“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, ఆగస్టు 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 34 (గౌరీమా - ఎదుట నిలిచిన దైవం)

తను అనుకున్నది సాధించిన సంతోషంలో మృడాని బృందావనంలో హాయిగా కొన్ని నెలలు కాలక్షేపం చేసింది.ఆమె అనుకున్నదే తడవుగా సమాధిలో మునిగి కృష్ణుని దర్శించేది.అలా ఆయనతో మాట్లాడుతూ ఆయన్ను చూస్తూ బృందావనంలో చీకూ చింతా లేకుండా ఆమె స్వేచ్చగా విహరించింది.

అదే సమయంలో ఆమెకు ఒక విశిష్ట వ్యక్తితో పరిచయం కలిగింది.అతడే రాధారమణ బోస్.ఈయన కలకత్తా వాస్తవ్యుడే అయినప్పటికీ ఆయనకు కలకత్తాలోనూ బృందావనంలోనూ ఇళ్ళున్నాయి.ఈయన బాగా ధనవంతుడైన ఒక జమీందారు.బృందావనంలో ఈయన ఒక కృష్ణ దేవాలయం కూడా కట్టించాడు.ఈయన కుటుంబమంతా కృష్ణ భక్తులు గనుక అప్పుడప్పుడూ ఈయన కుటుంబంతో సహా బృందావనం వచ్చి కొన్నాళ్ళు అక్కడ ఉండి పోతూ ఉండేవాడు.వీరు కృష్ణభక్తులే అయినప్పటికీ శ్రీరామకృష్ణులకు కూడా వీరభక్తులు.ఇతని కుమారుడే శ్రీరామకృష్ణుల అంతరంగ భక్తుడైన బలరాం బోస్. ఈ బలరాంబోసుకే ఒకానొక సమయంలో శ్రీరామకృష్ణులు చతుర్భుజములు కలిగిన శ్రీమహావిష్ణు రూపంలో దర్శనం ఇచ్చారు.

తండ్రీ కొడుకులిద్దరూ కూడా ఆమెకు ఇలా చెప్పారు.

'అమ్మా.నీవు మాతో కలకత్తాకు రా.అక్కడ ఒక దివ్యపురుషుని నీకు చూపిస్తాం.ఆయన నిత్యసమాధి నిమగ్నుడు.అందరిలా మానవవేషంలో కనిపించినప్పటికీ ఆయన మానవుడు కాదు.సాక్షాత్తూ భగవంతుడే ఆ రూపంలో భూమిమీద ఉన్నాడు.నీవొక సారి వచ్చి ఆయన దర్శనం చేసుకో.నీ వెదుకులాట పరిసమాప్తం అవుతుంది'.

కానీ మృడానికి ఆ మాటలు రుచించలేదు.తన అంతరంగంలో వెలుగుతున్న కృష్ణుడే తనకు చాలు.వేరొక మహాపురుషుని దర్శనం, ఆయనెంత గొప్పవాడైనా సరే, తనకెందుకు? అనుకుంది ఆమె. 

దాదాపుగా ఈ సమయంలోనే తన మేనమామ అయిన శ్యామా చరణ్ ను మృడాని బృందావనంలో కలుసుకుంది.తను అనుకున్న పని పూర్తయింది గనుక ఈసారి ఆమె ఈయన్ను చూస్తూనే పారిపోలేదు.ఆయన ఉంటున్న ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడింది.ఏడుస్తూ వాళ్ళమ్మ వ్రాసిన ఉత్తరాలను ఆయన మృడానికి చూపించి, ఒక్కసారి తనతో కలకత్తాకు రావడానికి ఆమెను ఎలాగైతేనేమి ఒప్పించాడు.ఆ విధంగా ఆమె దాదాపు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కలకత్తాకు వచ్చి అమ్మా నాన్నలను దర్శించింది.

