“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, జనవరి 2018, మంగళవారం

హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి?

మొన్నొకాయన నాతో మాట్లాడుతూ ఈ పోస్టును వ్రాయడానికి నాంది పలికాడు.

'అమెరికాలో ఎక్కడ బడితే అక్కడ హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. చూచారా ఇదెంత మంచి శుభ పరిణామమో?' అన్నాడు.

'ఆ విషయం నీకెలా తెలుసు?' అడిగాను.

'ఈ మధ్యనే అమెరికాలో ఆర్నెల్లు ఉండి వచ్చాను. అప్పుడు చూచాను. ప్రతి స్టేట్ లోనూ మన గుళ్ళున్నాయి. అంతేకాదు. ఒక్కో ఊరిలోనైతే అయిదారు దేవాలయాలున్నాయి. ఇంకా కడుతున్నారు.' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

'సరే మంచి విషయమేలే గాని, ఇది శుభ పరిణామం ఎలా అవుతుందో కాస్త చెప్పు వింటాను' అన్నాను.

'అదేంటి? మన సంస్కృతి అమెరికాలో కూడా విస్తరిస్తోంది. ఇది మంచిదేగా?' అన్నాడు.

'అవును. అదే సమయంలో మన సంస్కృతి మన దగ్గర మాయమౌతోంది. వాళ్ళ సంస్కృతి ఇక్కడ విస్తరిస్తోంది. దీనికేమంటావు?' అడిగాను.

'నిజమే. కాకపోతే కొంతలో కొంత మంచిదేగా?' అన్నాడు.

నేను నవ్వేసి ఊరుకున్నాను.

'అసలూ, నవాబుల కాలంలో మన గుళ్ళు ఎన్ని నాశనం అయ్యాయో లెక్కేలేదు. అవన్నీ ఉంటె ఇప్పుడు ఇంకెంత బాగుండేదో? అందుకే నాకు ముస్లిమ్స్ అంటే పరమమంట !' అన్నాడు కోపంగా.

'ఇప్పటి ముస్లిమ్స్ కాదుగా అప్పుడు మీ గుళ్ళు ధ్వంసం చేసింది? వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడున్న వీళ్ళమీద ఎందుకు నీకు కోపం?' అన్నాను నవ్వుతూ.

'అవుననుకోండి. కానీ వీళ్ళ తాతముత్తాతలేగా ఆ పనులు చేసింది?' అన్నాడు ఇంకా బుసలు కొడుతూ.

'ఓహో అదా ! అలా అయితే మీ తాతముత్తాతలు చేసిన పనులకు నీకూ శిక్ష పడాలిగా మరి?' అన్నాను.

'మా వాళ్ళేం గుళ్ళూ గోపురాలూ నాశనం చెయ్యలేదే?' అన్నాడు వాదనలోకి దిగుతూ.

'సరిగ్గా అవే పనులు చేసి ఉండకపోవచ్చు. కానీ అంటరానివాళ్ళు అంటూ సాటి మనుషులను దూరం పెట్టడాలూ, పల్లెల్లో పెత్తనం చెలాయించడాలూ, భూములన్నీ మీ చేతుల్లోనే ఉంచుకోడాలూ, రెలిజియస్ గా ఎన్నో బయటకురాని నేరాలూ దౌర్జన్యాలూ చెయ్యడాలూ - ఇవన్నీ చేశారు కదా మీ పెద్దలు? మరి వాటికి నీకూ శిక్ష పడాలిగా ఇప్పుడు. ఒప్పుకుంటావా?' అన్నాను సూటిగా.

'ఆ ! అదీ ఇదీ ఒకటే ఇలా అవుతుంది? మీరు చెప్పినట్లుగా మావాళ్ళు చేసిన నేరాలకు దౌర్జన్యాలకు సాక్ష్యాలు లేవు. కానీ దేవాలయాలు ధ్వంసం చెయ్యబడి మన కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి కదా? దీనికేమంటారు?' అన్నాడు తెలివిగా.

'ఇప్పుడు కరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తున్నవురా బిడ్డా' - అని మనస్సులో అనుకుని - 'అలా ధ్వంసం చెయ్యబడిన గుళ్ళూ గోపురాలే మీ నేరాలకు నిదర్శనాలు' అన్నాను.

అతనికి అర్ధం కాలేదు.

'ఏంటి మీరు చెబుతున్నది?' అన్నాడు అయోమయంగా.

'శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు' అని ఒప్పుకుంటావా? అడిగాను.

'అవును. నిజమే.' అన్నాడు తప్పదన్నట్టు.

'మరి ముస్లిమ్స్ మీ దేవాలయాలను ధ్వంసం చెయ్యడం వెనుక కూడా శివుని ఆజ్ఞ ఉండే ఉంటుంది' అన్నా నవ్వుతూ.

