“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, జులై 2010, మంగళవారం

జిల్లెళ్లమూడి స్మృతులు -1

పోయిన్నెలలో జిల్లెళ్ళమూడిలో ఒకరోజు ఉన్నాను. దానిక్కారణం తమ్ముడు చరణ్. నేను గుంతకల్ లో ఉన్నఫ్ఫటినుంచే చాలాసార్లు అంటుండేవాడు "అన్నగారు. మీరు సెలవులోవచ్చినపుడు ఒకరోజు మనం అమ్మదగ్గరికి పోయిరావాలి" అని.

రెండేళ్ళ క్రితం నేను గుంతకల్ కు పోక మునుపు ఒకటి రెండుసార్లు ఇద్దరం కలిసి జిల్లెళ్ళమూడికి పోయి వచ్చేవాళ్ళం. ఉదయాన్నే గుంటూరులో బయలుదేరిపోయి, రోజంతా అక్కడే ఉండి, రాత్రి కితిరిగి వచ్చేవాళ్ళం. కాని గుంతకల్ లో ఉన్న రెండేళ్ళలో ఎప్పుడు గుంటూరుకు వచ్చినా, జిల్లెళ్ళమూడి వెళ్ళటం వీలయ్యేది కాదు. శెలవు పెట్టిన ఒకటి రెండు రోజులు ఏవేవో పనులు సరిపోయేవి. మళ్ళీ తిరుగుప్రయాణం. ఇలా జరిగేది.

అనుకున్నట్లుగానే ఒకరోజు పొద్దున్నే అందరం కలసి జిల్లెళ్ళమూడి ప్రయాణం కట్టాము. దారిలో బాపట్లలో ఉపాహారంసేవించి పదిన్నరా పదకొండుకి జిల్లెళ్ళమూడి చేరుకున్నాము. నా కోసమని కొన్నిఆధ్యాత్మిక పత్రికలు, కొన్ని జ్యోతిష్యపత్రికలు కొని కార్లో పెట్టాడు చరణ్. దారి పొడుగునా ఆధ్యాత్మిక సంభాషణలు జరుగుతున్నాయి. శ్రీమతీ పిల్లలూ వెనకసీటులో కూర్చుని మధ్య మధ్యలో సంభాషణల్లొ వారి వంతుగా పాలు పంచుకుంటున్నారు.

"అన్నగారు, ఈ నెల విశ్వజనని సంచికలో అమ్మ జాతకం గురించి వ్రాశారు చూడండి" అన్నాడు చరణ్.

"ఎక్కడా" అంటూ పేజీలు తిప్పాను.

"అది వ్రాసింది ఎవరో కాదు మా అన్నయ్య. తను కూడా ఎం ఏ (జ్యోతిషం) చేశాడు. ప్రస్తుతం విజయవాడలోఉంటున్నాడు" అన్నాడు చరణ్.

తను మాట్లాడుతూనే ఉన్నాడు, ఈ లోపే ఆ వ్యాసం చదివేశాను.

"ఎలా ఉంది?" అని చరణ్ ప్రశ్న. మౌనంగా తలూపాను.

కాసేపాగి ఇలా అన్నాను. "ఈ జాతకం చాలా నిగూఢమైనది. స్థూలదృష్టికి అందేది కాదు. ఈ జాతకం గురించి ఇంకాచాలా వ్రాయవచ్చు. మీ అన్నయ్య చాలా తక్కువ వ్రాశారు".

"పోనీ మీరు వివరంగా వ్రాయండి" అని చరణ్ సలహా ఇచ్చాడు.

"అంత సాహసం నేను చేయలేను. కాని అమ్మ కరుణ ఉంటే అలాగే వ్రాస్తాలే" అన్నాను. దైవాంశతో పుట్టినవారివి, అవతారమూర్తుల జాతకాలు అంచనా వేయడం చాలా కష్టం. శారదామాత జాతకం కూడా ఇలాగే ఉంటుంది. మామూలు దృష్టికి చాలా సాధారణమైన వ్యక్తి జాతకంలా ఉంటుంది. ఏ ప్రత్యేకతలూ కనిపించవు. చాలా సూక్ష్మవిశ్లేషణతో చూస్తేగాని వీరి జాతకాల మహాత్యం ఏమిటో అర్ధం కాదు. అప్పుడు కనిపించే స్థాయి చూస్తే నోట మాట రానంత ఆత్మోన్నతి కనిపిస్తుంది.

మాటల్లోనే 7 వ మైలు రాయి వచ్చింది. చరణ్ చిన్నప్పుడు జిల్లెళ్ళమూడిలో ఉన్నాడు. జిల్లెళ్ళమూడి అమ్మగారి అనుగ్రహానికి పాత్రులైన ప్రసిద్ద, అజ్ఞాత వ్యక్తుల పేర్లు ఎన్ని చెబుతాడో? ఆ సంఘటనలు నాటకీయంగా ఎలా వివరిస్తాడో? అలా వింటూ ఉంటే గంటలు గడిచిపోతాయి. అతని ఉపనయనం అమ్మ చేతులమీదుగా జరిగింది. ఎంత పుణ్యాత్ముడో? అతని పుణ్యబలాన్ని ఊహించి "ఎంత అదృష్టవంతుడివి తమ్ముడూ. స్వయంగా అమ్మ నీకు బ్రహ్మోపదేశం చేసిందా?" అని ఆశ్చర్యపోతుంటాను. చరణ్ నవ్వుతూ "బ్రహ్మోపదేశం కాదు అన్నగారూ అమ్మోపదేశం" అంటాడు.

కారు మెయిన్ రోడ్డుమీద నుంచి జిల్లెళ్ళమూడి వైపు తిరిగింది. కాలువపక్కగా పోతున్నది. దూరంగా జిల్లెళ్ళమూడిగ్రామం కనిపిస్తున్నది. దూరం నుంచి ఆ గ్రామం కనిపించగానే చరణ్ కళ్లనుంచి ధారగా నీళ్ళు కారిపోతున్నాయి. అలాగేడ్రయివ్ చేస్తున్నాడు. మేం మౌనంగా ఉన్నాం.

(మిగతాది తరువాత పోస్ట్ లో)