సన్యాసిని వేషంలో ఉన్న కూతురిని చూచిన తల్లిదండ్రులు బాధ పడినప్పటికీ, ప్రాణాలతో ఆమె మళ్ళీ తమ కళ్ళకు కనిపించినందుకు ఉప్పొంగిపోయి ఆమెను కౌగలించుకుని ఎంతో ఏడ్చారు.ఇరుగు పొరుగులు అందరూ వచ్చి సంభ్రమాశ్చర్యాలతో ఆమెను చూస్తూ ఉండిపోయారు.అలా కొన్నాళ్ళు తల్లిదండ్రులతో గడపిన ఆమె, తనకు సంసారపు ఇంట్లో ఇలా ఉండటం నరకంలాగా ఉన్నదని చెప్పి, మళ్ళీ తీర్ధయాత్రలకు బయల్దేరింది.

ఈసారి ఆమె పూరీ క్షేత్రానికి వెళ్లి జగన్నాధుని దర్శనం చేసుకుంది.పూరీ క్షేత్రంలో ఉన్నపుడే ఆమెకు హరికృష్ణ ముఖోపాధ్యాయ అనబడే ఒకాయన పరిచయం కలిగింది.ఆయన కూడా శ్రీరామకృష్ణుల మహాభక్తుడు.

ఆయన కూడా ఆమెతో ఇలా అన్నాడు.

'అమ్మా.ఒక్కసారి దక్షిణేశ్వరం వెళ్ళు.అక్కడ ఒక మహానుభావుని నేను చూచాను.ఆయన మూర్తీభవించిన జ్ఞానానికీ ప్రేమకూ ప్రతిరూపం.ఎల్లప్పుడూ ఆయన సమాధిస్థితిలోనే ఉంటాడు.ఈ అద్భుతం మనం ఎక్కడా చూడలేము.ఆయన మహత్యాన్ని నేను వర్ణించలేను.నీ కళ్ళతో నీవే వెళ్లి చూడు.బహుశా నువ్వు వెదుకుతున్నది ఆయన కోసమే కావచ్చు'.

అప్పుడు కూడా మృడాని ఆ మాటలను తేలికగా తీసుకుంది గాని దక్షిణేశ్వరం వెళదామని ఆమెకు తోచలేదు.కానీ బలరాంబోసు నుంచి మళ్ళీ మళ్ళీ కలకత్తాకు రమ్మని ఆహ్వానం అందుతూ ఉండేసరికి ఆమె 'సరే,చూద్దామని' కలకత్తాకు చేరుకుంది.

అది 1882 వ సంవత్సరం.శ్రీ రామకృష్ణుల లీలకు ఈ భూమి మీద ఇంకా నాలుగేళ్లే గడువు మిగిలి ఉన్నది.అప్పటికే ఆయన తన నిజస్వరూపాన్ని చాలామందికి చూపడం ప్రారంభం అయింది.ఎందరికో వారి వారి ఇష్ట దైవాల రూపంలో ఆయన దర్శనం ఇచ్చేవారు.ఆయా అనుభవాలు పొందిన భక్తులు మనసా వాచా కర్మణా ఆయనకు పాదాక్రాంతులై ధన్యులయ్యేవారు.ఎంతటి ధన్యాత్ములో వాళ్ళు?

కలకత్తాకు చేరుకున్న మృడాని తన ఇంటికి పోకుండా బాగ్ బజార్ లో ఉన్న బలరాం బోసుగారి ఇంటికి చేరుకుంది.వాళ్ళు బాగా ధనవంతులు గనుక ఎన్నో గదులున్న వారి ఇంటిలో ఒక గదిని ఈమెకు ఇచ్చి అందులో ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండమని ఆమెకు చెప్పారు.

ఆమెతో ముచ్చటించే సమయంలో బలరాం బోస్ తరచుగా ఇలా అనేవాడు.

'అమ్మా! నీవు ఒకసారి దక్షిణేశ్వరానికి వెళ్ళు.అక్కడ ఒక సాధుపుంగవుడు ఉన్నాడని నీకు గతంలో చెప్పాను కదా.ఆయన్ను త్వరగా దర్శించుకో. ఆలస్యం చేశావంటే,ఆ తర్వాత నీవు చాలా పశ్చాత్తాపపడతావు.ఆయన చాలా మహనీయుడు.ఎందుకని ఇంతలా చెబుతున్నానో అర్ధం చేసుకో.'

