అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

16, డిసెంబర్ 2024, సోమవారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2024 వచ్చేసింది.

డిసెంబర్ 19 నుండి 29 వరకూ 11 రోజులపాటు జరుగబోతున్న ఈ పుస్తక ప్రదర్శన, హైద్రాబాద్ లోని NTR స్టేడియంలో జరుగుతుంది. దీనిలో పంచవటి బుక్ స్టాల్ కు స్టాల్ నంబర్ - 145 కేటాయించబడింది. అక్కడ పంచవటి ప్రచురణల పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి.

మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకూ పుస్తకప్రదర్శన ఉంటుంది.

నా రచనలను అభిమానించేవారు మీకు కావలసిన పుస్తకాలను మా స్టాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.  అంతేగాక, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ గురించి, మా యోగాశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి మీకున్న సందేహాలను మా సభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.

గతంలో ఉన్న ప్రింట్ పుస్తకాలకు తోడుగా, ఎంతోమంది అడుగుతున్న ఈ క్రొత్త పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేయబడ్డాయి. స్టాల్ లో మీకు లభిస్తాయి.

1. ఆరు యోగోపనిషత్తులు

2. వెలుగు దారులు (మూడు భాగాలు)

3. మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు (రెండు భాగాలు)

4. గోరక్ష సంహిత

5. శ్రీరామ గీత

6. ముక్తికోపనిషత్తు

7. గాయత్రీ రహస్యోపనిషత్తు

8. పతంజలి యోగసూత్రములు

9. మధుశాల

10. భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము

పుస్తకాభిమానులు, నా రచనల అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్ "

26, నవంబర్ 2024, మంగళవారం

ఆశ్రమం మొదటి వార్షికోత్సవం - 5 వ సాధనా సమ్మేళనం

పంచవటి ఆశ్రమం మొదలై అప్పుడే ఏడాది గడచిపోయింది. చూస్తూ ఉండగానే ఆశ్రమవాసం ఒక ఏడాది పూర్తయింది. అందుకని మొన్న 22, 23, 24 తేదీలలో (శుక్ర శని ఆదివారాలలో) ఆశ్రమం మొదటి వార్షికోత్సవం మరియు 5 వ సాధనా సమ్మేళనాలను జరుపుకున్నాము. 

ఆశ్రమసభ్యులలో కొంతమంది ఇతరదేశాలలో ఉన్నారు. వారిలో కొంతమంది దీనికోసమే ఇండియాకు వచ్చి, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ కలసి మూడురోజులపాటు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మా గ్రూపు చిన్నదే. కానీ గట్టిది. ఓటివారు జారిపోగా, గట్టివారు మాత్రం మిగిలారు.  నాకు నచ్చకపోతే నేనే తీసేస్తుంటాను. వాళ్లకు నచ్చకపోతే వాళ్ళే వెళ్లిపోతుంటారు. 

ఏమంటే, మాకు రాశి కంటే వాసిమీదే నమ్మకం ఎక్కువ. మాకు ప్రచారాలు, ప్రసాదాల కంటే ప్రసారమే ముఖ్యం. వేషాలకంటే కావేషాల తగ్గుదలే మాకు ప్రాధాన్యం. ఆర్భాటం కంటే ఆచరణే మాకు ముఖ్యం. రోదన కంటే సాధనే మాకు ఇష్టం.

మాదైన విధానంలో యోగాభ్యాసం, ధ్యానం. ఉపదేశాలు, ఉపన్యాసాలు, కర్మయోగం, సమిష్టిజీవనం, సందేహాలు సమాధానాలు, అభిప్రాయాల కలబోతలతో మూడురోజుల రిట్రీట్ చిటికెలో గడిచిపోయింది.

దూరప్రాంతాలనుండి మాటమాటకూ ఆశ్రమానికి రాలేకపోతున్న సభ్యులకోసం జ్యోతిషశాస్త్రం, హోమియోపతి ఆన్లైన్ క్లాసులను త్వరలో మొదలుపెట్టాలన్న నిర్ణయంతో,  డిసెంబర్ జనవరి నెలలలో హైద్రాబాద్, విజయవాడలలో జరుగబోయే బుక్ ఎగ్జిబిషన్లలో పంచవటి స్టాల్లో కలుసుకుందామన్న నిశ్చయంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది. 