'అదేంటి? శివుడు తన గుడిని తనే ధ్వంసం చేయించుకుంటాడా?' అన్నాడు ఎగతాళిగా.

'తప్పకపోతే మరేం చేస్తాడు?' అన్నా.

'అదేంటి? కొంచం అర్ధమయ్యేట్లు చెప్పండి' అన్నాడు అయోమయంగా.

'నీ దృష్టిలో నీ గుడి గొప్ప కావచ్చు. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తికి, ఆ విశ్వంలోని ఒక భూమి ఎంత? ఆ భూమిమీద ఉన్న అనేక దేశాలలో నీ దేశం ఎంత? ఆ దేశంలో మారుమూలన ఉన్న ఒక గుడి ఎంత? శివుడికి నువ్వు కట్టించిన గుడి తప్ప ఇంకేదీ లేదా ఈ ప్రపంచంలో ఉంటానికి? అయినా, విశ్వవ్యాప్తశక్తి అయిన విశ్వనాధుడికి నువ్వు గుడి కట్టించగలవా? ఆలోచించి చెప్పు.' అన్నాను.

'మీరిలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను.' అన్నాడు ఇంకేమీ అనలేక.

'చెప్పకు. నిన్ను చెప్పమని నేను అడగలేదు. నువ్వడిగితేనే నేను చెబుతున్నాను. నువ్వేమీ చెప్పద్దు. నాకూ వినాలని లేదు.' అన్నాను.

కాసేపు మౌనంగా ఉన్నాడు గాని, లోపల ఏదో పురుగు తొలుస్తోంది.

చివరకు మెల్లిగా - 'సరే మీరే చెప్పండి. మన గుళ్ళు ఎందుకు ధ్వంసం అయ్యాయో?' అన్నాడు.

'అలా  రా దారికి' అనుకుని చెప్పడం మొదలు పెట్టాను.

'ఏ గుడైనా మొదట్లో బాగానే ఉంటుంది. మంచి ఉద్దేశ్యంతోనే దాన్ని కడతారు. కాలక్రమేణా దానిలో లేనిపోని రాజకీయాలు చోటుచేసుకోవడం మొదలు పెడతాయి. అధికార దాహాలు, అక్రమాలు, నేరాలు, దౌర్జన్యాలు మొదలౌతాయి. లోపల్లోపల ఎన్నో లుకలుకలు సాగుతాయి కాని రెలిజియస్ ముసుగులో అవన్నీ బయటకు రాకుండా ఉండిపోతాయి. మతానికి రాజుల సహకారం తోడైతే ఇక అక్కడ జరిగే అక్రమాలు అన్నీఇన్నీ కావు. సామాన్యులను పురుగుల్లా చూడటమూ, తమకు తాము దైవాంశ సంభూతులలాగా భావించుకొని అడ్డమైన నేరాలు అక్రమాలు దౌర్జన్యాలు చెయ్యడమూ మొదలౌతాయి. ఆ అరాచకానికి అడ్డూఆపూ ఉండకుండా పోతుంది. ఈ క్రమంలో ఎంతోమంది ఆ ఇనుప చక్రాలక్రింద పడి నలిగిపోతారు. అప్పుడేం జరుగుతుంది? ' అన్నాను.

'ఏం జరుగుతుందో మీరే చెప్పండి' అన్నాడు.

'ఆ గుడిలోని దేవుడు కూడా భరించలేనంత మత దురహంకారం అక్కడివారిలో పెరుగుతుంది. అప్పుడు ఆ దేవుడే, బయట నుంచి కొంతమందిని సృష్టించి, వాళ్ళ చేత తన గుడిని తానే ఎటాక్ చేయించుకుని, దాన్ని కూలగొట్టిస్తాడు. మీ గుళ్ళలో జరిగింది కూడా అదే. ఇది అసలైన వాస్తవం.' అన్నాను.

' మీ లాజిక్ నాకు సమ్మతంగా లేదు.' అన్నాడు.

'అది నీ ఖర్మ. దానికి నేనేం చేసేది? పోనీ ఒక విషయం చెప్పు. వందల వేల సంవత్సరాల నుంచీ మంత్రాలతో, నియమాలతో, పూజలూ, పునస్కారాలూ క్రమం తప్పకుండా జరుగుతున్న ఒక గుడిలో శక్తి ఉంటుందా ఉండదా?' అడిగాను.

'తప్పకుండా ఉంటుంది' అన్నాడు.

'మరి అంతటి శక్తి ఉన్న ఆలయాలను, బయటనుంచి ఎవడో వచ్చి ఎలా ధ్వంసం చెయ్యగలడు? అంటే దీనిలో రెండే మార్గాలున్నాయి. ఒకటి - మీ గుళ్ళలో శక్తి తగ్గిపోయన్నా ఉండాలి. రెండు - వాటిని కూల్చేసిన ముస్లిమ్స్ లో మీకంటే ఎక్కువ భక్తీ శక్తీ ఉండి ఉండాలి. అంతేనా కాదా?' అడిగాను సీరియస్ గా.

