“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, ఏప్రిల్ 2023, మంగళవారం

దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు

ఈరోజు మంగళవారం.

నేడు దొడ్డవరం ఊరిలో ఉన్న లక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. అర్చకులు నరసింహాచార్యులు గారు, నడివయసు దాటిన మనిషి. మా వివరాలు విని చాలా సంతోషించారు. 'ఈ ఊరికి మేమొచ్చి పది రోజులైందని, ఊరిలో అతి ప్రాచీన ఆలయం ఏమిటి? అని వాకబు చేస్తే నరసింహస్వామి గుడి అని చెప్పారని, అందుకని ఈ ఆలయానికి నేటికి వచ్చి దర్శనం చేసుకోగలిగామ'ని ఆయనతో అన్నాను.

ఆలయంలో ఎవరూ లేరు. ఇతర గ్రామస్తులు సామాన్యంగా ఈ ఆలయానికి రారని తెలిసింది. ఎందుకంటే, ఇక్కడ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారట. ఇది పెద కమ్మవారి అధ్వర్యంలో నడుస్తున్న ఆలయం. విశాలంగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అంకమ్మతల్లి గుడి అయితే, మొక్కులు, బలులు మొదలైన వాటితో గ్రామ్యపంధాలో ఉంది. దానికి విభిన్నంగా నరసింహస్వామి ఆలయం, వైదిక సాంప్రదాయ విధానంలో శుచిగా ఉన్నట్లుగా అనిపించింది. ఇక్కడి 'ఆరా' కూడా చాలా బాగుంది.

వచ్చే నెల 4. 5 తేదీలలో సరసింహ జయంతి జరుగుతుందని, రోజంతా పూజలు, భజనలు ఉంటాయని, రమ్మని ఆచార్యులు అన్నారు. 'అలాగే వస్తామని' అంటూ, 'జనం వచ్చే పర్వదినాలలో కంటే, రాని మామూలు రోజులే మాకు బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఆలయంలో  ఒక్కడినే కూర్చుని జపధ్యానాలు అనుష్టానము చేసుకోవచ్చా?' అని అడిగాను.

'బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంతకంటే కావలసింది ఏముంది? వచ్చి చేసుకోండి' అని ఆయన అన్నారు.

'ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తన జరుగుతుంది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ ఉంటుంది. ఆడవాళ్ళ సంకీర్తనా బృందం ఉంది. వాళ్ళు చాలా బాగా భజన చేస్తారు. మీరూ వచ్చి పాల్గొనండి' అని ఆహ్వానించారు.  

'మా ఆశ్రమంలో కూడా ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తనం మొదలుపెట్టి చెయ్యబోతున్నాము. అయినా, ఇక్కడకు కూడా వస్తాను' అని  ఆయనతో చెప్పాను.

దొడ్డవరం తెల్లబాడు గ్రామాలలో రామనామ సంకీర్తనం చేసే ఆడవాళ్ళ బృందాలున్నాయి. వీరిది అవధూతేంద్ర సరస్వతీస్వామి వారి పరంపర. వీరికే రఘువరదాసుగారని పేరున్నది. నా చిన్నపుడు గ్రామగ్రామాలలో రామనామ ఏకాహాలు, సప్తాహాలు వీరి అధ్వర్యంలో జరిగేవి. రామనామాన్ని  తెలుగునాట గ్రామగ్రామాలలో ప్రచారం చేసి తరించిన మహనీయుడాయన. పాతతరం వారికి ఆయన సుపరిచితుడే. రామనామం మారుమ్రోగుతున్నంత వరకూ పల్లెటూర్లు ఎంతో బాగున్నాయి. కాలక్రమేణా క్రైస్తవ  విషప్రచారాలతోను, ఇతర వెర్రిపోకడలతోనూ నేటి పల్లెటూర్లు ఎంతగా భ్రష్టు పట్టినప్పటికీ, ఈ నాటికీ రామనామ సంకీర్తనమే పల్లెలను కొద్దో గొప్పో రక్షిస్తున్న శక్తి అనేది నా నమ్మకం.

రామనామ సంకీర్తనను నేను చాలా ఇష్టపడతాను. దాని శక్తి నాకు బాగా తెలుసు. దానితో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా చిన్నప్పటిది.

