“Self service is the best service”

25, మార్చి 2016, శుక్రవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 10 (జీవిత గమనం - దశాప్రకరణం)

తొమ్మిదో భాగంతో ఆపిన ఈ సీరీస్ ను మళ్ళీ ఇప్పుడు కొనసాగిద్దాం.

1922-23 లో జరిగిన శని-కేతు దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

'మంజిలే మీమ్' ను రద్దు చేసిన తర్వాత బాబా ఒక నెలపాటు కదలకుండా ఉన్నాడు.ఆ తర్వాత అరంగావ్ అనే ఒక కుగ్రామం దగ్గరలో ఉన్న ఒక ఇంటికి తన మకాం మార్చాడు.ఆ ఇల్లుని మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మిలటరీ క్యాంప్ గా ప్రభుత్వం వాడుకుంది.ఇప్పుడా ఇల్లు పాడుబడి ఉన్నది.బాబాతో బాటు అలాంటి సాధనాజీవితానికి సిద్ధంగా ఉన్న 13 మంది సన్నిహిత శిష్యులు ఆ ఇంటిని బాగుచేసుకుని అందులో నివసించడం మొదలు పెట్టారు.అదే తర్వాత తర్వాత మెహెరాబాద్ ఆశ్రమంగా మారింది.

ఈ ఆశ్రమజీవితం 'మంజిలే మీం' జీవితం కంటే ఇంకా కఠినమైన నియమాలతో కూడి ఉండేది.శిష్యులంతా బాబా మాటకు ఎదురు చెప్పడానికి వీల్లేదు.ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చినా,అది తనకు నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకుని పాటించాల్సిందే.బాబా శిక్షణ ఆ విధంగా ఉండేది.దానికి సిద్ధమైన వాళ్ళే ఆయనతో ఉండేవారు.

అంతరిక పరివర్తన అలా కాకపోతే ఇంకెలా వస్తుంది? ఇంట్లో కూచుని పుస్తకాలు చదువుకుంటూ టీవీలు చూసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే వస్తుందా?అహం నాశనం కావాలంటే సద్గురు సమక్షంలో అలాంటి శిక్షణకు సిద్ధపడాల్సిందే.వేరే దారి లేనే లేదు.

1923లో వీరంతా కలసి ఆగ్రా,కరాచీ,క్వెట్టా,బలూచిస్తాన్ లలో పర్యటించారు. ఆ సమయంలో బాబా అయిదు నెలలు ఉపవాసం ఉన్నాడు.ఆ సమయంలో ద్రవ పదార్దాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు.అదికూడా 30 లేదా 40 గంటల కొకసారి మాత్రమే పల్చని టీనో మజ్జిగో త్రాగేవాడు.

అలా కొంతకాలం బాంబేలో ఉన్న తర్వాత తన ముఖ్య శిష్యులతో కలసి 160 మైళ్ళు నడచి సాకోరీ చేరి ఉపాసనీ మహారాజ్ దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఉపాసనీ మహారాజ్ వెదురు కర్రలతో ఒక బోను తయారుచేసుకుని అందులో కూచుని ఉండేవాడు.అంతదూరం నుంచి తన కోసం నడిచి వచ్చిన వారికోసం ఆయన కనీసం బయటకు రాకపోగా, ఆ బోనులోనుంచే వారిని నానా తిట్లూ తిట్టి కసురుకుంటూ వారిని అక్కడనుంచి వెంటనే వెళ్లిపొమ్మని విసుక్కున్నాడు.ఆయన విధానాలు అలా ఉండేవి. ఏం చేస్తాం? మహనీయులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పిచ్చి ఉంటుంది.

1923-1926 శని - శుక్ర దశ

ఈ దశ మొదలు కావడం తోనే బాబా మళ్ళీ తన ఘోరమైన ఉపవాసాలు మొదలుపెట్టాడు.ఈసారి కొంతమంది ముఖ్యమైన శిష్యులను తీసుకుని పర్షియాకు బయలుదేరాడు.కానీ మార్గమధ్యంలో కొందరు శిష్యులు తీవ్రంగా జబ్బు బారిన పడటంతో ఆ ప్రయాణం మానుకుని వెనక్కు వచ్చేశాడు.

