“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, అక్టోబర్ 2018, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 26 (సాధనా నిలయం - శబ్దకాలుష్యం)

భోజనాల తర్వాత, ఎవరి బసకు వారు వెళ్లిపోయేటప్పుడు అందరికీ ఇలా చెప్పాను.

'ఇది చాలా ప్రశస్తమైన స్థలం. చూస్తున్నారు కదా ! అనవసరమైన మాటలలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. ఇప్పుడు ధ్యానం చేస్తూ నిద్రించండి. మళ్ళీ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, మీ ఇష్టం వచ్చిన చోట కూర్చుని ధ్యానం చెయ్యండి. మీరెక్కడ కూచున్నా ఎవరూ ఏమీ అనరు. ఇది మన అమ్మ ఇల్లు. అంటే, మన ఇల్లే. అమ్మ ఆలయంలో గాని, హైమక్కయ్య ఆలయంలొ గాని, లేదా అమ్మ నివసించిన పై గదిలో గాని, లేదా ఈ ఆవరణలో ఎక్కడైనా సరే, కూర్చుని ధ్యానం చెయ్యండి. మనం ఇక్కడకు వచ్చింది సాధన కోసం అని మర్చిపోకండి. ఇక మీమీ గదులకు వెళ్లి నిద్రించండి.'

నేను చెప్పినట్లే ఉదయం నాలుగు గంటలకే అందరూ లేచి స్నానాలు కానిచ్చి ఏడున్నర దాకా చక్కగా ధ్యానసాధన చేసుకున్నారు. ఆ సమయంలో చాలామందికి చాలా మంచి అనుభవాలు కలిగాయని, ధ్యానస్థితి చాలా తేలికగా వచ్చిందనీ ఆ తర్వాత మాటల సందర్భంలో నాకు చెప్పారు.

నేనూ మూర్తీ పొద్దున్నే లేచి కాలకృత్యాలు ముగించుకుని డాబామీద పచార్లు చేస్తున్నాం. అమ్మ ఇంటి డాబామీద పంచవటి సభ్యులంతా మాకు కనిపిస్తూనే ఉన్నారు. ఇంతలో మైకుల గోల మొదలైంది.

జిల్లెళ్ళమూడి చాలా చిన్న ఊరు. ఇప్పటికీ అక్కడ ఉన్న ఇళ్ళ సంఖ్య 300 మాత్రమే. అంటే జనాభా దాదాపు వెయ్యి ఉంటుంది అంతే ! నాలుగు బజార్లు చుట్టూ పొలాలు తప్ప ఇంకేమీ అక్కడ లేవు. అంత చిన్న ఊర్లో కూడా రెండు చర్చిలు, ఒక మసీదు ఉన్నాయి. ఒక పోలేరమ్మ గుడి ఉంది. ఇవన్నీ కలసి నాలుగు మైకులు పెట్టి పెద్దపెద్ద సౌండుతో, నాలుగురకాల పాటలు వినిపిస్తున్నాయి. మైకులన్నీ అమ్మ ఆశ్రమం వైపే గురిపెట్టబడి ఉన్నాయి. ఆ మైకుల దెబ్బకు పొద్దున్నే ఉండే ప్రశాంతత అంతా భగ్నమై పోయింది.

'ఏంటి ఈ ఖర్మ?' అన్నాడు మూర్తి.

