“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, అక్టోబర్ 2018, ఆదివారం

మహానంది ఆలయ దర్శనం

మనం కోరకుండా జరిగేదే అసలైన దైవదర్శనం ! 'నువ్వు కోరితే కోరినదే ఇస్తాను, కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అన్నారు కదా !

జీవితంలో ఏదైనా సరే, అనుకోకుండా జరిగినదే అసలైనది. మనం ప్లాన్ చేసి చేసేది అసలైనది కాదు. అది మన సంకల్పం. అనుకోకుండా జరిగేది దైవసంకల్పం.

మొన్నొక రోజున ఆఫీస్ పనిమీద నంద్యాల వెళ్ళవలసి వచ్చింది. ఆఫీస్ పని అయిపోయాక సాయంత్రం అనుకోకుండా మహానందికి వెళ్లాం. ముందుగా ప్లాన్ చెయ్యలేదు ఏమీ లేదు. అప్పటికప్పుడు మా బాస్ తో కలసి వెళ్ళవలసి వచ్చింది.

నేను ఇంతకుముందు చాలాసార్లు మహానంది వెళ్లాను. కానీ ఈరోజు మాకు జరిగిన మర్యాదా, దర్శనమూ ఎప్పుడూ లేదు. ఆలయ మర్యాదలతో స్వాగతమూ, ప్రత్యేకంగా గర్భగుడిలోకి తీసుకువెళ్ళి శివలింగాన్ని తాకించి అభిషేక జలాన్ని మనపైన చల్లడమూ, ప్రత్యేక హారతీ, అమ్మవారి గుడిలో కూడా శ్రీచక్రమేరుప్రస్తారం ప్రక్కనే కూర్చోబెట్టి మహాహారతి ఇవ్వడమూ, తరువాత వేదపండితుల చేత ఆశీర్వచనమూ - ఇదంతా చూస్తుంటే అమ్మ ఏదో పెట్టుకున్నట్లే అనిపించింది మనసులో. పైగా ఇక్కడి అమ్మవారి పేరు మా అమ్మ పేరే ! - కామేశ్వరీ దేవి.

'ఏంటమ్మా ఇదంతా ? ఇక్కడకి రావాలని నేను అనుకోలేదు. రూమ్ లో పడుకుని ఉన్నవాడిని ఇక్కడకు తీసుకొచ్చి, ఇదంతా చేయిస్తున్నావు?' అనుకున్నా మనసులో.

చరణ్ అప్పుడప్పుడూ అంటూ ఉంటాడు. 'అమ్మ గనుక ఇవ్వడం మొదలుపెడితే మనం తట్టుకోలేం అన్నగారు ! ఉక్కిరిబిక్కిరై పోతాం !' అని. బహుశా అలాంటిదేదో మొదలైనట్లుంది !

ప్రక్కనే ఉన్న మా బాస్ కూడా అదే మాట అన్నారు.

'మనం చూడాలి అనుకుంటే ఇలాంటి దర్శనం జరగదు. ఆయన మనల్ని పిలిపించుకున్నప్పుడే ఇలాంటి అనుగ్రహం దక్కుతుంది' అన్నాడాయన.

నిజమే కదా అనుకున్నాను !

మనం దైవం వంక చూడటం ఏముంది? అది ఎవరైనా చేస్తారు. దైవం మనవంక చూడటమే కదా అసలైన విషయం ! అలా చూచేటట్లు మనం ఉండటం ఇంకా ముఖ్యమైన విషయం ! మనం ఆయన దగ్గరకు వెళ్ళడం ఏముంది? అందరూ అదేపని చేస్తారు. కానీ మనల్ని ఆయన పిలిపించుకోవడం అసలైన అనుగ్రహానికి సూచన !

గమనించే చూపు గనుక మనకుంటే, మన జీవితంలోని చిన్నచిన్న విషయాలలో కూడా దైవస్పర్శ మనకు అందుతూనే ఉంటుంది మరి !