1924 లో తన ముఖ్య శిష్యులతో కలసి ఆయన మెహరాబాద్ లో స్థిరంగా ఉండటం ప్రారంభం చేశాడు.ఆయన శిష్యులలో చాలామంది మంచి సంపన్న కుటుంబాల నుంచీ విలాస జీవితాలనుంచీ వచ్చినవారు.అలాంటి వారిచేత రాళ్ళు మోయించడం,ఎండలో పని చేయించడం,గోడలు కట్టించడం, బావిలో నీళ్ళు తోడించడం.వంట చేయించడం,పాకీదొడ్లు శుభ్రం చేయించడం వంటి కూలిపనులు చేయించేవాడు బాబా.ఆ శిష్యులు ఆ పనులని ఆనందంగా చేసినా,తమ వారిచేత అలాంటి చాకిరీ చేయిస్తున్నాడని,వారి బంధువులకు మాత్రం బాబామీద మహాకోపంగా ఉండేది.వారిలో చాలామంది బంధువులకు వీరంతా బాబాతో నివసించడం సుతరామూ ఇష్టం ఉండేది కాదు.దానికి తోడు ఇలాంటి కూలిపనులను తమవారి చేత బాబా చేయిస్తుంటే వాళ్ళు చాలా బాధపడి కోపం తెచ్చుకునేవారు.

బాబాతో ఆ కాలంలో నివసించినవారిలో దౌలత్ మాయి, ఆమె కుమార్తె అయిన మెహెరా ఇరానీ ఉన్నారు. వీరిలో మెహెరా ఇరానీ తర్వాత కాలంలో బాబాకు చాలా ప్రియమైన శిష్యురాలుగా మారింది.'ఆమె నా రాధ' అని బాబా తరచూ అనేవాడు.'ప్రపంచం మొత్తం లోకీ ఆమె అతి పవిత్రమైన వనిత' అని కూడా అనేవాడు.

దౌలత్ మాయి సోదరుని పేరు కల్నల్ మేర్వాన్ సొహ్రాబ్ ఇరానీ. ఆయన మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో అత్యంత ఉన్నతమైన హోదాలో ఉండేవాడు.తన సోదరి, మేనకోడలు బాబా చేతిలో నానా కష్టాలూ పడుతూ ఉండటం ఆయనకు నచ్చేది కాదు.మంచి సౌకర్యాలున్న జీవితం ఒదిలేసి, ఒక పాడుబడిన ఇంట్లో ఉంటూ,రోజువారీ సౌకర్యాలు ఏవీ లేకుండా నానా కష్టాలూ పడుతూ అలాంటి బ్రతుకు బ్రతకడం ఎందుకని ఆయన ప్రశ్నించేవాడు.వెనక్కు వచ్చెయ్యమని వారిని పోరు పెడుతూ ఉండేవాడు. కానీ దౌలత్ మాయీ, మెహెరా ఆమాటలు వినేవారు కారు.బాబాను వదిలేవారు కారు.ఇది కల్నల్ కు నచ్చేది కాదు.వీరికి బాబా ఏదో మందు పెట్టాడనీ లేదా వారిమీద ఏదో వశీకరణ ప్రయోగం చేశాడనీ ఆయన అనుకునేవాడు.అలాంటి అనుమానంతో ఆయన బాబామీద లేనిపోని నానా పుకార్లూ ప్రచారం చేసేవాడు.కానీ వాటిని బాబా పట్టించుకునేవాడు కాదు.ఆ స్త్రీలూ పట్టించుకునేవారు కారు.బాబాను వదిలేవారు కారు.

