“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, సెప్టెంబర్ 2020, బుధవారం

Ma Anand Sheela - జాతక పరిశీలన - 1

పోయిన వారాంతంలో 'Netflix' లో 'Wild Wild Country' docu-series మళ్ళీ ఇంకోసారి చూశాను. 2019 లో  దీనిని మొదటిసారి  చూసినప్పటికీ, అప్పట్లో  రకరకాల పనులలో తలమునకలుగా ఉంటూ పైపైన మాత్రమే చూడగలిగాను. ఇప్పుడు కాస్త తీరిక చిక్కింది. అందుకని మొత్తం ఆరు భాగాలూ చూశాను. Way brothers ఈ సీరీస్ ని చాలా ఆసక్తికరంగా తీశారనే చెప్పాలి. అయితే వాళ్ళు, ఇంకా చాలా కోణాలని అందులో చూపించలేదు. ఎందుకో తెలియదు. దానిమీద ఇంకోసారి చాలా తీరికగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మాత్రం షీలా జాతకం వరకూ చూద్దాం. ఎందుకంటే, ఓషో సంస్థ పతనానికి ఆమె కూడా ముఖ్యకారకురాలు కాబట్టి.

ఓషో ప్రభావం ఇండియానుంచి అమెరికాకు విపరీతంగా వ్యాపించడానికి ముఖ్య కారకురాలు మా  ఆనంద్ షీలా లేదా షీలా అనే గుజరాతీ మహిళ.  ఆయన్ను అమెరికా తీసుకెళ్లింది, అక్కడ రిగన్ రాష్ట్రంలో  రజనీష్ పురం పెట్టడానికి, పెరగడానికి, కూలిపోవడానికి, అక్కడ జరిగిన నేరాలకు, ఘోరాలకు, చివరికి అందరూ జైలు పాలవ్వడానికి, వీటన్నిటికీ కారకురాలిగా లోకం ముందు దోషిగా నిలబడిన వ్యక్తి షీలా. ఈమె జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

వికీపీడియా ప్రకారం ఈమె 28-12-1949 తేదీన గుజరాత్ లోని బరోడాలో పుట్టింది. దీనినిప్పుడు వడోదర అంటున్నారు. జనన సమయం తెలియదు. అయినా సరే, మనకేమీ ఇబ్బంది లేదు గనుక, జాతకాన్ని పరిశీలిద్దాం. ఈమె జాతకాన్ని పైన చూడవచ్చు.

ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు షీలా అంబాలాల్ పటేల్. కొన్నికొన్ని కులాలకు కొన్ని గుణాలు ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. కులాన్ని మనం ఎంత కాదన్నా, దీనిని కాదనలేం. పటేల్ వర్గానికి చెందినవారు మంచి వ్యవహారవేత్తలు. బిజినెస్ లు చెయ్యడంలో గాని, సంస్థలు నడపడంలో గాని, వ్యవహారాలు చక్కబెట్టడంలో గాని వీళ్ళు సిద్ధహస్తులు. అమెరికాలో ఉన్న గుజరాతీలలో వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీలలో ఉన్నారు. న్యూజెర్సీ లోని జెర్సీ సిటీ లో ఉన్న ఇండియా స్క్వేర్ లేదా లిటిల్ గుజరాత్ అంతా వీళ్ళ మయమే. అమెరికాలో ఉన్న ప్రతి 10 మంది భారతీయులలో ఒకరు తప్పకుండా పటేల్ అవుతారు. వీళ్ళు అంత వ్యాపారవేత్తలు. ఈమె కూడా పటేల్ కుటుంబంలోనే పుట్టింది. అందుకే అలాంటి వక్రమైన తెలివితేటలున్నాయి.

ఎంతగా కాదనుకున్నప్పటికీ, భారతీయ ఆధ్యాత్మికచింతనా మార్గంలో ఓషో పాత్రను పూర్తిగా కాదనలేం. ఆయన సంస్థలో ఎన్ని ఘోరాలు, నేరాలు జరిగినా, ఆయన పుస్తకాలను, ఆయన ఆలోచనాధోరణిని మాత్రం కాదనడం కష్టం. మాటలవరకూ ఆయన చాలా గొప్పదైన, ఆచరణాత్మకమైన ఫిలాసఫీని చెప్పాడు. చేతల్లో ఎంతవరకూ ఆచరించాడనేది తరువాతి సంగతి. అందులో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడనేది వాస్తవం. అందరినీ విమర్శించి చివరకు తానే నవ్వులపాలయ్యాడు. ఏదేమైనప్పటికీ, ఇండియా, అమెరికాలు రెండూ ఓషోని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేవు. ఓషో తరువాత వచ్చిన గురువులందరూ కొద్దో గొప్పో ఆయన ఫిలాసఫీని చెబుతున్నవాళ్ళే.