జవాబు చెప్పలేక నీళ్ళు నములుతూ - 'ఆచారమూ పాడూ లేని వాళ్ళలో శక్తి ఉందంటే నేను నమ్మలేను. మాలోనే శక్తి తగ్గిపోయి ఉంటుంది.' అన్నాడు అయిష్టంగా.

'నేను చెప్పేదీ అదే. మీ గుళ్ళలో శక్తి తగ్గినప్పుడే ఇలాంటివి జరిగాయి. ఆ శక్తి ఎలా తగ్గిందంటావు? ఆలోచించు. నేను చెప్పినవే కారణాలు. మీలో దురహంకారం పెరిగిపోయింది, అక్రమాలు పెరిగాయి, రెలిజియస్ ముసుగులో నేరాలు చెయ్యడం మొదలైంది. సాటి మనుషుల మీద దౌర్జన్యాలు మొదలుపెట్టారు. ఆ అక్రమాలను దేవుడు కూడా భరించలేనంత స్థాయికి అవి చేరాయి. ఎంతోమంది ఉసురును మీరు పోసుకున్నారు. అందుకే ఒక మాలిక్ కాఫరో, ఒక అలాఉద్దీన్ ఖిల్జీనో, ఒక మహమ్మద్ గజనీనో, ఒక ఔరంగజేబో పుట్టుకొచ్చారు. వరుసగా మీ గుళ్ళమీద పడి వాటిని ధ్వంసం చేశారు. ఇంతకంటే ఇంకే కారణమూ లేదు. అనవసరంగా ముస్లిమ్స్ మీద ద్వేషం పెంచుకోకు. వాళ్ళలో మంచివాళ్ళు చాలామంది ఉన్నారు.' అని చెప్పాను.

'ఇదంతా మీ ఊహ కావచ్చుగా' అన్నాడు మళ్ళీ మొదటికొస్తూ.

'కావచ్చు. కానీ ఇంతకంటే లాజికల్ గా వేరే ఏదైనా ఉంటే చెప్పు. నేను వింటాను.' అన్నాను.

చాలాసేపు ఆలోచించాడు కానీ ఏమీ తట్టలేదు లాగుంది. ఏమీ మాట్లాడలేదు.

చివరకు నేనే ఇలా చెప్పాను.

'వివేకానందస్వామి జీవితంలో ఒక సంఘటన జరిగింది. కాశ్మీర్ లోని క్షీర్ భవాని ఆలయంలో జగన్మాత స్వరం ఆయనకు వినిపించింది. సాక్షాత్తూ అమ్మవారే ఆయనతో మాట్లాడింది. తన ఇష్టప్రకారమే తన ఆలయం ధ్వంసం కాబడిందనీ, అలా పాడుబడిన ఆలయంలో ఉండటమే తనకిష్టమనీ ఆ స్వరం చెప్పింది.' అన్నాను.

'అది ఆయన భ్రమ అయ్యి ఉండవచ్చు కదా?' అన్నాడు.

'ఆయన శిష్యుడు శరచ్చంద్ర చక్రవర్తి కూడా ఇదే సందేహాన్ని ఆయనదగ్గరే వెలిబుచ్చాడు. దానికి స్వామి చెప్పిన సమాధానం చదువు. 'స్వామి శిష్య సంవాదము' అనే తెలుగు పుస్తకంలో ఉంటుంది. ఇంగ్లీషులో అయితే Talks with Swami Vivekananda అని ఉంటుంది చూడు.

సామాన్యంగా భ్రమ అనేది మనకిష్టమైన రీతిలో ఉంటుంది గానీ మనకు నచ్చని రీతిలో ఉండదు. కనుక అది భ్రమ కాదు. పోనీ నువ్వన్నట్లే అది భ్రమ అనుకుందాం కాసేపు. అంటే - మహనీయులైన సిద్ధపురుషులతో సహా ప్రపంచంలో అందరిదీనేమో భ్రమనా?  నీదొక్కడిదీనేమో సరైన దృష్టీనా? నువ్వనుకున్నట్లుగా నీకు ఆన్సర్ వస్తే అది నిజమా? లేకపోతే భ్రమనా? ఇదేనా నీ తెలివి?' అన్నాను సీరియస్ గా.

ఏమో? నువ్వెన్ని చెప్పినా దీన్ని నేను అంగీకరించలేక పోతున్నాను' అన్నాడు చివరికి.

'దానినే మూర్ఖత్వం అంటారు మరి' అన్నాను నవ్వుతూ.

'అయితే ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అన్నాడు నసుగుతూ.