తాము వెదుకుతున్న దివ్యత్వం ఒక మనిషిలో కనిపించినప్పుడు నిజమైన దైవప్రేమికులు అతనిని వదలి పోలేరు.వారి జీవితంలో ఇంక దేనినైనా వదులుకోడానికి వారు సిద్ధమౌతారు గాని అతనిని మాత్రం వారు ఎన్నటికీ వదలరు. అదే నిజమైన దైవప్రేమకు చిహ్నం.అలాంటి పరిశుద్ధ మనస్కుల మీదే దైవానుగ్రహం వర్షిస్తుంది.ప్రతిదానికీ ముందూ వెనుకా మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసే ఇతరులకు అది దక్కదు.అయితే అల్పులైన లోకులకు ఈ విషయాలు అర్ధం కాక వారికి అలవాటైన చౌకబారు ధోరణిలోనే దీనిని చూస్తారు.అక్రమ సంబంధాలు అంటగట్టాలని చూస్తారు.ఇది లోక సహజమే.

నరేంద్రాది యువకభక్తులు శ్రీ రామకృష్ణుల చుట్టూ చేరినప్పుడు కూడా లోకులు ఇలాగే ఆయన్ను నిందించారు.ఆయనేదో వీరి మీద మత్తుమందు చల్లాడనీ,అభం శుభం ఎరుగని పిల్లలను వశం చేసుకుని,వారికి వైరాగ్యం నూరిపోసి వారి జీవితాలను పాడుచేస్తున్నాడనీ అందరూ ఆడి పోసుకున్నారు.కానీ నిజమైన దైవప్రేమను చవిచూచిన ఆ అమాయక యువకులు మాత్రం ఆయన్ను ఎంతమాత్రం వదలలేకపోయారు.చివరకు వారి జీవితాలనే ఆ ప్రేమకోసం వారు త్యాగం చేశారు.అంతేగాని ప్రపంచం వైపు వారు తిరిగి రాలేదు.నిజమైన భగవత్ప్రేమ అంటే అలాగే ఉంటుంది మరి.

శని - శుక్ర దశ చాలా విచిత్రమైన దశ.

ధనవ్యామోహంతో,లోకవ్యామోహాలతో కొట్టుమిట్టాడే లోకులను అది నానా బాధలూ పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తుంది.కానీ అంతరిక జీవితంలో పవిత్రత కోసం తపన పడే దైవాన్వేషకులకు మాత్రం అది ఎంతో సహకరిస్తుంది.ఆ దశ వారి జీవితంలో మరపురాని దశ అవుతుంది. శనిభగవానుని శిక్షణా విధానాలు ఇలాగే విచిత్రంగా ఉంటాయి.సాధకులను ఆయన అమితంగా కరుణిస్తాడు.కానీ కపటులైన లోకులను మాత్రం నానా బాధలకు గురి చేస్తాడు.

ఈ సమయంలో ఒక విచిత్రం జరిగింది.

1924 లో బాబా అనుచరులు ఆయన్ను ఒక కోరిక కోరారు.తమకోసం ఒక స్పెషల్ డ్రస్ కోడ్ తయారు చేసుకుంటామనీ ఒక ప్రత్యేకమైన గ్రూప్ గా తాము ఏర్పడతామనీ వారు అడిగారు.దానికి బాబా నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.ప్రపంచంలో ఇప్పటికే అనేక మతాలూ అనేక గ్రూపులూ ఉండనే ఉన్నాయి.వాటివల్ల గొడవలూ యుద్ధాలూ తప్ప మంచేమీ జరగలేదు.కనుక ఇంకో కొత్త గ్రూప్ అక్కర్లేదని తేల్చి చెప్పాడు.ప్రపంచం మొత్తం తన సంఘమేననీ తమకొక ప్రత్యేక ఐడెంటిటీ అక్కర్లేదనీ తేల్చేశాడు.ఇది చాలామంది శిష్యులకు నచ్చలేదు.అయినా సరే వారెవరూ బాబాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు.ఆయన చెప్పిన పనిని నోర్మూసుకుని చెయ్యడమే వారి పని.

