“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, అక్టోబర్ 2018, బుధవారం

ఇండియా అంటే ఇదా?

నాకొక ఇటలీ ఫ్రెండ్ ఉన్నాడు. హిందూమతం మీద పీ.హెచ్.డీ చేస్తున్నాడు. నా ఇంగ్లీష్ బ్లాగ్ చూచి, అప్పుడప్పుడూ హిందూమతం గురించి నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నాకు తెలిసినవి చెబుతూ ఉంటాను. ఎప్పుడూ మన మతాన్ని గురించి అడిగే అతను ఈసారి మాత్రం ఎందుకో మన దేశం గురించి అడిగాడు.

'పుస్తకాలు చదివి ఇండియా గురించి ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పాటయ్యింది నాకు. అలాంటి దేశంలో పుట్టిన మీరు అదృష్టవంతులు.' అన్నాడొకసారి.

'పుస్తకాలు వేరు నిజం వేరు. ఏమేం పుస్తకాలు చదివారు మీరు?' అన్నాను.

'భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, యోగసూత్రాలు, వేదాలు చదివాను' అన్నాడు.

'అది కొన్నివేల ఏళ్ళ క్రిందటి ఇండియా. ఇప్పటి ఇండియా అది కాదు. ఆ పుస్తకాలు చూచి ఇండియా అంటే అదే అనుకుంటే మీరు ఘోరంగా మోసపోయినట్లే' అన్నాను.

'అదేంటి మీరు ఇండియన్ అయి ఉండి అలా చెబుతున్నారు?' అడిగాడు.

'నేను నిజమైన ఇండియన్ కనుకనే సత్యం చెబుతున్నాను. నాకేమీ మా దేశం అంటే దురభిమానం లేదు. మా దేశం పెద్ద పత్తిత్తు అని నేనేమీ చెప్పను. అది ఒకప్పటి సంగతి. ఇప్పుడది నానాజాతి సమితి. ఎవడు బడితే వాడు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్న ఒక నిస్సహాయురాలు.' - అన్నాను.

'అయితే ప్రస్తుతం ఇండియా ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్పగలరా?' అడిగాడు.

అతనికి ఇలా చెప్పాను.

>> పైపైన మతం, లోపల అంతా మోసం
>>పైకి సెక్యులరిజం, లోపల ఆపర్ట్యునిజం
>>మాటల్లో దైవత్వం, ఆచరణలో రాక్షసత్వం
>>పైకి నిజాయితీ, లోపల అవినీతి
>>బైటకు అన్నీ నీతులే, అవకాశం వస్తే అంతా బూతే
>>సందు సందుకూ దేవాలయాలు, వాటి ప్రక్కనే సారాయి షాపులు
>>మాటల్లో సమానత్వం, ప్రతిదాంట్లో - కులం, స్వార్ధం.
>>నోరు తెరిస్తే ఆధ్యాత్మికత, పెట్టెలో మాత్రం లెక్కలేనంత నల్లడబ్బు
>>అందరూ నీతులు చెప్తారు, ఒక్కరు కూడా ఆచరించరు
>>శుచీ శుభ్రతా పాటించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం మా రక్తంలోనే లేదు.
>>అవినీతి నాయకులూ, నిజాయితీ లేని ఉద్యోగులూ, నెంబర్ టూ తప్ప ఇంకేమీ తెలియని వ్యాపారులూ, ఎకౌంటబిలిటీ లేని ఆర్ధికవ్యవస్థా, నాయకుల బినామీలైన దొంగ స్వామీజీలూ, వాళ్ళ సామ్రాజ్యాలూ, కులగ్రూపులూ, వాళ్ళ దోపిడీ మా దేశంలో సర్వసాధారణం.
>>'లా' అనేది మాకు లేదు. అధికారం నీ చేతిలో ఉంటే ఎలాంటి నేరం చేసినా ఈజీగా తప్పుకోవచ్చు'.
>>వెరసి మా దేశం ఒక పెద్ద మేడిపండు. బయటకు అంతా నవనవలాడుతూ ఉంటుంది. కానీ లోపలన్నీ పురుగులే'

ఇవి విని అతను నోరెళ్ళబెట్టాడు.

