“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, అక్టోబర్ 2021, మంగళవారం

మీ ప్రశ్నలు - నా జవాబులు

'ఈ మధ్య అన్నీ కరెంట్ ఎఫైర్స్ అందులోనూ గ్లోబల్ ఎఫైర్స్ మాత్రమే రాస్తున్నారు. సామాన్యుడిని పట్టించుకోవడం లేదు. మీ బ్లాగ్ ఒక క్రైమ్ న్యూస్ ఛానల్ అయిపొయింది. తెరవాలంటేనే భయంగా ఉంది. ఒక సరదా లేదు పాడూ లేదు' అంటూ కొందరు సన్నిహితులు కినుక వ్యక్తం చేస్తున్నారు. 

ఇందులో భయానికేముంది? లోకంలో జరుగుతున్నవాటికి, గ్రహాలకు ఉన్న సంబంధాలనే నేను వెలుగులో చూపిస్తున్నాను. పోన్లే మీరు కోరినట్లే ఒక లైట్ టాపిక్ రాస్తాలే అని ఓదార్చాను. అందికే ఇది !

నాకొచ్చే బోలెడు ఈ మెయిల్స్ లో నుంచి ఏరి కూరి, ఆర్నెల్లకోసారి ఇలాంటి పోస్టులు రాస్తేగాని, సీరియస్ సినిమాలో కామెడీ ట్రాక్ లాగా సరదాగా ఉండదు మరి ! ఇక చదవండి.

చదవబోయే ముందు ఒక చిన్న సవరణ. చదివేవాళ్ళని 'పాఠకులు' అంటాము. చొప్పదంటు ప్రశ్నలు వేసేవాళ్ళని నేను 'పాతకులు' అంటాను. పాతకులంటే పాపులు అనేకదండీ అర్ధం? అంటూ మళ్ళీ ఇంకొక చొప్పదంటు ప్రశ్న అడగకండి. అదే అర్ధం. మనందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పాపం చేసియున్నవారమే గనుక, నాతో సహా మీతో సహా మనందరమూ పాతకులమే (బైబిల్ ప్రకారం). కాబట్టి ఈ పదప్రయోగం తప్పుకాదనీ, ఎవరి హార్టునీ హర్టు చేయడానికి ఉద్దేశించబడలేదనీ గమనించ మనవి !

------------------------------------------------------------

ఒక పాతకుడు ఈ విధంగా మెయిలిచ్చాడు.

'గురువుగారు ! నాకీ మధ్యన తరచుగా వినాయకుడు కలలో కనిపిస్తున్నాడు. ఏం చెయ్యమంటారు?'

నా జవాబు

'ఆయనకు గుండ్రాళ్ళు నైవేద్యం పెట్టి, నువ్వు ఉండ్రాళ్ళు మెక్కు. అంతకంటే ఇంకేమీ చేయనక్కరలేదు'

------------------------------------------------------------------

ఒక పాతకురాలు ఇలా అడిగింది.

'గురూజీ ! కాళీమాతకు, కాళరాత్రికి తేడా ఏమిటి?'

నా జవాబు.

'అమ్మా ! పగటిపూట కనిపించే ఆమెను కాళీమాత అంటారు. రాత్రిపూట కనిపించే ఆమెను కాళరాత్రి అంటారు. మధ్యలో కనిపిస్తే ఏమంటారో నాకు తెలీదు. కావాలంటే, నాక్కొంచెం టైమివ్వు. వాళ్లకు ఫోన్ చేసి కనుక్కుని చెబుతా'.

------------------------------------------------------------------

మరో పాతకుడు ఇలా అడిగాడు.

''సిద్ధాంతిగారు ! మీరు జాతకాలు చూస్తారని తెలిసింది. నాకు ప్రస్తుతం డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది.  చూసి రెమెడీలు చెప్పండి'

ఆయనకు ఇలా జవాబిచ్చాను.

'అయ్యా ! నేను జాతకాలు చూస్తాను గాని, మీరనుకునే టైపు సిద్ధాంతిని కాను. ప్రస్తుతం నేనే చాలా డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాను. మీకు నేనేం రెమెడీలు చెప్పగలను? మీకెవరైనా మంచి జ్యోతిష్కుడు తెలిస్తే చూడండి. మనిద్దరం కలిసి జాతకాలు చూపించుకోడానికి ఆయన దగ్గరకెళదాం'.