ఇదే సమయంలో ఒక రాతి గదిలో తనను తాను బంధించుకుని బాబా ఒక నెలరోజులు ఒంటరిగా ఉపవాస దీక్షలో గడిపాడు.ఆ సమయంలో కూడా మంచినీరూ,టీ,పెరుగు,కూరగాయలు తప్ప ఇంకేమీ తీసుకునేవాడు కాదు. అది కూడా రెండో మూడో రోజులకు ఒకసారి మాత్రమే తీసుకునేవాడు.ఇది కూడా శని-శుక్ర దశ ప్రభావమే.మహారాజును కూడా బిచ్చగాడిగా ఈ దశ మారుస్తుందని కాళిదాసు తన ఉత్తర కాలామృతంలో చెప్పాడు కదా.అన్నీ ఉండి అలా బ్రతకడం ఈ దశాప్రభావం కాకుంటే మరేమిటి?

ఈ సమయంలో బాబా తన ముఖ్య శిష్యులతో కలసి భారతదేశం నాలుగు మూలలా తిరిగాడు.దక్షిణాదిన మద్రాస్ ఊటీల వరకూ వచ్చాడు.ఎక్కువగా కాలినడక మీదే వారు ఆధారపడేవారు.లేదా రైల్లో అతితక్కువదైన మూడవ క్లాసులో ప్రయాణం చేసేవారు.ఆ క్రమంలో దారిలో ఎదురైన అందరు తీర్ధయాత్రికులకూ ముఖ్యంగా కుష్టురోగులకూ తలవంచి వాళ్ళ పాదాలను తాకి మరీ నమస్కారం చేసేవాడు బాబా.ఇలా దాదాపుగా 5000 మందికి వంగి వంగి నమస్కారాలు చెయ్యడం వల్ల ఆయనకు మెడా వీపు భాగాలలో ఎముకలు దెబ్బతిని ఆ నొప్పులు జీవితాంతం ఆయన్ను వెంటాడాయి.

1925 లో ఆయన మళ్ళీ మెహరాబాద్ కు వచ్చేసి స్థిరంగా అక్కడ ఉండటం ప్రారంభం చేశాడు.ఆ సమయంలో కులమతాలకు అతీతంగా ఆయన ఒక బడిని ప్రారంభించాడు.అక్కడ చదువు తిండి బట్టా ఉచితంగా ఇవ్వబడేవి. అది ముఖ్యంగా పేదవారికి దళితులకు ఉద్దేశించబడింది.దిక్కులేని ఆ పిల్లలకు, కుష్టువారికి బాబా స్వయంగా తన చేతులతో స్నానం చేయించేవాడు.వారి లెట్రిన్స్ తానే స్వయంగా కడిగేవాడు.

అంతకు ముందు శ్రీరామక్రిష్ణులు కూడా 1856 ప్రాంతంలో ఇదే పని చేశారు.ఆయనైతే ఇంకా దారుణంగా తన పొడవైన జుట్టుతో కాలికాలయపు పాకీదోడ్లు శుభ్రం చేసేవాడు.ఆ తర్వాత మెహర్ బాబా మళ్ళీ ఆ పనిని చేశాడు.ఇలాంటి ఎందరు మహనీయుల అనుగ్రహ ఫలితమో ఈనాడు సమాజంలో అణచివేత అంతమై అందరికీ స్వేచ్చా,సమాన అవకాశాలూ దొరుకుతున్నాయి.కానీ ఇలాంటివారు చేసిన పనులు మౌనంగా కాలగర్భంలో కలసి పోతాయి.వాటిని ఎవరూ గుర్తించరు. గుర్తించాలని కూడా ఆ చేసినవారు కోరుకోరు.ఇవన్నీ మేమే సాధించామని రాజకీయులు మాత్రం విర్రవీగుతూ పోజులు కొడుతూ ఉంటారు.అది నిజం కాదు.

మహనీయుల సంకల్ప ఫలితంగానే చరిత్రలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.వారు మాత్రం అజ్ఞాతంగా ఉంటారు.అల్పులైన మనుషులు ఆయా పేరు ప్రఖ్యాతులను క్లెయిం చేసుకుంటూ ఉంటారు.సత్యం వేరు.అసత్యం వేరు. లోకం అసత్యాన్నే అనుసరిస్తుంది గాని సత్యాన్ని అనుసరించ లేదు.సృష్టి ధర్మం అంతే.

