“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, జూన్ 2010, శనివారం

యాండీ హూగ్ జాతక విశ్లేషణ- కొన్ని జ్యోతిష రహస్యాలు

Fighting was his life, career, art and philosophy

Know yourself, keep yourself under control, understand yourself, steel yourself, cleanse your mind and keep your body fit!» (Andy Hug, 1997)

యాండీ హూగ్ యొక్క జననతేది లభించింది గాని సరియైన జననసమయం ఎక్కడా దొరకలేదు. అది దొరికేంతవరకు ప్రత్యేకలగ్నాలతో విశ్లేషణ చేద్దాం. ఇతను 7-9-1964 న స్విట్జర్లాండ్ లోని వోలెన్ అనే గ్రామంలో జన్మించాడు.ఆ రోజు క్రోధి నామసంవత్సరం భాద్రపదశుక్ల ద్వితీయ సోమవారం అయింది.

ముందుగా చంద్రలగ్నాన్ని నిర్ధారించాలి. రోజు కొంతవరకు ఉత్తరఫల్గుణి, రువాత హస్తా నక్షత్రాలు ఉన్నాయి. కనుక రాశి కన్యారాశి అవుతుంది. ఇక నక్షత్రాన్ని నిర్ధారణ చేద్దాం. ఉత్తరఫల్గుణి ఒక అదృష్టనక్షత్రం. వీరి జీవితంలో సాధారణంగా ఒడుదుడుకులుండవు. వీరు ప్రభుత్వఉద్యోగులుగా టీచర్లుగా రాణిస్తారు. కనుక ఇతనిది ఉత్తరానక్షత్రం కాదు. హస్తానక్షత్ర జాతకులకు జీవితం ఒడిదుడుకుల మయం. బాల్యం బాధాకరంగా ఉంటుంది. ఇతనికి అదే జరిగింది. చిన్నప్పుడు అనాధాశ్రమంలో పెరిగాడు. సామాన్యంగా హస్తానక్షత్రజాతకులకు విజయం చాలా సార్లు చేతికందినట్లే అంది జారిపోతుంది. ఇది ఇతని జీవితంలో చాలాసార్లు జరిగింది.

క్యోకుషిన్కాయ్ కరాటే కాంపిటీషన్స్ లో చివరివరకూ గెలిచి చివరిలో శోకీ మట్సూయ్ చేతిలో ఓడిపోయాడు. కానీ పోటీలో ఇతను కొట్టినదెబ్బలకు, 100 మందితో వరుసగా ఫైట్ చేసి అందరినీ గెలిచిన షోకీమట్సూయ్ కూడా కూలబడ్డాడు. చక్కగా ఫైట్ చేసినా సరే టెక్నికల్ పాయింట్ వల్ల యాండీ రెండవస్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇది జడ్జిల పక్షపాత ధోరణివల్ల జరిగింది, ఒక యూరోపియన్ వీరుడు జపాన్ గడ్డమీద జపనీస్ వీరుణ్ణి గెలిచి ఆల్ జపాన్ చాంపియన్ షిప్ సాధించడం జీర్ణించుకోలేని జడ్జిలు విధంగా జడ్జిమెంట్ ఇచ్చి షోకీమత్సూయ్ ని విజేతగా ప్రకటించారు అని కొంతమంది అన్నారు.

