“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, జనవరి 2011, శుక్రవారం

విశ్వాత్మ తత్త్వం

శ్రీకాంత్ గారు నన్ను విశ్వాత్మ గారికి పరిచయం చేసారు. నేను కొంచం పక్కగా ఉండి ఆయన ఏమి పరిచయం చేస్తున్నారో సరిగా వినలేదు. పైగా పక్కనే మైకొకటి. దాంట్లో ఎగ్జిబిషన్ వారి ప్రకటనలోస్తున్నాయి. కానీ మధ్యలో మాత్రం "అఘోరీ బాబా జాతకాన్ని విశ్లేషణ చేసింది వీరే" అన్న శ్రీకాంత్ గారి మాట వినిపించింది. మైకు బారినుండి తప్పుకోటానికి అందరంకొంచం పక్కగా జరిగాము.

విశ్వాత్మ గారు మంచి స్పురద్రూపి. ఆరడుగుల ఎత్తుంటారు. బవిరి గడ్డం. వయస్సు చూస్తె ఏభై -ఏభై అయిదు మధ్యలోఉండవచ్చు అనిపిస్తుంది. గట్టి శరీరం. మోకాళ్ళవరకు కాషాయలుంగీ లాటిది కట్టుకొని పైన ఒక కాషాయ ఉత్తరీయం కప్పుకున్నారు. యోగుల కళ్ళలో ఉండే ప్రత్యేకత ఆయన కళ్ళలో కనిపించింది. అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలుకొనుక్కుని ఒక స్టాల్లోనుంచి బయటకు వస్తున్నారు.

నాకొక విద్య తెలుసు. ఏళ్ల తరబడి ధ్యానాభ్యాసం వల్ల నాకా విద్య పట్టుబడింది. ఒక వ్యక్తి హృదయంతో నేను సరాసరి తాదాత్మ్యం చెందగలను. తద్వారా వ్యక్తి మనసులో భావాలు నాకు ముందే తెలిసిపోతుంటాయి. ఇదంతా మౌనంగా జరుగుతుంది. బయటి వాళ్లకు అర్ధం కాదు. అలాటి సమయంలో ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే నాతో నేను మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ధ్యానాభ్యాసంలో ఇది చిన్నటెక్నిక్. కాని చక్కని అనుభూతినిస్తుంది. బాగా ఉపయోగపడుతుంది. విశ్వాత్మ గారి సమక్షంలో ఇదే స్తితిలోకి ప్రవేశించాను. దానివల్ల ఆయన భావప్రవాహాన్ని తేలికగా రిసీవ్ చేసుకోగలిగాను.

ఆయన మాట్లాడుతున్నంతసేపూ మిగిలినవాళ్ళం దాదాపు శ్రోతలుగానే మిగిలాము. మధ్యలో నావి ఒకటో రెండో ప్రశ్నలుతప్పించి రెండుగంటల పాటు ఆయన వాగ్ధాటి కొనసాగింది. పరిచయం అయింది అప్పుడే అయినా ఎప్పటినుంచో తెలిసినవాళ్ల లాగా సంభాషణ మొదలైంది.

రెండుగంటలపాటు ఆయన మాట్లాడినమాటలను ఒక్కమాటలో కుదించి చెప్పవచ్చు. దానిని వేదాంతపరిభాషలో "దృగ్-దృశ్య-వివేకం" అంటారు. అంటే, చూడబడుతున్న దృశ్యం- చూస్తున్న ద్రష్టకంటే భిన్నం అన్నస్పృహలో నిరంతరమూ ఉండటం. ఇది వేదాంత సాధన. జ్ఞాన మార్గం. శంకర భగవత్పాదులు పేరుతొ ఒక చక్కని గ్రంధాన్ని వ్రాశారు. జ్ఞానులంతా ఇదే స్థితిలో ఉంటారు. అందుకే వారిని ప్రపంచపు మాయలు లొంగతీసుకోలేవు.

యోగుల కళ్ళలోనే కాదు, స్వరంలోనూ ఒక ప్రత్యెక మాధుర్యం ఉంటుంది. అది యోగులు తేలికగా గుర్తించగలుగుతారు. ప్రత్యేకత ఆయన గొంతులో ధ్వనించింది. ఆయన వాగ్ధాటి మంద్ర స్వరంలో ఇలా సాగింది.

