“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, ఏప్రిల్ 2023, శనివారం

పరలోకం - నిత్యజీవం

క్రైస్తవ విషబోధలు తలకెక్కితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ ఈ మధ్యనే కెన్యాలో జరిగింది. Good News International Ministries అనే క్రైస్తవ సంస్థను స్థాపించిన పాల్ మెకంజీ తెంగే అనే పాస్టర్ ను ఈ నెల 15 వ తేదీన అరెస్ట్ చేశారు. కారణం? తిండీ నీళ్ళూ మానేసి చనిపోయేదాకా అలాగే ఉపవాసం ఉంటూ క్షీణించి క్షీణించి చనిపోతే, సరాసరి జీసస్ దగ్గరకు వెళతారని నూరి పోసి చాలామందిని ఈ పాస్టర్ చంపేశాడు. ఇతనికి 6౦౦ ఎకరాల చర్చ్ ప్రాపర్టీ ఉంది. అందులో పోలీసులు వెతుకుతుంటే ఎక్కడికక్కడ శవాలను పాతిపెట్టిన దిబ్బలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఇప్పటికి కనీసం 100 శవాలను తవ్వి తీశారు. వాటిలో ఎక్కువమంది చిన్నపిల్లల శవాలే ఉన్నాయి. వాళ్ళందరూ ఇతని మాటలు నమ్మి, తిండీ నీళ్ళూ మానేసి, క్షీణించి చనిపోయినవారే. 

2003 కు ముందు ఒక కారు డ్రైవరుగా పనిచేసిన ఈ పాల్ మెకంజీ, 2003 లో ఈ మిషనరీ సంస్థను స్థాపించి అతి త్వరలో వేలాదిమందిని ఆకర్షించాడు. ఇతని బోధనలు ముఖ్యంగా Dooms Day చుట్టూ తిరిగేవి. అంటే, త్వరలో భూమి అంతం కాబోతున్నదని, జీసస్ ను నమ్మితే స్వర్గానికి వెళతారని, లేకపోతే నరకమే గతి అని నూరిపోసే బోధలన్నమాట. ఆ విధంగా భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, జీసస్ ను నమ్మేలాగా చెయ్యడం ఈ ప్లాన్ లో ఒక భాగం. ఇదే పిచ్చి ఇంకా ముదిరితే, చివరకు ఈ రకంగా సూయిసైడ్ చేసుకుని జీసస్ దగ్గరకు చేరుకోవాలని విషబోధలు ఈ క్రమంలో బోధిస్తారు. 

చెప్పగా చెప్పగా అబద్దాలను కూడా నిజాలుగా ఒప్పించవచ్చు. అమాయకులకు బ్రెయిన్ వాష్ చెయ్యవచ్చు. క్రైస్తవ పిడివాదులు గాని, ఇస్లామిక్ టెర్రరిస్టులు గాని తయారయ్యేది ఇలాగే.

ఇంతమంది అమాయకుల చావులకు కారకుడైన పాస్టర్ పాల్ మెకంజీ, అందరినీ ముందుగా పరలోకానికి పొమ్మని, తను మాత్రం చివరలో వస్తానని వాళ్ళకు చెప్పేవాడు. ఎందుకంటే, చివరలో తను స్వర్గం గేట్లు మూయాలట. లేకపోతే పాపులు లోపలికి వచ్చేస్తారట. ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టేవాడు. ఇతని బోధలను నమ్మిన గొర్రెలు తమ ఆస్తులన్నీ అమ్మి ఇతని సంస్థకు డొనేషన్ క్రింద ఇచ్చేసేవారు. ఆ తరువాత పస్తులుండి చనిపోయేవారు. ఈ విధంగా అతను బాగా ఆస్తులను కూడబెట్టి కోట్లకు పడగలెత్తాడ. ఇప్పుడు అరెస్టయ్యాడు.

ఆ వివరాలన్నీ నెట్లో దొరుకుతాయి. ఇతనికి ఒక యుట్యుబ్ చానెల్ కూడా ఉంది. చూడండి. అర్ధమౌతుంది. అయితే, నేను చెప్పాలనుకున్నది అది కాదు. ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను.

ఒకటి, అమాయకులైన ప్రజలు ఏ విధంగా గొర్రెలుగా మారి ఇలాంటి పాస్టర్ల మాయలో పడుతున్నారు అనే విషయం.

రెండు, అసలు బైబిలు బోధల లోనే ఉన్న అబద్దాలు, లోపాలు ఏమిటన్న విషయం. ఈ రెండు విషయాలు నేను చెప్పబోతున్నాను.

కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో పేదరికం, చదువులేనితనం ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. అటువంటి చోట్ల క్రైస్తవ పాస్టర్ల కళ్ళు పడతాయి. డబ్బు ఎరవేసి బైబిల్ అబద్దాలు అమాయకులకు నూరిపోస్తారు. మతాలు మారుస్తారు. సమాజంలో చిచ్చు రేపుతారు. ఇది ఇండియాలో ముమ్మరంగా జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇక్కడ ప్రతి పల్లెలోనూ కనీసం రెండు చర్చిలున్నాయి. మైకులు మారు మోగుతున్నాయి. కాకమ్మ కబుర్లను పాస్టర్లు బాగా నూరిపోస్తున్నారు. వెర్రి గొర్రెలు నమ్మేస్తున్నారు.

ఈ పాస్టర్లు చెప్పే ముఖ్యమైన బోధ, పరలోకం, నిత్యజీవం అనేవి. పరలోకం అనేది ఒకటి ఉందని, జీసస్ ను నమ్మితే అక్కడకు పోతారని, అక్కడ నిత్యజీవం ఉంటుందని పచ్చి అబద్దాలను పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా అమాయకులకు నూరిపోస్తున్నారు. ఇవన్నీ అబద్దాలే. అవే నిజాలైతే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులేంటి?

1. క్రైస్తవం పుట్టి కేవలం రెండువేల సమత్సరాలు మాత్రమే అయింది. భూమి పుట్టి నేటికి 454 కోట్ల సంవత్సరాలైంది. మరి జీసస్ పుట్టకముందు ఉన్న కోట్లాది మనుషులందరూ నరకానికే పోయారా? ఇది నమ్మదగిన విషయమేనా?

2. నేటికీ ఇజ్రాయెల్ దేశంలో జీసస్ ను నమ్మరు. అక్కడ ఓపన్ గా క్రైస్తవాన్ని బోధిస్తే జైల్లో పెడతారు. మరి ఇజ్రాయెల్ దేశస్తులందరూ నరకానికే పోతారా? అప్పుడు వాళ్ళు నమ్ముతున్న యెహోవా ఏం చేస్తాడు మరి?

3. క్రైస్తవం తెలియనివారు, దానిని అనుసరించని ఇతర మతస్తులు, నాస్తికులు  ఎక్కడికి పోతారు? 

4. క్రైస్తవబోధలు నిజాలైతే, ఇజ్రాయెల్ దేశం ఈనాటికీ జీసస్ ను ఎందుకు నమ్మడం లేదు?

అసలు విషయమేమంటే, క్రైస్తవం చెబుతున్న శాశ్వత పరలోకం అనేది ఎక్కడా లేనేలేదు. అది అబ్రహామిక్ మతాలు సృష్టించిన పచ్చి అబద్దం మాత్రమే.

హిందూమతం ప్రకారం, స్వర్గ నరకాలనేవి తాత్కాలికమైన లోకాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇవి మరణానంతర స్థితులు మాత్రమే. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం కొంతకాలం పాటు ఉంటాయి. అవి అనుభవించిన తర్వాత మళ్ళీ  కర్మానుసారంగా జన్మ ఉంటుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అందుకునేటంత వరకూ జననమరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది మన సనాతన ధర్మం చెబుతున్న సత్యం.  అంతేకాదు, బౌద్దమూ జైనమూ కూడా ఇదే చెబుతాయి. ఇది మాత్రమే సత్యం. అంతేగాని, జీసస్ ని నమ్మితే స్వర్గం, లేకపోతే శాశ్వత నరకం అనేవి బూటకాలు, పచ్చి అబద్దాలు మాత్రమే. కానీ ఈ అబద్దాలను కోట్లాదిమంది నిజాలని నమ్ముతున్నారు. గొర్రెలుగా మారుతున్నారు. దీనికి కారకులు పాల్ మెకంజీ వంటి దొంగ పాస్టర్లు. ఇది వాళ్ళ వ్యాపారం.

ఈ పాల్ మెకంజీకి పెంటకోస్ట్ డినామినేషన్ తో సంబంధాలున్నాయి. ఇది తీవ్రమైన భావాలున్న సంస్థ. వీరిలో చాలామంది రోగమొస్తే మందులు వాడరు. జీసస్ తగ్గిస్తాడని మూర్ఖంగా నమ్ముతారు. 

ముప్పై ఏళ్ళ క్రితం మా దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఇదే విధంగా నమ్ముతూ, తనకు గుండెజబ్బు వచ్చినా మందులు వేసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా, జీసస్ రక్షిస్తాడని చెబుతూ అర్ధాంతరంగా చనిపోయాడు. పెంటకోస్ట్ మిషన్ గురించి వారి నమ్మకాల గురించి నాకప్పుడే మొదటిసారి తెలిసింది.