షీలాది రేవతీనక్షత్రం రెండోపాదం. శుక్లనవమి బుధవారం నాడు పరిఘా యోగంలోఈమె పుట్టింది. నాదికూడా రేవతీనక్షత్రం రెండోపాదమే. అందుకేనేమో, లోకమంతా షీలాని ఎంత తిట్టినా, నాకెందుకో ఆమెను చూస్తే 'అయ్యో పాపం' అనిపిస్తుంది. ఓరెగాన్ లో జరిగిన నేరాలన్నీ ఓషో, షీలాలు కలిసే చేశారు. అయితే, ఓషో మాత్రం బయటపడకుండా తెరవెనుక కూచుని, అన్నీ షీలా చేత చేయించేవాడు. చివరికి తాను అమాయకుడిలా నటించి, ఆమెని బలిపశువును చేశాడు. ఇది ఓషో చేసిన అతి పెద్ద తప్పు. చేసేదంతా చేయించి, చివరకు ఒక ఆడపిల్లను బలిచెయ్యడం చాలా ఘోరమైన పాపం. ఇదొక గురువు లక్షణం కానేకాదు.

ఓషో  చెప్పిన ఉపన్యాసాలు, ఆయన మాట్లాడిన విషయాలు, తనను  గురించి తాను చెప్పుకున్న మాటలు, చేయించుకున్న ప్రచారాలు చూస్తే, ఆయన స్థాయి బుద్ధునికంటే ఎక్కువగా తోస్తుంది. మరి అంత శక్తి ఉన్నవాడు షీలా ఎలాంటిదో గ్రహించలేక పోయాడా? మొదట్లోనేమో 'నువ్వు నాతొ ప్రేమలో ఉన్నావు. నేను నీతో ప్రేమలో ఉన్నాను' అన్నాడు. చివర్లోనేమో 'అదొక బజారుముండ. నేను తనతో పడుకోలేదని తనకి కుళ్ళు' అన్నాడు. అంత ఛండాలంగా ఒక ఓపెన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక గురువుని నేనిప్పటివరకూ చూడలేదు.

క్లుప్తంగా చెప్పాలంటే, Zorba the Buddha అనేది ఆయన విధానం. అంటే అత్యంత భోగాలు అనుభవిస్తూ కూడా, ఒక బుద్ధుడున్న స్థితిలో ఉండే వ్యక్తి అనర్ధం. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఎవడూ దీనిని చెయ్యలేడు. ఓషో కూడా  ఊరకే మాటలు చెప్పాడు గాని, ఆచరణలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ క్రమంలో మాయమాటలు చెప్పి ఎన్నో జీవితాలను నాశనం చేశాడు.

జీవితాలను బాగు చేసేవాడు, మనుషులను జ్ఞానమార్గంలో నడిపించి మోక్షానికి దారి చూపేవాడు 'గురువు' అన్న పదానికి అర్హుడౌతాడు గాని, జీవితాలు నాశనం చేసి, చివరికి 'నాకేం తెలీదు' అని తప్పించుకునేవాడు కాలేడు. అదే విధంగా - 'చేసేపని ఎలాగున్నా పరవాలేదు, చేరే గమ్యం ప్రధానం' అని చెప్పేవాడు అసలు గురువే కాడు. చేసే పనిని బట్టి, నడిచే నడకను బట్టి గమ్యం ఉంటుంది గాని దానికి భిన్నంగా ఉండదు. ఒళ్ళంతా బురద పూసుకుని పెంటలో నడుస్తూ, 'చివరికి నేను స్వర్గాన్ని చేరతాను' అనుకుంటే అది జరిగే పని కాదు.