అలాగే చాలాసార్లు నికి అర్హత ఉన్నా టాప్ స్లాట్ అందినట్లె అంది జారిపోయింది. కనుక ఇతనిది ఉత్తరానక్షత్రం కాదు హస్తా నక్షత్రమే అని రూఢిగా చెప్పవచ్చు. అంటే చంద్రుడు ఇతని జాతకంలో కన్యా రాశి 10 డెగ్రీల నుంచి 23.20 డిగ్రీల లోపు ఉన్నాడు. మరి హస్తానక్షత్రం పాదం అయి ఉంటుంది? డిగ్రీలలో కన్యారాశి నాలుగు నుంచి ఏడుపాదాల వరకూ ఉంటాయి. అవే హస్తా నక్షత్రంలోని ఒకటినుంచి నాలుగు పాదాలౌతాయి. ఇతను వీరవిద్యలలో నిష్ణాతుడైనప్పటికీ స్వతహాగా జాలిగుండె మరియు ఆధ్యాత్మికభావాలు కలవాడు. ఇతనిలో వీరత్వం సాధుస్వభావం కలసి ఉన్నాయి. కనుక నాలుగోపాదం అయిన మేషనవాంశ అవటానికి అవకాశం ఉన్నది. ఎందుకనగా వీరవిద్యలను, శూరత్వాన్ని అలవోకగా ప్రసాదించగల అంగారకునిరాశి ఇది. సున్నితమనస్కతను ఇచ్చే చంద్రునిదైన హస్తానక్షత్రమూ, వీరవిద్యలను ఇచ్చే అంగారకుని నవాంశరాశీ కలిసి ఇతని మనస్తత్వాన్ని తీర్చి దిద్దాయి.

ఇదే
నిజమైతే, చంద్రుడు హస్తానక్షత్ర మొదటిపాదపు డిగ్రీలైన 10.00 నుంచి 13.20 డిగ్రీల మధ్యన ఉండి ఉండాలి. నాడీ జ్యోతిశ్యవిధానంలో వాడేటటువంటి "రాశితుల్యనవాంశ" టెక్నిక్ ప్రకారం చంద్రుడు రాశినవాంశలలో షష్టాష్టకస్థితిలో ఉన్నందువలన ఇతని జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పాయింట్ కూడా బాగా సరిపోయింది గనుక చంద్రుడు హస్తానక్షత్రం ఒకటో పాదంలో ఉన్నట్లు మనం భావించవచ్చు. దీన్ని ఇంకా సూక్ష్మవిశ్లేషణ చేసి లగ్నడిగ్రీలను, జనన సమయాన్ని కూడా కనిపెట్టవచ్చు. కాని మనం ప్రస్తుతం చేయబోతున్న విశ్లేషణకు ఇంతకంటే లోతుకు పోవడం అవసరంలేదు కనుక ఇంతటితో ఆపుదాము.

ఇతని ఆత్మకారకుడు సూర్యుడు. సూర్యుడు నవాంశలో నీచస్థితిలో ఉన్నాడు కనుక కారకాంశరాశి తులారాశి అవుతుంది. జైమినిమహర్షి తన యొక్క జైమినిసూత్రములలోని ప్రధమాధ్యాయం 64, సూత్రం లో " కర్మణి పాపే శూర: " అని చెబుతూ ఒక వ్యక్తి శూరుడా లేక పిరికివాడా అన్న విషయాన్ని ఎలా నిర్దారించాలో సూత్రీకరించాడు. అనగా కారకాంశ నుంచి తృతీయమున పాపగ్రహమున్నచో ఆవ్యక్తి శూరుడగును అని అర్ధం. యాండీ జాతకంలో యోగం అచ్చు గుద్దినట్లు సరిపోయింది. ఇతనికి తులారాశినుంచి తృతీయస్థానంలో కేతువున్నాడు. నవాంశకుండలిలో కారకాంశ నుంచి తృతీయస్థానంలో శనీశ్వరుడు స్థితుడై ధైర్యాన్నీ శూరత్వాన్నీ ఇస్తున్నాడు. కనుక ఇతను జైమిని సూత్రభాషలో చెప్పాలంటే శూరుడు మరియు ఇప్పటి భాషలో కరాటే వీరుడయ్యాడు. పిరికివాడు కావడానికి ఒక వ్యక్తిజాతకంలో యోగం ఉండాలో చెబుతూ జైమిని మహర్షి తన అరవై అయిదో సూత్రంలో " శుభే కాతర: " అన్నాడు. అనగా కారకాంశనుంచి తృతీయస్థానంలో శుభ గ్రహాలున్నట్లైతే అతను పిరికివాడవుతాడు అని అర్ధం. యోగం యాండీ జాతకంలో లేదు. అందుకే కొమ్ములు తిరిగిన వీరులతో తలపడి ధైర్యంగా కాంపిటీషన్ ఫైట్స్ చేశాడు.

