“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జూన్ 2010, శనివారం

మనసు లోని మర్మమును తెలుసుకో....

జూన్ అయిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఒకామె ఇలా ప్రశ్నించింది.

నేనొక సమస్యపై మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడగమంటారా?

మనస్సులో యధావిధిగా గురువును,నవగ్రహాలను,ఇష్టదైవాన్ని స్మరించి నిమిత్తాలను పరిశీలించగా శుభ సూచకములుగా కనిపించాయి. కనుక అడుగమని చెప్పాను.

ముందుగా నాకు మీ విద్యమీద నమ్మకం కలగాలి గనుక నా మనసులోని ప్రశ్నను మీరే చెప్పండి?

ఆమె మాటకు నవ్వొచ్చింది. మానవ మనస్తత్వమే ఇలాటిది. ఎక్కడ మోసపోతామో అని అనుక్షణం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. పైగా నమ్మకం లేకుంటే అడగడం ఎందుకు? సరే చూద్దామని ప్రశ్న చక్రం వేసి చూచాను.

తులా లగ్నం వచ్చింది. శీర్శోదయ రాశి ఉదయిస్తున్నది. బేసి రాశి. కనుక అడగాలని ఇచ్చ ఆమెలో బలంగా ఉన్నది. కాని లగ్నానికి కేంద్రాలలో శుభ గ్రహాలు లేవు. బుధుడొక్కడే సప్తమంలో ఉండి ఇది ఉత్త ఉబుసుపోని ఇంటలెక్చువల్ ప్రశ్న మాత్రమే. చివరికి నీవు చెప్పినది వీరికి నచ్చదు. అని సూచిస్తున్నాడు. లగ్నాధిపతి శుక్రుడు నవమంలో మిత్ర స్థానంలో ఉండి ప్రశ్న నిజమైనదే ఎగతాళికి అడిగింది కాదు. అని చెబుతున్నాడు. కాని ఆయనతో కేతువు కూడా ఉండటం వల్ల సమస్యలో ఏదో చిక్కుముడి ఉన్నది. లోతైనఆలోచనలేకుండా భావాద్వేగాలలో పడి కొట్టుకుపోతున్నవారు ఈ సమస్యలో ఉన్నారు అని చూపిస్తున్నాడు. ఎందుకంటే కేతువు తలలేని గ్రహం. ఇక మనస్సును సూచించే చంద్రుడు పంచమ స్థానంలో ఉండి ప్రశ్నలోని నిజాయితీని సూచిస్తున్నాడు. కాని క్షీణ చంద్రునిగా ఆమె మనస్సులో జ్యోతిష్య శాస్త్రం మీద అపనమ్మకాన్ని కూడా సూచిస్తున్నాడు. సరే అది మనకు అనవసరం అనుకున్నాను.

చంద్రుడు ఈ లగ్నానికి దశమాధిపతి అవుతాడు. పుత్ర స్థానం అయిన పంచమంలో ఉన్నాడు. కనుక ఇది ఈమె సంతానం యొక్క వృత్తికి సంబంధించిన ప్రశ్న అయి ఉండవచ్చు.

"మీరు మీ సంతానం యొక్క వృత్తికి సంబంధించిన ప్రశ్న అడగాలనుకుంటున్నారు." అని చెప్పాను.

ఆమె నమ్మలేనట్లుగా చూచింది. "జ్యోతిశ్శాస్త్రాన్నిగురించి ఒక ప్రెండ్ చెబితే మొదట్లో నమ్మలేదు, కాని ఇప్పుడు నమ్మవలసి వస్తోంది. మీరు చెప్పింది చాలా వరకూ సరిగానే ఉంది. ఇంకా చెప్పండి" అన్నది.

పంచమంలో స్త్రీగ్రహమైన చంద్రుడు ఉన్నాడు కనుక " ఇది మీ అమ్మాయి ఉద్యోగానికి చెందిన ప్రశ్న" అన్నాను.

"నిజమే. అసలు సమస్య ఏమిటో చెప్పండి."

పంచమ స్థానం అయిన కుంభరాశి నుంచి పరిశీలించాలి. కేంద్రాలయిన నాలుగు ఏడు పది స్థానాలలో పాప గ్రహాలయిన రవి,కుజుడు ఉన్నారు. కనుక ఈ అమ్మాయి సంకట పరిస్థితిలో ఉన్నది.