ఆ మాటలను విన్న మృడాని నవ్వుతూ ఇలా అనేది.

'అన్నా!నేను హిమాలయాలలో ఎంతోమంది సాధువులను చూచాను.నువ్వు చెబుతున్న సాధువును చూడాలని నాకేమీ కోరిక లేదు.లోకంలో ఎందఱో సాధువులున్నారు.ఏమిటి ఈయన ప్రత్యేకత?ఒకవేళ ఆయన నిజంగా నువ్వు చెప్పేటంత శక్తివంతుడే అయితే నన్నే ఆయన దగ్గరకు ఈడ్చుకుని పొమ్మను.అప్పుడు వస్తాను.అంతవరకూ రాను.'

ఈ మాటలు విన్న బలరాం నవ్వేసి, ఇంకా సమయం రాలేదని లోలోపల భావించి, ఊరకుండేవాడు.

ఈ విధంగా వారి ఇంటిలోని ఆ గదిలో ఉంటూ మృడాని తన దామోదర సాలగ్రామానికి యధావిధిగా పూజ చేసుకుంటూ మిగతా సమయంలో ధ్యానంలో ఉంటూ ఉండేది.ఇలా ఉండగా ఒకరోజున ఒక అద్భుతం జరిగింది.

ఆరోజు ఉదయమే నిద్ర లేచిన మృడాని యధాప్రకారం కాలకృత్యాలను తీర్చుకుని తన గదిలో పూజకు ఉపక్రమించింది.సాలగ్రామాన్ని ముందుగా నీటిలో స్నానం చేయించి ఒక శుభ్రమైన వస్త్రాన్ని చుట్టి దానిని ఆ సాలగ్రామం కోసమే చేయించిన ఒక చిన్న సింహాసనం పైన ఉంచబోతూ ఉండగా హటాత్తుగా ఆ సింహాసనం మీద దివ్యకాంతితో వెలుగుతున్న రెండు మృదువైన మానవ పాదాలను ఆమె చూచింది. మొదట అది తన భ్రమేమో అనుకుని ఆమె కనులు నులుముకుని మళ్ళీ చూచింది.ఎన్ని సార్లు చూచినా ఆ పాదాలు అలాగే ఆమెకు కన్పిస్తున్నాయి.ఒక్కసారిగా ఆమె శరీరంలోనుంచి ఒక విద్యుద్ఘాతం ప్రసరించినట్లైంది.ఆమె రోమాలన్నీ ఝల్లుమంటూ నిటారుగా అయిపోయాయి.

నిర్ఘాంతపోయిన ఆమె చేతిలోనుంచి ఆ సాలగ్రామం ఎప్పుడు జారి నేలపైన పడిపోయిందో ఆమెకు తెలియలేదు.తెలియడంతోనే ఆమె పశ్చాత్తాపంతో క్రుంగిపోయింది.ఇన్నేళ్ళలో ఆ సాలగ్రామాన్ని ఆ విధంగా ఒక్కసారి కూడా చెయ్యి జార్చుకున్నది లేదు.ఇప్పుడు ఇలా జరిగేసరికి ఆమె చలించి భయపడి పోయింది.క్రింద పడిన సాలగ్రామాన్ని చేతిలోకి తీసుకుని శుభ్రంగా దానిని నీటితో మళ్ళీ స్నానం చేయించి తుడిచి ఆ సింహాసనం మీద ఉంచింది. హటాత్తుగా ఆ సాలగ్రామం స్థానంలో మళ్ళీ అవే పాదాలు ఆమెకు దర్శనమిచ్చాయి.వణుకుతున్న చేతులతో ఒక తులసిదళాన్ని సాలగ్రామానికి సమర్పించగా, ఆ తులసిదళం  సాలగ్రామం మీద కాకుండా ఆ పాదాల మీద పడటం ఆమె చూచింది.ఒకవేళ తను భ్రమ పడుతున్నానేమో నని మళ్ళీ రెండు మూడుసార్లు తులసి దళాలను ఆమె సమర్పించింది.అన్నిసార్లూ ఆ దళాలు ఆ పాదాల మీదనే పడటం ఆమె చూచి ఇంక తట్టుకోలేని స్థితిలో ఆనందోద్రేకంతో స్పృహ తప్పి అక్కడే కూలిపోయింది.

