“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, మే 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 14 (అమెరికాలో ఏమేం చూచారు?)

అమ్మయ్య !

ఇండియాకు తిరిగి వచ్చేశాము.

ఇక తీరికగా అమెరికా అనుభవాలను నెమరు వేసుకోవచ్చు. వ్రాసుకోవచ్చు.

నేను అమెరికాలో ఉన్నప్పుడు మాటల సందర్భంలో చాలామంది నన్ను ఇలా అడిగారు.

'ఇక్కడ ఏమేం చూచారు? ఎక్కడెక్కడ తిరిగారు?ఇంతదూరం వచ్చారు కదా అమెరికాలో ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్స్ కొన్నైనా చూచారా?'

వారందరికీ దాదాపుగా ఇదే సమాధానం చెప్పాను.

'ఈ ట్రిప్ లో మూడే ముఖ్యమైన ప్రదేశాలు చూచాను.ఒకటి - పాంటియాక్ పరాశక్తి టెంపుల్. అక్కడ అమ్మను చూచాను. రెండు - డెట్రాయిట్ డౌన్ టౌన్ లో ఉన్న ఫ్రీర్ హౌస్. ఈ ఇంటికి వివేకానందస్వామి వచ్చి అతిధిగా ఉన్నారు.అక్కడ స్వామి కూర్చున్న డైనింగ్ టేబుల్ చూచాను.మూడు - గాంగెస్ మిషిగన్ లో మదర్స్ ట్రస్ట్ ఆశ్రమం చూచాను.అక్కడ శ్రీరామకృష్ణ శారదామాతల చితాభస్మాలు ఉన్నాయి.ఈ మూడింటి కంటే అమెరికాలో ప్రస్తుతానికి చూడవలసినవి నాకు ఇంకేమీ కనిపించలేదు.'

'అదేంటి? ఇక్కడ దాకా వచ్చి ఇవా మీరు చూచింది?' అన్నట్లుగా కొందరు చూపుల ద్వారా అడిగారు.

'ఎక్కడ చూచినా ఏముంది? అవే పంచభూతాలు..అదే మనుషులు.అదే ఈషణాత్రయం.ఇంకేంటి చూచేది?' - అంటూ "శ్రీవిద్యా రహస్యం" నుంచి ఈ పద్యాన్ని కొందరికి కోట్ చేశాను.

కం||అవియే పర్వత సీమలు
అవియే నదులును తరువులు నవియే పధముల్
భువినెంత దిరిగి జూచిన
చవి బుట్టదు లోకమెల్ల సమమే యగుచున్

ఎక్కడ చూచినా అవే కొండలు.అవే నదులు.అవే చెట్లు.అవే దారులు.భూమిమీద ఎంత చూచినా వింత అనేది ఏముంది? ఏమీ లేదు.కనుక లోకమంతా పంచభూతాత్మకంగా సమంగానే ఉంటుంది.కనుక ప్రత్యేకంగా దేన్నో చూద్దామన్న దాహం ఏమీ ఉండదు.దాహం లేనప్పుడు అటూ ఇటూ తిరగడం ఏముంటుంది?

ప్రదేశాలలో ఏమీ లేదు.ఉన్నదంతా మనుషులలోనూ వారి మనస్తత్వాలలోనూ ఉన్నది.నాకు మనుషులతోనూ వారి మనసులతోనూ ఆడుకోవడం సరదాగా ఉంటుంది.ప్రదేశాలు తిరగడం నాకు నచ్చదు.మనసులతో గారడీ చెయ్యడం నాకిష్టం.దాని ద్వారానే వారిని దైవమార్గంలోకి మళ్ళించగలం. వారికి సరియైన దారి చూపించగలం.దానిలో నడిపించగలం.ఈ లోకంలో మనం చెయ్యగలిగిన అతి ముఖ్యమైన పని ఇదే అని నా నమ్మకం.ఇది ఉత్త నమ్మకం మాత్రమే కాదు.నా జీవితానుభవాలు కూడా దీనినే చెబుతున్నాయి.వాటి ప్రకారమే నేను వెళతాను.ఎవరైనా ఇంతే కదా.వారివారి జీవితానుభవాల ద్వారానే వాళ్ళు వెళతారు.అలాగే వెళ్ళాలి కూడా.'

