Spiritual ignorance is harder to break than ordinary ignorance

31, అక్టోబర్ 2018, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 30 (కరసేవ)

ట్రెయిన్ లో కూచుని ఉన్న నాకు గత రెండురోజులుగా జిల్లెళ్ళమూడిలో మేము చేసిన కరసేవ గుర్తొచ్చింది.

చాలామంది ఏమనుకుంటారంటే, ఆధ్యాత్మికం అంటే, టిఫిన్ చేసి మళ్ళీ భోజనం చేసే లోపల టీవీలో వస్తున్న ప్రవచనాలు వినడం అనుకుంటారు. ఆధ్యాత్మికం అంటే అది కాదు.

ఆధ్యాత్మికం అంటూ ఊరకే మాటల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చెబితే చాలదు. అది ఉత్తమాటలకు పరిమితమైనదీ కాదు. మన చేతల్లో, మన నిత్యజీవితంలో అది ప్రతిఫలించాలి. అప్పుడే అది నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది.

తన అనుచరులు ఆధ్యాత్మిక జ్ఞానఖనులు మాత్రమేగాక, కర్మవీరులుగా కూడా ఉండాలని వివేకానందస్వామి ఆశించారు. నిజమైన యోగి జీవితం అంతరికంగానూ బాహ్యంగానూ కూడా పరిపక్వతను సంతరించుకుని ఉండాలి.

మేం అక్కడున్న రెండురోజులలో కొంత physical service చేస్తామని ఆశ్రమ నిర్వాహకులతో చెప్పాము. కొన్ని కారణాల వల్ల మొదటిరోజున అది కుదరలేదు. రెండవరోజున భోజనశాలలో వడ్డన దగ్గర మనవాళ్ళందరూ పని అందిపుచ్చుకుని చక్కగా పనిచెయ్యడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అదే విధంగా, అక్కడున్న గ్రౌండ్ లో అందరూ ఇష్టం వచ్చినట్లు పారేసిన కాగితాలను, చెత్తా చెదారాలను అందరం కలసి ఏరిపారేసి శుభ్రం చేశాము. ఈ సారి వచ్చినపుడు ఇలాంటివి Community Works ఏమేమి ఉన్నాయో చెబితే మేము చేస్తామని అక్కడి వారితో చెప్పాము.

జీవితంలో నిస్వార్ధసేవ అనేది చాలా ముఖ్యమని, దానిని మీరంతా మీమీ జీవితాలలో తప్పకుండా ఆచరించాలనీ నా శిష్యులకు నేను చెబుతూ ఉంటాను. పంచవటి ఆశయాలలో ఇది చాలా ముఖ్యమైనది.

లోకంలో అందరూ ప్రతిఫలం ఆశించే ఏ పనైనా చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఆశించేవాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేసేవాడై ఉండాలి. అదే కర్మయోగం అంటే.

మనకు కావలసింది వాచా వేదాంతం కాదు. ఆచరణ వేదాంతం కావాలి. అనుష్టాన వేదాంతం కావాలి. దీనినే శ్రీరామకృష్ణులు వివేకానందస్వామికి బోధించారు. వారు చెప్పిన 'నిస్వార్ధసేవ' అనే దానిని తర్వాతకాలంలో ఇప్పటివరకూ వచ్చిన మహనీయులందరూ అనుసరిస్తూనే ఉన్నారు. వారికి తెలిసినా తెలియకపోయినా, శ్రీరామకృష్ణుల బ్యానర్ క్రింద వారు పని చేసినా చెయ్యకపోయినా, సేవాభావాన్ని ప్రచారం చేస్తున్నవారందరూ శ్రీరామకృష్ణులు, వివేకానందస్వామి చెప్పినదానిని ఆచరిస్తున్నట్లే. దీనినే 'పంచవటి' కూడా పాటిస్తున్నది.

కరసేవలో పాలుపంచుకున్న అందరికీ ఈ సందర్భంగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను.