“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, మార్చి 2021, శుక్రవారం

కర్మవలయం - ప్రశ్నశాస్త్రం

సమయం రాత్రి పది. పనులన్నీ ముగించుకుని నిద్రాధ్యానానికి ఉపక్రమించబోతుండగా ఫోన్ మ్రోగింది. ఏదో క్రొత్త నంబర్. ఒక్కొక్కసారి అమెరికా శిష్యులు కూడా ఇండియా నంబర్ తో ఫోన్ చేస్తుంటారు. సరే ఎవరో చూద్దామని 'హలొ' అన్నా.

'నేను ఫలానా మాట్లాడుతున్నాను. ప్రభుత్వంలో ఫలానా పొజిషన్ లో రిటైరయ్యాను' అందొక మొగగొంతు దర్పంగా, 

ఇలాంటి మాడిపోయిన బల్బులని చాలా మందిని చూసి ఉండటంతో, అదంతా పట్టించుకోకుండా, 'చెప్పండి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు?' అడిగా.

'నా బాధలు మీతో చెప్పుకుని, పరిష్కారం అడుగుదామని. ఫలానాయన మీ నంబరిచ్చాడు' అంది స్వరం.

సామాన్యంగా ఆ సమయంలో అలాంటి ఫోన్స్ నేను మాట్లాడను. కానీ ఆ స్వరంలో ధ్వనిస్తున్న కించిత్ బాధ, ఫోన్ కట్ చెయ్యకుండా  నన్ను ఆపేసింది. 'సరే ఏంటో చూద్దాంలే' అనుకున్న వెంటనే  మనసులో అప్పటి ప్రశ్నచక్రం కనిపించింది.

తులా లగ్నమైంది. లగ్నాధిపతి శుక్రుడు, బాధకుడైన సూర్యునితో కలసి పంచమస్థానంలో అస్తంగతుడై ఉన్నాడు. అది శనిస్థానమైన కుంభమైంది. మనఃకారకుడైన చంద్రుడు కుటుంబస్థానంలో నీచస్థితిలో కేతుగ్రస్తుడై ఉంటూ కుటుంబపరమైన మానసికవేదనను సూచిస్తున్నాడు.

'మీ సంతానం గురించి, ముఖ్యంగా మీ అమ్మాయి గురించే కదా మీ బాధ' అన్నాను.

అవతలనుంచి భోరుమంటూ ఏడుపు వినిపించింది. నేను మౌనంగా ఉండిపోయాను. కాసేపలా వెక్కిళ్లు పెట్టిన తర్వాత 'ఏం చెప్పమంటారు మా ఖర్మ? ఎందుకిలా జరుగుతోంది?' అన్నాడు.

పంచమం నుండి సప్తమాధిపతి సూర్యుడు పంచమలగ్నంలో ఉన్నాడు. అక్కడనుంచి నవమాధిపతి శుక్రుడు లగ్నంలో అస్తంగతుడైనాడు. పంచమాధిపతి శని దానికి ద్వాదశమైన మకరంలో నీచగురువుతో కలసి ఉన్నాడు. మకరం ప్రశ్నలగ్నానికి చతుర్ధమైంది. అక్కడ నవమాదిపతి అయిన బుధుడు నీచగురువుతో డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నాడు. గురు - రాహు - చంద్రదశ అయింది. అంటే ఇది పితృశాపం ! ఇది వీళ్ళ జీన్స్ లోనే ఉంది. గురుద్రోహం కూడా తోడై ఉంది.

ఈ యోగాలను గమనిస్తూ 'మీ అమ్మాయి ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ కొడుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. అంతేనా?' అడిగాను.

'అంతేసార్! నాకు తెలిసి నేనేమీ పాపాలు చెయ్యలేదు, ఇప్పుడు మేమిద్దరం ఓల్డేజి హోములో ఉన్నాం. అక్కడనుంచే మీతో మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ ఫలానా ఆయన, మీ గురించి చెప్పి, మీ నంబర్ ఇచ్చాడు, మీకు ఎష్ట్రాలజీ బాగా తెలుసనీ చెప్పాడు' అన్నాడు. 