"నేననేది నాకు ముఖ్యం. నేను చూచేదృశ్యం ముఖ్యం కాదు. వినే శబ్దం ముఖ్యం కాదు. అలాగే ఇతర ఇంద్రియాల ద్వారా తెలియబడుతున్న విషయపరంపర ముఖ్యం కాదు. పంచేంద్రియాల ద్వారా బాహ్యవిషయాలను తెలుసుకొంటున్న ఎరుక ఏదైతే ఉన్నదో అదేనేను. నేనన్న భావనలో నిరంతరమూ ఉండాలి. అదే నిత్యం. ప్రపంచం మొత్తం నశించినా ఎరుక నశించదు.

ప్రపంచం మీద "నేను" ఆధారపడి లేదు. ప్రపంచమే "నేను" మీద ఆధారపడి ఉన్నది. మనం నిద్రిస్తున్నపుడూ ప్రపంచం ఉన్నది. సూర్యుడూ చంద్రుడూ ఉన్నారు. కాని సమయంలో మాత్రం మనవరకు వారు లేనట్లే. కనుక ప్రపంచమంతా "నేను" దాన్ని గుర్తించటం మీదే ఆధారపడి ఉన్నది. కాని దానికి ప్రత్యెక ఉనికి లేదు. నేను ఉన్నది అనుకుంటే ప్రపంచం ఉన్నది. దాన్ని నేను గుర్తించకపోతే అది లేదు. కనుక ప్రపంచాన్ని గుర్తిస్తున్న "నేను" ముఖ్యం. కాని ప్రపంచం నాకు ముఖ్యం కాదు.

సూర్యుడు లేకుంటే నువ్వు లేవు. అని అంటారు. కాని సూర్యుడు అలాగే ఉంటున్నాడు. మనిషి మాత్రం మరణిస్తున్నాడు. కనుక మాట నిజం కాదు. నిజానికి " నేను " లేనప్పుడు ప్రపంచం లేదు. అలాగే సమస్త ప్రకృతీనూ. కనుక మనిషి ఉనికి అనేది బయట వస్తువులపైన ఆధారపడి లేదు. ఉందని అనుకుంటే అది మన భ్రమ. కాని మనిషి తనను తాను మరిచి బాహ్య వస్తువులకోసం, వ్యక్తుల కోసం పరిగెత్తుతున్నాడు. అదే అతను చేస్తున్న తప్పు.

సాధకుడనేవాడు ముందుగా ప్రపంచాన్ని వదలాలి. తరువాత దేవుణ్ణి వదిలిపెట్టాలి. తరువాత గురువుని వదిలిపెట్టాలి. ముగ్గురినీ పట్టుకొని ఉన్నంత వరకూ అతను అజ్ఞానం లోనే ఉన్నట్లు లెక్క.

లోకమంతా దేవుళ్ళ పూజలతో నిండి ఉంది. లోకులు వాళ్ళ జీవితమంతా పూజలు చేస్తూనే ఉంటారు. కాని అంతరికంగా వారికి ఎదుగూ బొదుగూ ఉండదు. అలాగే ఇంకొందరు, రకరకాల గురువులను పట్టుకొని వేల్లాడుతూ ఉంటారు. వాళ్ళూఅంతే. నేను తక్కువ వాణ్ని. మా గురువు గొప్పవాడు అనుకుంటూ జీవితమంతా అలాగే బ్రతుకుతూ ఉంటారు. అంతేగానితత్వాన్ని గ్రహించలేరు. గురువులూ చెప్పరు. గురువు గురువుగానే ఉంటాడు. శిష్యుడు శిష్యుడుగానే ఉంటాడు.

ఒక ప్రసిద్దబాబా గారున్నారు. ఆయన శిష్యుడొకాయన తన చిన్నప్పటినుంచి బాబా వద్దకు వస్తున్నాడు. ప్రస్తుతంశిష్యుడు బాగా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఆయనకొక మనవడు ఉన్నాడు. మనవడితో పాటు ఇప్పటికీ ఇంకా బాబాగారి వద్దకువచ్చి అదేచోటిలో ఆయనకాళ్ళవద్ద కూచుంటున్నాడు. అంటే అతను ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా ఏమి తెలుసుకున్నట్లు? ఏమి ఎదిగినట్లు? పోనీ బాబాగారు సత్యాన్ని తన శిష్యులకు చెబుతున్నారా అంటే అదీ లేదు.