అలా కొన్ని గంటలు గడచాయి. మామూలుగా పూజ ముగించుకుని ఆమె బయటకు వచ్చే సమయం దాటిపోవడంతో తలుపు కొద్దిగా తోసి లోనికి చూచిన స్త్రీలకు నేలమీద పడిపోయి ఉన్న మృడాని కనిపించింది.గాభరా పడిన వారు,లోనికి వచ్చి ఆమె పరిస్థితి చూచినా, ఆమెను తాకకుండా, వెంటనే బలరాం బోసును పిలిపించారు.

వెంటనే ఆయన వచ్చి మృడానిని చూచాడు.

ఆయన మహాభక్తుడూ ఎంతో ఉత్తముడూ గనుక, అది మూర్చతో స్పృహ కోల్పోయిన రోగపు పరిస్థితి కాదనీ, ఆనంద పారవశ్యంతో కూడిన సమాధిస్థితి అనీ ఆయనకు వెంటనే అర్ధమైంది. ఆమెను ఏమాత్రం కదిలించకుండా, ఒక విసనకర్రతో గాలి వీస్తూ ఉండమనీ భగవన్నామాన్ని సంకీర్తనం గావించమనీ ఆయన వారికి సూచించాడు.ఆ విధంగా కొన్ని గంటలు గడచేసరికి మృడాని మెల్లిగా కళ్ళు తెరచి లేచి కూచుంది.

కానీ ఆమె మామూలు మనిషిలా కనిపించడం లేదు.ఏదో దయ్యం పట్టిన మనిషిలా గోచరిస్తోంది.ఎవరు ఏమడిగినా ఆమె బదులు చెప్పడం లేదు.ఆమె కళ్ళు గాజుకళ్ళలా ఉన్నాయి. వాటిలో ఏ విధమైన స్పందనా లేదు.మాటమాటకీ ఆమె తన ఛాతీ వైపు చూచుకుంటూ ఉన్నది.అక్కడేదో తనను పట్టి గుంజుతున్నట్లు ఆమెకు అనిపించి ఆ కనిపించని దారాన్ని పట్టుకోవాలని చేతితో వెదుకుతున్నట్లుగా ప్రయత్నం చెయ్యసాగింది.కానీ తన హృదయాన్ని పట్టి లాగుతున్న ఆ దారం ఆమెకు చిక్కడం లేదు. ఎవరో తన హృదయాన్ని పట్టి బలంగా లాగుతున్నట్లుగా ఆమెకు అనిపించసాగింది. చెప్పలేని వేదన ఏదో ఆమెను మళ్ళీ ఆవహించింది. దానిని తట్టుకోలేక బిగ్గరగా గొంతెత్తి ఆమె ఏడవసాగింది.చూచేవారికి ఇదేమీ అర్ధం కావడం లేదు.

ఆ విధమైన వేదనలో ఆ పగలు గడిచి రాత్రి మొదలైంది.మొదటి జాము గడిచింది.రెండవ జాము గడిచింది.మూడవ జాము కూడా గడిచింది. తెల్లవారు ఝామున ఆమెకు ఒక స్వరం హటాత్తుగా వినవచ్చి ఆమె ఆత్మను కుదిపేసింది.

ఎంతో మనోహరమైన ఆ స్వరం కోపాన్ని నటిస్తూ ముద్దుగా ఆమెతో ఇలా అనడం ఆమె విన్నది.

'నిన్ను నా దగ్గరకు లాక్కుంటే తప్ప నీ అంతట నువ్వు రావా?'

ఆ స్వరం విని అదిరిపోయిన మృడాని ఇలా అరిచింది.

'ఎవరు నువ్వు? నీ స్వరం నాకు బాగా తెలిసిన స్వరమే. నువ్వెవరో చెప్పు.'

నవ్వుతున్న ఆ స్వరం ఇలా బదులిచ్చింది.