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను మాత్రం ఇక్కడ చూడవచ్చు.






read more " ఆశ్రమం మొదటి వార్షికోత్సవం - 5 వ సాధనా సమ్మేళనం "

2, అక్టోబర్ 2024, బుధవారం

దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం !

సనాతన హిందూధర్మానికి మరో విజయం !

వారణాశిలోని దాదాపు పది ఆలయాలనుంచి షిరిడీసాయిబాబా విగ్రహాలను నిన్న తొలగించారు. ఇది చాలా మంచి న్యూస్ !

గత పదేళ్లనుంచి అనేకమంది అసలైన హిందువులు చేస్తున్న పోరాటం కొద్దిగా ఫలితాన్ని చూపించడం మొదలైంది. నిద్రపోతున్న అమాయక హిందువులను మేలుకొలుపుతోంది. సత్యాన్ని వారికి అర్ధమయ్యేలా చేస్తోంది. కనీసం కొంతమంది హిందువులు ఇప్పటికైనా మేల్కొంటున్నారు. నార్త్ లో చైతన్యం వస్తోంది. సౌత్ లో మాత్రం ఇంకా రావడంలేదు. మన సౌత్ అంతా దండకారణ్యం కదా. ఇది రావణుని రాజ్యం. అడవిమనుషులకు జ్ఞానోదయం కలగడానికి టైం పడుతుంది మరి !

మెజారిటీ హిందువులు చాలా అమాయకులు. ఎవరేది చెబితే అది నమ్మేస్తారు. అందులోనూ, 'అనుకున్న పనులన్నీ జరుగుతాయి'  అన్న ఆశను చూపిస్తే చాలు, ఎవరినైనా నమ్మేస్తారు. మతాలు మారిపోతారు. చివరకు కన్నతల్లిని కూడా మర్చిపోతారు. వేరే ఎవరినో తన తల్లి అనడం మొదలుపెడతారు. అంత అమాయకులు ! అమాయకత్వం అన్నమాట సరికాదేమో, స్వార్థపరత్వం అంటే సరిపోతుంది. 

పచ్చి స్వార్ధపరులు మాత్రమే మాతృభూమికి, మాతృధర్మానికి ద్రోహం చేస్తారు. 

సాయిబాబాను దేవునిగా మార్చి, హిందువులను తమ మతానికి దూరంచేసి, హిందూసమాజాన్ని చీల్చే కుట్ర గత నలభైఏళ్లుగా చాలా తెలివిగా అమలు చేయబడుతోంది. దీనిని చేసినది మళ్ళీ కొందరు సోకాల్డ్ సాంప్రదాయ హిందువులే. దేవుడు కాని సాయిబాబాను దేవునిగా చిత్రిస్తూ ప్రచారాలు చేసినది, గుళ్ళు కట్టించినదీ హిందువులే. వీరిలో మహారాష్ట్ర మరియు తెలుగు బ్రాహ్మణులే ఎక్కువమంది ఉన్నారు. తమ స్వార్థంకోసం, గురువులుగా సమాజంలో చెలామణీ కావడం కోసం హిందూమతాన్ని నాశనం చేయడంలో వీళ్ళు తమ పాత్రను పోషించారు.

వేదవేదాంతాలలో ఉన్న సారాన్ని వివరించి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత బ్రాహ్మణులది. వారిది ఆచార్యస్థానం. అలాంటి స్థానాల్లో ఉన్నవారు దారితప్పి, సాయిబాబా వంటి తురకలను సాక్షాత్తు దేవునిగా మార్చి, అమాయకులైన తమ హిందూ అనుచరులను ఏమారుస్తూ వచ్చారు. గురువులది స్వార్ధం. ప్రజలది అమాయకత్వం. అందుకే వీరిద్దరిని  చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. కొండొకచో అసహ్యం కూడా వేస్తుంది.

నిజమైన హిందూమతం, సనాతనధర్మం వేదాలలో ఉపనిషత్తులలో ఉన్నది. వాటి సారం భగవద్గీత. వీటిని చదివి అర్ధం చేసుకున్నవారు, సాయిబాబా లాంటి ముస్లిం పకీర్లను ఎన్నటికీ పూజించరు.

మరొక్క వింత విషయం చెప్పనా ?