నిజానికి, నాలో ఏమున్నదో, అదే శిష్యుడవైన నీలోనూ ఉన్నది. నేను గురువునూ కాను, నీవు శిష్యుడవూ కావు. నేనేదో నీవూ అదే. అన్న స్థితికి తన శిష్యులను తెచ్చేవాడే నిజమైన గురువు. ఇదే అసలైన వేదాంత బోధ.

అటువంటి బోధ చేసే గురువులూ ప్రస్తుతం లేరు. ఒకవేళ గురువులు ఉన్నా, వినే శిష్యులూ లేరు. జిడ్డు కృష్ణమూర్తి తన జీవితమంతా చెప్పి చూచాడు. ఎవరికీ అర్ధం కాలేదు. విన్నంత సేపూ బాగానే వింటారు. కానీ ఆచరణ ఉండదు. జిడ్డుగారు అదే చెప్పేవాడు. " గురువుతోనూ అవసరం లేదు" అని తన జీవితమంతా చెబుతూనే ఉన్నాడు. ఆయన చెబుతున్నవిషయాన్ని అర్ధం చేసుకోకుండా తిరిగి ఆయన్ను ఎదురు ప్రశ్నించేవారు.

"మీరు చెబుతున్నది నిజమే అయితే, గురువు అవసరం లేకపోతే, మరి మీ అవసరం మాత్రం ఏముంది? మీరెందుకు మాకు చెబుతున్నారు?" అని.

దానికి ఆయన ఇలా జవాబిచ్చాడు. "నా అవసరం మీకు లేదు అన్నవిషయం మీకు అర్ధంకావాలనే ఇంత వివరంగా చెబుతున్నాను" అనేవాడు. కాని ఎంతమంది అర్ధం చేసుకోగలిగారు? ఎంతమంది ఆచరించగలిగారు? చాలా కొద్దిమంది ఉంటారు. వేళ్ళమీద లెక్కించవచ్చు.

దాదాపు ఎనభైఏళ్ల క్రితం, కొన్ని వేలకోట్లరూపాయల సామ్రాజ్యాన్ని తృణీకరించి, తన మీద మోపబడిన "ప్రవక్త" టైటిల్నితృణప్రాయం గా త్యజించిన మహా వ్యక్తి ఆయన. ఆయన్ని "ఆర్డర్ ఆఫ్ ది స్టార్" అన్న దియసాఫికల్ సంస్థ కు తిరుగులేని నాయకునిగా ఎన్నుకొని, ఒక దేవుడుగా, ప్రవక్తగా, గుర్తిస్తున్న కొన్ని వేల మంది ఎదుట " నేను మీరనుకుంటున్న ప్రవక్తను కాను. నాలో ప్రత్యేకతా లేదు " అని సత్యాన్ని తేటతెల్లంగా చెప్పిన మనిషి. నేను ఆయనతో చాలా రోజులు కలిసి ఉన్నాను. చివరి రోజులలో ఆయన నిరాశతో చనిపోయాడు. తన జీవితమంతా శ్రమించి చెప్పినదేదీ ఎవరికీ ఎక్కలేదని, మనుషులలో మార్పు రాదనీ, తన జీవితం వృధాగా గడిచిందని ఆయన బాధపడ్డాడు.

రజనీష్ కూడా ఇలాగే నిరాశతో చనిపోయాడు. మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే రజనీష్ గారితో మాట్లాడాను. ఆయనతో కలిసి తిరిగాను. ఆయన మహావేదాంతి, విజ్ఞానఖని. ఎన్ని పుస్తకాలు, గ్రంధాలు చదివాడో లెక్కే లేదు. ఫిలాసఫీలో పండిపోయాడు. ఆయన కూడా చివరకు నిరాశతో పోయాడు. " ప్రపంచం కుక్కతోక వంటిది. దీని వంకర ఎన్నటికీ మారదు. కాని నా వాణి వృధా పోదు. దీనిని భద్రపరచండి. కారణం? వాణి నాది కాదు. ఇది పైనుంచి వచ్చింది. ముందుతరాలలో ఎవరికి ఇది చేరుతుందో? ఎవరిని మేల్కొలుపుతుందో?" అనేవాడు. అమెరికాలో "ఒరెగాన్" స్టేట్ లోని వందల ఎకరాల పనికిమాలిన బీడు భూమిని రెండేళ్లలో నందనవనంగా మార్చి చూపించాడు. ఆయనక్కడుంటే కొన్నేళ్లలో అమెరికా మొత్తం ఆయనకు దాసోహం అంటుందని భయపడి ప్రభుత్వం ఆయన్ను దొంగ కేసులో ఇరికించి తరిమేసింది. ప్రపంచంలో ఎక్కడైనా ఒకద్వీపాన్ని కొనుక్కుని ఉండిపోదామని చూస్తె ఎక్కడా అమ్మకుండా నిలువ నీడ లేకుండా చేసింది. చివరికి అమెరికావాళ్ళు చేసిన విషప్రయోగంతోనే ఆయన చనిపోయాడు.