'అంత ఘోరంగా ఉందా పరిస్థితి ?' అడిగాడు.

'నేను చెప్పింది చాలా తక్కువ. ఇండియా నిజస్వరూపం చూస్తే నువ్వు హార్ట్ ఎటాక్ వచ్చి అక్కడికక్కడే పోతావు' చెప్పాను.

'ఏమో నేను నమ్మలేక పోతున్నాను.' అన్నాడు.

'దానిక్కారణం నువ్వు చదివిన పుస్తకాలు. ఆ పుస్తకాలలో నీక్కనిపించే ఇండియా చచ్చిపోయి కొన్నివేల ఏళ్ళు గడిచాయి. ఇప్పుడున్న ఇండియా దానికి పూర్తి ఆపోజిట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా విను. మీ దేశంలో గాని, అమెరికాలాంటి దేశాలలో గాని, ఒక ఆడది ఒంటరిగా అర్ధరాత్రి పూట కారు డ్రైవ్ చేసుకుంటూ హాయిగా తిరగ్గలదు. కానీ ఇండియాలో అలా రాత్రిపూట తిరుగుతూ ఉంటే, తెల్లారేసరికి గ్యాంగ్ రేప్ కు గురైన ఆమె శవం మాత్రమే దొరుకుతుంది. కొన్నిసార్లు అదీ దొరకదు. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. అర్ధం చేసుకో.' - చెప్పాను.

'మీరింతగా చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను' అన్నాడు మళ్ళీ.

'అంటే నీకు అనుభవించే ఖర్మ ఉందన్నమాట. సరే నేనేం చెయ్యగలను? చేతులుకాలితే గాని ఎవడికైనా విషయం అర్ధం కాదు. ఎప్పుడైనా ఒకసారి ఇండియా వచ్చి ఇక్కడ తిరుగు, నీకే అర్ధమౌతుంది నేను చెప్పినదాంట్లో నిజం. లేదా ఇక్కడ దోపిడీకీ, రేప్ కీ గురైన మీ టూరిస్ట్ లను అడుగు. వాళ్ళు చెబుతారు నిజానిజాలు. అప్పుడు నమ్ముదువుగాని' అన్నాను.

కొన్ని నెలల తర్వాత అతను మళ్ళీ మెయిల్ ఇచ్చాడు.

'సారీ ! మీరు చెప్పినది నిజమే. నా ఫ్రెండ్స్ చాలామంది మీరు చెప్పినదే చెప్పారు. వారిలో కొందరు చాలా చేదు అనుభవాలను మీ దేశంలో ఎదుర్కొన్నారు. అవి వింటుంటే నాకు చాలా భయం వేసింది. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే మాత్రం చాలా పానిక్ అయ్యేవాడిని. పుస్తకాలనుంచి నేను ఏర్పరచుకున్న అర్ధంలేని అభిప్రాయాలను పోగొట్టి నిజాన్ని తెలియజేసినందుకు చాలా ధాంక్స్. ఇండియా వద్దామని అనుకున్న నా ఆలోచన ఇప్పుడు మార్చుకున్నాను.' అన్నది ఆ మెయిల్ సారాంశం.

'నువ్వు చదివిన ఇండియా ఒకప్పుడు మా దేశంలో ఎక్కడ చూచినా ఉండేది. కానీ ఇప్పుడది మినుకు మినుకు మంటున్న దీపాల్లా అక్కడక్కడా ఉంది. దానికోసం వెదికినా కూడా నీకది దొరకదు. ఇండియా వచ్చి చూస్తే అలాంటి ఇండియా కనిపించక నువ్వు చాలా ఘోరంగా నిరాశపడటం ఖాయం. అలాంటి పని చెయ్యకు' అని అతనికి చెప్పాను.

ఏ రకమైన చేదు అనుభవాన్నీ పర్సనల్ గా పొందకుండానే నిజాన్ని అతను గ్రహించేలా చెయ్యగలిగినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను.

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు కదూ !