ప్రతివాడూ చెప్పేమాట ఇదే కావడంతో నేనేమీ ఆ విషయం నమ్మలేదు. మనమేం పాపాలు చేస్తున్నామో కూడా తెలీనంత చీకటిలో మనం బ్రతుకుతున్నామన్నది పచ్చినిజం.

చతుర్ధాన్ని అందులోని యోగాలను గమనిస్తున్నపుడే ఈయనగారి గతజీవితం అర్ధమైపోయింది. 'ఏ పాపాలూ చెయ్యలేదా? ఏమీ చెయ్యకపోతే మీకిలా జరగడానికి దేవుడికి తెలివి లేదనుకుంటున్నారా?' అడిగాను కటువుగా.

'అదేంటి అలా అంటారు?' అన్నాడాయన హర్దయిన గొంతుతో.

ఈకాలపు మనుషులతో ఇదే పెద్ద చిక్కు. ప్రతివాడూ తానొక మహా పవిత్రుడినని, తనకంటే మంచివాడు లేడని ఊహించుకుంటూ నానా ఛండాలమైన పనులూ చేస్తుంటాడు.  చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే మాత్రం సహించలేడు. 

మళ్ళీ చతుర్ధాన్నీ, మాతృకారకుడైన చంద్రుడు నీచస్థితిలో ఉచ్ఛకేతువుతో కలసి ఉండటాన్నీ గమనిస్తూ 'మీ అమ్మగారిని ఎందుకంత బాధలు పెట్టారు?' అడిగాను.

రెండు క్షణాలు నిశ్శబ్దం !!

'మేమేం బాధలు పెట్టలేదు. ఓల్డేజి హోమ్ లో ఉంచి, డబ్బులు కడుతూ బాగానే చూసుకున్నాం' అన్నాడు.

ఇక ఇలా లాభంలేదని, బెడ్ మీదనుంచి లేచి కుర్చీలో కూచున్నాను.

'మీరెంతమంది అన్నదమ్ములు?' ఇంటరాగేషన్ మొదలుపెట్టాను.

'నలుగురం' అన్నాడు.

'నలుగురూ బాగానే సెటిలయ్యారు కదా?' అడిగాను.

'అందరం మంచి పొజిషన్స్ లోనే సెటిలయ్యాము. అందరి పిల్లలూ ఇప్పుడు ఫారెన్లోనే ఉన్నారు' అన్నాడు.

'మీ నాన్నగారు?' అడిగాను.

'ఆయన కూడా ప్రభుత్వంలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రిటైరయ్యాక కొద్దీ రోజులకే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు' అన్నాడు.

'అప్పుడు మీ అమ్మగారిని ఎవరిదగ్గర ఉంచుకున్నారు?' అడిగాను.

కాసేపు మళ్ళీ నిశ్శబ్దం.

'హలొ. ఉన్నారా?' రెట్టించాను.

'ఆ. ఉన్నానండి. మా దగ్గర ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. అందుకే ఓల్డేజి హోములో చేర్పించాం' అన్నాడు.

అంటే, కోడళ్ళకీ ఆమెకూ పడేది కాదన్నమాట ! కొడుకులేమో భార్యలకు చెప్పలేని చవలయ్యారన్నమాట ! 

'చూడండి. మీరు ఈ టైంలో ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేసినది ఇలా అబద్దాలు చెప్పడానికా?' అడిగాను తీవ్రంగానే.

ఆయనకూడా ఆర్గుమెంట్ మోడ్ లోకి దిగాడు.