జ్యోతిష్యనియమాల ప్రకారం ఒకని జాతకంలో చంద్రకుజ యోగం గాని, బుధకుజయోగంగాని ఉంటే అతను ముష్టియుద్ధంలోగాని (నేటి భాషలో బాక్సింగ్, కరాటే మొదలైనవి), మల్లయుద్ధంలోగాని (రెజిలింగ్) ప్రవీణుడౌతాడు. యాండీ జాతకంలో ఇవి రెండూ ఎలా ఉన్నాయో చూద్దామా? నాడీజ్యోతిష్యసూత్రాలను బట్టి బుధుడు సింహరాశిలో వక్రస్థితివల్ల కర్కాటకరాశిలో ప్రవేశించి కుజునితో కలిసినట్లు భావించాలి. నవాంశలో ఇక బుధకుజులు కర్కాటకరాశిలో కలిసే ఉన్నారు. దశాంశలో చంద్రకుజులకు షష్టాష్టకయోగం ఉన్నది. కనుక ఇతను మార్షల్ ఆర్టిస్ట్ అయ్యాడు.

చంద్రలగ్నం నుంచి పరిశీలించగా విశ్లేషణ ఇలా ఉంటుంది. దశమాధిపతి అయిన బుధుడు వక్రించి రవితో కలసి త్రిక స్థానమైన ద్వాదశస్థానంలో ఉన్నందువల్ల విజయం చివరివరకూ అందినట్లే అంది జారిపోతుంది. దశమ స్థానంలో రాహువు కుజునిదైన మృగశిరా నక్షత్రంలో స్థితుడై ఉన్నందువల్ల మూర్ఖమైన+తెలివైన పంచెస్ కిక్స్ తో ప్రాణాలు తీయగల క్యోకుశిన్ కాయ్ కరాటేలో ప్రావీణ్యతను వృత్తిగా ఇచ్చాడు. "శనివత్ రాహు" అన్న సూత్రం ప్రకారం శని కుజుని నక్షత్రంలో ఉన్నట్లే భావించాలి. అనగా ఇది దారుణ విస్ఫోటనాత్మకమైన వృత్తిని ఇస్తుంది. కనుక స్కూలుదశ చివరిలో ఇతను కొన్నాళ్ళు బుచ్చర్ గా పనిచేశాడు. రాహుకేతువులు తామున్న రాశినాధుల యొక్క, మరియు నక్షత్రనాధుల యొక్క ఫలితాలు ఇస్తారు గనుక రాహువు ఇక్కడ బుధునికి రిప్రెజెంటెటివ్ గా ఉన్నాడు. కనుక బుధుడు కుజుని నక్షత్రంలో ఉన్నట్లే లెక్క. అందువల్ల ఇతనికి వీరవిద్యలలో ప్రావీణ్యత కలిగింది. దానికి తగినట్లే చిన్నతనంలోనే ఇతనికి తొమ్మిదినుంచి పదహారు ఏళ్లవరకు కుజదశ జరిగింది. సమయంలోనే ఇతను కరాటే నేర్చుకోవడం మొదలు పెట్టాడు.

