“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, ఫిబ్రవరి 2019, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 33 (తిన్న మెతుకులు)

మానవజాతే అసలు చాలా విచిత్రమైనది. అది స్వార్ధం, అపనమ్మకం, మాటలు మార్చడం, క్రమశిక్షణా రాహిత్యం అనే దినుసులతో తయారు చెయ్యబడింది. కనుక మానవులనుంచి ఏవో గొప్ప ప్రవర్తనలను ఆశించడమే చాలాసార్లు పెద్ద పొరపాటు అవుతూ ఉంటుంది. సోకాల్డ్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా దీనికేమీ మినహాయింపులు కారు.

ప్రవక్తలు చెప్పినదానిని  వాళ్ళ అనుయాయులే చాలావరకూ ఆచరించరు. ఆచరించకపోగా, ఆ బోధనలను తప్పుదారి పట్టిస్తూ, తప్పుగా వ్యాఖ్యానిస్తూ, తమకు కావలసినట్లుగా వాటిని మలచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్నిమతాలలోనూ కొన్ని వేల ఏళ్ళనుంచీ జరుగుతోంది.

కొంతమంది జిల్లెళ్లమూడి అమ్మగారి భక్తులు నాతో ఈ మాటను చాలాసార్లు అన్నారు.

'జిల్లెళ్ళమూడిలోని అన్నపూర్ణాలయంలో మనం తినే ప్రతి మెతుకూ  మనకు ఒక జన్మను తగ్గిస్తుంది'

ఈ మాట విన్నప్పుడల్లా నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది.

'ఈ మాట ఎవరన్నారు? అమ్మ అలా చెప్పినట్లు నేనెక్కడా చదవలేదే?' అన్నాను.

'ఎవరో కొంతమంది భక్తులు అన్నట్లున్నారు'  అన్నాడు చెప్పినాయన.

ఆ మాట నన్ను ఆలోచనలో పడేసింది.

ఈ సోకాల్డ్ భక్తులకు వేరే పనీ పాటా ఏమీ ఉండదు. మహనీయులు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టె పని మానేసి, వాటికి వీళ్ళ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉండటమే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే, వాటిని ఆచరించాలంటే ఈ భక్తులు చాలా త్యాగాలు చెయ్యవలసి వస్తుంది. ఆ క్రమంలో వాళ్ళ ఈగోలు కూడా చాలా దెబ్బతింటాయి. కానీ ఆ మాటలకు ఏవేవో వీరికి  తోచిన పిచ్చి వ్యాఖ్యానాలు చెయ్యడం చాలా తేలిక, దీనివల్ల వాళ్ళ ఈగోలు బలపడటమేగాక ఏ రకమైన త్యాగాలూ చెయ్యవలసిన పని ఉండదు. కానీ ఈ  క్రమంలో ఆ మహానీయుల అసలైన బోధనలు కాలక్రమంలో వక్రీకరించబడి, కొంతకాలానికి వాళ్ళు అసలేమి చెప్పారో కూడా అర్ధంకాని స్థితికి చేరుకుంటాయి. ఇలా జరగడానికి  ఆయా  శిష్యులే ప్రధాన కారకులౌతూ ఉంటారు.

బుద్ధుని బోధనలకూ, ఇతర మహనీయుల బోధనలకూ మన దేశంలో ఇదే గతి పట్టింది. ఇక విదేశీ మతాలలో అయితే చెప్పనే అక్కర్లేదు.

అతనితో ఇలా చెప్పాను.

'నువ్వు చెబుతున్నది కరెక్ట్ కాదు. జన్మలు తగ్గడం అనేది అలా జరగదు. మనం తిన్న మెతుకుల వల్ల జన్మలు తగ్గవు. మనం ఇతరులకు పెట్టిన మెతుకుల వల్ల  జరిగితే జరగవచ్చునేమో ! అప్పుడు కూడా జన్మలేమీ తగ్గవు. మనకున్న చెడుకర్మ ఏదైనా తగ్గవచ్చు. కొంత మంచి ఏదైనా  మనకు జరగవచ్చు.  అంతేగాని జన్మలు ఎలా తగ్గుతాయి? దాని ప్రాసెస్ వేరే ఉంది. మనం అన్నం తిన్నంత మాత్రాన, అది ఎంత గొప్ప ప్రసాదమైనా సరే, జన్మలు తగ్గవు.

పైగా దీనిలో ఇంకో విషయం ఉన్నది. జిల్లెళ్ళమూడి అమ్మగారు జన్మలను ఒప్పుకోలేదు. జన్మలు లేవని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎందఱో పండితులు, సాంప్రదాయవాదులు ఆమెను విమర్శించారు కూడా. అయినా సరే, ఆమె తన మాటను మార్చుకోలేదు. కనుక,అసలు  జన్మలే లేవని అమ్మ అంటుంటే, జిల్లెళ్ళమూడిలో తిన్న అన్నంలో ఉన్న మెతుకులు జన్మలను తగ్గిస్తాయని అనడం ఎంత సబబుగా ఉంటుంది? నా ఉద్దేశ్యం ఏమంటే, ఈమాటను అన్న భక్తుడికి, అమ్మ తత్త్వం అస్సలు అర్ధం కాకపోగా, మితిమించిన ఎమోషనల్ భక్తిలో ఈ మాట అన్నాడని నాకర్ధమైంది.

ప్రపంచంలోని మతాలలో జరిగిన డామేజి అయినా, హింస అయినా, వాటివాటి ఎమోషనల్ ఫాలోయర్స్ వల్లే జరిగింది. అంతేగాని శాంతంగా వాటి బోధలను అర్ధం చేసుకుని ఆచరిద్దామని ప్రయత్నించినవారి వల్ల లోకానికిగాని ఆయా మతాలకుగాని ఎటువంటి చెడూ జరుగలేదు.

'ఎమోషనల్ భక్తి చాలాసార్లు ఎందుకూ పనిచెయ్యకపోగా, ఆధ్యాత్మికంగా చాలా తప్పుదారి పట్టిస్తుంది. ఉన్న విషయాన్ని ఉన్నట్లు అర్ధం చేసుకుని ఆచరించాలి గాని, ఊరకే ఎమోషనల్ గా ఉంటే  ఏమీ ఉపయోగం లేదు. ఇది నా మాటగా ఆ మాట అన్న వ్యక్తితో చెప్పు' అని ముగించాను.

మనం పొందినవాటివల్ల మనకేమీ మేలు జరుగదు. నిస్వార్ధంగా ఇతరులకు మనం పెట్టినదానివల్లే మనకు మంచి జరుగుతుంది. అదే మన అదృష్టంగా రూపొందుతుంది. ఇది నామాట కాదు. మన సనాతనధర్మం చెబుతున్న మాట.

చెప్పిన మాటలు సరిగా అర్ధం  చేసుకోకుండా, ఆచరించకుండా, వాటికి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ, మళ్ళీ తమను వదలకుండా పీడించే భక్తులతో మహనీయులకు ఎంత నరకమో కదా ! బహుశా అదేనేమో వారి అనంతమైన సహనానికి, కరుణకు సంకేతం !

భక్తులలో చాలామంది ఇంతే, మైకుపెట్టి చెవిలో అరుస్తున్నా కూడా చెబుతున్నది అర్ధం చేసుకోరు. ఆధ్యాత్మికలోకంలో కూడా ఎంత అజ్ఞానం ఉందిరా దేవుడా? అనుకున్నాను.

లోకంమీదా, లోకులమీదా, అజ్ఞానపు పట్టు అంత గట్టిగా ఉంది మరి !