'అవును.నేను నీకు బాగా తెలుసు.కానీ నా దగ్గరకు వస్తేగాని నువ్వు నన్ను గుర్తించలేవు.త్వరగా రా.'

మొదట ఆ స్వరం తన ధ్యానంలో వినిపిస్తున్నదని ఆమె అనుకుంది.కానీ ఆ స్వరం జాగ్రదావస్థలోనే ఆమె చెవులకు వినిపించసాగింది.

'త్వరగా రా...త్వరగా రా....త్వరగా రా..' అనే మాటలు ఆమె చెవులలో గింగుర్లు తిరుగుతూ ప్రతిధ్వనించసాగాయి.

చివాలున లేచి నిలబడిన ఆమె ఆ స్వరం వినిపిస్తున్న దిక్కుగా నిద్రలో నడుస్తున్న దానిలా నడక సాగించింది.తలుపులు తెరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమె ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకుంది.రోజూ తెలతెలవారే సమయానికి గంగా స్నానానికి వెళ్ళడం ఆమె అలవాటు.కానీ ఆ రోజున ఇంకా చాలా ముందుగానే ఆమె వాకిట్లోకి రావడంతో కంగారు పడిన కాపలాదారు -'అమ్మా.ఇంత పొద్దున్నే ఈరోజు స్నానానికి వెళుతున్నారేమి?తలుపు తియ్యమంటారా?' అంటూ అడిగాడు.కానీ ఆమె ఆ మాటల్ని పట్టించుకోకుండా తలుపు వైపు శూన్యదృక్కులతో చూస్తూ నిలబడి పోయింది.

ఇంతలో ఈ కలకలం విని ఇంటిలో వారు అందరూ బయటకు వచ్చారు.బలరాం బోసు ముందుకు వచ్చి ఆమె పరిస్థితిని గమనించాడు.ఇది శ్రీరామకృష్ణుల లీల అని అతనికి అర్ధమైంది.

'ఏమ్మా.దక్షిణేశ్వరం పోదామా?' అని ఆమెను మృదువుగా అడిగాడు.

ఆమె ఆ మాటకు కూడా జవాబు ఇవ్వలేదు.అతని వైపు శూన్యంగా చూచింది.మళ్ళీ తలుపు వైపు చూచింది.ఒకసారి తన ఛాతీ వైపు చూచుకుంటుంది.అక్కడ తన గుండెను కట్టిన కనిపించని దారాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది.కానీ ఆ దారం ఆమెకు చిక్కదు.నిరాశతో మళ్ళీ తలుపు వైపు చూస్తుంది.ఇలా పిచ్చి చేష్టలు ఆమె చెయ్యసాగింది.

వెంటనే తమ గుర్రపు బగ్గీలను బయటకు తియ్యమని ఆజ్ఞాపించిన బలరాం వాటిలో తన కుటుంబంలోని మిగతా ఆడవారిని అందరినీ ఎక్కించి వారి మధ్యలో మృడానిని జాగ్రత్తగా కూర్చుండబెట్టి దక్షిణేశ్వరానికి పోనిమ్మని బండితోలేవానికి చెప్పాడు.

బండ్లు వేగంగా దక్షిణేశ్వరం వైపు సాగిపోయాయి.

వారు కాళికాలయానికి చేరేసరికి తెలతెలవారుతూ ఉన్నది.సూర్యుని బంగారు కిరణాలు గంగానది పైనా, కాళికామాత ఆలయ శిఖరాల పైనా ప్రసరిస్తూ మానవుల అజ్ఞానపు అంధకారాన్ని తొలగిస్తున్న బ్రహ్మతేజస్సులా వెలుగులను చిమ్ముతున్నాయి.

శ్రీరామకృష్ణుల గది తలుపులు తీసే ఉన్నాయి.

వణుకుతున్న కాళ్ళతో శ్రీరామకృష్ణుల గదిలోకి అడుగుపెట్టిన వారు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూచి ఆశ్చర్య పోయారు.