తరువాత పదహారునుంచి ముప్పైనాలుగు ఏళ్ళవరకు ఇతనికి రాహుదశ జరిగింది. రాహువు దశమస్థానంలో ఉండి విధమైన ఫలితాలు ఇస్తున్నాడో పైన విశ్లేషించాను. కనుక దశాకాలం అంతటా దేశదేశాలు తిరుగుతూ కాంపిటీషన్ ఫైట్స్ చేశాడు. రాహువు రాక్షసుల గ్రూపులోనుంచి దేవతల గ్రూపులోకి మారాడు. అలాగే రాహుదశలో ఇతను రాక్షసక్రీడ అయిన క్యోకుశిన్ కాయ్ కరాటేను వదలి కొంచెం సాప్ట్ స్టైల్ అయిన సీడోకాయ్ కాన్ కరాతేలొకి మారాడు. తరువాత ముప్పై మూడో సంవత్సరం ప్రాంతంలో ఇతనికి గురుదశ మొదలైంది. గురువులో శని అంతర్ధశలో ఇతను బ్లడ్ కాన్సర్ కు గురై కొద్దిరోజులలో హఠాత్తుగా చనిపోయాడు. ఇతని జాతకంలోని ప్రబలమైన దశమరాహు ప్రబావం వల్ల పరాయిదేశమైన జపాన్ లో చనిపోవడమే గాక అక్కడే ఒక బౌద్ధాలయంలో ఇతని అస్థికలు ఉంచబడ్డాయి.

ఇతనికి నవాంశలో మూడుగ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి. అవి రవి,కుజ,గురువులు. రాహుకేతువులు కూడా నీచ స్థితిలోనె ఉన్నారు. అందువల్ల ఇతని జీవితం దురదృష్టకరంగా ముగిసింది. కాని కుజుడు నీచలో ఉంటూ కూడా వర్గోత్తమాంశలో ఉన్నందువల్ల మార్షల్ ఆర్ట్స్ల్ లో యోగాన్నిచ్చాడు. వీరవిద్యలు అభ్యాసం చేసేవారి జాతకంలో దేవసేనాపతి అయిన సుబ్రమణ్యస్వామిని సూచించే కుజునికారకత్వం బలంగా ఉంటుంది. ఇది అనేకమంది జాతకాలలో (నా జాతకంతో సహా) గమనించాను.

కాన్సర్ రోగుల జాతకాలలో గురువు ముఖ్యపాత్ర వహిస్తాడు. ఇది చూడడానికి చాలా చిత్రంగా కనిపిస్తుంది. గురువు సంపూర్ణశుభగ్రహంకదా ఇలా జరుగుతుందా అని జ్యోతిశ్య విధ్యార్ధులకు సందేహం వస్తుంది. సందేహాన్ని చాలామంది నావద్ద వ్యక్తపరిచారు. గురువు చెడుకూడా చెయ్యగలడు. కత్తి ప్రాణం తియ్యగలదు ప్రాణం పొయ్యగలదు కూడా. గురువు చెడుచేసే జాతకాలలో ఇతర పాపగ్రహాలైన శనీశ్వరుడు, కుజుడు,రాహువులను మించి చెడు చెయ్యగలడు. నీతివంతుడు సాధారణంగా చెడు జోలికి పోడు, చెడు చెయ్యడు. కాని అతను కారణం చేతనైనా నీతిని గాలికొదిలేస్తే మామూలు దుర్మార్గుల కంటే ఎక్కువ చెడుచెయ్యగలడు. ఇదీ అలాటిదే. ఒక జాతకంలో గురుగ్రహం చెయ్యగలిగిన చెడును గురించి ప్రసిద్ధ జ్యోతిష్కురాలు, జ్యోతిషమార్తాండ, జ్యోతిర్విద్యావారిధి మొదలైన అనేక బిరుదులున్న శ్రీమతి మృదులాత్రివేదిగారు రామన్ గారి అస్ట్రలాజికల్ మాగజైన్ లో ఎన్నో ఏళ్ళనుంచీ అనేక వ్యాసాలు వ్రాశారు. ఆమె ఈ విషయంమీద చాలా పుస్తకాలుకూడా వ్రాశారు.