'ఏం చెప్పమంటారండీ? కోడళ్ళేవరికీ మా అమ్మను చూడటం ఇష్టం లేదు. పనివాళ్లున్నారు. కానీ ముసలామెను ఇంట్లో పెట్టుకోవడం వాళ్ళకిష్టం లేదు. హై సొసైటీ కదండి ! పార్టీలు, గెట్ టుగెదర్స్ ఉంటాయి. ఆమె అడ్డంగా ఉంటుందని, బ్రదర్సందరం మాట్లాడుకుని ఆమెను మంచి ఓల్డ్ ఏజి హోములో చేర్పించాము. ఖర్చులు అందరం పంచుకున్నాము. అది తప్పంటారా?' అడిగాడు.

ఇలా ఉంటారు మనుషులు. రాత్రి పదికి ఫోన్ చేసినా మనం మాట్లాడాలి. వాళ్ళు చెప్పే సోదంతా వినాలి. వాళ్లేమో నిజాలు చెప్పరు. మేం పత్తిత్తులమనే వాదిస్తారు. కానీ కష్టాలు తీరే మార్గాలు చెప్పమంటారు. ఛీ ఛీ అని అసహ్యమేసింది.

'చూడండి ! మీరు నలుగురన్నదమ్ములు. మీ నలుగురినీ చక్కగా పెంచి పెద్దచేసి బాగా చదివించారు మీ తల్లిదండ్రులు. మంచి పొజిషన్స్ కి వచ్చేవరకూ సపోర్ట్ చేసి, పెళ్లిళ్లు చేశారు. మరి అంత చేసిన మీ తల్లిదండ్రులని అలాగా చూసుకోవడం? సరే, మీ నాన్నగారు మీ చేతుల్లో చిక్కకుండా చనిపోయారు. మీమీ భార్యలకు భయపడి మీ అమ్మను ఓల్డేజి హోములో చేర్పించారు. డబ్బులు మాత్రం పడేస్తూ, ఆమె ఆశించిన ప్రేమకు ఆమెను దూరం చేసి, అదేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడతారేమిటి? మీరు చేసినది ఘోరమైన పాపం. దీనికి మీకు శిక్ష తప్పదు' అన్నాను.

ఆయనకు కోపమొచ్చింది.

'ఏంటండీ? నేను ఫలానాగా రిటైరయ్యాను. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు. మా ఫ్రెండ్ ఏదో మిమ్మల్ని రిఫర్ చేశాడని మీకు ఫోన్ చేశాను.  ఇలా మాట్లాడతారేమిటి? మీకు తెలిస్తే రెమెడీలు చెప్పండి. లేదంటే ఊరుకోండి. అంతేగాని ఇలా మాట్లాడకండి. అసలు నాకు మీ జ్యోతిష్కులంటే నమ్మకం లేదు.  ఏదో మా ఫ్రెండ్ మాట కాదనలేక ఫోన్ చేశాను' అన్నాడు.

'ఓహో అసలు రంగు బయటపడిందే' అనుకుంటూ - 'వినండి గుర్నాథంగారు ! నేనేమీ రోడ్డుపక్కన జ్యోతిష్కుడిని కాను.  నేనొక సివిల్ సర్వీస్ అధికారిని. ప్రస్తుతం ఇంకా సర్వీస్ లోనే ఉన్నాను.  మీకంటే చిన్న పొజిషన్లో అయితే లేను. మీరేదో నాకు ఫోన్ చేసి నన్ను ఉద్ధరించడం లేదు. నా టైం మీకు కేటాయించి మీతో ఫోన్లో మాట్లాడటమే చాలా ఎక్కువ. అది ముందు తెలుసుకోండి. మిమ్మల్ని పైకెత్తాల్సిన అవసరం నాకు లేదు. పోనీలే ఏదో బాధల్లో ఉన్నారని  ఇంతసేపూ మర్యాదగా మాట్లాడాను. ఇప్పుడు వినండి.