తన గదిలోని చిన్న చెక్కమంచం మీద కూర్చుని ఉన్న శ్రీ రామకృష్ణులు తన చేతిలోని దారపు ఉండ చుట్టూ దారాన్ని బిగిస్తున్నట్లుగా చుడుతూ తన మృదు మధురమైన స్వరంతో ఒక పాటను పాడుతూ నవ్వుతూ వీరికి దర్శన మిచ్చారు.

'అమ్మా! కాళీ! నువ్వు కృష్ణునిగా నీ లీలను ప్రదర్శించినప్పుడు ప్రేమమయిగా ఈ లోకంలో ఉన్నావు.అప్పుడు నీ భయానకమైన స్వరూపాన్ని ఎక్కడ దాచావమ్మా? చెప్పు.' - అంటూ ఆ పాట సాగుతుంది.

సరిగ్గా వీరు ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి ఆ దారపు ఉండ చుట్టూ దారాన్ని చుట్టటం అయిపోయింది.నవ్వుతూ ఆయన ఆ దారపు ఉండను పక్కన ఉంచారు. అదే క్షణంలో తన గుండెను పట్టి లాగుతున్న దారం మాయం అయినట్లుగా మృడానికి అనిపించి ఆమె తేలికగా శ్వాస పీల్చుకుని మామూలు లోకంలోకి వచ్చి చుట్టూ పరిశీలనగా చూడసాగింది.తాను శ్రీరామకృష్ణుల గదిలో ఉన్నట్లు ఆమెకు అర్ధమైంది.

బలరాం బోసు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా శ్రీ రామకృష్ణుల పాదాలకు తమ తమ తలలను తాకించి ప్రణామం గావించారు.తాను కూడా ప్రణామం చేద్దామని వంగిన మృడాని ఆ పాదాలను చూస్తూనే నిర్ఘాంతపోయి బిగుసుకుపోయిన స్థితిలో అలా ఉండిపోయింది.

అవే పాదాలు ! తన దామోదర సింహాసనం మీద తనకు దివ్యకాంతితో మెరుస్తూ కనిపించిన పాదాలు అవే ! వాటిని గుర్తుపట్టిన క్షణంలో ఆమె శరీరంలో నుంచి ఒక విద్యుద్ఘాతం మళ్ళీ ఝల్లుమంటూ పాకింది.

నిర్ఘాంతపోయిన ఆమె తలెత్తి శ్రీరామకృష్ణుల ముఖంలోకి చూచింది.ఆయన చెక్కు చెదరని అదే చిరునవ్వుతో ఆమెవైపు చూస్తూ ఉన్నారు.

ఆయననూ ఆయన చిరునవ్వునూ అంతకు ముందు ఎక్కడో చూచినట్లు మృడానికి తెలుస్తూ ఉన్నదిగాని అదెక్కడో గుర్తు రావడం లేదు.ఆయన తనకు బాగా తెలుసు.తనకు ఎంతో ఆత్మీయుడీయన.తన సర్వస్వం ఈయనే.కానీ తమ బంధం ఎప్పటిదో ఆమెకు గుర్తు రావడం లేదు.అంతా ఏదో అర్ధం అయ్యీ కానట్టి స్థితిలా ఉన్నది.ఏదో గుర్తొచ్చి గుర్తురాని స్థితిలా ఉన్నది.అలాంటి స్థితిలో అయోమయంలో పడిన మృడాని అలాగే ఆ పాదాలకు ప్రణామం ముగించి లేచి, అక్కడున్నవారిలో చివరి వరుసలోకి వెళ్లి కూచుండి పోయింది.