'ఏం లేదు. అమెరికాలో గుళ్ళు కట్టినంత మాత్రాన అదేదో గొప్ప విజయం అనుకోకండి. మన సంస్కృతి ఏదో గొప్పగా విస్తరిస్తోంది అని భ్రమా పడకండి. సంస్కృతి గుళ్ళలో ఉండదు. మనలో ఉంటుంది. మీలో అది లేకపోతే మీరు కట్టిన గుడి ఎక్కువ కాలం ఉండదు. కూలిపోతుంది. ఆ కూలిపోవడం ఏ రకంగానైనా కావచ్చు. అదే కూలిపోవచ్చు లేదా బయటనుంచి ఎవడైనా వచ్చి కూలగొట్టవచ్చు.

ఒక పండు లోపలనుంచి కుళ్ళడం ఎప్పుడైతే మొదలౌతుందో, బయటనుంచి అనేక పురుగులు దాన్ని ఎటాక్ చెయ్యడానికి వస్తాయి. అలాగే ఇదీ జరుగుతుంది. ముందు మీలో కుళ్ళు ఏర్పడింది. అప్పుడు బయటనుంచి ముస్లిమ్స్ వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. మీలో నీతీ, నిజాయితీ, ఐకమత్యమూ ఉంటే బయటవాళ్ళు ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోదురు. లోపం మీలో ఉంది. వాళ్ళలో లేదు. తప్పులన్నీ మీ దగ్గరుంచుకుని బయటవాళ్ళను అనడం దేనికి?

ఎక్కడైనా సరే, ఒక పవర్ సెంటర్ ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడ నానా అక్రమాలూ మొదలౌతాయి. గుడి కూడా ఒక పవర్ సెంటరే. పైగా అదొక రెలిజియస్ పవర్ సెంటర్. అక్కడ జరిగే అన్యాయాలకు అంతూ పొంతూ ఉండదు. ప్రస్తుతం మన తిరుమలనే చూడు. అక్కడున్నంత అవినీతి ఎక్కడా ఉండదని ప్రతివాడికీ తెలుసు. అక్కడ అందరూ భక్తులే. అందరూ దొంగలే. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అక్కడ ఉన్నాడని నమ్ముతూ, మళ్ళీ చెయ్యకూడని అడ్డమైన పనులన్నీ చేస్తూనే ఉంటారు. దీనినేమనాలి?

కనుక దేవాలయ వ్యవస్థ మాటున అహాలూ, అక్రమాలూ, దౌర్జన్యాలూ, అవినీతీ పెరగకుండా చూచుకోవడం ముఖ్యం. అంతేగాని ఎన్ని గుళ్ళు ఏ దేశంలో కట్టామన్నది ముఖ్యం కాదు. ఎన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయన్నదీ ముఖ్యం కాదు. మన గుళ్ళు దేవుడికి అక్కర్లేదని గ్రహించు. విశ్వమే ఆయన దేవాలయం. మీరు మళ్ళీ ఒక రాతి గుడిని కట్టక్కరలేదు. అక్కడ అడ్డమైన అక్రమాలూ చెయ్యనక్కర్లేదు.

నువ్వు చేప్పే దేవాలయ కమిటీలలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఒకరంటే ఒకరికి పడదు. అనేక ఈగో ప్రాబ్లంస్ ఉంటాయి. ఇంటర్నల్ గొడవలు ఉంటాయి. బయటకు మాత్రం గుడి అనే ముసుగులో అన్నీ కప్పేసి మహా పవిత్రులలాగా ఫోజు కొడుతూ ఉంటారు. ఎవడికి దొరికినది వాడు మెక్కుతూ ఉంటారు. ఇక ఆ గుడిలో దైవత్వం ఎక్కడేడుస్తుంది? వాళ్ళలో వాళ్లకు రాజకీయాలు లేని ఒక కమిటీని నాకు చూపించు. చూపలేవు.

నా దృష్టిలో ఇదేమీ పెద్ద గొప్ప 'ఎచీవ్ మెంట్' కాదు. ఇలాంటి గుళ్ళు కట్టడం వల్ల నా దృష్టిలో ఎలాంటి ఉపయోగమూ లేదు. కనుక అమెరికాలో మన సంస్కృతి, గుళ్ళు కట్టడం ద్వారా విస్తరిస్తోందని నువ్వు చంకలు చరుచుకోవలసి అవసరం లేదు. ఒకవేళ చరుచుకుంటే చరుచుకో. ఇది నీ ఇష్టం. కానీ అదొక భ్రమ మాత్రమే' అని ముగించాను.

అతను చాలా విసుగ్గా ముఖం పెట్టుకుని అక్కణ్ణించి నిష్క్రమించాడు.

యధావిధిగా - నేను చెప్పినది అతనికే మాత్రమూ నచ్చలేదని మళ్ళీ చెప్పనక్కర్లేదు కదూ !