మహానీయులందరూ ఇక్కడే ఫెయిల్ అయ్యారు. ఊబిలో ఉన్నవాడిని బయటకు తియ్యాలంటే తాను ఒడ్డున ఉండి, వాణ్ని ఏదన్నా తాడుతో బయటకు లాగాలి. అంతేకాని తానుకూడా ఊబిలోకి దిగితే ఏమౌతుంది? ఇద్దరూ మునుగుతారు. మహనీయుల పరిస్తితి కూడా ఇలాగే తయారైంది. నేలబారున ఉన్న తన శిష్యుణ్ణి పైకేత్తాలంటే తాను ఒంగవచ్చు. కాని పాకరాదు. దేకరాదు. తాను వాని స్థితికి దిగజారకూడదు. కాని ప్రస్తుతపు గురువులందరూ చేస్తున్నది పాకుడే. శిష్యుల్నిఉద్దరించబోయి, వాళ్ళు కూడా దిగజారుతున్నారు. ఊబిలోకి దిగుతున్నారు.

రమణ మహర్షి కూడా ఇక్కడే ఫెయిల్ అయ్యాడు. చిన్నప్పుడు ఈశ్వరాన్వేషణలో ఇల్లు వదిలి వచ్చాడు. కాని చివరకు అదేసంసారంలో చిక్కుకున్నాడు. ఆయన అతి మామూలు మనిషిలా బతికాడు. కాని ఇప్పుడు ఆయనకు ఉన్నవీ లేనివీ అంటగడుతున్నారు. చివరిలో ఆయనకు కాన్సర్ వచ్చినపుడు కొందరు శిష్యులు లండన్ తీసుకు వెళతామన్నారు. అక్కడ మంచి ట్రీట్మెంట్ చేయిస్తామన్నారు. వారి కుటుంబసభ్యులు దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ మహర్షి అక్కడే చనిపోతే అప్పుడు అక్కడే సమాధి చెయ్యవలసి వస్తుంది. అప్పుడు ఇండియాలో ఆశ్రమం దిక్కులేనిదౌతుంది అని తలచి విదేశీయ శిష్యులను రౌడీలతో కొట్టించారు.

విదేశీ శిష్యులు అడిగారు " స్వామి. మీరు మాతో వస్తారా?. ఇక్కడే ఉంటారా? అని.

దానికాయన " శరీరం ఇక్కడినుంచే వచ్చింది. ఇక్కడే ఉండనివ్వండి." అని అన్నాడు. వారు వెళ్ళిపోయారు. కనుక చివరిదశలో ఆయనకూడా ఫెయిలయ్యాడు.

వింటున్న నేనడిగాను " లండన్ అయినా ఒక్కటే, తిరువన్నామలై అయినా ఒక్కటే అనుకుని ఆయన అలా అన్నారేమో? ఆత్మజ్ఞానికి ఎక్కడైతే నేమి?"

"ఆయన అలా అనలేదు. తన కుటుంబ సభ్యులను ఆయన సపోర్ట్ చేసాడు. తాను వదిలివచ్చిన సంసారంలోనే చివరకు ఆయన ఇంకోరకంగా చిక్కుకున్నాడు." అని విశ్వాత్మ గారన్నారు.

"ఇవన్నీ పుస్తకాలలో ఎక్కడా వ్రాసి లేవే?" అన్నాను నేను.

"ఎందుకుంటాయి? ఇలాటివి
ఎవరూ వ్రాయరు. కాని కొందరు నిజాయితీ ఉన్న శిష్యులు వ్రాశారు. వాళ్ళు ఆయన్ని వదిలి అప్పట్లోనే వెళ్ళిపోయారు" అన్నాడు విశ్వాత్మగారు.