అసలైన ముస్లిములు కూడా ఫకీర్లను, దర్గాలను పూజించరు, అది ఘోరమైన పాపమని ఖురాన్ అంటుంది. ఏ ముస్లిమూ సాయిబాబాను పూజించడు. ఆయన ఒక ఫకీర్ మాత్రమే అని వారు నమ్ముతారు. అది నిజం కూడా. అంటే, ముస్లిములు కూడా చెయ్యని పాపాన్ని హిందువులు నిస్సిగ్గుగా చేస్తున్నారన్నమాట ! వినడానికి భలే ఉంది కదూ ! ఇదీ మెజారిటీ హిందువుల అమాయకత్వం !

ఎన్నో హిందూసంఘాలు ఏళ్ల తరబడిగా చేస్తున్న పోరాటం ఇప్పటికైనా కొంత ఫలితాలు చూపిస్తున్నది.  హిందువులలో కనీసం ఇప్పటికైనా కొంత చైతన్యం వస్తోంది. సంతోషం !

హిందువులారా ! కళ్ళు తెరవండి ! చీకట్లో నడవకండి ! వెలుగులోకి రండి ! మీ మతమేంటో, మీ గ్రంధాలేమి చెబుతున్నాయో, మీరేం చెయ్యాలో తెలుసుకోండి ! ఎవరేది చెబితే అదే నిజమని భ్రమించకండి ! మతాలు మారకండి ! ఎవరిని పడితే వారిని గుడ్డిగా పూజించకండి. మీ దేవతలను వదలకండి ! మీ ఆచారాలకు తిలోదకాలను ఇవ్వకండి. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు, ఈశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయస్వామి మొదలైన దేవతలు చాలరా? ఒక ముస్లిం ఫకీర్ ను దేవునిగా చేసి కూచోబెట్టి పూజించవలసిన ఖర్మ మీకేంటి?

వారణాశి హిందూసోదరులు తమలో కొంతైనా ఆత్మాభిమానం మిగిలి ఉందని నిరూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని దేవాలయాలలోనూ ఇదే పని జరగాల్సిన అవసరం గట్టిగా ఉంది !

మన తెలుగురాష్ట్రాల బండనిద్ర ఎప్పటికి వదులుతుందో మరి ?

read more " దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం ! "

24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.

read more " మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల "

18, ఆగస్టు 2024, ఆదివారం

ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది?

ఈరోజు మధ్యాహ్నం 12.56 నిముషాలకు వేసిన ప్రశ్నచక్రం ఇది. 

కలకత్తా డాక్టర్ మరణం వెనుక అసలు ఏముంది? అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న ఉద్దేశ్యం.

9 వ తేదీన ఈ సంఘటన జరిగింది. కానీ ప్రశ్న చూడాలని నాకు అనిపించలేదు. ఈరోజు మధ్యాహ్నంపూట ఆదేశం వచ్చింది. అందుకని ప్రశ్న జాతకం చూడటం జరిగింది.

రహస్యాలకు నిలయమైన వృశ్చికం లగ్నమౌతూ దీనివెనుక చాలా రహస్యాలు దాగున్నాయని, ఇది సింపుల్ కేసు కాదని చెబుతోంది. 

చంద్రుడు 3 లో ఉంటూ స్నేహితులు, సహచరుల పాత్ర ఉందని చెబుతున్నాడు.

శని 4 లో వక్రించి ఉంటూ, 3 లోకి వచ్చి చంద్రుని కలుస్తూ తన క్లాసుమేట్లు, ఇంటిదొంగలు దీనివెనుక ఉన్నారని చెబుతున్నాడు.

లగ్నాధిపతి కుజుడు 7 లో గురువుతో కలసి శుక్రస్థానమైన శత్రురాశిలో ఉంటూ, ప్రొఫెసర్లు మొదలైన గురుస్థానంలో ఉన్నవాళ్ల పాత్ర కూడా ఉందని, ఈ అమ్మాయి వారి వలలో పడిందని చెబుతున్నాడు.

గురుకుజులతో యురేనస్ కూడా అక్కడే ఉంటూ సంఘవిద్రోహశక్తులు దీని వెనుక ఉన్నారని ఈ అమ్మాయిని చంపింది వారేనని, గురువులకు వారికీ  స్నేహం ఉందని, వారందరూ ఒక గ్రూపని చెబుతున్నాడు.  

పంచమాధిపతి గురువు 7 లో కుజ యురేనస్ లతో కలసి ఉండటం, ఈ పని చేసినది తెలియని మనుషులు కాదని, ఈ అమ్మాయికి వారికీ బాగా పరిచయం ఉందని స్పష్టంగా చెబుతోంది.

