోగం ఎవరిసృష్టి? ఇన్ని రకాల శాఖలు ఉపశాఖలు ఎక్కణ్ణించి వచ్చాయి? అసలైన క్రియాయోగం లో ఇన్నిరకాల క్రియలు, శాఖలు ఉండవు. బాబాజీ దృష్టి మీమీద పడితే మీ సాధన పూర్తి అయినట్లే. ఆయన దృష్టితోనే సాధన అంతా జరుగుతుంది. అది అసలైన క్రియాయోగం. కాని నేటి క్రియాయోగం ఎలా ఉందొ మీకు తెలుసు కదా. నేటి క్రియాయోగం లో మీరు చేసే క్రియలు ఎక్కువగా ఉంటాయి. కాని అసలైన క్రియాయోగంలో బాబాజీదృష్టి మాత్రమే అంతా చేయిస్తుంది. మనం చెయ్యాల్సినది ఏమీ ఉండదు. నేను ఇదే మాటను దయామాతగారితో చెప్పాను. ఆమె మౌనంగా విని "కంగ్రాచ్యులేషన్స్" అని క్లుప్తంగా అని ఊరుకున్నారు. నిజం ఆమెకూ తెలుసు. కాని అంతకన్నాఎక్కువ ఆమె మాట్లాడితే సంస్థ దెబ్బ తింటుంది.అలా మాట్లాడటం ఇప్పటి క్రియాయోగవ్యవస్థకు వ్యతిరేకం. కనుక ఆమె అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు.

ప్రపంచం లో ఏదీ స్వచ్చంగా ఉండలేదు. జనం ఉండనివ్వరు. లోకులు దేన్నైనా కలుషితం చేస్తారు. దిగజారుస్తారు. షిర్డీసాయిబాబాకు గతి పట్టిందో చూస్తున్నారుగా. చివరికి కోరికలు తీర్చే యంత్రంగా ఆయన్ని దిగజార్చి కూచోపెట్టారు. నేటి లోకంలో ఆయన ఒక వ్యాపార వస్తువైనాడు. జనానికి మహిమలు కావాలి. వారివారి కోర్కెలు తీరటం కావాలి. మహిమలు చూపించే వారు లోకుల దృష్టిలో గొప్పవాళ్ళు. వాళ్ళ చుట్టూనే పిచ్చిజనం మూగుతారు.

మేడం బ్లావేత్స్కీ నేటి బాబాల కంటే ఎన్నో గొప్ప మహిమలు చేసింది. ఒకసారి ఆమె తన శిష్యులతో ఎడారిలో ప్రయాణంచేస్తున్న సమయంలో చీకటి పడింది. చీకటి రాత్రి ఎడారిలో చలిలో ఎక్కడ ఉండాల్రా దేవుడా అని వారంతా భయపడుతున్న సమయంలో ఎడారిలో ఒక పెద్ద భవనాన్ని సృష్టించింది బ్లావేత్స్కీ. అందరూ తెల్లవార్లూ భవనంలో హాయిగా ఉన్నారు. తెల్లవారిన తరువాత చూస్తె భవనం లేదు ఏమీ లేదు. మళ్ళీ ఎడారిలో అందరూ నిలబడిఉన్నారు. మరి రాత్రంతా విశ్రాంతినిచ్చిన భవనం ఎక్కడికి పోయింది? ఇలాటి మహిమలు ఎన్నో చేసి చూపింది ఆమె. ఒక ఆవును సృష్టించి తానే పాలుపితికి తాగమని అందరికీ ఇచ్చేది. కాసేపటి తరువాత చూస్తె ఆవూ ఉండదు ఏమీఉండదు. మరి కాసేపు ఆవు ఎక్కణ్ణించి వచ్చేదో ఎవరికీ తెలిసేది కాదు. పాలు తాగినట్లు చారికలు కనిపిస్తూనే ఉండేవి. సంఘటనలను ఎలా వివరించగలం? ఇలాటి మహిమలు ఎన్నో ఆమె చేసింది. ఇవన్నీ నేటి బాబాల మహిమలకంటే చాలా రెట్లు గొప్పవి. జనానికి ఇలాటి మహిమలు చేసేవాళ్ళూ కోరికలు తీర్చేవాళ్ళూ కావాలి. అంతే గాని శుద్ధ జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు.