గురువు
అంటేనే పెద్దవాడు బరువైనవాడు అని అర్ధం. He embodies expansion and growth. కాన్సర్ వ్యాధిలో జరిగేది సరిగ్గా ఇదే. శరీరంలో కణాలు విచ్చలవిడిగా పెరిగి పోతాయి. అవయవాలలో కణుతులు ఏర్పడతాయి. ఒక చోటినుంచి ఒకచోటికి బదిలీఅవుతూ శరీరంలో కాలనీస్ ఏర్పాటు చేసుకుంటాయి.దీనిని వైద్యపరిభాషలో metastasis అంటారు. ఇక శనీశ్వరులు రోగం నయం కాకుండా ఆలస్యం చేస్తారు. He slows down the curative process. వీరి కలయిక దురదృష్టాన్నీ, దీర్ఘరోగాలనూ ఇస్తుంది. Abnormal expansion and growth (Jupiter) with slow curative process (Saturn) is cancer. మెడికల్ అస్ట్రాలజీలో ఇటువంటి అనేక అద్భుత రహస్యాలున్నాయి. వీటిని బట్టి జాతకునికి ఏ వయస్సులో ఏ రోగం రాబోతున్నదో ముందుగానే తెలుసుకోవచ్చు.

ఇక్కడ ఇంకొక రహస్య సూత్రం చెబుతున్నాను. సామాన్యంగా గురువు నీచలోఉన్న జాతకాలలో గాని శని గురువులు కలిసియున్న జాతకాలలో గాని ఒక విచిత్రం జరుగుతుంది. వీరు పూర్వజన్మలో సద్బ్రాహ్మణులకు, సద్గురువులకు, దేవతలకు ద్రోహం, అన్యాయం చేసి ఉంటారు. ద్రోహం చాలారకాలుగా ఉండవచ్చు. వారి ఆస్తి కాజేయటం, వారి ఆడవారితో సంబంధం పెట్టుకోవడం, వారిని దూషించడం, అవమానించడం, బాధ కలిగించడం, నమ్మించి మోసం చేయడం, వారిని చంపడం ఇలా రకరకాలుగా దోషం ఉంటుంది. దేవతల విషయంలోనైతే, వారి ఆలయాలు ధ్వంసం చెయడం, వారిని దూషించడం, ఆలయాలను అపవిత్రం చేయడం, కూలగొట్టడం, దేవతల మాన్యాలు ఆస్తులు కాజేయటం, దురాక్రమణ చేయడం ఇలా అనెకరకాలుగా దోషాలు ఉంటాయి. దోషానికి తగినట్లు ఫలితాలు కూడా జన్మలో అనుభవించ వలసి వస్తుంది. అందుకని వీరికి జన్మలో దురదృష్టం వెంటాడుతుంది. విజయాలు చివరివరకూ వచ్చి చివరిలో చేజారిపోతాయి. చివరికి కాన్సర్ వంటి భయంకర వ్యాధులు ప్రాణాలు తీస్తాయి.

పూర్వజన్మ దోషాలు విధంగా చాలా భయంకరంగా ఉంటాయి. చాలామంది -- జన్మలో మేము తెలిసి తప్పూ చెయలేదు. కాని జన్మంతా బాధలు పడుతున్నాము. దైవం ధర్మం అంతా బూటకం. కర్మసిధ్ధాంతం మిధ్య, హోమాలు జపాలు వెధవలు చేసే పనులు, జ్యోతిష్యజ్ఞానం అబద్ధం, ఇదంతా డబ్బులు కాజేయడానికి బ్రాహ్మలు ఆడుతున్న నాటకం -- అని దైవాన్ని, బ్రాహ్మణులను, గురువులను నిందిస్తూ ఉంటారు. వారి జాతకాలు పరిశీలిస్తే పూర్వజన్మలలో వారు దారుణమైన పాపాలు చేసి ఉన్నట్లు జ్యోతిర్వేత్తలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా బుద్ధిరాక ఇప్పుడు కూడా ఇలా దూషిస్తూ అదేదో గొప్పగా భావిస్తూ ఉంటారు. తరువాతికాలంలో కర్మ పరిపక్వానికి వచ్చి దాని ఫలితాలు అనుభవించేటప్పుడు వారికి అర్ధం అవుతుంది. ప్రస్తుతం కండకావరం మీద అర్ధం కాదు. సరే టాపిక్ ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

