“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జనవరి 2010, మంగళవారం

కాళ హస్తి, తిరుపతి సందర్శనం

23-1-2010 సాయంత్రం కాళ హస్తి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఒక VVIP గారితో వెళ్ళ బట్టి ఆలయ EO ఎదురొచ్చి పూర్ణ కుంభ స్వాగతం తో తీసుకెళ్ళి దర్శనం చేయించారు. తరువాత ఒక గంట సేపు ఆలయంలో మృత్యుంజయ లింగం ఉన్న చోట కూర్చొని మౌన జపం లో కాలం గడిపాను.

అదే రోజు రాత్రికి తిరుమల కొండ పైకి చేరుకొని రాత్రికి అక్కడే బస చేసాము. 24-1-2010 తెల్ల వారు జామున నాలుగుకే లేచి స్నానాలు ముగించుకొని అయిదు కల్లా దర్శనం కొరకు బయలు దేరాము. శుక్ర వారం నాడు TTD బోర్డు మీటింగ్ జరిగింది. మాతో పాటు బోర్డు సభ్యులు, ఇంతకూ ముందటి ఈవో గారు, మరికొందరు VVIP లు ఉన్నారు. లోపలి గడప వరకు తీసుకెళ్ళారు. గత ఇరవై ఏళ్లలో అటువంటి దర్శనం జరుగలేదు. గడప దాటితే స్వామి దగ్గరకు చేరుతాము. స్వామిని చాలా దగ్గరగా చూచే అదృష్టం కలిగింది. సర్వాలంకార భూషితుడుగా స్వామి నయనానంద కరం గా ఉన్నాడు. ప్రధాన అర్చకులు హారతి ఇస్తుండగా వజ్ర వైడూర్యాలు ధగ ధగ మెరిసి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. స్వామి మందహాసం ఇంతకు ముందు అంత దగ్గరగా చూడలేదు. అత్యంత సమ్మోహనం గా ఉంది. చెక్కిన శిల్పి ఎవరో గాని అద్భుతమైన ప్రతిభ కలవాడు. చిరు మందహాసం లో ఎన్ని భావాలను పొదగ గలిగాడో.

అంత చలిలో కూడా తమిళ వైష్ణవ భక్తులు, డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళు చలికి గజ గజ వణుకుతూ పైన ఆచ్చాదనలు లేకుండా దర్శనం కోసం వేచి ఉండటం చూస్తె, తమిళ సోదరులకు మనకంటే భక్తి చాలా ఎక్కువే అనిపించింది. మన ఆంధ్రా వాళ్ళు మాత్రమె పాంటు చొక్కాలలో దర్శనానికి వచ్చి కనిపించారు. వేషానికి దైవ దర్శనానికి సంబంధం లేక పోయినా, సాంప్రదాయ దుస్తులలో వచ్చి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి వేరు అనిపించింది. ఈ సారి వచ్చినపుడు నేను కూడా పంచె కట్టుకుని, శాలువా కప్పుకుని రావాలని నిశ్చయించుకున్నాను.

ఆరున్నర కల్లా దర్శనం ముగించుకొని బయటకు వచ్చి బయట చైర్మన్ ఆదికేశవులు నాయుడు గారిని కలిశి బసకు చేరాము. పది కల్లా కొండ దిగి క్రిందకు వచ్చి లోకంలో పడ్డాము.

తిరుమల కొండ లోనే ఏదో అద్భుతమైన వాతావరణం ఉంది. పైన ఉన్నంత వరకు సమస్యలు గుర్తుకు రావు. ఏదో వేరే లోకం లో ఉన్న అనుభూతి కలుగుతుంది. The mind reaches an elevated state effortlessly. ఇది నాకేనా అందరికీ ఇలాగే ఉంటుందా అని మా స్నేహితులను అడిగాను. అందరూ అదే అనుభూతికి లోనవుతాము అని చెప్పారు.

పవిత్ర క్షేత్ర దర్శనము, ఆలయ మర్యాదలతో ఆహ్వానములు జరగాలంటే, పంచమ, నవమాధిపతి దశలు, యోగ కారక దశలు జరుగుతూ ఉండాలి. అధిపతులు కూడా మంచి స్థితిలో ఉండాలి. అప్పుడే ఇలాటి అవకాశాలు లభ్యం అవుతాయి.