టిబెట్ లో నేను కళ్ళారా చూచాను. గాలిలో తేలే యోగులున్నారు. గాలిలో పైకి లేచి శూన్యంలో పడుకొని ఉయ్యాల బల్లమీద ఊగినట్లు ఊగుతారు. నాటికీ ఉన్నారు. ఒక అయిదారుగురు లామాలు గుండ్రంగా నేలమీద కూచుంటారు. కూచున్న వాళ్ళు కూచున్నట్లే గాలిలోకి తేలిపోయి చాలా ఎత్తులో శూన్యంలో కూచుని, అక్కడ ఆసనాలు అభ్యాసం చేస్తారు. సత్సంగం శూన్యంలోనే జరుగుతుంది. తరువాత నిదానంగా కిందికి దిగి వస్తారు. ఇదంతా నేను చూచాను. కాని వాళ్ళు మన హిందూయోగుల కాళ్ళకు నమస్కారం పెడతారు. మనల్ని గౌరవిస్తారు. కారణం? ఎన్ని విద్యలు ప్రదర్శించినా వాళ్లకు దేహ స్పృహ ఉన్నది. దేహ స్పృహ లేని మన యోగులు వీరికంటే ఉన్నతస్థాయిలో ఉన్నట్లే. " మీకు యోగవిధానాలు తెలియవు. కనుక మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి అభ్యాసం ద్వారా సాధించవచ్చు. కాని దేహస్పృహ లేని స్థితి అత్యుత్తమం. అది సాధించటం అతి కష్టం. అది మాకు లేదు. మీకుంది" అని వారంటారు.

వారిని ఇక్కడకు జనం మధ్యలోకి తేవాలని నేను ప్రయత్నం చేసాను. మొదట్లో వస్తామని వాళ్ళూ ఒప్పుకున్నారు. తరువాత మేము రామన్నారు. ఇక్కడకొస్తే ఏముంది? మొదట్లో జనమందరూ వేలంవెర్రిగా ఎగబడి చూస్తారు. తరువాత తమ కోరికలు తీరే చిట్కాలు చెప్పమని వేధిస్తారు. చెప్పకపోతే తాటాకులు కడతారు. కొన్నాళ్ళు పోయిన తరువాత,మొదట్లో బ్రహ్మరధం పట్టిన ఇదే జనమే బురద చల్లుతారు. గారడీ విద్యలని పేరుపెట్టి తరిమితరిమి కొడతారు. తతంగాలు జరుగుతాయని వారికి తెలుసు. అందుకే జనం మధ్యకు వారు రారు.

కనుకనే మనలో మనం ఉండటం అన్నింటిలోకీ శ్రేష్టం. ఆలోచనలు కూడా మనకు ప్రతిబంధకాలే. నిజానికి ప్రపంచం ఒక భావన. అది ఆలోచనకూడా కాదు. అంతకంటే క్రిందిదైన ఒక భావనామాత్రం. భావనలోనే అంతాఉంది. భావన ఎలా ఉంటె మనకు అలా కనిపిస్తుంది.

దేవుళ్ళు పూజలు అవసరం లేదా అంటే అవసరమే. కాని వాటి అవసరం ఎంతవరకో తెలుసుకోవాలి. ఒకటోతరగతి రెండోతరగతి ఈ విధంగా తరగతులు అవసరమే. మనం ఎంత వరకు వచ్చామో అవి తెలియచేస్తాయి. కాని ఎప్పటికీ ఒకటో తరగతి లోనే ఉంటే అదేమి విద్యాభ్యాసం? బాగా చదువుకున్నవాడు ప్రతిరోజూ అ, ఆ, లు దిద్దుకోడు. కాని అంతమాత్రాన ఇవి దిద్దకుండా ఆ స్తితికీ చేరలేడు. అలాగని అ, ఆ, లు దిద్దటమే చదువుకదా అని ఎప్పుడూ అవే దిద్దుకుంటూ ఉండకూడదు. ముందు క్లాసులకు ఎదగాలి. ఇది కూడా అంతే.