ఇదే సమయంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. 

10-7-1925 న బాబా జీవితాంత పూర్తి మౌనాన్ని మొదలు పెట్టాడు.ఆ రోజు తర్వాత 1969 లో చనిపోయేవరకూ ఆయన ఒక్కసారి కూడా నోరువిప్పి మాట్లాడలేదు.44 సంవత్సరాల పాటు తన మిగిలిన జీవితమంతా ఆయన మౌనంగానే ఉండిపోయాడు. కాకపోతే అల్ఫాబెట్ బోర్డు ద్వారా తన భావాన్ని చెప్పేవాడు.కొన్నాళ్ళ తర్వాత అదీ మానేసి సైగలు మాత్రం చేసేవాడు.

మన లెక్క ప్రకారం ఆరోజున శని-శుక్ర-శని-శుక్ర-శనిదశ జరిగింది.ఇది ఎంత అద్భుతమో గమనించండి.

లగ్నాదిపతిగా శని దశమంలో ఉచ్ఛ స్థితిలో వక్రించి ఉన్నాడు.పైగా వాక్కుకు కారకుడైన చంద్రునితో కలసి ఉన్నాడు.శుక్రుడు వాక్ స్థానంలో వక్రించి ఉండటమే గాక సున్నా డిగ్రీలలో ఉన్నాడు.కనుక వాక్కు నిగ్రహింపబడే సంఘటన ఆ రోజున జరిగింది.శనిశుక్రుల దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశనాడు ఈ సంఘటన జరిగింది.జ్యోతిశ్శాస్త్రం ఎంత గొప్పదో దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. మహనీయుల జీవితాలుకూడా గ్రహాధీనం లోనే నడుస్తాయని కూడా దీనిని బట్టి మనం గ్రహించవచ్చు.

ఆ తర్వాత కొంతకాలానికి, రోడ్డు పక్కన ఉన్న ఒక వేపచెట్టు క్రింద 4x7 అడుగుల అత్యంత ఇరుకు చెక్క కేబిన్ నిర్మించుకుని అందులో దూరి ఒక నెలరోజులు ఉన్నాడు బాబా. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కరువును వర్షాభావాన్నీ పోగొట్టమని కొందరు రైతులు ఆయన్ను ప్రార్ధించారు.మరుసటి రోజున ఒక ధునిని వెలిగించమని ఆయన తన శిష్యులను ఆజ్ఞాపించాడు.ఆ మరుసటి రోజున విచిత్రంగా ఎన్నడూ లేనన్ని మబ్బులు పట్టి 15 గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసి ఆ ప్రాంతానికి ఉన్న కరువును పూర్తిగా నిర్మూలించింది.ఇది వాస్తవంగా జరిగిన సంఘటన.

ఇదే సమయంలో దాదాపు 40,000 మంది ప్రజలు రెండురోజుల పాటు ఎడతెరిపి లేకుండా బాబాను దర్శించుకున్నారు.బాబా పేరు అందరికీ తెలియడం మొదలైంది.

ఇదే సమయంలో బాబా రెండుసార్లు కొన్ని నెలల తరబడి మళ్ళీ చిన్నచిన్న కేబిన్స్ వంటి వాటిల్లో ఉన్నాడు.అలా ఎందుకు చేసేవాడో ఎవరికీ తెలియదు. తాను చేస్తున్న 'అంతరిక లోక ప్రక్షాళనా కార్యక్రమం' కోసం అలా చేసేవాడినని కొందరు ముఖ్య శిష్యులకు ఆయన చెప్పాడు.

