నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

అమ్మకు నైటీబాబా సర్టిఫికెట్ అవసరమా?

మొన్న జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు ఒక క్రొత్త విషయం గమనించాను. అదేంటంటే, ప్రచారం పైన పెరిగిన ఫోకస్. నేటి నెట్ సమాజంలో అది అవసరమే. కాదనలేం. కానీ ఆ క్రమంలో సత్యాలను పక్కన పెట్టి అబద్ధాలను ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉన్నదా? అనేది నా సందేహం. అలా ఉన్నవీ లేనివీ ప్రచారం చేసే క్రమంలో అమ్మ భావజాలాన్ని, అసలుతత్త్వాన్ని మరుగున పడవెయ్యవచ్చా? అనేది కూడా నా ఇంకొక సందేహం.

ఉదాహరణకు, 'అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారమే' అని  శ్రీశ్రీశ్రీ నైటీబాబా చెప్పినట్టుగా ఒక కొటేషన్ అక్కడ బోర్డుల పైన దర్శనమిచ్చింది. అసలు నైటీబాబానే ఒక పెద్ద ఫ్రాడ్ అనేది ఎప్పుడో ఋజువై పోయింది. టీవీ కెమెరాలు, అశాంతి నిలయంలో జరిగిన అనేక సంఘటనలు ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా ఎప్పుడో  నిరూపించేశాయి. అలాంటి ఫ్రాడ్ బాబా ఇచ్చిన సర్టిఫికెట్ అమ్మకు అవసరమా? ఆ సర్టిఫికెట్ వాడుకోవడం వల్ల అమ్మ ప్రతిష్ఠ కొత్తగా పెరిగేది ఏమైనా ఉందా? అనేది నా సందేహం.

'అమ్మ రాజరాజేశ్వరి అవతారమే" అని నైటీబాబా నిజంగా చెప్పినట్లైటే, మరి అమ్మ దర్శనానికి బాబా ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? బాబాలు జగన్మాత కంటే గొప్పవాళ్లా? అనేది అసలైన ప్రశ్న.

పోతే, తను రాజరాజేశ్వరి అవతారం కానని అమ్మే స్వయంగా చెప్పింది. అమ్మ జీవితాన్ని చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 'అన్నపూర్ణాదేవి అని, రాజరాజేశ్వరి అని నన్ను అనుకునేవారే గాని, నన్ను నన్నుగా చూసేవాళ్ళు ఏరీ?' అని అమ్మ అన్నది.

అమ్మంటే నా అవగాహన కూడా అమ్మ చెప్పిన పై మాటలనే బలపరుస్తున్నది.

ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూడలేని వారే, ప్రతిదానికీ శివునితో విష్ణువుతో అమ్మవారితో ముడిపెట్టి చారిత్రక సంఘటనలకు పురాణరంగులు అద్దాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేస్తే గాని వారికి తృప్తి కలగదు. ఈ క్రమంలో కాకమ్మకధలు సృష్టిస్తూ ఉంటారు. తిరుమలలో జరిగిన శ్రీనివాసుని లోకల్ చరిత్రకు మహావిష్ణువుతోను, కేరళలో జరిగిన అయ్యప్ప జానపద చరిత్రకు మోహినీ అవతారంతోను, బుద్ధునికి దశావతారాల తోను లింకులు పెట్టి రకరకాలైన కథలు అల్లినది, ప్రతిదానికీ పురాణ ప్రతిపత్తిని ఆశించే ఈ పిచ్చిపోకడలే.

ఇక బాబాల సంగతి చెప్పనే అక్కర్లేదు. దివ్యత్వం లేనివారికి దివ్యత్వాన్ని, హిందువులే కానివారికి హిందూత్వాన్ని అద్ది, వాళ్ళను దేవుళ్ళను చేసి కూచోపెట్టినది కూడా ఈ పొకడలే. హిందువులలో ఈ దిగజారుడుతనం పోవాలి. అసలైన హిందూమతం పైన వారికి స్పష్టత రావాలి. వారి మతమేంటో వారికి స్పష్టంగా అర్థం కావాలి. నా పుస్తకాల ద్వారా దీనినే నేను చెబుతున్నాను.

అమ్మ చెప్పిన ఇలాంటి అసలైన మాటలను దాచిపెట్టి, అమ్మ భావజాలాన్ని పక్కదారి పట్టించి, ఫ్రాడ్ బాబాలు చెప్పిన ఇలాంటి కల్లబొల్లి కబుర్లను ప్రచారం చెయ్యడం ఎందుకు?

ఇది సత్యాన్ని అనుసరించడమా? లేక అసత్యాన్ని ఆరాధించడమా?

ఆదాయం కోసం ఆదర్శాలకు తిలోదకాలివ్వడం అవసరమా?

సత్యం నిలబడాలంటే కూడా అసత్యాల దన్ను కావాలా?

ఇదేనా కలిమాయ అంటే?