దొడ్డవరం, తెల్లబాడు గ్రామాలు రెండూ కలిసే ఉంటాయి. వీటిలో అసలు ఊరు దొడ్డవరం గ్రామమే. ఇది వెయ్యేళ్ళ క్రితం గడ్డ ఎత్తబడిన ఊరు. అప్పటిలో చోళరాజుల పరిపాలనలో ఉండేది. అద్దంకి రాజధానిగా ఉండేది. కాలక్రమంలో యాదవ రాజులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మొదట్లో ఈ గ్రామం గడ్డను ఎత్తినది బ్రాహ్మణులే. బ్రాహ్మణులు, పెద కమ్మవారు కలసి ఈ గ్రామాన్ని స్థాపించారు. ఈ గ్రామం అసలు పేరు వీరనరసింహపురి అగ్రహారం. అందుకే వెయ్యేళ్ళనాటి నరసింహస్వామి ఆలయం ఈ ఊరిలో ఉన్నది.

ఏభై ఏళ్ళ క్రితం వరకూ ఈ ఊరిలో ముప్పై దాకా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలున్నాయి. అందరూ ఇళ్ళను పొలాలను అమ్ముకుని ఊరు ఒదిలి చదువులు, ఉద్యోగాల కోసం పట్నాలకు వెళ్ళిపోయారు. పెదకమ్మవారి కుటుంబాల పిల్లలు కూడా చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు.ఆ కులంలోని పెద్దవాళ్ళు మాత్రం ఊరిలో మిగిలారు. శివాలయం వైపుగా చిన్న కమ్మవారి కుటుంబాలు ఉన్నాయి. వారు వ్యవసాయవృత్తిలో ఉన్నారు. వారిలో వాడే బత్తుల వెంకటసుబ్బయ్య. వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, వేదం మీద ఆసక్తితో ఎంతో పరిశోధన చేసి, 'అతిరుద్రం- షడ్దర్శనాలు' అనే విషయం మీద సంస్కృతభాషలో Ph.D చేశాడు. జ్యోతిష్యశాస్త్రంలో M.A చేశాడు. ఇతని గురించి ఇంతకు ముందు వ్రాశాను. ఈ ఊరి ఆణిముత్యం ఇతడు. బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మవారు గాక, వడ్డెరలు, యాదవులు, మాలలు, మాదిగలు, ఇతర కులస్తులు కొంతమంది ప్రస్తుతం గ్రామంలో ఉన్నారు.

ఈ ఊరు చాలా పేరు గాంచిన ఊరు. సినీనటి భానుమతి పుట్టినది ఇక్కడే. ఇక్కడ రామాలయం వీధిలోనే ఆమె పుట్టిన ఇల్లు ఉన్నది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య బ్రాహ్మణుడు. తల్లి సరస్వతి, కళావంతులని చెప్పారు. మద్రాసులో స్థిరపడి, ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా, అప్పుడప్పుడు ఆమె తన స్వగ్రామమైన దొడ్డవరానికి వచ్చి పోయేదని ఇక్కడివాళ్ళు చెప్పారు. ఇక్కడి ఆలయ ఉత్సవాలలో ఆమె తల్లి సరస్వతి నాట్యం చేసేదని, తల్లి వెంట చిన్నపిల్ల భానుమతి వస్తూ ఉండేదని అన్నారు. సరస్వతి గారు సంగీత విద్వాంసురాలు. ఆమె దగ్గరే భానుమతి తన మొదటి సంగీత పాఠాలను అభ్యసించి ఉండవచ్చు.

సంగీత విద్వాంసులకు, కళాకారులకు, సాహిత్యప్రియులకు ఈ ఊరు పెట్టింది పేరు.

బుర్రకధకు మన దేశంలోనే పేరు తెచ్చిన మేటి కళాకారుడు జంగం వెంకటస్వామి, ఆయన శిష్యుడు హరిజనుడైన కాకుమాను రాఘవులు ఈ ఊరి వారే. వెంకటస్వామి గాత్రం ఎంత ఖంగుమనేదంటే, దానిని రికార్డు చేయబోతుంటే గ్రామఫోను ప్లేటు చిట్లిపోయిందట. దీనిని ఇప్పటికీ కధగా చెప్పుకుంటారు.

ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు శింగంశెట్టి చంద్రశేఖరం ఈ ఊరివాడే. ఈయన పక్కా కమ్యునిస్టు. కానీ నిరంతరం కృష్ణనామాన్ని జపించేవాడు. భక్తిరసంలో ఓలలాడేవాడు.