---------------------------------------------------------------

ఇంకొక పాతకురాలు ఇలా అడిగింది.

'సార్ ! ప్రపంచంలో ఉన్న అన్ని ఆశ్రమాలూ తిరిగాను. అన్ని దీక్షలూ తీసుకున్నాను. అన్నీ చేశాను. అంతా అయిపోయింది. ఎక్కడా  ఏమీ దొరకలేదు. ఎక్కడా ఏమీ లేదని, అంతా మోసమేనని తెలుసుకున్నాను. మీ మార్గంలో అడుగుపెట్టి  నడుద్దామనుకుంటున్నాను. ఏమంటారు?'

నా జవాబు.

'అలాగేనమ్మ ! అన్నీ అయిపోయిన నీకు, ఇక నేను చెప్పేదేముంది? ముందు నా మార్గమేంటో నాకు అర్ధం అయితే, ఆ తర్వాత నీవు కూడా అందులో నడవొచ్చు.  గత 40 ఏళ్లుగా అదేంటో తెలుసుకోవాలనే నేనూ ప్రయత్నిస్తున్నాను. ముందు నాకొక క్లారిటీ వచ్చాక, అప్పుడు నువ్వు కూడా ఇందులో అడుగు పెడుదువుగాని. అంతవరకూ నీ అడుగులు జాగ్రత్త చేసుకో. ప్రస్తుతం మాత్రం నా వైపు నీ అడుగులు వెయ్యకు'.

---------------------------------------------------

ఇంకొక పాతకురాలు ఇలా వ్రాసింది.

'మీ పుస్తకాలు కొన్ని చదివాను. మీ తపన నాకర్ధమైంది. మాది ఫలానా మిషన్. ఇందులో ధ్యానం చాలా బాగుంటుంది. ఊరకే కూచుంటే చాలు. మా ప్రిసెప్టార్ నుంచి ఒకటే ట్రాన్స్ మిషన్ వస్తూ ఉంటుంది.  ఒక్కసారి ట్రై చెయ్యండి. ఇక మీరు వెనక్కు పోలేరు. మీకిందులో తప్పకుండా శాంతి దొరుకుంటుంది.'

నా జవాబు.

'నా తపన అర్థమైందా? మా తల్లే ! ఇప్పటిదాకా నా తపనను అర్ధం చేసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వేనమ్మ ! నేను కూడా గతంలో చాలా మిషన్లు వాడాను. ప్రస్తుతం కుట్టుమిషన్ వాడుతున్నాను. దాన్ని తొక్కుతుంటే నాకు తెలీకుండానే దానిమీదకు వాలిపోయి ధ్యానంలోకి జారిపోయి నాలుగ్గంటల  తర్వాత మెలకువొస్తోంది.నువ్వూ ట్రై చెయ్యి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఇస్తారు. కావాలనుంటే మీ గురువూ నీవూ ఇద్దరూ కలసి నా దగ్గరకు రండి. మీకు మిషన్ ఉపదేశం  ఇచ్చి ఎలా తొక్కాలో నేర్పిస్తాను.. ఇకపోతే శాంతి అంటావా? ఇప్పటికే నా దగ్గర చాలామంది శాంతులున్నారు. ఇక చాలమ్మ. శాంతి ఎక్కువైతే వాంతి అయ్యే ప్రమాదం ఉంది.  ఆ ప్రమాదం నాకొద్దులే. నీ శాంతిని నీ దగ్గరే ఉంచుకో.

--------------------------------------------------------- 

ఇంకో పాతకురాలు ఇలా అడిగింది.

'మీరు తరచుగా నా కలల్లోకి వస్తూ ఉంటారు. మా ఇంట్లో మీ ఫోటో పెట్టి పూజ కూడా చేస్తున్నాను. ఇది కరెక్టేనా?'

నా జవాబు.

'చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మ. విను. నేను నీ కలలోకి రావడం వరకూ కరెక్టే, కానీ నువ్వు నా ఫోటోకి దండ వేసి పూజ చెయ్యడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనింకా బ్రతికే ఉన్నాను మరి ! అయినా పూజ చెయ్యాలంటే  నీకు స్తోత్రాలుండాలి కదా ! నీలాంటి వీరభక్తుల బాధ తీర్చడానికే, నా శిష్యులు కొంతమంది నా సహస్రనామావళి వ్రాస్తున్నారు. సగం అయింది. మిగతా సగం కూడా అయ్యాక, నీకు పంపిస్తాను.  దానితో చేసుకో నీ పూజ, కాకపోతే ఫోటోకి నువ్వేసిన దండను తీసేసి చెయ్యి. అదొక్కటే నా రిక్వెస్ట్. 

------------------------------------------------------------------- 

ఒక పాతకుడు మాత్రం మంచి ప్రశ్న అడిగాడు.

'అందరూ యూ ట్యూబ్ చానల్స్ పెడుతున్నారు. 'స్నానం చేసేటప్పుడు ఒళ్ళెలా రుద్దుకోవాలి?' అంటూ  మా గర్ల్ ఫ్రెండ్ ఒక వీడియో చేస్తే పదికోట్ల మంది వ్యూయర్స్ చూశారు. 'మొగుణ్ణి ఎలా రాచి రంపాన పెట్టాలి?' అంటూ మా సీనియర్ యు ట్యూబర్ ఒక ఫెంటాస్టిక్ వీడియ= చేసింది. దానిని వందకోట్లమంది వీక్షించారు. 'కుక్కకు ఎలా స్నానం చేయించాలి? పిల్లికి పాలెలా పట్టాలి? ఎలుకకు ఎండ్రిన్ ఎలా పెట్టాలి? పొద్దున్నే పళ్ళు ఎలా తోముకోవాలి? సాయంత్రం సాక్స్ ఎలా తొడుక్కోవాలి? రాత్రి నిద్రపోయేటప్పుడు దుప్పటి ఎలా కప్పుకోవాలి? మళ్ళీ పొద్దున్నే టాయిలెట్ ఎలా క్లిన్ చెయ్యాలి?' ఇలాంటి ఎన్నో  అద్భుతమైన వీడియోలను మా ఫ్రెండ్స్ చేసి కోట్లు సంపాదించారు. మీ దగ్గర ఇంత నాలెడ్జి ఉంది కదా? మీరూ ఒక ఛానల్ పెట్టవచ్చుగా?'

నా జవాబు.

'చాలా మంచి సూచన ఇచ్చావు నాయన ! కొంచం ఓపిక పట్టు. ఒక్క తొమ్మది నెలలాగు. డెలివరీ అవుతుంది. జూలై 2022 తర్వాత మావి నాలుగు చానల్స్ ఒకేసారి మొదలై మీ దుమ్ము దులపబోతున్నాయి. యోగా, జ్యోతిష్యం, మార్షల్ ఆర్ట్స్, ఆధ్యాత్మికం ఇలా నాలుగు చానల్స్ మొదలు పెట్టబోతున్నాను. ఇవిగాక, రకరకాల సబ్జెక్ట్ ల మీద నేను తియ్యబోయే షార్ట్ ఫిలిమ్స్ ఒక వరదలాగా వస్తాయి. కొంచం ఓపిక పట్టు. నెక్స్ట్ ఇయర్ నుంచి నీ మెయిల్స్ ని చూచే తీరిక కూడా నాకుండదు. ఇక జవాబులు అసలే కుదరవు. అన్నీ ఛానల్ లోనే. సరేనా, మీ అభిమానానికి థాంక్స్.'

----------------------------------------------------------------- 

ఇలాంటివే ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి. అన్నీ ఒకేసారి వ్రాస్తే మీరు తట్టుకోలేరు గనుక, సాంపిల్ గా ఇవి మాత్రం ఇస్తున్నాను. సీరియస్ టాపిక్స్ మధ్యలో బాగా బోరు కొట్టినప్పుడు మళ్ళీ మరికొన్ని ఇస్తాను.  ఈ లోపల ఇవి చదూకోండి. రేపటినుంచీ మళ్ళీ గ్లోబల్ క్రైమ్ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.  బై.