“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

బాలసుబ్రమణ్యం జాతకంలో రాహుకేతువుల పాత్ర

సుమధురగాయకుడు బాల సుబ్రమణ్యం 
4-6-1946 న నెల్లూరు దగ్గరలో పుట్టాడు. ఆయన గురించి అందరికీ తెలుసు. అదంతా మళ్ళీ నేను వ్రాయవలసిన పని లేదు. ఆయన జాతకంలోని కొన్ని ముఖ్యమైన యోగాలను మాత్రం చెప్తాను.

నీచ కుజుడు, చంద్రుడు ఇద్దరూ బుధనక్షత్రంలో ఉండటం వల్ల మహాపట్టుదల ఉన్న మొండిమనిషని అర్ధం అవుతోంది. బుధుడు తృతీయాధిపతి కావడం వల్ల పాటలు పాడుతూ, డబ్బింగ్ చెప్పే కళాకారుడని తెలుస్తున్నది. గురువు వక్రత్వం వల్ల శాస్త్రీయసంగీతంలో లోతైన ప్రజ్ఞ లేదన్న విషయం స్ఫురిస్తున్నది.

చూడటానికి ఇది కాలగ్రస్తయోగ జాతకంలాగా కన్పిస్తుంది గాని సూర్యుడు బుధుడు రాహుకేతువుల పట్టులో లేరు గనుక ఆ యోగం లేదు. జననసమయం మనకు తెలియదు గనుక ఇతర పద్ధతుల ద్వారా చూద్దాం.

వృత్తికారకుడు, ఆత్మకారకుడైన శని, సినిమారంగానికి కారకుడైన శుక్రునితో కలసి, సాహిత్యానికి సంగీతానికి కళలకు నెలవైన మిధునంలో ఉండటం సినిమారంగంతో సంబంధమున్న వృత్తిని, పేరు ప్రఖ్యాతులను ఇచ్చింది. అయితే, పంచమంలో ఉచ్చకేతువున్నప్పటికీ పంచమాధిపతి కుజుని నీచత్వస్థితివల్ల, చంద్రునితో కలయిక వల్ల- సంతానమూలకంగా మనోవ్యధ, నష్టమూ తప్పవని, సంపాదించినది మిగిలే అదృష్టం లేదన్న సూచన స్పష్టంగా ఉన్నది. నవమాధిపతి అయిన గురువు వక్రిగా ఉంటూ దీనిని బలపరుస్తున్నాడు.

రాహువు ఉచ్చశుక్రుడిని సూచిస్తున్నందు వల్ల, సూర్యునితో బుధునితో కలసి ఉన్నందువల్ల సినిమారంగంలో విజయాన్నిచ్చాడు.

రాహుకేతువులు ఆయన పుట్టినపుడు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు అదే స్థానాలకు వచ్చారు. అంటే, 4 ఆవృత్తులు పూర్తిచేశారు. కనుక ఆయనకు 72+ ఏళ్లు నిండాయి. జాతకంలో రాహుకేతువుల ఉచ్చస్థితి చాలా మంచిసూచన. ఈ జాతకులు బిచ్చగాడి స్థితినుంచి మహారాజస్థితికి ఎదుగుతారు. బాలూగారు అలాగే, సున్నా నుంచి ఈ స్థాయికి ఎదిగాడు. అనేక భాషలలో పాడటమూ, రకరకాల గొంతులు పెట్టి ప్రయోగాలు చేయడమూ, మిమిక్రీ చేయడమూ, అనేక దేశాలు తిరిగి ప్రదర్శనలివ్వడమూ ఇదంతా శుక్రుడిని సూచిస్తున్న ఉచ్చరాహువు అనుగ్రహమే.

కానీ రాహుకేతువులు ఇస్తున్న యోగం నాలుగో ఆవృత్తితో అయిపోయింది. కనుక రాహువు వృషభంలోకి ప్రవేశించగానే మరణం కూడా ఆయన జీవితంలో ప్రవేశించింది. ఎన్ని ఆవృత్తులకు రాహుకేతువుల యోగం అయిపోతుంది అని మాత్రం ఆడక్కండి. ఆ రహస్యాలు చెప్పను.

రాహువు 23 న వృషభం లోకి వచ్చాడు. బాలూగారు 25 న చనిపోయాడు. అంతకు ముందు ఆగస్ట్ 5 న కరోనా లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరాడు. అప్పుడు రాహువు మిథునం మొదటి నవాంశలో ఉన్నాడు. అప్పటికే వృషభం మీద రాహువు యొక్క ఆచ్చాదన మొదలైంది. అందుకే ఆస్పత్రిలో పడేశాడు. ఆ నవాంశ అయిపోయేవరకూ అంటే, సెప్టెంబర్ 23 వరకూ ఆస్పత్రిలోనే ఉన్నాడు. రాహువు రాశి మారి వృషభం లోకి రాగానే తీసుకుపోయాడు.

కరోనా అనేది రాహువు కన్నెర్ర చేయడం వల్ల లోకానికి మూడిన రోగమే !

బాలూగారి జాతకం మీద రాహుకేతువుల ఉచ్చస్థితి ప్రభావం స్పష్టంగా కన్పిస్తున్నది.