సృష్టిలో ఏదీ ఊరకే జరగదు. మీరేమీ తప్పులు చెయ్యకుండా మీకిలాంటి శిక్షలు పడవు. మీ తండ్రిగానిని మీరు చూసుకోలేకపోవడం, మీ తల్లిగారిని చివరలో ఓల్డేజి హోములో పడేసి ఆమె అక్కడే చనిపోతుంటే, మీరు నలుగురు బ్రదర్సూ ఇక్కడే ఇండియాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, నెలవారీ ఖర్చులు వంతులు వేసుకుని,  ఒక బెగ్గర్ కి పడేసినట్లు డబ్బులు పడేస్తూ, ఆమె తిన్నదా తినలేదా పట్టించుకోకుండా, ఆమె రోగాలు రొష్టులూ పట్టించుకోకుండా, గాలికొదిలేశారు చూడండి, అదీ మీరు చేసిన ఘోరమైన పాపం. అది చేయడంవల్ల మీరు మాతృశాపాన్ని మూటగట్టుకున్నారు. దానికి తిరుగులేదు. మీ పిల్లలు ఇప్పుడేదో అమెరికాలో ఉన్నారని తెగ సంపాదిస్తున్నారని ఎగరకండి. వాళ్ళ కుటుంబాలు నాశనమౌతాయి. రెండుతరాల తర్వాత వాళ్ళ అడ్రసులు కూడా ఉండవు. మీ మునిమనవళ్లు  మనవరాళ్లు అందరూ అమెరికన్స్ అయిపోతారు. నల్లోళ్ళనీ తెల్లోళ్ళనీ ఏడాదికొకళ్ళని మారుస్తూ చివరకేమౌతారో వాళ్ళకే తెలీకుండా పోతారు. మీ ముఖాలను కూడా వాళ్ళు గుర్తుంచుకోరు. వాళ్ళ ముఖాలు మీకూ గుర్తుండవు.

అప్పటిదాకా ఎందుకు? ప్రస్తుతం మీ గతేంటో చూడండి. మీ అమ్మగారు ఎంతబాధ పడ్డారో అంతకంత బాధలు మీరూ పడతారు.  ఇప్పుడే పడతారు. పైగా, ఎంత అహంకారం మీకు? పెద్ద పొజిషన్లో రిటైరయ్యారా? అయితే ఏంటి బోడి? ఒకప్పుడు మీరు వెయ్యి క్యాండిల్స్ బల్బే కావచ్చు. కానీ ఇప్పుడు మాడిపోయిన బల్బు. ఆ సంగతి మర్చిపోకండి. మీలాంటి వాళ్ళను ఇప్పటికి కొన్ని వేలమందిని చూచాను. ఈ స్థితిలో కూడా  మీకింత అహంకారముందంటే, ఒకప్పుడు ఇంకెంత ఉండేదో నేనూహించగలను.  మీలాంటి పాపాత్ములకు నేను రెమెడీలు చెప్పను. చెప్పి, మీ శాపాన్ని ఉత్తపుణ్యానికి  నా భుజాలకెత్తుకోలేను. మీ ఖర్మ అనుభవించండి. చావండి. నాకెందుకు?

ఇంకో సంగతి. ఇన్ని పాపాల మధ్యలో ఏంతో కొంత పుణ్యం సంపాదించే ఉంటారు మీరు. అందుకే నాతో ఫోన్లో మాట్లాడే అదృష్టం పట్టింది. అది తెలుసుకోండి. మీ పాపిష్టి ముఖాలకి రెమెడీలు కావాలా? గో టు హెల్ !' అన్నాను.

ఆయన కోపంగా ఏదేదో ఇంగిలీషులో అరుస్తున్నాడు.

ఫోన్ కట్ చేసి ఆ నంబర్ బ్లాక్ చేశాను.

ఇవాళ పొద్దున్న మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, 'ఎందుకురా అలాంటి వెధవలకి నా ఫోన్ నంబరిస్తావు?' అంటూ ముక్కచీవాట్లు పెట్టాను.