వివేకానందులు సేవా భావాన్ని ప్రచారం చేశారు. ఎందుకని అలా చేసారు? అప్పట్లో బ్రిటిష్ పరిపాలన ఉండేది. పేదరికం ఉండేది. దోపిడీ ఉండేది. అందుకని ఒకరికి ఒకరుగా సేవా భావం అవసరం అని వారు భావించారు. కాని అదే సర్వస్వంకాదు. ఆ కాలానికి అది అవసరం. ఇప్పుడు అంతగా అవసరం లేదు.

"అవును. ప్రస్తుతం సేవ ఎవరికీ అవసరం లేదు. ప్రస్తుత సమాజంలో అందరి దగ్గరా డబ్బు బాగానే ఉంది. నూరేళ్ళక్రిందటి పరిస్తితులు ఇప్పుడు లేవు. కనుకనే సేవ అనే పదానికి అర్ధం లేకుండా పోయింది." అన్నాను నేను.

విశ్వాత్మ గారు అవునన్నట్లు తలాడించారు.

"సామాన్యంగా నేను ఇంతసేపు మాట్లాడను. ఒక్కొక్కసారి అలా చెప్పాలనిపిస్తుంది. చెప్తాను. నేను ఏదీ ఇలా చెయ్యాలి అనుకోని చెయ్యటంఉండదు. సమయానికి దానంతట జరిగితే ఏదైనా జరుగుతుంది. అదే విధంగా మీరు కలవటం ,ఇంతసేపు మాట్లాడుకోవటం అనుకోకుండా జరిగింది." అన్నారు ఆయన.

అర్ధమైంది అన్నట్లు నేనూ చిరునవ్వు నవ్వాను.

దాదాపు గంటన్నర పైగా అందరం నిలబడే ఉన్నాము. చీకటి పడింది. బాగా చలి మొదలైంది. లోపల తమ్ముడుసుబ్రహ్మణ్యం, ఇక నిలబడలేక కొంచం దూరంలో కుర్చీలో కూచుని ఉన్నాడు. అతనికి కొంచం విసుగ్గా ఉన్నది. ఎంతసేపు ఇలా ఆయన చుట్టూ నిలబడి శిలా ప్రతిమలలాగా వింటూ ఉంటారు వీళ్ళు? అని అనుకున్నాడో ఏమో మరి. బయలుదేరుదాం రమ్మని
అక్కణ్ణించి నాకు సెల్ ఫోన్ చేస్తున్నాడు. రెండు మూడు సార్లు అలా ఫోన్ చేసాడు. అది నాజేబులోనే ఉన్నది కాని విశ్వాత్మగారి మాటలు వింటున్న ఏకాగ్రతలో నాకు సెల్ మోగిన చప్పుడు వినబడలేదు. అందుకని పక్కనే ఉన్న తమ్ముడు అంజిబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అంజిబాబు కదిలి వారివద్దకు వెళ్ళాడు. నాకు పరిస్తితి అర్ధమైంది. వాళ్ళు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళాలి. గుంటూరు నుంచి ఇంకా రెండు గంటలు ప్రయాణం చెయ్యాలి. కనుక బయలుదేరకతప్పదు. లేకపోతె ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది. వాతావరణంకూడా బాగాలేదు. అదీ గాక హై ఫ్రీక్వెన్సీభావాలను గంటలుగంటలు వినడం తట్టుకోవడం చాలా కష్టం.

సరే నని విశ్వాత్మ గారికి నమస్కరించి సెలవు తీసుకున్నాము. ఆయనకు కూడా పరిస్తితి అర్ధమైంది. "అలాగే" అంటూచిరునవ్వుతో కదిలి ముందుకెళ్ళి పోయారు. ఎంత హటాత్తుగా మొదలైందో అంత హటాత్తుగానే సంభాషణ ముగిసింది. మామూలుగా సాగే పరిచయాలు, మీరెక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు వగైరా మాటలు లేవు. సంభాషణలో పడి "లగ్ననాడి" నా కాపీని శ్రీకాంత్ గారి వద్దనే మరచి పోయాను.
ఎవరి దారిన వాళ్ళం బయలుదేరాము.