1970 ప్రాంతాలలో పూనాలోని ఓషో ఆశ్రమంలో 'థెరపీ' లనబడే గ్రూప్ మెడిటెషన్లు జరిగేవి. విదేశీయులకు కూడా అవి చాలా ఖరీదైన ప్రోగ్రాములు. వాటిలో భారతీయులకు ప్రవేశం లేదు. అవి చాలా రహస్యంగా జరిగేవి. వాటిలో హింస, కొట్టుకోవడం, గ్రూప్ సెక్స్ మొదలైన చండాలమంతా ఉండేది. వాటిల్లో పాల్గొనేవాళ్ళలో చాలామందికి కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు, ముఖాలు వాచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవి ఎంతో మానసిక ఊరటని, విశ్రాంతిని, రిలీఫ్ ని ఇచ్చేవి. వాటికోసం విదేశీయులు బారులు తీరేవాళ్ళు. కానీ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు త్వరలోనే అయిపోయేవి. ఏం చెయ్యాలో తెలీక, కొంతమంది తెల్ల అమ్మాయిలు పూనాలో వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి మరీ ఆ ప్రోగ్రాములలో పాల్గొనేవాళ్లు. తెల్లబ్బాయిలు డ్రగ్స్ అమ్మేవాళ్ళు. ఓషో ఈ రెంటినీ తప్పని చెప్పేవాడు కాదు. వారిని ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించమనేవాడు.  అవి కట్టి ప్రోగ్రాములు చెయ్యమనేవాడు. పైగా, ఎవరిదగ్గరైనా పడుకున్నప్పుడు కూడా ధ్యానం ఎలా చేయవచ్చో ఉపన్యాసాలిచ్చేవాడు. అంటే,  శిష్యులు ఏమై పోయినా తనకు మాత్రం డబ్బే ప్రధానమని చెప్పకనే చెప్పేవాడు. ఈ కోణంలో ఓషో రక్తంలోని  ఒక నీచమైన జైన్ వ్యాపారస్తుడు బయటపడతాడు. ఓషో జైన్ మతస్తుల ఇంట్లో పుట్టాడు.

ధ్యానం కోసం పూనా వీధుల్లో ఒళ్ళమ్ముకోడానికి సిద్ధపడిన ఆ అమ్మాయిలను తలచుకుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత శుద్ధమైన, ఎంత అమాయకమైన మనసులో వాళ్ళవి ! ఏం? అలాంటి వాళ్ళకోసం ధ్యానాన్ని ఉచితంగా నేర్పలేకపోయాడా ఇన్ని నీతులు చెప్పిన ఓషో? నీ బోడి ధ్యానాన్ని చెయ్యడానికి ఒకమ్మాయి ఒళ్ళమ్ముకోవాలా? దరిద్రుడా ! నువ్వొక గురువా అసలు? నీ కుటుంబసభ్యులలో ఎవరైనా ఆ పని చేస్తే నీకెలా ఉంటుంది? అప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తావా? ఎందుకు నీ పుస్తకాలు? వాటిల్లో నీతులు? పనికిమాలిన చెత్త !'

ఇవన్నీ చూచాడు గనుకనే యూజీ - 'ఓషో ఒక అమ్మాయిల బ్రోకర్' అన్నాడు.

ఆ అమ్మాయిలు గనుక ఇప్పుడు చనిపోయి ఉంటే, ఖచ్చితంగా స్వర్గంలో ఉంటారు. ఓషో ఖచ్చితంగా నరకంలో ఉంటాడు. ఇది నిజం ! 

'ప్రజల పాపాలకు రాజుకు శిక్ష పడుతుంది, శిష్యుల పాపాలకు గురువుకు శిక్ష పడుతుంది' - అంటారు. శిష్యులు తప్పు దారిలో పోతుంటే సరిదిద్దాల్సింది పోయి, వాళ్ళచేత  నానా ఛండాలపు పనులు చేయించి, చివరలో వాళ్ళ ఖర్మకు వాళ్లను వదిలేసి తాను విమానమెక్కి పారిపోవడం ఒక్క ఓషోకే చెల్లింది. షీలా కూడా అదే చేసింది. ఇద్దరూ కలిసి  వాళ్ళను అమాయకంగా నమ్మిన అందర్నీ ముంచారు. ఇదా గురుత్వమంటే ?

