“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, మార్చి 2021, ఆదివారం

శివరాత్రి - 2021

మొన్న శివరాత్రి నాడు, రాత్రి పదకొండున్నర దాటాక మిత్రుడు ఫోన్ చేశాడు. అప్పుడే నిద్రపట్టబోతోంది. 'ఏంటి ఈ టైంలో ఫోన్?' అనుకుంటూ ఫోనెత్తి 'హలో' అన్నా బద్ధకంగా.

'ఏం చేస్తున్నావ్' అన్నాడు.

తనెప్పుడూ ఇంతే. భోంచేస్తుంటే ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటాడు. నిద్రపోతుంటే ఫోన్ చేసి  ఏం చేస్తున్నావ్? అంటాడు. స్నానం చేసే టైం లో అడగటం లేదు. అదొక్కటే వెసులుబాటు. ప్రస్తుతానికి బాత్రూం లోకి ఫోన్ తీసికెళ్ళడం లేదు. ముందుముందు అదికూడా చెయ్యాల్సి వస్తుందేమో మరి?

'ఈ టైంలో ఏం చేస్తాను? ఎగుర్లాడుతున్నా' అన్నా.

'అవునా? నువ్వు కూడా అదే చేస్తున్నావా?' అన్నాడు ఆశ్చర్యంగా.

'నేను కూడానా? ఇంకా ఎవరైనా ఇదే చేస్తున్నారా ఏంటి ఖర్మ?' అన్నా.

'అదేంటి? నువ్వు చూడటం లేదా?' అన్నాడు.

'ఏంటి చూసేది?' అన్నా.

'అదే. లైవ్ ప్రోగ్రామ్. ఫలానా ఆశ్రమంలో శివరాత్రి లైవ్ వస్తోంది. అందరూ ఎగురుతున్నారు' అన్నాడు ఉత్సాహంగా.

'శివరాత్రి లైవా? అదేంటి? అదేమన్నా ఫేషన్ షోనా లైవ్ రావటానికి? పైగా ఎగరటమేంటి?' అన్నాను.

'అక్కడ శివరాత్రి అలాగే చేస్తారు. పెద్దపెద్ద వాళ్లంతా ఉన్నారు. అందరూ ఎగురుతున్నారు' అన్నాడు మళ్ళీ.

'పెద్ద పెద్దవాళ్ళంటే ఏంటి? సైజా? ఎంత పొడుగున్నారేంటి?' అన్నాను.

'ఛ అది కాదు. అర్ధరాత్రికూడా నీ జోకులూ నువ్వూనూ. సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు. నా ఫెవరెట్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె డాన్స్ చెయ్యకపోతుంటే, స్వామీజీ ఆమె జబ్బ పట్టుకుని లేపి మరీ డాన్స్ చేయిస్తున్నాడు చూడు' అన్నాడు ఎంతో ఊగిపోతూ.

'హతవిధీ' అనుకున్నా మనసులో

'శివరాత్రి అలా కూడా చేసుకుంటారా? అయినా ఊరకే ఎగరమంటే ఆమెందుకు ఎగురుతుంది? లక్షలిస్తే ఎగురుతుంది గాని' అడిగా.

దానికి జవాబు చెప్పకుండా 'నేనుకూడా వెళ్తే బాగుండేది. తనతో నేను కూడా డాన్స్ చేసేవాడిని ' అన్నాడు నిరాశగా.

'తనతో అంటే ఎవరితో స్వామీజీతోనా' అన్నా నవ్వుతూ.

'ఛా! ఆ ముసలోడితో నాకెందుకు? నా ఫెవరెట్ హీరోయిన్ తో' అన్నాడు నీరసంగా.

'ఆ! నీకోసమే ఎదురుచూస్తోంది వెళ్ళు. ఆ దరిదాపులకు కూడా నిన్ను వెళ్లనివ్వరు. సోలో డాన్స్ చేసుకోవడమే నీకు చివరకు జరిగేది. ఇదంతా సరేగాని, దీనిని శివరాత్రి అంటారా? నా చిన్నప్పుడు కోటప్పకొండ తిరునాళ్లలో రాత్రంతా ఎద్దుబండ్లమీద రికార్డింగ్ డాన్సులు జరిగేవి. వాటికీ వీటికీ తేడా ఏంటో?' అన్నా నవ్వుతూ.

