“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఏప్రిల్ 2023, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 54 (వడ్లగింజలో బియ్యపు గింజ)

'జాగ్రత్తగా వినండి' అంటూ చెప్పడం మొదలుపెట్టాను.

పదకొండో శతాబ్దం నాటికి మనదేశంలోని వేదం, వేదాంతం, యోగం, పురాణం, తంత్రం అన్నీ కలగలసి ఒక క్రొత్త రూపాన్ని ధరించాయి. ఈ అన్నింటినీ సమన్వయపరచి ఒకే బోధనగా బోధించాలని, పల్లెలలోని సామాన్యులకు కూడా వీటి సారాన్ని అందుబాటులోకి తేవాలని మన దేశంలోని అనేకమంది గురువులు మహనీయులు తలపోశారు. ఉత్తర భారతంలో నాధసంప్రదాయం గాని, దక్షిణాదిన సిద్ధసంప్రదాయం గాని, బైరాగులు, గోసాయిలు, యోగులు, అందరూ వారివారి ప్రాంతాలలో పల్లెటూర్లలో  చేసినది అదే. వీరు వ్రాసిన, చెప్పిన బోధనలు తత్త్వాలని, గాధలని, చిటికెలని, జానపదగీతాలని అనేక రూపాలలో పై అన్నింటినీ, అంటే వేదవేదాంతాలను, యోగశాస్త్రాన్ని, తంత్రశాస్త్రాన్ని, పురాణవిజ్ఞానాన్ని అన్నింటినీ సమన్వయం చేస్తూ చెప్పబడినాయి. మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రాంతంలోనూ ఈ మార్పు వచ్చింది. అనేకమంది మహనీయులు ఎక్కడికక్కడే దీనిని ఒక  ఉద్యమం లాగా తీసుకొచ్చారు. పల్లెపల్లెలకూ దీనిని పాకించారు. తద్వారా ఏమైంది? అత్యున్నతమైన వేదాంత, యోగ, తంత్ర, సిద్ధమార్గాల భావనలు, సాధనలు అన్నీ గ్రామ్య భాషలలో  అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రభావం వల్లనే ఇస్లాం మన దేశంలో వ్యాప్తి చెందలేకపోయింది.

ప్రాచీన వేదకాలంలో బుద్ధుడు చేసినదానినే మధ్యయుగాలలో వీరు చేశారు. ఉపనిషత్తులలోని జ్ఞానభాగాన్ని లోకల్ గా మాట్లాడుకునే పాళీభాషలో బుద్ధుడు గ్రామగ్రామాలలో సరళంగా బోధించాడు. అదే విధంగా పదకొండో శతాబ్దం తర్వాత ఎందరో మహనీయులు ఇదే పనిని దేశమంతటా చేశారు.  ఈ మూమెంట్ నేపాల్ నుంచి శ్రీలంక వరకూ, గుజరాత్ నుండి, బెంగాల్ వరకూ ఒక వరదలాగా వచ్చింది

మన తెలుగునేలలో ముఖ్యంగా వేమనయోగి, బ్రహ్మంగారు, స్వాత్మారామ యోగి, శ్రీనివాస యోగి, ఇంకా ఎందరో అవధూతలు, బైరాగులు దీనిని ప్రచారం చేశారు. ఈ విధంగా వేదవేదాంత భావనలు పల్లెపల్లెలకూ పాకి,  సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి.  పరాయి మతాల వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకున్నాయి.

అలాంటిదే ఈ అచల సంప్రదాయం కూడా.

అచలానికీ అద్వైతానికి ఏమీ భేదం లేదు. పదాలను అర్ధం చేసుకోవడంలోనే ఉన్న చిక్కంతా ఉంది. అఖండ అద్వయ అనంతమైన ఎరుక అనేది సగుణ సమాధి. అచలం అనేది నిర్గుణసమాధి. సగుణంలో, సగుణాన్ని గ్రహించేవాడు ఉంటాడు. నిర్గుణంలో వాడూ లయమౌతాడు. అంతే.