రాహువుతో నెప్ట్యూన్ కలసి 5 లో ఉంటూ, డ్రగ్ మాఫియాను సూచిస్తున్నాడు. ఆ ముఠా  సభ్యులతో ఈ అమ్మాయికి స్నేహంగాని, కనీసం గట్టి పరిచయం గాని ఉందని. వారు ఈ అమ్మాయికి బాగా పరిచయస్తులే అని సూచిస్తున్నాడు. రాహువు గురురాశిలో ఉండటం ముస్లిములను సూచిస్తుంది. కనుక వారిలో వీరు కూడా ఉండవచ్చు.

10 లో రవి బుధ శుక్రులున్నారు.  వీరిలో రవి బలంగా ఉంటూ నాయకుల అధికారుల హస్తాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.

రవితో ఉన్న బుధుడు వక్రించి, ఆ నాయకుల, అధికారుల బుద్ధి వక్రించిందని చూపిస్తున్నాడు.

లగ్నము, శని, గురుకుజులు, రవిబుధశుక్రులు ఒకరికొకరు కేంద్రస్థానాలలో ఉంటూ, వీరిమధ్యన జరిగిన తీవ్రమైన ఘర్షణను సూచిస్తున్నారు.

గురుశుక్ర శని కుజులు డిగ్రీ దృష్టులలో చాలా దగ్గరగా ఉన్నారు. వీరిలో శుక్ర శనులు నీచమైన సెక్స్ నేరాలను సూచిస్తారు. గురుశుక్రులు ఈ నేరంలో గురువుల పాత్రను సూచిస్తారు. శని కుజులు హింసాత్మక సంఘటనకి సూచకులు. గురుశనులు దృఢకర్మను సూచిస్తారు. గురుకుజులు అధికార దుర్వినియోగాన్ని సూచిస్తున్నారు.

నవాంశలో శని 6 లో నీచలో ఉంటూ నీచులైన స్నేహితులను, తక్కువస్థాయి పనివారిని శత్రువర్గంగా సూచిస్తున్నాడు.

సూర్యుడు 6 లో ఉఛ్చస్థితిలో ఉంటూ అధికారులతో ఈ అమ్మాయికి శత్రుత్వం వచ్చిందని స్పష్టంగా చూపిస్తున్నాడు.

నవాంశలో గురువు ఉఛ్చస్థితిలో ఉన్నందున ఈ కేసు ఇంత సంచలనాన్ని సృష్టించి, దేశవ్యాప్త ఉద్యమాన్నిరేకెత్తించి, సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకునేవరకూ తెచ్చింది. లేకపోతే, గతంలో జరిగిన ఎన్నో వందల రేప్ /మర్డర్ కేసులలాగే ఇది కూడా వెలుగులోకి రాకుండా ఉండిపోయేది.

ఈ కేసులో నేరస్థులకు శిక్ష పడుతుందా? అన్నది అసలు ప్రశ్న.

లగ్నాధిపతి కుజుడు 7 లో శత్రుస్థానంలో ఉండటం, దశమాధిపతి రవి దశమస్థానంలో బలంగా ఉండటం, ఇద్దరికీ కేంద్రదృష్టి ఉండటాలను బట్టి, లాభాధిపతి బుధుడు 9 లోకి వస్తూ, కుజునితో 3/11 దృష్టిలోకి రావడాన్ని బట్టి, కొంత హడావుడి జరుగుతుంది గాని, పూర్తి న్యాయం మాత్రం జరగదని, అసలైన నేరస్థులు తప్పించుకుంటారని ప్రశ్నశాస్త్రం చెబుతోంది.

ప్రశ్న సమయంలో చంద్ర రాహు రాహు గురు బుధదశ నడిచింది. రాహు-గురు -వక్రబుధులు సంఘవిద్రోహ మాఫియాను, అధికారులు మాఫియాతో కుమ్మక్కు అవడాన్ని సూచిస్తున్నారు.  లగ్నము, చంద్రుడు, రాహువు, గురువు, బుధుడు ఒకరికొకరు తృతీయాలలో ఉన్నారు. అంటే, ఇదంతా ఒక పెద్ద నెట్ వర్క్ అని స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇది మామూలు రేప్ కేసు కాదు. దీని వెనుక చాలా పెద్ద నెట్ వర్క్, డ్రగ్ మాఫియా, అధికారుల పాత్ర అన్నీ ఉన్నాయి. దీనిని ఛేదించాలంటే నాయకులకు, అధికారులకు  చాలా చిత్తశుద్ధి, నిజాయితీలు ఉండాలి. ప్రస్తుతకాలంలో అవి ఎంతమందిలో ఉన్నాయి?