" మీ అమ్మాయి సంకట పరిస్థితిలో ఉన్నది." అన్నాను.

"నిజమే. కాబట్టేగా మిమ్మల్ని అడుతున్నది. ఆ సమస్య ఏమిటో చెప్పండి." ఆమె అడిగింది.

కుంభరాశినుంచి దశమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ అమ్మాయి వర్క్ ప్లేస్ కు వివాహ స్థానానికి సంబంధం ఉన్నది. అంటే ఆఫీస్ లో ఎవరో ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని వెంటబడుతూ ఉండవచ్చు. ఇప్పుడు కూతురి మనస్సును సూచించే పంచమ స్థానాన్నిపరిశీలించాను. అక్కడ శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. కనుక ప్రేమ వ్యవహారం నడుస్తున్నది అని అర్ధమైంది.

"మీ అమ్మాయికి అఫీసులో ఒక సహోద్యోగితో ప్రేమ వ్యవహారం ఉన్నది." అని చెప్పాను.

"నిజమే. ఇంకా చెప్పండి" ఆమె జవాబు.

ఇద్దరికీ ప్రేమ ఉన్నప్పుడు ఉద్యోగాలున్నపుడు అడ్డంకి ఏమై ఉండాలి? అని ఆలోచించాను.

పంచమంలోని కేతువువల్ల ఏదో సమస్య ఉన్నది అని తెలుస్తున్నది. కాని అది ఏమై ఉంటుంది?

ఈ లగ్నానికి రవి బాధక స్థానాధిపతి. ఆ రవి అష్టమ స్థానంలో ఉండి సమస్య రవి యొక్క కారకత్వాలలో ఒకటి అని చూపిస్తున్నాడు. కుంభరాశి నుంచి రవి, మాతృస్థానం అయిన చతుర్ధంలో ఉన్నాడు. మాతృ స్థానాధిపతి అయిన శుక్రుడు నవమాధిపతి కూడా అయ్యాడు. కనుక తల్లి తండ్రులను సూచిస్తున్నాడు. అంటే అసలు సమస్య తల్లి తండ్రులకు చెందినది. ఒకవేళ కులాంతరసమస్యనా? కనుక తల్లిదండ్రులకు ఇష్టం లేదా? చంద్ర కుజులు సమసప్తకంలో ఉండి ప్రేమికుల మధ్యన మంచి ఆకర్శణ ఉన్నది అని చూపిస్తున్నారు. వీరిద్దరూ వేర్వేరు గ్రూపులకు చెందిన వారు కారు. మిత్ర వర్గంలోని వారే కనుక వీరిద్దరిదీ ఒకే కులం అయ్యుండాలి. కనుక ఇది కులాంతరప్రేమ కాదు. ఇక మిగిలిన ఆప్షన్ ఏమిటి? రవి పితృ వర్గ సూచకుడు. చంద్రుడు మాతృవర్గ సూచకుడు. శుక్రునికి వచ్చిన అధిపత్యాలవల్ల మళ్ళీ తల్లితండ్రులే సూచింపబడుతున్నారు. కుజుడు కేతువుదైన మఖా నక్షత్రంలో ఉండి సమస్య జెనెటిక్స్ కి సంబంధించినది అని చూపిస్తున్నాడు. కేతువు తల్లి తండ్రుల స్థానాలకు అధిపతి అయిన శుక్రునితో కలసి ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి, అమ్మాయియొక్క తల్లిదండ్రులకు దగ్గరి బంధువు అయ్యి ఉండాలి. అమ్మాయి తల్లి తండ్రులకు అతను ఒకేసారి బంధువు ఎలా అవుతాడు? అంటే నన్ను అడుగవచ్చిన ఆమెకూడా ఆమె బావనో మేనమామనో చేసుకుని ఉండవచ్చు. బహుశా అదే సమస్య అయి ఉండవచ్చు. మరి అదే నిజమైతే, ఈ విషయం ప్రేమించుకునేటప్పుడే ఈమె కూతురికీ ఆ ప్రేమికునికీ తెలుసుకదా? ఒకవేళ తెలిసి ఉండక పోవచ్చు. చాలా సార్లు బీరకాయ పీచు చాలా దూరం పోయి ఎవరెవరొ తెలియని పరిస్థితులు ఉంటాయి. తరువాత విచారిస్తే గోత్రాలు కలవడం తాతలో ముత్తాతలో ఇద్దరికీ ఒక్కరే అని తేలడం జరుగుతుంటుంది. ఇలాటి కేసు కావచ్చు. అని ఊహించాను.

