“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, జనవరి 2010, ఆదివారం

పురుషార్థాలు-కొన్ని జ్యోతిష తంత్ర రహస్యాలు


రాశిచక్రాన్ని పురుషార్థపరంగా నాలుగు త్రికోణాలుగా ఎలా దర్శించవచ్చో చెప్పాను కదా.ధర్మ-కామ త్రికోణాలను మాత్రం తీసుకోని,ఇంకొంత లోతైన విశ్లేషణ చూద్దాం.

ధర్మానికి కామానికి సామాన్యంగా పొసగదు. పొత్తు కుదరదు.కనుక ధర్మ,కామ త్రికోణాలు పరస్పరం ఎదురెదురుగా ఉంది సూటిగా ఖండించుకుంటాయి.కాని ఈ రెంటిని చక్కగా సమన్వయము చేసుకో గలిగితే, అనగా ధర్మాన్ని కామానికి ఆధారం చేసుకోగలిగితే అప్పుడు జీవితం భగవంతుని ఆదేశాలకు,ప్రకృతి యొక్క అమరికకు అనుగుణంగా ఉంటుంది. అప్పుడు మానవుడు భూమ్మీద దేవుని ప్రతిరూపం కాగలడు. అంటే దేవుని కుమారునిగా బ్రతకగలడు.

ధర్మ-కామ త్రికోణాలు రెండూ కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్య యంత్రం.లోకాలకు మాతాపితలైన పార్వతీ పరమేశ్వరుల సంతానం కుమారస్వామి.ప్రతి మానవుడూ కుమారుడే.కాని ఎవడైతే ధర్మాన్నీ-అంటే ఒకటి,అయిదు,తొమ్మిది భావాలనూ (శివుణ్ణి) మరియు కామాన్ని అంటే మూడు,ఏడు,పదకొండు భావాలను (శక్తిని) సరిగా సమన్వయము చెయ్యగలడో వాడు కుమారుని అంశ అవుతాడు.దీనిని సూచిస్తూ కుమారస్వామి యంత్రంలో ఎదురెదురుగా ఖండించు కుంటున్న రెండు త్రికోణాలు ఉంటాయి.

ఊర్ధ్వ ముఖంగా ఉన్న త్రికోణం ధర్మ త్రికోణం.రాశిచక్రంలో ఇది 1,5,9 భావాలలో దర్శనం ఇస్తుంది. ఇది ధర్మ స్వరూపుడైన శివునికి సూచిక.ప్రపంచానికి ధర్మమే (universal law)ఆధారం.ధర్మం ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా ఉంటుంది. దానికి కింది చూపు ఉండదు.శివతత్త్వం అగ్ని స్వరూపం.అగ్ని ఎప్పుడూ క్రిందినుంచి పైకి ఎగురుతుంది. పైముఖంగా ఉంటుంది.

ఇక అధోముఖంగా ఉన్న త్రికోణం శక్తికి సూచిక.రాశి చక్రంలో ఇది 3,7,11 భావాలలో మనకు దర్శనం ఇస్తుంది.ఏ శక్తి అయినా పైనుంచి కిందికే ప్రవహిస్తుంది.శక్తితత్త్వం జలస్వరూపం. శక్తి ఆర్ద్రమైనది.నీరు ఎప్పుడూ పైనుంచి క్రిందికే ప్రవహిస్తుంది.అందుకే కామత్రికోణం క్రింది ముఖంగా ఉంటుంది.శక్తి లేకపోతే ప్రపంచం లేదు. ప్రపంచమంతా శక్తి మయమే.

శివశక్తుల కలయిక కుమారస్వామి. ఈయన యంత్రంలో ఆరుకోణాలు ఉంటాయి.అందుకే ఆయనకు షణ్ముఖుడు అని పేరు వచ్చింది.ఈ ఆరు కోణాలు రెండు త్రిభుజాల పరస్పర ఖండన,మెళన వల్ల ఏర్పడతాయి. అలాగే ధర్మం,కామం కలయిక వల్ల ఉన్నతుడైన మానవుడు ఏర్పడతాడు. ప్రపంచం లోని ఉన్నతమైన భావాలకు శక్తులకు షణ్ముఖుడు అధిపతి. దీనికి సూచికగానే ఆయనను దేవ సేనాపతి అంటారు.అంటే దేవసేన అనే ఒక దేవతకు భర్త అని కాదు. ధార్మికమైన, శక్తివంతములైన పవిత్ర భావములు అనబడే దేవతలకు ఆయన అధిపతి అని అర్థం. ఇది ధర్మ-కామ సమన్వయ స్వరూపం.