ఈమె జాతకంలో చూడగానే కనిపించే అంశం గురువు నీచత్వం. ఎవరి జాతకంలో నైతే గురువు నీచలో ఉంటాడో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడం ఈ  జన్మలో సాధ్యం కానే కాదు,  మిగతా గట్టి యోగాలు ఉండి, అవి సాయపడితే తప్ప. సాధారణంగా ఇలాంటి జాతకులకు  ఒక నీచమైన గురువు లభిస్తాడు. లేదా, ఆ గురువు వల్ల వీళ్లకు భ్రష్టత్వం పడుతుంది. లేదా వీళ్ళే గురువును వెన్నుపోటు పొడుస్తారు. లేదా వీళ్ళే ఒక దొంగ గురువుగా అవతారం ఎత్తుతారు. ఎలా చూచినప్పటికీ, ఇది ఒక సూటియైన గురుదోషమే. ఈ కారణం చేతనే ఈ జాతకులు ఎంత గింజుకున్నా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేరు. అలా జరగడానికి వాళ్ళ పూర్వకర్మమే  కారణం అవుతుంది. పూర్వజన్మలో వీళ్ళు గురుద్రోహులై ఉంటారు. కనుక ఈ జన్మ ఇలా పోవలసిందే. లేదా, ఒక నిజమైన గురువు దొరికితే ఆయన సేవలో తరించాల్సిందే. ఈ గురుశాపం వల్ల వీళ్లకు ఇతర రెమెడీలు కూడా పనిచేయవు.

ఈమె జాతకం చాలా విచిత్రమైనది. ఈమె జాతకంలోని గ్రహస్థితులను గమనిద్దాం.

ధనుస్సులో రవి 

ఇది చాలా ఆశపోతు మనస్తత్వాన్ని, దురహంకారపు తత్త్వాన్ని ఇస్తుంది. ధనుస్సు సహజధర్మ స్థానం కనుక మతపరంగా ఎదగడం, ధార్మిక సంస్థలలో ఉన్నత పదవులు నిర్వహించడం జరుగుతుంది.

మీనంలో రాహు చంద్రులు 

రాహుచంద్రులు కలిస్తే అది ఒక మాఫియా లీడర్ మనస్తత్వాన్నిస్తుంది. కానీ ఇక్కడ రాహువు గురుక్షేత్రంలో ఉంటూ గురువును సూచిస్తున్నాడు. ఇదొక గురుచండాల యోగం. అంటే, ఛండాలపు గురువు లభిస్తాడని అర్ధం. అంతేగాక, సంప్రదాయ విరుద్ధమైన పనులు, నేరాలు చేసే యోగం ఉందని అర్ధం. హింసాత్మక కార్యక్రమాలకు, అనైతికమైన పనులకు, నేరపూరితమైన చర్యలకు ఈ యోగం ప్రేరకమౌతుంది. మీనం ఆధ్యాత్మిక రాశి గనుక, ఈ పనులన్నీ ఒక ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో జరుగుతాయని తెలుస్తున్నది.

కన్యలో కుజ కేతువులు

ఇదొక భయంకరమైన అహంకార యోగం. ఇక్కడ కేతువు ఉచ్చబుదుడిని సూచిస్తున్నాడు. కనుక విపరీతమైన తెలివినీ, అదే సమయంలో మహామొండిదైన అధికారపూరిత మనస్తత్వాన్నీ తనమాటే సాగాలన్న పంతపు ధోరణినీ ఈ యోగం సూచిస్తుంది. దీనినే 'చావు తెలివి' అని మనం అంటూ ఉంటాం.

సింహంలో శని

దొడ్డిదారిన అధికారంలోకి రావడం, కొంతకాలం చక్రం తిప్పడం, తరువాత ఒక తోకచుక్కలాగా రాలిపోవదాన్ని ఈ యోగం సూచిస్తుంది. ఈ క్రమంలో చాలా చెడ్డ పేరును కూడా సంపాదించడం జరుగుతుంది. 

మకరంలో బుధ గురు శుక్రులు

తను అనుకున్నది సాధించడానికి ఏ పనిని చేసినా పరవాలేదనే ఆలోచనా, దానికి అవసరమైన ప్లానింగూ, అనుచరులూ, చివరకు అంతా సర్వనాశనం కావడం ఈ యోగం వల్ల జరుగుతుంది. లోకంలో గొప్ప పేరును ఈ యోగం ఇస్తుంది. కానీ ఆ పేరుతో బాటు దారుణమైన చెడ్డపేరు కూడా వస్తుంది.  బుద్ధి కారకుడైన బుధునితో నీచగురువు ఉండటం, ఒక నీచగురువు ఈమె బుద్ధిని పాడు చేస్తాడని సూచిస్తోంది. అక్కడే శుక్రుడుండటం ఈమెకు చాలామందితో ఉన్న సంబంధాలను, అది కూడా ఆ గురువు సంస్థలో ఉన్నవాళ్ళతో, సూచిస్తోంది. 

ఇవన్నీ షీలా జీవితంలో జరిగినట్లు మనం స్పష్టంగా గమనించవచ్చు.

(ఇంకా ఉంది)