అయినా సందేహ నివృత్తికోసమని ఆరూఢ లగ్నాలు పరిశీలించాను. పాకలగ్నం మిధునం అయ్యింది. సప్తమారూఢం ధనుస్సు అయింది. ఇవి సమ సప్తకాలుగా ఎదురెదురుగా ఉన్నాయి. కనుక సమస్య ఇదే అని అర్ధం అయ్యింది. ఇప్పుడు మాతృ ఆరూఢ లగ్నం లెక్కించాలి. కుంభం నుంచి నాలుగు,వృషభం అవుతుంది. అధిపతి శుక్రుడు అక్కడ నుంచి రెండింట ఉన్నందువల్ల మళ్ళీ రెండైన కటకం మాతృ ఆరూఢం అవుతుంది. అది చంద్ర స్థానం అయ్యి మళ్ళీ తల్లినే సూచిస్తున్నది. దశమ స్థానంగా వృత్తినీ సూచిస్తున్నది.

రూలింగ్ ప్లానెట్స్ ను సమస్య పరిష్కారానికి ప్రార్ధించాలి. లగ్నాధిపతి-శుక్రుడు. స్టార్ లార్డ్-గురువు. చంద్రరాశి-శని. స్టార్ లార్డ్-గురువు. వారాధిపతి-శని. హోరాధిపతి-శుక్రుడు.కనుక గురువు శుక్రుడు శని రూలింగ్ ప్లానెట్స్ గా వచ్చాయి. గురువు ఈ లగ్నానికి రోగ స్థానాధిపతి, మరియు సహజ పుత్ర కారకుడు. శుక్రుడు ప్రేమవ్యవహారాలకు, వివాహానికి సూచకుడు.శని ఈ లగ్నానికి పుత్ర స్థానాధిపతి. ఈమెగారి అమ్మాయికి లగ్నాధిపతి. సమస్య అర్ధం అయ్యింది. ఈ అమ్మాయికి ప్రేమ వ్యవహారంతో జరిగే వివాహంతో రోగపూరిత సంతానం కలిగే ఖర్మ ఉన్నది. దాన్ని తప్పించడం కష్టం.

ఇలా ఆలోచన చేసిన మీదట ఆమె ముఖం లోకి చూచాను. ఆమె కొంత ఆతృతగా కొంత అపనమ్మకంగా చూస్తున్నది. ఏమిటి ఇంతసేపు ఆలోచిస్తున్నాడు? ఇతనికి సమస్య అర్ధం కాలేదు, తప్పించుకోడానికి ఎత్తు వేస్తున్నాడు అనుకుంటున్నట్లు ఆమె ముఖాన్ని చూస్తే అనిపించింది.

" ఏమీ అనుకోకండి. మీ వారు మీ బంధువులలోని వారా బయట సంబంధమా?" అడిగాను.

"మా బావేనండి. ఎందుకు అలా అడిగారు?" ఆమెకు అనుమానం వచ్చింది.

ఇప్పుడు సమస్య మొత్తం వీడిపోయింది. కనుక ఇలా చెప్పాను.

"ఆ అబ్బాయి మీ దగ్గరి బంధువులలోని వాడే, లేదా ఒకే గోత్రం అయినా కావచ్చు. అయితే ఈ సంగతి ప్రేమ వ్యవహారం చాలా ముదిరిన తర్వాత తెలిసి ఉంటుంది. ఇదేనా అసలు సమస్య?"

ఆమెకు కాసేపు నోట మాట రాలేదు. "కొంచెం మంచినీళ్ళివ్వండి" అని అడిగింది. కరెక్టుగా చెప్పగలిగానని నాకు అర్ధం అయింది. అయితే కధ ఏమిటొ ఆమె నోటివెంటనే విందామని ప్రశాంతంగా ఉన్నాను. నీళ్ళు తాగిన తర్వాత ఆమె చెప్పింది.