"ఇప్పుడున్న ఒక ప్రసిద్ధ బాబాగారు కూడా అంతే. చిన్నప్పుడు స్కూల్ దశలోనే -నా భక్తులు నన్ను పిలుస్తున్నారు- అంటూ ఇల్లొదిలి వచ్చేసారు. చివరకి తన బంధువర్గం చేతిలోనే మళ్ళీ బందీ అయ్యారు. ఆయనతోకూడా మీతో వలెనె మాట్లాడాను. ఇప్పటికీ సరాసరి ఆయన వద్దకు వెళ్ళగలిగే స్వాతంత్ర్యం నాకుంది. "సేవాకార్యక్రమాలలోకి వస్తూ మీస్థాయి తగ్గుతున్నారు." అని కూడా హెచ్చరించాను. దానికాయన ఇలా అన్నారు. " మీరు చెప్పిన స్థాయి శిష్యుల వద్ద మీరు చెప్పిన స్థాయిలోనే ఉండగలను. కాని నాచుట్టూ ఉన్నవారు నేలబారు మనుషులు. వీరికోసం వీరిస్థాయికి నేను దిగిరాక తప్పటం లేదు." అన్నాడు. ఆ దిగిరావటమే దిగజారటం. అంటే పతనం అయినట్లేగా మరి. తన స్థాయికి వాళ్ళని ఉద్దరించాల్సింది పోయి, వాళ్ళ స్థాయికి తను దిగజారితే ఇంకేముంది?

ఇంకొక ఉపన్యాసకస్వామి ఉన్నారు. వేలాదిమందిని సమ్మోహితుల్ని చేస్తూ ఉపన్యాసం ఇవ్వగలడు. కాని స్థితిలో దాదాపు అయిదారేళ్ళు మాత్రమె ఉండగలిగాడు. ఒకప్పుడు ఆయన ఉపన్యాసం వింటూ వేలాదిమంది ట్రాన్స్ లోకి పోయేవారు. ఇప్పుడో, వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఉపన్యాసాలలో మునుపటి పటుత్వం లేదు. ఇక ఆయన శిష్యులో? ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నారు. ఒక్కడికీ ఆచరణ లేదు. మరి ఇన్నేళ్ళ ఉపన్యాసాలవల్ల ఏమి సాధించినట్లు? ఇది దిగజారుడు కాక మరేమిటి?

ఇంకొక స్వామి ఉన్నాడు. ఆయనది మరీ నేలబారు వ్యవహారం. మొదట్లో ఏదో కొంత వేదాంతం చెప్పేవాడు. ప్రస్తుతం మాత్రం సంగీతఆర్కెష్ట్రాతో కాలం గడుపుతున్నాడు. ఆయనకు తగిన శిష్యులే ఆయన చుట్టూ చేరుతున్నారు.

కనుక ఎవరైనా సరే. ప్రపంచపు మాయలో పడితే దిగజారినట్లే. వేషానికి పటాటోపానికి విలువిస్తే పతనమే. శిష్యులకు ఎక్కువ విలువిస్తే నాశనమే. తన స్వస్థితి నుంచి దిగజారినట్లే. నేను న్యూయార్కు వెళ్ళినప్పుడు అక్కడి వీధుల్లోనూ ఇదే డ్రస్సుతో నడిచాను. అక్కడి వారు " ఏమిటీ డ్రస్సు?" అన్నట్లు చేతితో సైగ చేస్తే, " మీ డ్రస్సు ఎందుకలా ఉంది?" అని నేనూ సైగ చేశాను. వారిదే ప్రమాణం అని మనం ఎందుకనుకోవాలి? వారి డ్రస్సు వారికి గొప్ప. నా డ్రస్సు నాకు గొప్ప. వారిభాషలో మాట్లాడాలని మనం ప్రయత్నిస్తే వారు పైచేయి తీసుకుంటారు. నేను నా భాషలోనే వారికి సమాధానం చెప్తాను. వారిభాష నాకు రానట్లే నా భాష వారికీరాదు. వారిభాష వారికి గోప్పైతే నాభాష నాకుగొప్ప. నేను నడిచి రోడ్డున పోతుంటే కారులో పోతున్నవాళ్ళు ఎగతాళిగా చెయ్యాడిస్తారు. నేనూ వారి కాళ్ళ వైపు చూపిస్తాను. "మీ స్థాయి అక్కడే ఉంది"అన్నట్లు. పరిస్థితి అలా ఉంటుంది.

( తరువాతి భాగం త్వరలో)