అదీగాక దీనివెనుక ఉన్న మాఫియా ముఠాను కదిలించడం అంత సులభం కాదు. వారికి నాయకుల అధికారుల అండదండలున్నాయి గనుక అసలు నేరస్థులు దొరకరని చెప్పవచ్చు.

పైగా, రోజులు గడిచేకొద్దీ ఎంత పెద్ద న్యూసైనా సరే పాతబడిపోతుంది. పబ్లిక్ మర్చిపోతారు. కనుక ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనేది ఎవరికైనా తేలికగా అర్థమౌతుంది.  

ప్రసన్నలక్ష్మి, మీరాజాస్మిన్, ప్రత్యూష, సుశాంత్ సింగ్ ఇలా గతంలో ఎన్ని జరగలేదు ! వారిలో ఎందరికి న్యాయం జరిగింది? ఇప్పుడు  మాత్రం ఎలా జరుగుతుంది? పాత రికార్డును బట్టే కదా ప్రస్తుత ఇమేజి ఏర్పడేది !

వ్యవస్థలు కుప్పకూలినపుడు ఎవరి రక్షణబాధ్యత వారిదే అవుతుంది. అందుకే రైల్వే ఎప్పుడో చెప్పింది, ' మీ లగేజికి మీరే బాధ్యులు ' అని.
read more " ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది? "

10, ఆగస్టు 2024, శనివారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్

బాంగ్లాదేశ్ సంక్షోభంలో కూరుకుపోయింది.

దీనిని వాళ్ళు 'రెండవ స్వతంత్రం' గా వర్ణించుకోవచ్చు గాక. కానీ విధ్వంసం దిశగా వాళ్ళు వెళుతున్నారనడానికి గత వారంరోజులుగా అక్కడ హిందువులపైన జరుగుతున్న మారణకాండలే సాక్ష్యాలు.

దీనివెనుక అమెరికా, పాకిస్తాన్, చైనాల కుట్ర అనుమానం లేకుండా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదుల కుట్ర ఉంది.

దీనివల్ల మన దేశానికి కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అటు బర్మాలో కొన్ని భాగాలు, ఇటు ఇండియాలో సెవెన్ సిస్టర్స్, అస్సాం, వేస్ట్ బెంగాల్, బీహార్ వరకూ ఇస్లామిక్ రాజ్యమంటూ క్రొత్త నినాదం ముందుకొస్తుంది. దానికి అల్ ఖైదా, ఇరాన్ లు ఆజ్యం పోస్తాయి. మనదేశంలో ఉన్న ఇస్లామిక్ స్లీపింగ్ సెల్స్ లోపలనుంచి సహకరిస్తాయి. ఇంటా బయటా సమస్యలు  చుట్టుముడతాయి. వెరసి ఇండియా పెను ప్రమాదంలో పడబోతోంది.

ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్లో  మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్న మన ప్రభుత్వం ఇక తూర్పునుండి కూడా చొరబాటులను, అల్లర్లను, తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అస్సామ్, వేస్ట్ బెంగాల్ లు ప్రధానంగా టార్గెట్ అవుతాయి.

ఈ విషయంలో గ్రహాలేమంటున్నాయి?

ఇదంతా యురేనస్ గ్రహం యొక్క ప్రభావం. జూన్ నెలలో యురేనస్ గ్రహం, భారతదేశాన్ని సూచించే వృషభరాశిలోకి అడుగుపెట్టింది. ఒక్క నెలలోనే మన దొడ్డివాకిలి లాంటి బాంగ్లాదేశ్ లోని ప్రజాప్రభుత్వం కూలిపోయింది.

84 ఏళ్ల కొకసారి యురేనస్ గ్రహం రాశిచక్రాన్ని ఒక చుట్టు చుట్టి వస్తుంది. అంటే, ఒక్కొక్క రాశిలో అది 7 ఏళ్ళు ఉంటుంది. గతంలో 1940-48 మధ్యలో యురేనస్ వృషభరాశిలో సంచరించింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలోకి వచ్చింది.

ఏయే విషయాలు యురేనస్ అదుపులో ఉన్నాయి?