ఈ జవాబును విన్న కొందరు నన్నొక పిచ్చివాణ్ని చూచినట్లు చూచారు.చూస్తే చూడనీ.అది వాళ్ళ ఖర్మ. నా దృష్టిలో వాళ్ళూ పిచ్చివాళ్ళే.నిజానికి నాకంటే వాళ్ళే అసలైన పిచ్చోళ్ళు.

లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పిచ్చి.

శ్రీ రామకృష్ణులను కూడా అందరూ పిచ్చివాడని గేలి చేశారు.ఇదే విషయాన్ని ఆయన భైరవీ బ్రాహ్మణితో ఇలా చెప్పారు.

'చూడమ్మా.అందరూనన్ను పిచ్చివాడినని అంటున్నారు.నేను నిజంగా పిచ్చివాడినా? నాకు పిచ్చి ఉందా?'

భైరవిమాత ఇలా జవాబిచ్చింది.

'అవును నాయనా.ఈ లోకంలో అందరూ పిచ్చివాళ్ళే.ఇక్కడ కొందరికి డబ్బు పిచ్చి.కొందరికి అధికారపు పిచ్చి.ఇంకొందరికి విలాసాల పిచ్చి.మరికొందరికి ఇంకొక పిచ్చి.నీకేమో భగవంతుడి పిచ్చి.వాళ్ళ పిచ్చి కంటే నీ పిచ్చి చాలా ఉన్నతమైనది.వాళ్ళ మాటలకు నీవేం బాధపడకు. పిచ్చివాళ్ళ వాగుడును నువ్వు లెక్క చెయ్యవలసిన పని ఏమాత్రం లేదు.'

నయాగరా జలపాతం, గ్రాండ్ కాన్యన్,స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, మొదలైన ప్రదేశాలే అమెరికాలో చూడదగినవని కొందరి భావన.మరి కొందరేమో లాస్ వెగాస్ లాంటి చోట్లు చూడాలని కోరుకుంటారు. వీటిల్లో దేనిలోనూ ఏమీ లేదని నేను భావిస్తాను. నేను చూచిన ఈ మూడే, డెట్రాయిట్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలని నేను భావించాను.అవే చూచాను.

వీటన్నిటినీ మించి - నన్ను ప్రాణంగా ప్రేమించే మనుషులను కలుసుకోగలిగాను.వాళ్ళతో అనుబంధాలు పెంచుకోగలిగాను. వారికి వెలుగు బాటను చూపగలిగాను.వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురాగలిగాను.

సొంత డబ్బాలాగా అనిపించినా సరే, నేను తరచుగా ఒకమాట అంటూ ఉంటాను.

'నాతో ఒక్కసారి పరిచయం అయితే ఇక మీ జీవితాలు మునుపటిలా ఉండవు.ఒకవేళ ఉంటేమాత్రం - మీ పంచేంద్రియాలు సరిగ్గా పనిచెయ్యడం లేదని అర్ధం.'

ఈ విషయం నా ఇండియా శిష్యులకు బాగా తెలుసు.ఇప్పుడు అమెరికా శిష్యులకు కూడా ఈ విషయం సరిగ్గా అర్ధం అయిందని భావిస్తున్నాను.

అందరూ గొప్పగా భావించే ప్రదేశాలు ఏమీ చూడకపోయినా, గొప్ప ఆత్మ సంతృప్తితో నేను ఇండియాకు తిరిగి వచ్చాను.

నన్ను నన్నుగా ప్రేమించి,నాకోసం,దైవానుభూతి కోసం, జీవితంలో ఒక అర్ధం కోసం, కలవరించే కొన్ని ఆత్మలను నేను ఈ ట్రిప్ లో కలుసుకోగలిగాను.నాతోబాటు వెలుగుదారిలో వారిని నాలుగడుగులు వేయించగలిగాను.

ఇంతకంటే ఇంకేం కావాలి?

(ఇంకా ఉంది)