ప్రపంచంలొని అతి ప్రాచీన మతాలన్నిటిలో ఈ భావన ఉంది. హిందూ మతంలో భాగమైన తంత్రశాస్త్రంలో ఈ భావన శివుడు,శక్తి, కుమారుడు అని చెప్ప బడింది. అంటే చలిస్తున్న ప్రపంచం (శక్తి), దీనికి ఆధారమైన అచలమైన శివుడు,మరియు ప్రపంచంలో ఉన్న జీవుడు (కుమారుడు) అని అర్థాలు. దీన్ని కాపీ కొట్టిన క్రైస్తవమతం Father,Holy Ghost,Son అని చెప్పింది. అయితే Father అన్న పదానికి Jehova(Yahveh) నూ, Holy Ghost కు ఆత్మనూ, Son కు జీసస్ నూ సూచికలుగా వారు తీసుకున్నారు.

కాని దీని అసలైన మూలభావనలో చూస్తే, 

Father=జగత్పిత,శివుడు లేక పరమాత్మ

Holy Ghost=కాళి లేక జగన్మాత,

Son=కుమార స్వామి అనేది క్ర్రైస్తవం కంటే అతి ప్రాచీనమైన హిందూ మతంలో తంత్రంలో మనకు దర్శనం ఇస్తుంది.

ఇక్కడ ఒక చిత్రమైన విషయం కనిపిస్తుంది. Holy Ghost అన్న పదానికి కాళీ మాత రూపం అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటె ఆమె రూపం అతి భయంకరంగా ఉండి కూడా అతి పవిత్రమైనదిగా ఉంటుంది.


మూల భావనలు ప్రాతిపదికగా తీసుకుంటే, ప్రపంచంలోని ఏ మతమూ హిందూ మతం కంటే గొప్పది కాదు. ఎందుకంటే ఇతర మతాలు చెప్పేభావనలు అన్నీ అంతకు వేల సంవత్సరాల ముందే హిందూమతం లో ఉన్నాయి.

ఇంకో విదంగా చెప్పాలంటే హిందూమతంలోని చిన్నచిన్న ముక్కలే ఇతర మతాలు అని అనుకోవచ్చు. ప్రపంచంలోని ఏ మతానికి చెందినా వారైనా శివ-శక్తులనే, తెలిసో తెలియకో పూజిస్తున్నారు. పూజించగలరు. ఇంతకంటే ఎవరైనా ఇంకేమీ చెయ్యలేరు.ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అంతిమ సత్తాకలు (Ultimate Entities) శివ-శక్తులు మాత్రమె.


జ్యోతిష్యపరంగా చూస్తే ఈ రేఖా యంత్రం, ధర్మ మరియు కామ త్రికోణాల కలయికగా మనకు దర్శనం ఇస్తుంది.తంత్రపరంగా ఇది శివ-శక్తి స్వరూపమైన షణ్ముఖ సుబ్రహ్మణ్య యంత్రం.జాతక రహస్యాలు తెలిసిన వారికి దీన్ని చూడగానే ఒక మనిషిలో ధర్మం-కామం ఏఏ పాళ్ళలో కలిసి ఉన్నాయో తెలిసిపోతుంది.

ధర్మం ఎక్కువై కామం తగ్గితే దైవత్వం.

కామం ఎక్కువై, ధర్మం తక్కువ అయితే రాక్షసత్వం.



రెండూ ఇంచు మించుగా సమపాళ్ళలొ ఉంటే మానవత్వం.

ఈ జ్ఞానం కలగాలంటే, పై ఆరు భావాల (1,5,9,3,7,11) సమన్వయ పూర్వక విశ్లేషణ చెయ్యటంలో ప్రావీణ్యత ఉండాలి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది. ఈ అంకెలలో ఒక క్రమం మనం చూడవచ్చు. 1,3,5,7,9,11 అంకెలలో ఉన్న రహస్య సంకేతాలను, తంత్రపరమైన రహస్యాలను ఇంకొక సారి వివరిస్తాను.

చివరిగా ఒక కొసమెరుపు ఏమిటంటే ప్రాచీన యూదుమతంలో,ఈ షట్కోణ సుబ్రహ్మణ్య యంత్రాన్ని Solomon Seal అనే పేరుతో పిలుస్తారు. King Solomon ఈ యంత్రాన్ని పూజించేవాడు.మెడలో ధరించేవాడు.అంటే అతడు తెలిసో తెలియకో శివ-శక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించేవాడు.ప్రాచీనకాలంలో,నేటివలే మత పరమైన సంకుచిత భావనలు లేవు.నిజమైన జ్ఞానం ఎక్కడ ఉన్నా స్వీకరించేవారు.సాలమన్ రాజు మార్మిక శాస్త్రముల(Occult Sciences) జ్ఞానం కలిగినవాడు.ప్రాచీన తంత్రజ్ఞానం మన దేశంనుంచి,ఈజిప్టుకు చేరింది.కనుక ఆ భావనలు సాల్మన్ రాజుకు తెలుసు అని అనుకోవడం సత్యదూరం కాబోదు.

ఇటువంటి అధ్బుతమైన insights ను జ్యొతిష,తంత్రశాస్త్రాలు మానవునికి ఇవ్వగలవు.