పోతే, పాల్ మెకంజీ దృష్టిలో ఇతను చెప్పేదే అసలైన క్రైస్తవమతం. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో ప్రచారంలో ఉన్న క్రైస్తవం అసలైన క్రైస్తవం కాదని ఇతను బోధిస్తాడు. రోగాలు వస్తే మందులు వేసుకోవడం పాపమని, మొబైల్, కంప్యూటర్ వంటి మోడరన్ పరికరాలు వాడకూడదని, అమెరికా వంటి దేశాలు సైతాన్ అనుచరులని ఇతను బోధించేవాడు. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది తీసుకోవద్దని, అది Seal of the Beast  అని ఆ గొర్రెలకు ఎక్కించేవాడు. అందుకే, ఓటర్ లిస్టులో నమోదు కూడా చేసుకోకుండా తన బోధలను వినే గొర్రెలకు నూరిపోసేవాడు. చివరకు  తిండీ నీళ్ళు మానేసి ఆత్మహత్యలు చేసుకోమని అదే జీసస్ ను చేరుకునే అసలైన దారి అని వాళ్ళను హిప్నటైజ్ చేశాడు. నమ్మించాడు. వాళ్ళందరూ చచ్చారు. ఇతను మాత్రం హేపీగా ఉన్నాడు.

అసలీ Seal of the Beast అంటే ఏమిటి? ఇది బైబిల్ లోని ప్రకటనల గ్రంధం (Revelations Chapter) లో ఉంటుంది. ఈ చాప్టర్ 66 CE ప్రాంతంలో వ్రాయబడింది. ఇది రాజకీయపరంగా వ్రాయబడిన అబద్దపు వ్రాతలే గాని నిజాలు కావు.

ఎలా అంటే, అప్పట్లో నీరో చక్రవర్తి రోం ను పాలించేవాడు. ఇతని బొమ్మతో నాణేలు చలామణీలో ఉండేవి. పాతకాలంలో రాజులందరూ తమ తమ బొమ్మలతో నాణేలను ముద్రించేవారు. ఇది మామూలే. అయితే, రోమన్ల ఏలుబడిలో ఉన్న యూదులు యెహోవా పిచ్చిలో ఓల్డ్ టెస్టమెంట్ మాయలో పడి, దీనిని వ్యతిరేకించారు. నీరో చక్రవర్తి బొమ్మ ఉన్న నాణేలను Seal of the Beast గా వాళ్ళు వర్ణించారు. అయితే, డైరెక్ట్ గా దీనిని వ్యతిరేకిస్తే రాజు చేతిలో చావు తప్పదు కనుక, మార్మిక భాషలో అర్ధం అయ్యీ కానట్టుగా దీనిని వ్రాసి, 'ప్రకటనల గ్రంధం' అని దీనికి పేరు పెట్టారు. దీనిని నేటి క్రైస్తవులు దైవాదేశంతో వ్రాయబడిన ప్రకరణంగా భావిస్తూ మోసపోతున్నారు.

ఇలాంటి తెలిసీ తెలియని బోధలను చేస్తూ జనాలను చీకటి యుగాలలోకి తీసుకుపోతున్న క్రైస్తవ పాస్టర్లు నేడు ఇండియాలో కూడా లక్షలాది మంది ఉన్నారు. ఇటువంటి పిచ్చి బోధలను నమ్మి పిచ్చోళ్లుగా మారుతున్న అమాయకులు కోట్లల్లో ఉన్నారు 

పాప్ మెకంజీ ఈ బోధలను క్రొత్తగా చెయ్యడం లేదు. 2016 లో కూడా ఇలాగె చేసి కొన్ని వందల మందిని ఇదే విధంగా ఉపవాసాలుండమని ప్రేరేపించి, వాళ్ళ చావులకు కారకుడయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ చేశాడు. ఈ విధంగా జనాభాని తన వంతు కృషితో తగ్గిస్తున్నాడన్న మాట.

ఇటువంటి విషప్రచారాలు చేస్తున్నవారిని చట్టపరంగా నిరోధించవలసిన అవసరం ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ఇండియాలో చాలా ఉన్నది. లేదంటే నిన్న కెన్యాలో జరిగిన ఇటువంటి సంఘటనలే  రేపు ఇండియాలో కూడా జరిగే ప్రమాదం ముందు ముందు ఉన్నదనేది వాస్తవం. 

రూల్ ఆఫ్ లా లేనంతవరకూ ఇలాంటి వెఱ్ఱి పోకడలు తప్పవనేది కూడా వాస్తవమే. 

మతమార్పిడి నిరోధకచట్టం ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ కఠినంగా అమలు కావలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, సక్రమమైన రీతిలో హిందూమతాన్ని హిందూసంస్థలు అందరికీ ప్రచారం చెయ్యవలసిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే Dooms Day అనేది త్వరగా రావడానికి ఇటువంటి విషబోధనలే కారణాలు అవుతాయి.