“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, మే 2016, సోమవారం

మా అమెరికా యాత్ర - 7 (ఎగ్గోపాఖ్యానం)

చాలామంది వేదాంతులు - 'శరీరం మాయ' - అంటూ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు.కానీ తాంత్రికుల విధానం అది కాదు.వారికి శరీరం కూడా సత్యమే. నేను బయటకు వేదాంతినే అయినప్పటికీ లోలోపల ఒక తాంత్రికుడిని.'దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవి స్సదాశివ:' - శరీరమే ఒక దేవాలయం అని తంత్రం చెబుతుంది.కనుక దేవాలయాన్ని ఫిట్ కండిషన్ లో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.అందుకే దైనందిన జీవితంలో నేను శరీర వ్యాయామానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాను.అదే అలవాటు మా అబ్బాయికి కూడా వచ్చింది.

తను ఒకటి రెండేళ్ళ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను యోగా చేస్తుంటే చూస్తూ ఉండేవాడు.నేను చక్రాసనం వేస్తే క్రిందనుంచి పాక్కుంటూ ఈ పక్కనుంచి ఆ పక్కకు వచ్చేవాడు.నేను శీర్షాసనంలో ఉంటే తనుకూడా తల క్రిందకు పెట్టి నా ముఖంలోకి చూస్తూ 'ఈ..' అంటూ నవ్వేవాడు.

తను పెరుగుతూ వస్తున్న కొద్దీ నా దగ్గర యోగా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వచ్చాడు.ప్రస్తుతం అమెరికాలో ఉన్నా వ్యాయామం మానుకోలేదు.జిమ్ కు వెళుతూ ఉంటాడు.Oakland University Cricket Team కు కెప్టెన్ గా ఉన్నాడు.ఇక్కడ తెలుగు వారందరినీ కూడగట్టి క్రికెట్ ఆడుతూ ఉంటాడు.

మరి ఈ వ్యాయామాలూ అవీ చేస్తే, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి కదా.తనకేమో మీట్ అలవాటు లేదు.అందుకని ఎగ్ లో పీనట్ బటర్,స్పినాచ్,ఆల్మండ్ మిల్క్,ఇంకా ఏవేవో కలిపి ప్రోటీన్ షేక్ తయారుచేసి తీసుకుంటూ ఉంటాడు.

మొన్నొక రోజున తనకోసం అది తయారు చేసుకుంటూ - 'నాన్నా నీకు కూడా తయారు చెయ్యనా?' అని అడిగాడు.నేను కాలేజి రోజుల్లో ఒక పదిసార్లో ఏమో ఆమ్లెట్ తిన్నాను.ఆ తర్వాత ఇప్పటివరకూ ఎగ్ జోలికి పోలేదు.సరే చూద్దాం అని, 'ఓకె చెయ్యి'. అన్నాను.

'ఎల్లో కలపనా? తీసెయ్యనా?' అడిగాడు.

కొంత వయసు వచ్చాక ఫ్యాట్ పెరుగుతుందని ఎల్లో చాలామంది తినరు. అందుకని తను అలా అడిగాడు.

'మనకా ఇబ్బంది ఏమీ లేదు నాయనా! అన్నీ ఉంచు.' అంటూ ఎగ్గోపాఖ్యానం ఇలా బోధించాను.

'చూడండి శిష్యులారా ! జాగ్రత్తగా వినండి.మీకు ఈరోజు ఒక పరమ రహస్యాన్ని బోధిస్తున్నాను.ఈ రహస్యం ఇంతవరకూ ఎవరికీ తెలియదు. మొదటిసారిగా నేనే ప్రపంచానికి దీనిని వెల్లడి గావిస్తున్నాను.ఇది పుస్తకాలలో ఎక్కడా దొరకదు.గురుశిష్య పరంపరగా మాత్రమే వస్తూ ఉంటుంది.అందుకని జాగ్రత్తగా వినండి.

ఎగ్ లో ఉన్న ఎల్లో అనేది గురువు.వైట్ అనేది చంద్రుడు.గురుచంద్రుల కలయిక గజకేసరి యోగం అనబడుతుంది.గజకేసరీ యోగం అంటే ఎగ్గే. కనుక ఆ రెంటినీ ఎప్పటికీ వేరు చెయ్యకూడదు.అలా చేసినవారు,గజకేసరీ యోగాన్ని భ్రష్టు పట్టించిన వారౌతారు.కలసి ఉన్న గురువునూ చంద్రుడినీ విడదీసిన వారౌతారు.వారిని గురువు చంద్రుడూ ఇద్దరూ శపిస్తారు.కనుక ఎగ్ ను మొత్తం స్వీకరించండి.విడదియ్యకండి.

ఇందులో ఇంకొక రహస్యం వినండి. మ్రింగడం అనేది రాహువు యొక్క చర్య.కనుక ఎగ్ ను త్రాగేవారు దేనిని సూచిస్తారంటే - గురుచంద్రులు రాహువు చేత మ్రింగబడడాన్ని సూచిస్తారు.అందుకే అలాంటివారి జీవితాలలో రాహువు ప్రధానపాత్ర వహిస్తూ ఉంటాడు.గురువునూ చంద్రుడినీ మ్రింగేస్తూ ఉంటాడు.సూక్ష్మంగా గమనిస్తే నేను చెబుతున్నదానిలో నిజం మీకు అర్ధమౌతుంది.