'నాకేం తెలుసురా అతనలా మాట్లాడతాడని? అతనూ వాళ్ళావిడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఓల్డేజి హోములో ఉన్నారు. ఇద్దరూ 65+ లో ఉన్నారు. ఆవిడేమో అక్కడే బాత్రూమ్ లో కాలుజారి పడి మోకాలు ఫ్రాక్చర్ అయింది. అదీ పరిస్థితి. గ్రహాలు బాలేవని ఎవరో చెబితే మంచి జ్యోతిష్కుడు కావాలంటే నీ నంబరిచ్చాను. సారీ ! ఇంకెప్పుడూ ఇవ్వను' అన్నాడు.

'మాయమాటలు చెప్పి లక్షలు వదిలించే కమర్షియల్ జ్యోతిష్కులు చాలామంది ఉన్నారుకదా? వీళ్లకు వాళ్ళే కరెక్ట్. వాళ్ళు చూసుకుంటార్లే వదిలేయ్. సరేగాని,  వాళ్ళమ్మను కూడా ఓల్డేజి హోములో ఉంచారటకదా చివర్లో ?' అడిగాను.

'అవునురా. నలుగురు బ్రదర్సూ వెల్ సెటిల్డ్. కానీ పెళ్ళాలు చెప్పినమాటలు విని అమ్మను అలా చంపేశారు. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ సంతానాన్ని చూసుకుని విర్రవీగారో వాళ్ళే ఇప్పుడు పట్టించుకోవడం లేదు.  వాళ్ళ మదర్ కూడా చివరలో  ఓల్డేజి హోములో బాత్రూం లో పడి తుంటి ఎముక విరిగింది. ఆమెను వీళ్ళెవరూ పట్టించుకోలేదు.  అప్పట్లో ఈ పెద్దకోడలే ఆమెను ఇంటికి తీసుకురానివ్వలేదు. ఇప్పుడు అదే కోడలు ఓల్డేజి హోంలో కిందపడి మోకాలు విరగ్గొట్టుకుంది. నాకు వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ . అందుకే నాకివన్నీ తెలుసు. సర్లే ఏదో అయిపొయింది. ఇంకెప్పుడూ ఇలాంటి వాళ్ళకి నీ నంబర్ ఇవ్వను. సరేనా !' అన్నాడు బతిమిలాడుతూ. 

నేనేం అనగలను? 'సరే' అన్నాను.

ఇలా ఉన్నారు మనుషులు ! జీవితంలో మన ప్రయారిటీస్ అన్నీ దారితప్పాయి. డబ్బు ఒక్కటే ప్రధానమై కూచుంది. స్వార్ధమూ, జల్సాలూ ముఖ్యమైనాయి. బాధ్యతలంటే అసహ్యం పెరిగింది. కనీసం కృతజ్ఞతకూడా ఎవరికీ ఉండటం లేదు. కర్మనియమాలు ఎవరికీ అర్ధం కావడం లేదు. చేసుకునేటప్పుడు ఎగురుకుంటూ చేసుకుంటున్నారు. పడేటప్పుడు లబోదిబో అంటున్నారు.  కానీ ఆ స్థితిలో కూడా అహంకారాలు ఏమాత్రమూ తగ్గడం లేదు. 

మనమెన్ని తప్పులైనా ఘోరాలైనా చెయ్యవచ్చు. కానీ మనకు మాత్రం అంతా బాగానే ఉండాలి. కనీసం పశ్చాత్తాపం కూడా ఉండదు ఇలాంటి మనుషులకి. పైగా, చింతచచ్చినా పులుపు చావనట్లు ఎంత అహంకారం? ఇలాంటి మృగాలకి ఏం రెమెడీలు చెప్పాలి? ఎందుకు చెప్పాలి?

దేవుడా ! మనం చేసేదే మనకు తిరిగి వస్తుందన్న నిజం ఎప్పుడు తెలుసుకుంటారో మనుషులు?