తీవ్రమైన ఆలోచనలో పడిన మృడాని అంతరిక నేత్రం క్షణంలో తెరుచుకుంది.ఈయనే తన గురువు.పదిహేనేళ్ళ క్రితం ఆడుకుంటున్న తనను ఆశీర్వదించిన దైవం ఈయనే.ఆ తర్వాత అరటితోటలో తనకు మంత్రోపదేశం చేసిన సద్గురువు ఈయనే.అంతేకాదు. ఈయన ఉత్త సద్గురువు మాత్రమే కాదు.దేహంతో ఈ భూమిమీద నడయాడుతున్న దైవం ఈయనే.దేశాలు పట్టుకుని దిక్కులేని దానిలా తిరుగుతున్నప్పుడు తనను అనుక్షణం వెంట ఉండి నీడలా రక్షించినది ఈయనే.హిమాలయాల చలిలో తిండీ నీరూ లేక పస్తులున్న రోజులలో తనను ఆదుకుని కాపాడింది ఈయనే.బృందావనంలో ప్రేమోన్మాదంలో మునిగి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినప్పుడు తనకు దర్శనమిచ్చిన తన కృష్ణుడు ఈయనే.ఈ పాదాలను తాను చాలా స్పష్టంగా చూచింది.కృష్ణపీఠం మీద తనకు సాక్షాత్కరించిన పాదాలు ఇవే.ఈ పాదాలు ఎక్కడున్నా తను గుర్తించగలదు.

మృడాని అంతరంగం విలవిలలాడిపోయింది.ఇది కలా? నిజమా? లేక తన భ్రమా? ఊహించలేని ఈ సంఘటనతో ఆమె శరీరం ఉద్వేగంతో వణికిపోతున్నది.

'ప్రభూ! దేవదేవా! కృష్ణా! ఇక్కడ దాక్కుని ఉన్నావా?ఈ భూమి మీదే శరీరధారివై ఒక సామాన్యుడిలా మారువేషంలో ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉండి, నన్ను ఇన్నేళ్ళూ పిచ్చిదానిలా ఇన్ని ఊర్లు తిప్పావా? ఎందుకిలా చేశావు? ఆ రోజునే నువ్వెవరో నాకు చెబితే సరిపోదా? నేను నమ్మనా? ఆ రోజునే నన్ను నీ దగ్గరకు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది? ఎందుకింత ఆలస్యం చేశావు?ఎందుకు నన్నింత క్షోభకు గురిచేశావు? నీ దర్శన భాగ్యాన్ని పొందే అర్హత నాకు ఇప్పటికి గాని రాలేదా? ఎంత పాపిష్టిదానిని నేను? ఇదే కలకత్తాలో నీవు దాక్కుని ఉంటే, నేను హిమాలయాలని, ఏవేవో క్షేత్రాలని పిచ్చిదానిలా ఎలా తిరగ గలిగాను? ఇంత అజ్ఞానంలో ఎలా ఉన్నాను నేను? ఎంతోమందితో నువ్వు రమ్మని కబురంపినా రాకుండా మూర్ఖురాలిలా ప్రవర్తించాను.నాకు ఎన్నెన్ని అవకాశాలిచ్చావు? ఎంతమందితో నాకు చెప్పించావు? అయినా నేను వినలేదు. నేనెంత మందబుద్ధిని? ఏమిటి నాకీ ఖర్మ? ఎందుకిలా జరిగింది? అయ్యో!ఎంత సమయం వృధాగా గడచి పోయింది?' - అంటూ ఆమె అంతరంగం ఆక్రోశిస్తోంది.మౌనంగా కూచుని ఆయన్నే చూస్తున్న ఆమె చెంపల మీద నుంచి కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి.ఈ బాధను తట్టుకోలేని ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది.

చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను వింతగా చూడసాగారు.

ఆమె వైపు అదే చెదరని చిరునవ్వుతో కాసేపు వీక్షించిన శ్రీ రామకృష్ణులు బలరాం వైపు దృష్టిని మరల్చి ఇలా అడిగారు.

'బలరాం.ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా కనిపిస్తున్నది?'

'ఈమె నా సోదరి' అని బలరాం చెప్పాడు.

'అంటే ఈమె నీ సొంత సోదరినా?' అంటూ మళ్ళీ ఆయన రెట్టించారు.

'అవును స్వామీ' అని బలరాం చెప్పాడు.

'అంటే, ఈమె కాయస్థ కులానికి చెందినదా? నిజంగానా?' అని మళ్ళీ శ్రీ రామకృష్ణులు నవ్వుతూ ప్రశ్నించారు.