ఈ సమయంలోనే బాబా అంటే ఇష్టం కలిగిన దాదాపు 500 మంది ఆయన చుట్టూ నివసించడం మొదలు పెట్టారు.ఆ సమయంలో మెహరాబాద్ లో ఒక స్కూలు,ఆశ్రమం మొదలైనవి ఉండేవి.శిష్యులు ఆయా పనులు చూచుకుంటూ ఉండేవారు. ముఖ్యమైన శిష్యులు ఆయనకు దగ్గరగా నివసించేవారు. వారి సమయమంతా ఆటపాటల్లో సాధనలో జోక్స్ లో పిచ్చాపాటిగా మాట్లాడుకోవడంలో స్కూలు ఆశ్రమం పనులను చూచుకోవడంలో సాగిపోయేది.

ఇదే సమయంలో భయంకర బందిపోటు 'సత్య మంగ్' తన అనుచరులతో కలసి బాబా దర్శనానికి వచ్చాడు.వారంతా మారువేషాల్లో వచ్చారు.చివరకు పోలీసులకు కూడా వారంటే భయమే.వారంతటి కరుడు గట్టిన క్రూరమైన బందిపోట్లు.కానీ బాబా వారిని గుర్తించి ఏమాత్రం భయపడకుండా ' నువ్వు ఒక ఆడదానిలాగా పిరికితనంగా ఇతరుల మీద ఆధారపడి వాళ్ళను దోచుకుని బ్రతుకుతున్నావు.ఒక మగవాడిలాగా నీ కాళ్ళమీద నీవు నిలబడి కష్టపడి బ్రతకడం మొదలు పెట్టు.ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు' అని సూటిగా చెప్పాడు.

అలా సూటిగా చెప్పినందుకు ఆ గుంపు ఆయన్ను ఏం చేస్తుందో అని అందరూ భయపడ్డారు.కానీ వాళ్ళు బాబాను ఏమీ అనలేదు.ఆ తర్వాత కాలక్రమేణా 'సత్య మంగ్' మంచిగా మారిపోయాడు.

1926 లో శని శుక్రదశ అంతమయ్యే సమయంలో బాబా ఒక మహా విచిత్రమైన పని చేశాడు.ఉన్నట్టుండి మెహెరాబాద్ అంతా మూసేస్తున్నాననీ అందరినీ అక్కడనుంచి ఖాళీ చెయ్యమనీ చెప్పాడు.ఆ భవనాలూ స్కూలూ ఆస్పత్రీ అన్నీ తానే దగ్గరుండి కూలగొట్టి నేలమట్టం చేయించాడు.స్టాఫ్ అందరినీ వేరే చోట ఉద్యోగాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలగకుండా చేశాడు.తనతో ఉన్నవారి నందరినీ బాంబే దగ్గరలో ఉన్న లోనావాలాకు తీసుకు పోయాడు.

అయితే అక్కడ ఒక నెలమాత్రమే వారంతా ఉన్నారు.మళ్ళీ మెహరాబాద్ కు తిరిగి వచ్చిన బాబా, కూలగొట్టిన స్కూలును ఆశ్రమాన్నీ మళ్ళీ కట్టమని శిష్యులను ఆజ్ఞాపించాడు.చచ్చినట్టు మళ్ళీ ఆ భవనాలన్నీ తిరిగి కట్టారు శిష్యులు.నోరెత్తి ఇదేంటి అని ప్రశ్నించే చాయిస్ వారికి లేదు.

తుగ్లక్ గనుక డిల్లీనుంచి దౌలతాబాద్ కూ మళ్ళీ అక్కణ్ణించి డిల్లీకీ రాజధానిని మార్చినట్లుగా ఇది జరిగింది.

ఇలాంటి విచిత్రమైన పనులు ఆయన మాటమాటకీ చాలా చేస్తూ ఉండేవాడు.అయితే వాటి వెనుక ఏమేం అర్ధాలున్నాయో అలా ఎందుకు చేసేవాడో ఎవరికీ తెలియదు.అడిగే సాహసమూ ఎవ్వరూ చేసేవారు కారు.

ఆయన వెంట ఉండేవారికి మాత్రం ప్రతిరోజూ ఒక పరీక్షగా ఉండేది.అదే వాళ్ళ సాధనగా ఉండేది.

(ఇంకా ఉంది)