'అదంతే. రామేశ్వరం పోయినా ఏదో తప్పలేదని అంటారు చూడు. ఇదీ అంతే. ఇదొక కనపడని దౌర్జన్యం. ఇక్కడ మన ఆశ్రమం ఉన్నది కదా. దానిని చూపించి మేము కూడా దాని ప్రక్కనే చర్చ్ కడతాం, మసీదు కడతాం అని ఫండ్స్ తెచ్చుకుంటారు. డబ్బులు బాగా వస్తుంటాయి. అక్కడ మాత్రం ఎవరూ ఉండరు. ఒక మైకును పెట్టి వాళ్ళ పనులమీద ఎక్కడో తిరుగుతూ ఉంటారు. శబ్దకాలుష్యం మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇదొక బిజినెస్. కులమతాలతో సంబంధం లేకుండా అందర్నీ తల్లిప్రేమతో అక్కున చేర్చుకుని తన చేతితో వాళ్లకు అన్నం తినిపించి, అందరూ రండిరా అని పిలిచిన అమ్మ దగ్గరే మళ్ళీ కులాలు మతాలు చూపిస్తున్నారు. ఏం చేస్తాం? మనుషుల ఖర్మ ఇంతే. మనుషులు ఎప్పటికీ మారరు.' అన్నాను. 

ఇంతలో ఒక చర్చ్ మైకు మ్రోగింది. అది గంట గంటకూ గంటలు కొడుతూ, టైం ఎంత అయిందో చెప్పి, ఒక బైబిల్ సూక్తిని పెద్ద సౌండుతో చెబుతోంది. ఆ రకంగా దానిని ప్రోగ్రాం చేశారు. దీన్ని చూచి హిందువులు, సాయిబులు కూడా అదే ధోరణి మొదలు పెడితే చుట్టూ ఉన్నవాళ్ళకు ఎంత నరకంగా ఉంటుంది? ఏంటో ఈ ఖర్మ? అన్ని దరిద్రాలూ మన దేశానికే పట్టాయేమో? అనిపించింది.

నన్నడిగితే మైకుల్ని పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ నీ బ్యాన్ చేయ్యాలంటాను. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా మన దేశంలో ఎవడూ లెక్క చెయ్యడు. పోలీసులు పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా మైకులు తియ్యమంటే మతకలహాలు జరుగుతాయి. ఒకరిని చూచి ఇంకొకరు ఇలా మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండు పెట్టుకుంటూ పోతుంటే చివరకు దెబ్బతినేది మన ఆరోగ్యాలే. శబ్దకాలుష్యం కనపడని హాని చేస్తుంది. ఏం చేస్తాం? మన దేశంలో ఉన్న అనేక దరిద్రాలలో ఇదీ ఒకటి. భరించడం తప్ప ఇంకేమీ చెయ్యలేం. ధార్మిక సంస్థలలో కూడా అధర్మం ప్రవేశించడం అంటే ఇదే ! ప్రస్తుతం ధర్మపీఠం  మీద కూచుని ఉన్నది సైతానే. దేవుడు ఏ మతమందిరంలోనూ లేడు. ఉన్నది డబ్బు, అహంకారం, మదం - ఇవే !

ఎవరిని ఎవరు కదిలించినా కులసంఘాలు, రాజకీయ నాయకులు ముందుకొస్తారు. గొడవలౌతాయి. బంగారం లాంటి దేశాన్ని ఇలాగే మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండనంత వరకూ మన దేశం ఖర్మ ఇంతే. మన సమస్య ఏమిటంటే - వెయ్యేళ్ళ బానిసత్వం నుంచి ఒక్కసారిగా మనకు తట్టుకోలేనంత స్వతంత్రం వచ్చేసింది. దాన్ని ఏం చేసుకోవాలో తెలీక ఇలా తయారౌతున్నాం. దానికి తోడు, విలువలు లేని రాజకీయపార్టీలే ఈ దేశానికి పట్టిన అసలైన చీడ. కంచే చేను మేస్తుంటే ఇక ఎవడేం  చెయ్యగలడు? ఈ దేశాన్ని ఎవ్వడూ బాగు చెయ్యలేడు. ఇదింతే !' అన్నాను.

మాట్లాడుకుంటూ క్రిందకొచ్చి మిగతా పనులు కానిచ్చి, దినకర్ అన్నయ్యను కలుద్దామని ఆఫీసుకు బయల్దేరాం.

(ఇంకా ఉంది)