ఈ రహస్యబోధను ఎవరికిబడితే వారికి చెప్పకండి.అర్హత ఉన్నవారికి మాత్రమే దీనిని బోధించాలి.గుర్తుంచుకోండి.' అంటూ ముగించాను.

ఇదంతా అప్పటిదాకా సైలెంట్ గా వింటున్న రాజు - 'ఆహా! అండంలో బ్రహ్మాండం' అంటూ చమత్కరించాడు.

అందరం గొల్లున నవ్వుకున్నాం.

హాస్యాన్ని కాసేపు పక్కన ఉంచితే - సంతాన దోషాలు రావడానికి గల కారణాలలో ఒకటి - పాము గుడ్లను ధ్వంసం చెయ్యడం - అని ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలు చెబుతున్నాయి.సాధారణంగా రైతు కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంటుంది.పొలాలలో ఉన్న పుట్టలను వాళ్ళు తవ్వేస్తూ ఉంటారు.ఆ క్రమంలో ఆ పుట్టలలో ఉన్న పాము గుడ్లను వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటారు.ఆ పాపమే వాళ్లకు సంతాన దోషంగా సంక్రమించి తరతరాలు వెంటాడి వేధిస్తూ ఉంటుంది.

సంతాన దోషాలున్నవారు ఎగ్స్ తింటూ ఉన్నంతకాలం వాళ్ళు చేసే రెమేడీలు ఏవీ పనిచెయ్యవు.దానివెనుక ఉన్న లాజిక్ ఏమంటే - ఇప్పటికే ఉన్న పాపఖర్మను ఈ పనిద్వారా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉండటమే.ఎగ్ ఈటింగ్ మానుకోకపోతే సంతాన దోషాలు పోవు.సంతాన దోషాలు అంటే - పిల్లలు పుట్టకపోవడం మాత్రమే కాదు, పిల్లలు రోగాలతో బాధపడటం, బలహీనంగా ఉండటం, చెప్పిన మాట వినకుండా మొండిగా తయారు కావడం,అప్రయోజకులుగా మిగిలిపోవడం,లేదా పెద్దవయసులో తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండటం, ఇంకా ఇలాంటివి ఎన్నో - ఇవన్నీ 'సంతాన దోషం' అనే పదానికి రకరకాల షేడ్స్ గా ఉంటాయి. వీటికి గల ఏకైక కారణం - ఎగ్ ఈటింగ్ కాకపోయినా - ఇప్పటికే ఉన్న ఆ దోషాన్ని ఇది ఎక్కువ చేస్తుంది.కనుక జాతకపరమైన రెమేడీలు చేసేవారు ఎగ్ జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది.

జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహం అనేది సంతాన కారకుడని మనకు తెలిసినదే.గురుకృప లేకుంటే మంచి సంతానం కలగదు.గురువుగారి రంగు పసుపు.కనుక ఎగ్ లోని గజకేసరీ యోగాన్ని విడదీస్తుంటే, గురుశాపాన్ని ఎన్నటికీ పోగొట్టుకోలేరు.చాలాసార్లు సంతాన దోషానికి గురుశాపమే కారణం అవుతూ ఉంటుంది.

ఎగ్ అనేది రాహువు.అందులోని ఎల్లో గురువు.వైట్ చంద్రుడు.సంతాన దోషం అనేది సర్ప(రాహు)శాపం వల్లా,గురుదోషం వల్లా, చంద్రదోషం వల్లా వస్తుంటుంది.ఇది పరమరహస్యం.రాహు దోషం ఉన్నవారికి వీర్యకణాలు తగినన్ని ఉండవు,లేదా వాటిలో (శక్తి) మొబిలిటీ తక్కువగా ఉంటుంది.గురుదోషం ఉన్నవారిలో అయితే - కన్సెప్షన్ లో ఆటంకాలు ఏర్పడతాయి. చంద్రదోషం ఉన్నవారికి ప్రసవంలో ఆటంకాలు కష్టాలు ఏర్పడతాయి. ఈ ముగ్గురి పరస్పర యోగాల (permutations and combinations) వల్ల - జనెటిక్ డిజార్డర్స్,అబార్షన్స్,శిశువు సరిగ్గా పెరగకపోవడం (malformation of fetus),లేదా గర్భంలో ఉన్న శిశువుకు హార్ట్ బీట్ లేకపోవడం,లేదా శీఘ్రప్రసూతి (premature delivery), పుట్టినప్పుడే హార్ట్ లో హోల్ ఉండటం,లేదా లివర్ దెబ్బదిని ఉండటం,లేదా శిశువుకు చర్మరోగాలు రావడం - మొదలైన రకరకాల సమస్యలు ఎదురౌతాయి.ఆయా గ్రహయోగాలను జాగ్రత్తగా గమనించి, వాటికి తగిన రెమెడీలను పాటిస్తే ఆయా దోషాలు పోతాయి. 

ఈ బోధ 'ఎగ్గోపాఖ్యానం' అనే పేరుతో సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుందని వేరే చెప్పాల్సిన పని లేదుగా?