ప్రఖ్యాత వీధి భాగవతకళాకారుడు జక్కుల వెంకట రామదాసు ఈ ఊరిలో పుట్టినవాడే.

సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తన నాదస్వర గానంతో మెప్పించిన నాదస్వర ప్రవీణుడు చినబాలాజీ ఈ గ్రామస్తుడే.

(ఈ వివరాలను శ్రీ గొల్లపూడి ప్రకాశరావు రచించిన 'మా జంట గ్రామాలు' అనే పుస్తకం నుంచి గ్రహించాను)

ఇంకా ఎందరెందరో ఎన్నో రంగాలలో ప్రసిద్ధి కెక్కినవారు ఈ గ్రామం నుంచి వచ్చారు. అలాంటిది దొడ్డవరం గ్రామం. కానీ ప్రస్తుతం మాత్రం గతకాలపు సాంస్కృతిక వైభవం అంతా అంతరించింది. జనాల దగ్గర డబ్బు పెరుగుతున్నది గాని సాంస్కృతిక పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

నాలుగు వేల జనాభా ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నది. నరసింహస్వామి ఆలయానికి తోడు, ఒక రామాలయం (అసంపూర్తిగా వదలివెయ్యబడింది. చందాలు వసూలు చేసినవారు కొందరు చనిపోగా, మరికొందరు అమెరికాకు వెళ్ళిపోయారట),  మాలపల్లిలోని రామాలయం, పాత శివాలయం, అంకమ్మ తల్లి గుళ్ళు రెండు, బ్రహ్మంగారి గుళ్ళు మూడు, పోలేరమ్మ తల్లి గుడి ఒకటి, శక్తి క్షేత్రం అనే అమ్మవారి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి, ఈ మధ్యనే కట్టబడిన ఒక పెద్ద నల్లరాతి ఆంజనేయస్వామి విగ్రహం, ఈ విధంగా చాలా గుడులున్నాయి. ఇవిగాక మూడు చర్చిలున్నాయి. ఎవరికి వారే, వారి వారి కులగుళ్ళు కట్టుకుంటూ వాళ్ళ ఉనికిని  సామాజికబలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నది గాని, పాతకాలపు ఆలయాల సంస్కృతిని పద్ధతులను నిలబెట్టే క్రమం మాత్రం గోచరించడం లేదు. మైకులు మాత్రం మోగిపోతున్నాయి.

ఈ గ్రామానికి మాకు గల అనుబంధం ఏనాటిదో? ఎప్పటిదో? నేడు మేము ఈ గ్రామానికి చేరుకున్నాము. మా మొదటి ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. మొదటి ఆశ్రమం అని ఎందుకన్నానంటే, గోదావరి తీరంలో మా ఇంకొక ఆశ్రమం రావాలన్నది నా సంకల్పం. పేరుకు చంద్రపాడు గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ, ఏది కావాలన్నా మేము రావలసింది దొడ్డవరం గ్రామానికే. కనుక ప్రస్తుతానికి మేము దొడ్డవరం గ్రామస్తులమే.

ఈ ఊరుకు ఆనుకుని ఉన్న ఇంకొక గ్రామం ఇలపావులూరు. 1984 ప్రాంతాలలో మాకు బాగా పరిచయస్తుడైన IT Rao గారు ఈ గ్రామపు ఆయనే. ఆయనపేరు ఇలపావులూరి తిరుమలరావు. ఈయన గుంతకల్లు రైల్వే డివిజన్ లో TTE గా పనిచేశారు. అప్పుడప్పుడూ తన స్వగ్రామానికి వచ్చి పోతూ ఉండేవాడు. ఆ ఇలపావులూరు గ్రామం మా ప్రక్కనే ఉంది.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమగ్ర సమన్వయం చేస్తున్న మా ఆశ్రమం ఇక్కడ రావడం ఈ నేల చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. కానీ ఈ గ్రామస్తులకు మా ఆశ్రమ విధానాలు, ఆశయాలు అర్ధమౌతాయా? ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యున్నత ఆధ్యాత్మిక సంపద వాళ్ళ ముంగిటిలోకి వచ్చి నిలుచున్న విషయం వారికి ఎప్పటికైనా  తెలుస్తుందా? దానిని అందుకోగలిగే వాళ్ళు ఒక్కరైనా ఇక్కడ కనిపిస్తారా?

ఏమో? కాలమే నిర్ణయించాలి.