తిరుగుబాట్లు, విప్లవాలు, పెద్ద ఎత్తున అల్లర్లు, ప్రభుత్వాలు కూలిపోవడాలు, దేశాలమధ్యన యుద్ధాలను ఈ గ్రహం కంట్రోల్  చేస్తుంది.  ఇది చరిత్ర చెబుతున్న నిజం ! 

కనుక అప్పటి పరిస్థితులే అటూ ఇటూగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి.

1940-48 మధ్యలో ఏం జరిగింది?
-----------------------------------------------
1939-45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.
 
అప్పుడే భారత స్వతంత్రపోరాటం కూడా జరిగింది. 1947 లో మనకు స్వతంత్రం వచ్చింది.

రెండో ప్రపంచయుద్ధంలో ఏడున్నర కోట్ల మంది ప్రపంచప్రజలు + సైనికులు చనిపోయారు. 

భారత విభజన సమయంలో జరిగిన సరిహద్దు అల్లర్లలో 5 నుండి 10 లక్షల మంది చనిపోయారు.

2024-2030 మధ్యలో మళ్ళీ అవే పరిస్థితులు రాబోతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం, చైనా - తైవాన్ సంక్షోభం, బాంగ్లాదేశ్ లో తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు ఇవన్నీ ముదిరి ముదిరి మూడవ ప్రపంచయుద్ధంగా మారబోతున్నాయి. 

రోహిణీ శకట భేదనం
-----------------------------
రోహిణీ నక్షత్రంలో యురేనస్ 1943-45 మధ్యలో సంచరించాడు. అప్పుడే రెండవ ప్రపంచయుద్ధం ముదిరి పాకాన పడింది. జపాన్ పైన అణుబాంబు ప్రయోగం జరిగింది కూడా అప్పుడే.

మళ్ళీ ఇప్పుడు 2026-28 మధ్యలో యురేనస్ రోహిణీ నక్షత్రంలో సంచరించబోతున్నాడు. 84 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను ప్రపంచం మళ్ళీ చూడబోతోంది.

మేషరాశిలో శని స్థితి
-----------------------------
మేషరాశి శనికి నీచస్థితి. ప్రస్తుతం శనీశ్వరుడు 2027-30 మధ్యలో మేషరాశిలో సంచరించబోతున్నాడు.  ఈ సమయంలో ప్రపంచదేశాల ప్రజలకు, ముఖ్యంగా భారత ఉపఖండపు ప్రజలకు నానాకష్టాలు తప్పవు.

యురేనస్ సంచారం + శని మేషరాశి సంచారం రెండూ కలిసి, 2026 నుండి 2029 వరకూ నాలుగేళ్లు ప్రపంచదేశాలకు చుక్కలు కనిపించబోతున్నాయి.

ఇదే సమయంలో భారతదేశం కూడా కనీవినీ ఎరుగని గడ్డు పరిస్థితులను, సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది.

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు, ప్రజలు, ముఖ్యంగా హిందువులు ఐకమత్యంగా ఉంటూ దేశభద్రతకు, దేశప్రయోజనాలకు పెద్దపీట వెయ్యకపోతే మాత్రం, ఆ తరువాత ఏ పీటా వేసుకోవడానికి ఎవరూ మిగలరు.

ఈ హెచ్చరికను ఆషామాషీగా తీసుకోకండి.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం ఇదే కావచ్చు, కలియుగాంతం ఇదే కావచ్చు. ఇప్పటినుండి ఏడేళ్లలో మన కళ్ళముందే మనం వాటన్నింటినీ చూడబోతున్నాం. తస్మాత్ జాగ్రత !

ఈ సబ్జెక్ట్ పైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

జైహింద్ !  
read more " బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్ "

28, జులై 2024, ఆదివారం

4 వ సాధనా సమ్మేళనం విజయవంతం

ఆషాఢపూర్ణిమ గురుపూర్ణిమ. ఆనాడు సనాతన భారత సాంప్రదాయానికి పరమగురువైన వ్యాసభగవానుని స్మరించి మనమందరం ఆరాధిస్తాం. కనుక అది వ్యాసపూర్ణిమ అయింది. అదేసమయంలో, వ్యాసభగవానుని ప్రతిరూపాలుగా భావిస్తూ ఎవరి గురువులను వారు పూజించడం కూడా మన సంప్రదాయం.