వీళ్ల అమ్మాయి పని చేసే ఆఫీసులో ఒకతనితో ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. కాని కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి కులం ఒకటే అయినప్పటికీ, గోత్రం కూడా ఒకటేననీ, అతను వీళ్ళ బంధువుల లోని వాడేననీ, బీరకాయ పీచు బంధుత్వం ఉన్నదనీ తెలిసింది. ప్రస్తుతం నన్ను అడుగవచ్చిన ఆమె కూడా బావనే పెళ్ళిచెసుకున్నందువల్ల వీళ్ళకు కొంతమంది సంతానం పుట్టి పోయారుట. మళ్ళీ దగ్గరి సంబంధం చేసుకుంటే ఎలాటి పిల్లలు పుడతారో అని భయపడుతున్నారు. పైగా గోత్రం ఒకటే కావటం జరిగింది. అంటే వరుసకు అన్నాచెల్లీ అవుతారు. ఇదీ సమస్య. ఏం చెయ్యమంటారు అని నన్ను అడిగింది.

మీరేం చేద్దామనుకుంటున్నారు? అని అడిగాను.

అదే అర్ధం కావడం లేదు. అని చెప్పింది.

నేను చెప్పిన పరిష్కారం మీరందరూ ఒప్పుకుంటారా? అని అడిగాను.

అలా నేను మాటివ్వలేను. కాని మీ సూచన చెప్పండి. అని అడిగింది.

ఒకే గోత్రంలో వారికి పెళ్ళి చెయ్యకూడదు. పైగా దగ్గరి బంధువులని చెబుతున్నారు. సంతాన పరంగా మీకూ సమస్యలొచ్చాయి. కనుక వీరికి ఇంకా వస్తాయి. కనుక ప్రేమ మరిచిపోయి ఎవరికి వారు వేరే సంబందాలు చేసుకోవడం మంచిది. నూటికి తొంభై అయిదు శాతం ప్రేమలు ఆకర్షణలేగాని నిజమైన ప్రేమలు కావు. అని చెప్పాను.

కానీ అమ్మాయి అబ్బాయి గట్టి పట్టుమీదున్నారు. పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆమె చెప్పింది.

అంటే వీరికి అనుభవించాల్సిన ఖర్మ గట్టిగా ఉందన్నమాట అని లోపల అనుకుని " మరి ఒకే గోత్రం వారికి పెళ్ళి ఎలా జరిపిస్తారు" అడిగాను.

"ఒక తెలిసిన పురోహితుణ్ణి అడిగాము. అమ్మాయిని ఎవరికైన దత్తు ఇచ్చి ఆ దంపతుల చేత కన్యాదానం చేయిస్తే గోత్రం మారిపోతుంది గనుక పరవాలేదు. పెళ్ళి చెయ్యవచ్చు అని ఆయన చెప్పాడు." అన్నది.

నాకు ఒళ్ళు మండినంత కోపం వచ్చింది. తమాయించుకుని" దత్తు ఇస్తే ఒంట్లోని జీన్స్ ఎలా మారతాయి?" అని అడిగాను.

"ఏమో నాకు తెలియదు. ఆయన మా ఇంటి పురోహితుడు. బాగా శాస్త్రం తెలిసినవాడు." అని చెప్పింది.

"సరే. నా అభిప్రాయం నేను చెప్పాను. తరువాత మీ ఇష్టం" అని అన్నాను.

ఆమె ఏమీ చెప్పకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ పెళ్ళి జరిగితే మాత్రం సంతాన స్థానంలో ఉన్న శుక్ర కేతువుల వల్ల మంగోలియా బేబీలు పుట్టే అవకాశం ఉంది. వారికి సంతానంతో బాధలు తప్పవు. ఆ సంతానాన్ని పెంచుతూ ప్రతిరోజూ నరకం పడెటప్పుడు ఇప్పటి ఆకర్షణలు ప్రేమలు నిలబడతాయా? ఏం జరుగుతుందో ముందుముందు చూడాలి.

ఏది ఏమైనప్పటికీ ప్రశ్న శాస్త్రం నిజమైనందుకు సంతోషం కలిగింది.