'అది నేలబారు. ఇది సోఫిస్టికేటెడ్, మైల్డ్ వెర్షన్ ఆఫ్ ఓషో ఆశ్రమంలా ఉంది.' అన్నాడు మిత్రుడు గాలిలో తేలిపోతూ.

'బైటికి మైల్డ్, లోపల మాత్రం వైల్డ్. బయటపడటానికి సమయం పడుతుంది' అన్నా.

'అంతేనంటావా?' అన్నాడు నీరసంగా.

'అయితే ప్రస్తుతం ఈ స్వామీజీ భక్తుడివా నీవు? శ్రీవిద్యని వదిలేశావా?' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'అదేం లేదు. సరదాగా లైవ్ చూస్తున్నా. కాసేపాగి శంకరాచార్యులవారు వ్రాసిన నిర్వాణ శతకం చదువుకుంటా. విన్నావా ఈ పేరు ఎప్పుడైనా?' అన్నాడు.

'అది నిర్వాణశతకం కాదు. నిర్వాణషట్కమని ఆరుశ్లోకాలు. అది చిక్కటి అద్వైతం. అవి చదివితే నీకేమొస్తుంది?' అడిగా. 

'అందులో నువ్వే శివుడివి నువ్వే శివుడివి అని ఉంటుంది తెలుసా నీకు?' అన్నాడు.

'హైస్కూల్లో ఉన్న రోజుల్లో చదివా అది. అయినా, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అనుకున్నంత మాత్రాన నువ్వు శివుడివి అయిపోవు.' అన్నాను విసుగ్గా.

'ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వేం చేస్తున్నావు?' అడిగాడు.

'ఏమీ చేయ్యను. నిద్రపోతాను నువ్వు వదిలితే' అన్నా నవ్వుతూ.

'అదేంటి కనీసం అర్ధరాత్రి పన్నెండు వరకైనా మెలకువగా ఉండవా?' అడిగాడు చిరాగ్గా.

'ఎందుకు? ఏమొస్తుంది అలా ఉంటే?' అడిగాను.

'శివరాత్రి కదా? శివపూజ చెయ్యవా?' అడిగాడు.

'పూజ మానుకున్నదెప్పుడు మళ్ళీ ఆరంభించడానికి?' అన్నాను.

'అంటే ప్రత్యేకపూజ లేదా?' అడిగాడు.

'ఏ ప్రత్యేకతా లేకపోవడమే పూజనుకుంటున్నాను' అన్నాను.

'అంటే, శివరాత్రికి ఏమీ చెయ్యవా?' అడిగాడు.

'ప్రతిరాత్రీ శివరాత్రే. శివుడు లేని రాత్రేక్కడుంది? పగలెక్కడుంది?' అడిగాను.

'అంటే, చేస్తున్నవాళ్లంతా పిచ్చివాళ్ళా?' అడిగాడు మళ్ళీ.

'పిచ్చివాళ్ళయితే బానే ఉండేది. అజ్ఞానులు. అహంకారులు' అన్నా.

'మరి నువ్వు చేసే పూజ ఏంటి?' అడిగాడు.

'చెప్పినా నీకర్ధం కాదు' అన్నాను.

'సర్లే ఏదో ఒకటి నీగోల. హాయిగా డాన్స్ చూసుకుంటా' అన్నాడు.

'ఆ పని చెయ్యి. శివుడి సంగతి ఎలా ఉన్నా, నీ హీరోయిన్ దర్శనం మాత్రం అవుతుంది, మీ స్వామీజీ ఆమె జబ్బ వదిల్తే' అన్నా నవ్వుతూ.

'సరే పడుకో. ఇక ఉంటా' అంటూ ఫోన్ కట్ చేశాడు మిత్రుడు.

'గుడ్ నైట్' అంటూ ముసుగేసి నిద్రలోకి అడుగుపెట్టా.

ఈ ఒక్క రాత్రికి శివుడిని తలచుకుంటే సరిపోతుందా? అదికూడా ఇలా డాన్సులు పాటలతో దరిద్రంగానా? అసలు శివుడు లేని రాత్రేక్కడుంది?

డర్టీ వరల్డ్ ! దీనిని ఎవడూ బాగుచెయ్యలేడు !