వ్యాసపూర్ణిమ తరువాత వచ్చే సప్తమి నేను పుట్టినరోజు గనుక, ఈ నెల 26, 27, 28 తేదీలలో వచ్చిన వీకెండ్ లో మా ఆశ్రమంలో గురుపూర్ణిమ ఉత్సవాలను జరిపాము.

ఈ మూడురోజులపాటు మా ఆశ్రమంలో 4 వ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం జరిగింది. పంచవటి సాధనామార్గానికి చెందిన ఉన్నతదీక్షలను సభ్యులకు ఇవ్వడం, వాటి లోతుపాతులు నేర్పించడం, సాధన చేయించడం, సందేహనివారణ చెయ్యడం, ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చెయ్యడం జరిగింది. జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, యోగసాధన, హోమియోపతి వైద్యాలలో నాదైన విధానాన్ని సభ్యులకు నేర్పించడం జరిగింది.

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.




 


read more " 4 వ సాధనా సమ్మేళనం విజయవంతం "

14, జులై 2024, ఆదివారం

మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల

ఈరోజు మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 66 వ పుస్తకం, మరియు మొదటి హిందీ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు హిందీ అనువాదం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆదరణను పొందడంతో. దీనిని హిందీ లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నాం.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల "

5, జులై 2024, శుక్రవారం

The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల


ఈరోజు మా క్రొత్తపుస్తకం The Wine House విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 65 వ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు ఇంగ్లీష్ అనువాదం. తెలుగుపుస్తకం మంచి పాఠకాదరణను పొందింది. అందుకని దానిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేద్దామన్న సంకల్పం కలిగింది.

కేవలం రెండునెలల లోపే 'మధుశాల' ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన నా శిష్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  అంతేకాదు, ఈ పుస్తకం హిందీ అనువాదం కూడా అయిపోయింది. పదిరోజులలో అది కూడా मधुशाला అనే 'ఈ బుక్' గా హిందీరాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

నా పుస్తకాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడుభాషలలోనూ వస్తాయని ఇంతకు ముందు చెప్పాను. అది నేడు The Wine House తో మొదలుపెట్టబడింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

ఏకాంత ధ్యానసాధనను ఇష్టపడేవారికి ఈ పుస్తకంలోని 140 చిన్నికధలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, నా ఫిలాసఫీ మొత్తం ఈ పుస్తకంలో అతి తేలికమాటలలో చెప్పబడింది. ప్రయత్నించండి.

read more " The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల "

24, జూన్ 2024, సోమవారం

ప్రపంచ యోగ దినోత్సవం - 2024

జూన్ 21 2024 న వేసవి అయనాంతపు రోజు. ఆ రోజున  ప్రపంచమంతా యోగదినోత్సవాన్ని జరుపుకుంది. పంచవటి సాధనామార్గాన్ని అనుసరించేవారందరూ, ఆనాడు మా శైలిలో యోగవ్యాయామాన్ని చేసి ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. 

మాకిది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చేసే మొక్కుబడి తంతు కాదు. ఇది మా రోజువారీ దినచర్యలో భాగం.

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామాలు మొదటిమెట్లు మాత్రమే. కనీసం వీటి విలువనైనా ప్రపంచం నేడు గుర్తిస్తోంది. రోగాలకు భయపడి కొందరైనా యోగాన్ని చేస్తున్నారు. కొంతలోకొంత నయం.

మన ప్రధానమంత్రి మోదీగారు మన దేశానికి చేసిన గొప్ప మేళ్లలో ఇదీ ఒకటి. మనం మర్చిపోతున్న మన విజ్ఞానాన్ని మనకు, ప్రపంచానికి గుర్తుచేసిన ఈ మహానుభావుడికి దేశం మొత్తం ఋణపడి ఉంది. కానీ ఆయనకు మనం ఓట్లు వెయ్యం. మెజారిటీ ఇవ్వం. మనకు మేలు చేసేవాడు మనకు అక్కర్లేదు. మనల్ని నాశనం చేసేవాళ్ళే మనకు కావాలి. వాళ్లనే గెలిపించుకుంటాం. నాశనమౌతూనే ఉంటాం. ఇది మెజారిటీ ఇండియన్స్ పరిస్థితి.

అదలా ఉంచితే, పంచవటి సభ్యులందరూ ఎవరి ఇళ్లలో వారు చేస్తున్న యోగసాధనా కొలేజ్ ను ఇక్కడ చూడవచ్చు. 






read more " ప్రపంచ యోగ దినోత్సవం - 2024 "