ప్రకృతి-పురుష వివేకాన్ని చెప్పేది సాంఖ్యం. ఇది మన తాత్విక చింతనలన్నింటికీ మూలం. కపిలమహర్షి దీనిని చెప్పినవాడు. ఓంకారోపాసనకే తారకమని పేరు. దీనిని మాండూక్యోపనిషత్తు ప్రతిపాదించింది. మనకు తెలిసిన మూడవస్థలను దాటి, వాటికి అతీతమైన నాలుగోదానిని (తురీయాన్ని) అందుకోవడం ఈ దారి. శ్రీరామనామాన్ని కూడా తారకమంత్రమనే అంటారు. ఓంకారం వైదికమైతే, రామనామం పౌరాణికం. రామనామ జపం కూడా  తురీయస్థితిని అందిస్తుంది. ఇకపోతే, మనస్సుకు అతీతమైన స్థితిని అందుకోవడం అమనస్కం. ఇందులో మనోలయం, మనోనాశం అని రెండు మెట్లుంటాయి. క్లుప్తంగా, సాంఖ్య, తారక, అమనస్క యోగాలంటే ఇవే.

అయితే, వీటిని గ్రంధాలు చదివి అర్ధం చేసుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. సాధన చేసి అనుభవంలో వీటిని పొందాలి. లేకపోతే గ్రంధాలను మోస్తున్న గాడిదమాదిరి అవుతుంది మీ పని. నేటి టీవీ ఉపన్యాసకులు, పండితులు అందరూ, అనుభవజ్ఞానం లేని సామాన్యులే.  వీరికి కావలసింది అనుభవజ్ఞానం కాదు. డబ్బు మాత్రమే. యూట్యూబులో వీటిమీద వీడియోలు చేసుకోవడం వల్ల, వారికి డబ్బులు దండిగా రావచ్చు, కానీ అనుభవజ్ఞానం మాత్రం ఎన్నటికీ అందదు. దానికి దారి వేరే ఉంది.

సగుణబ్రహ్మ సమాధిని అచల మార్గానుసారులు అద్వైతం అంటున్నారు. నిర్గుణసమాధిని అచలం అంటున్నారు. ఈ సమాధి స్థితులను అందించే అనేక యోగ-తంత్ర దీక్షలను పెద్దలమార్గం అంటున్నారు. పేర్లు మార్పు గాని ఉన్న తత్త్వం ఒకటే.

సగుణం, నిర్గుణం, సహజం - ఇదీ దారి. చలాన్ని దాటి ఎరుకను పొందటం అద్వైతం. ఎరుక కూడా లేని స్థితి అచలం. చలంలో అచలాన్ని అందుకోవడం సహజం.

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను దాటిన తురీయం, అద్వైతం. దానిని మించిన తురీయాతీతం, అచలం. జాగ్రత్ లో తురీయాతీతం సహజం.

న పంచవటి సాధనామార్గంలో మీకు ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కొద్దిరోజులలో ప్రారంభం కాబోతున్న మన ఆశ్రమంలో ఇవన్నీ మీకు నేర్పించబడతాయి. ఉత్త థియరీ మాత్రమే కాదు. ప్రాక్టికల్ గా వీటిని ఎలా సాధన చేయాలో మీకు నేర్పిస్తాను. సాధన చేయిస్తాను. ఈ స్థితులను మీరు ప్రత్యక్షానుభూతిలో అందుకుంటారు. అప్పుడు మీకు అద్వైతం, అచలం మొదలైనవి ఏమిటో డైరెక్ట్ గా అర్ధమౌతుంది.

అందరిలాగా కాకమ్మకబుర్లు చెప్పడానికి కాదు ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా ఇవన్నీ వ్రాస్తూ వస్తున్నది. మన ఆశ్రమం వీటన్నిటినీ సాకారం చేస్తుంది.

కొనఊపిరితో ఉన్న ఈ సాధనామార్గాలన్నీ శ్రీ రామకృష్ణుల కరుణతోనే మళ్ళీ బ్రతికి బట్టకట్టాయి. ఆయనను ఆరాధించి అనుసరించే  మనకు ఇవన్నీ తెలియనివేమీ కావు.  మన అరచేతిలోనే ఇవన్నీ ఉన్నాయి. ముందుముందు మీరే చూస్తారు' అన్నాను.

వింటున్న శిష్యుల ముఖాలు ఆనందంతో వికసించాయి.

'ఇంతేనా? ఆ పెద్దపెద్ద పేర్లన్నీ విని ఇంకా ఏదో అనుకున్నాము. ఇదంతా మీ పుస్తకాలలో మీరు ఇప్పటిదాకా వ్రాసినదేగా?' అన్నారు. 

'అంతేమరి. అర్ధం కానంతవరకూ బ్రహ్మవిద్య. అర్ధమైతే కూసువిద్య. వడ్లగింజలో బియ్యపుగింజ అంతే. ఇక రెస్టు తీసుకోండి లంచ్ టైం దాకా' అన్నాను.

అంతటితో సంభాషణను ఆపి నిద్రకుపక్రమించాం అందరం.