అప్పుడు బలరాం నవ్వుతూ ఇలా బదులిచ్చాడు.

'మీరన్నది నిజమే స్వామీ.ఈమె ఒక బ్రాహ్మణ వనిత.వాళ్ళు మా కుటుంబానికి బాగా స్నేహితులు.మా నాన్నగారిని ఈమె తండ్రిలా భావిస్తుంది.నేను ఈమెను నా సొంత సోదరిగానే చూచుకుంటూ ఉన్నాను. అందుకే మీకు అలా చెప్పాను.'

'అదీ సంగతి.అలా చెప్పు.ఈమె ఇక్కడి అమ్మాయే.ఈమె నాకు చాలా కాలం నుంచీ తెలుసు.' అని శ్రీరామకృష్ణులు రహస్యమైన చిరునవ్వు నవ్వుతూ అన్నారు.

ఆశ్చర్యపోయిన బలరాం ఇదంతా చూస్తున్న తన కుటుంబ సభ్యులతో ఇలా అన్నాడు.

'చూచారా? మనమందరం కలసి ఇక్కడకు వచ్చాం.కానీ ఈ అమ్మాయి ఒక్కతే పరీక్ష పాసయింది.మనమందరం పరీక్ష తప్పాము.'

ఈ మాట విన్న అందరూ - శ్రీ రామకృష్ణులతో సహా - గొల్లున నవ్వారు.కానీ మృడాని మాత్రం నవ్వలేదు.ఆమె ధారాపాతంగా కన్నీరు కారుస్తూనే ఉంది.

కాసేపు కూచున్న అందరూ ఇక వెళదామని లేచారు.కానీ మృడానికి అక్కడనుంచి వెళ్లాలని లేదు.అక్కడే ఉండిపోవాలని ఆమె మనస్సు బలంగా చెబుతోంది.అక్కడే ఉండి, ఆయనతో తన మనస్సులోని సంఘర్షణ అంతా చెబుదామనీ, తన ఇన్నేళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలను ఆయన ముందు విప్పి చెప్పి,వాటిలోని నిజానిజాలనూ అంతరార్దాలనూ తెలుసుకుందామని, ఆయన పాదాలమీద పడి ఏడుద్దామనీ,తన బరువును దించుకుందామనీ ఆమె హృదయం ఆక్రోశిస్తోంది.

కానీ తానిక్కడ ఉండలేదు. ప్రస్తుతానికి వీరితో వెళ్ళక తప్పదు. తను ఇక్కడే ఉంటానంటే వీరంతా ఏమనుకుంటారో? అది సభ్యతగా ఉంటుందో ఉండదో? అన్న సంశయం ఆమెకు కలిగింది.ఏం చెయ్యాలో తెలియక ఆమె మనసు తీవ్రంగా ఊగిసలాడింది.

ఆమె సంశయం ఏమిటో సర్వజీవుల హృదయాంతర్వర్తి యైన శ్రీరామకృష్ణులకు చిటికెలో అర్ధమైంది. వారందరి మధ్యనా ఆమె తన హృదయాన్ని విప్పి చెప్పలేకున్నదని ఆయన గ్రహించారు.

సెలవు తీసుకుంటున్న మృడానితో శ్రీరామకృష్ణులు ఒకే ఒక్క మాటను అన్నారు.

'మళ్ళీ ఒకసారి రామ్మా'

అప్పటికి మృడానికి సరిగ్గా 25 ఏళ్ళు మాత్రమే. పదిహేనేళ్ళ క్రితం, పదేళ్ళ చిన్నపిల్ల అయిన మృడానితో, దీక్షా సమయంలో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు.

' పదిహేనేళ్ళ తర్వాత గంగాతీరంలో నువ్వు మళ్ళీ నన్ను చూస్తావు.'

సరిగ్గా పదిహేనేళ్ళ తర్వాత ఆ మాట ఆ విధంగా అక్షరాలా నిజమైంది.

సత్యస్వరూపుడైన శ్రీ రామకృష్ణుల మాట తప్పిపోవడం ఎప్పుడైనా జరుగుతుందా?

(ఇంకా ఉంది)