పై విశ్లేషణవల్ల గురువు, శనీశ్వరులు కలిసి ఏమి చేయగలరో అర్ధం అయింది కదా. ఇప్పుడు చూడండి. రోగాలను సూచించే షష్టాంశలో శని నీచరాశిలో రాహుకేతువులతో కలసి ఉన్నాడు. రక్తానికి సూచకుడైన జననచంద్రునికి అష్టమంలో గ్రహ స్తితివల్ల బ్లడ్ కాన్సర్ వచ్చింది. మారకస్థానంలో ఉన్న గురువుయొక్క దశ మొదలు కావడం తోనే చావు వరించింది. మేషరాశిలో ఉన్న శనీశ్వరులు తులారాశిలో ఉన్న గురువుని సమసప్తక దృష్టితో చూస్తున్నాడు. గురు/శనుల గ్రహస్థితుల వల్ల యాండీ హూగ్ గురుదశలో/శని అంతర్ధశ మొదలుకావడం తోనే బ్లడ్ కాన్సర్ వచ్చి చనిపోయాడు. అంతకు నాలుగునెలల ముందు ఇతను చేసిన లాస్ట్ ఫైట్ లో అందరివద్దా సెలవు తీసుకున్నాడు. ఇతనికి తెలిసో తెలియకో రాహుదశ చివరిలో కెరీర్ నుంచి రిటైర్ అయ్యాడు. అదే విచిత్రం. అతని కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. భార్యాపిల్లలు అనాధలైనారు. ఇటువంటి శిక్ష అనుభవించడానికి ఇతను పూర్వజన్మలో పాపం చేసి ఉంటాడో నేను ఊహించగలను. కాని దానిని బయటకు చెప్పకూడదు. ఇదొక జ్యోతిశ్శాస్త్ర నియమం. పైగా అంతా బహిర్గతం చేస్తే సస్పెన్స్ ఏముంటుంది?

విధి చాలా విచిత్రమైనది. కర్మ కూడా విచిత్రమైనదే. రెంటినీ ఎవరూ అర్ధం చేసుకోలేరు. "గహనా కర్మణో గతి:" అని భగవానుడే గీతలో చెప్పాడు. మంచివాళ్ళ ముగింపులు మంచిగా ఉండాలనీ లేదు. చెడ్డవాళ్ళ ముగింపు చెడ్డగా ఉండాలనీ లేదు. అసలు మంచీ చెడూ అన్నవి సాపేక్షాలు. జన్మలో ఎంత మంచో ఎంత చెడో ఎవరు చెప్పగలరు? కాని కట్టి కుడిపే కర్మమాత్రం ఎవరినీ ఉపేక్షించదు. ఎవరి సమయం వచ్చినపుడు వారు ఆయా కర్మఫలితాలు అనుభవించాల్సిందే. నాటకం నుంచి నిష్క్రమించాల్సిందే.

యాండీహూగ్ గొప్ప వీరుడే కాదు.తన ప్రత్యర్ధులుకూడా మెచ్చుకున్న మంచిగుణాలు కలిగిన వాడు. మానవతావాది.మంచి మనసున్ననిషి.అతని నిష్క్రమణ ఇలాజరగడం మాత్రం అల్పజ్ఞానులమైన మనకు బాధాకరం. మార్షల్ ఆర్ట్స్ అభిమానులకు ఇది మరీ బాధాకరం. ఇతను చనిపోయినరోజున ఇతని చిరకాల ప్రత్యర్ధులైన షోకీమట్సూయ్, పీటర్ ఏట్స్, నికొలాస్ పెటాస్, ఫ్రాన్సిస్కోఫిలో, కెంజిమిదోరి, అకిరామసుదా మొదలైన మహావీరులందరూ కంటతడిపెట్టారు.

ప్రస్తుతానికి
యాండీహూగ్ జాతకవిశ్లేషణ చాలు. చాలా వ్రాయవచ్చు."బాధ నా చేత కన్నీరు పెట్టించలేదు. మంచితనం ఒక్కటే నాచేత కన్నీరు పెట్టిస్తుంది" అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మాటలు గుర్తుకొస్తున్నాయి.

గుడ్ బై!!! షిహాన్ యాండీహూగ్.