“The gates of the winehouse are wide open. Come ye all who want to enjoy a good drink”

3, ఏప్రిల్ 2016, ఆదివారం

FACEBOOK అంటే శనీశ్వరుడే

మనుషుల మీద గ్రహప్రభావం రకరకాలుగా ఉంటుంది.

వారి వారి కర్మానుసారం గ్రహాలు మనుషుల్ని అనేక రకాలుగా పట్టుకుని పీడిస్తూ ఉంటాయి.మామీద ఏ గ్రహ ప్రభావమూ లేదు అనుకునేవారు కూడా చక్కగా గ్రహాల ప్రభావంలోనే ఉంటారు.అయితే వారికా సంగతి ఏమాత్రమూ తెలియదు.మనం చెప్పినా వారు నమ్మరు.పైగా మనల్నే ఎగతాళి చేస్తారు. గ్రహప్రభావం అంటే ఇలాగే ఉంటుంది.

వీరిలో ముఖ్యంగా శనీశ్వరుని ప్రభావం మనుషుల మీద మహా ఘోరంగా ఉంటుంది.మనల్ని పీడించడానికి ఈయనకు అనేక ఆయుధాలు ఉంటాయి. వీటిల్లో లేటెస్ట్ ఆయుధమే FACEBOOK.

ఈ పదంలో ఎనిమిది అక్షరాలున్నాయి.ఎనిమిది అనేది శనికి సూచిక.8 అనే అంకెలోనే ఒక లూప్ ఉంటుంది.ఆ వలయంలో పడినవాళ్ళు బయటకు రాలేరు.అలా గుండ్రంగా ఆ వలయంలో పడి తిరుగుతూనే ఉంటారు. ఆ లూప్ అనేది ఎన్నటికీ అంతం కాదు.శనీశ్వరుని చుట్టూ కూడా అనేక రింగ్స్ లేదా వలయాలు ఉండటం మనకు తెలుసు.ఆ వలయాలలో గనుక ఒక మనిషి చిక్కుకుంటే ఇక బయటకు రావడం చాలా కష్టం.

శనీశ్వరుడు ఒక మనిషిని పీడించాలంటే ముందు అతనికి తన లక్షణాలైన బద్ధకం,సోమరితనం,జాగు,ఏ పనీ చెయ్యకుండా ఒకచోట కూచుని కాలక్షేపం చెయ్యడం,మాటలేగాని చేతలు లేకపోవడం,గుడ్లప్పగించి చూస్తూ ఉండటం మొదలైన అవలక్షణాలను ఆ మనిషికి ప్రదానం గావిస్తాడు.ఆ లక్షణాలే అతన్ని క్రమేణా నాశనం చేస్తాయి.

INTERNET అనేది కూడా ఎనిమిది అక్షరాల పదమే.ఇది కూడా శనీశ్వరుని ఆయుధమే.కాకపోతే దీనిమీద రాహువు ప్రభావం ముఖ్యంగా ఉంటుంది.వీరిద్దరూ చాలావరకూ ఒకేరకంగా పనిచేస్తారు."శనివత్ రాహు" అనే సూత్రం ప్రసిద్ధమైనదే కదా.

FACEBOOK అనేదానిని గానీ INTERNET అనేదానిని గానీ మంచికీ వాడుకోవచ్చు.చెడుకూ వాడుకోవచ్చు.ఏ నూతన ఆవిష్కరణ అయినా ఈ సూత్రానికి లోబడే ఉంటుంది కదా.కాకపోతే ప్రస్తుతం సమాజంలో మంచికంటే ఎక్కువగా చెడుకే ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి.

FACEBOOK బాధితులను గనుక మనం గమనిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

ఎంతసేపూ కంప్యూటర్ కు లేదా మొబైల్ కు అతుక్కుని ఉండటం, అనవసరమైన చెత్త సంభాషణలలో ఎప్పుడూ కాలం గడుపుతూ ఉండటం, కుటుంబ సభ్యులకంటే ఫేస్ బుక్ ఫ్రెండ్సే ఎక్కువ అనుకోవడం, వాస్తవ ప్రపంచాన్ని ఒదిలేసి ఊహాలోకాలలో విహరిస్తూ ఉండటం, ముక్కూ మొహం తెలియని వాళ్ళతో స్నేహంలోనూ,వీలైతే ప్రేమలోనూ పడటం,ఆ తర్వాత మోసపోయి ఏడవడం,డిప్రెషన్ కు గురికావడం,కొండొకచో ఆత్మహత్యలకు పాల్పడటం,లేదా కేసులు పెట్టుకుని పోలీసు స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం,ప్రతిదాన్నీ ఫోటోలలో బంధించాలని చూడటం,వాస్తవ పరిస్థితులకు వాస్తవంగా స్పందించలేక పోవడం - ఇలాంటి వాటిని మనం ఎన్నైనా గమనించవచ్చు.

ఇవి చాలనట్టు - నిరంతర చాటింగ్ వల్ల కళ్ళు పోవడం,సైటు రావడం, కళ్ళజోడు ప్రత్యక్షం కావడం - ఇలాంటి అవకరాలు కూడా తయారౌతాయి.

ఖచ్చితంగా ఇవన్నీ శని రాహువుల శాపాలే.

మొన్నా మధ్యన - సాక్షాత్తూ  భార్యాభర్తలే దొంగ పేర్లతో ఫేస్ బుక్ ఫ్రెండ్స్ గా చాటింగులు చేసుకుని,ప్రేమలో పడి,రెస్టారెంట్లో కలుద్దామని అనుకుని,తీరా కలిశాక బిత్తరపోయి విడాకుల వరకూ వెళ్ళారని విన్నాం.

వీటన్నిటికీ కారణం శని రాహువుల ప్రభావమే.శని రాహువుల ప్రభావం శపితయోగం అవుతుందని నేను గతంలో ఎన్నోసార్లు వ్రాశాను.ఇంటర్నెట్టూ ఫేస్ బుక్కుల దుష్ప్రభావాలు అసలైన శపితయోగం గానే పనిచేస్తాయి. శాపాలంటే ఇవి కాకపోతే మరేమిటి?

వీటి చెడుప్రభావం కొన్నిసార్లు వెంటనే కన్పించినా చాలాసార్లు మాత్రం నిదానం మీద మాత్రమే కనిపిస్తుంది.శనిప్రభావం చాలా నిదానంగానే ఉంటుందనేది మనకు బాగా తెలిసిన విషయమే కదా.

పాతకాలంలో కనుక శని రెమేడీలు కావాలంటే ఏ శని సింగణాపూరులో అభిషేకం చెయ్యమనో లేదా నువ్వులు దానం చెయ్యమనో చెప్పేవారు.ఈ కాలాన్ని బట్టి ముందుగా - FACEBOOK AND INTERNET ల మితిమీరిన వినియోగం మానుకోండి.ఈ రెంటితో మీరు అతుక్కుని ఉన్నంత వరకూ మీరు శనిరాహువుల ప్రభావం నుంచి తప్పుకోలేరు. ముందుగా వాటితో కాలక్షేపం చెయ్యడం బాగా తగ్గించండి.ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని వాడండి.అదే శనిభగవానునికి అసలైన రెమెడీ అని చెప్పాల్సి వస్తుందేమో?