“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఫిబ్రవరి 2016, గురువారం

తెలంగాణా ఆంధ్రా రాష్ట్రాల శాపాలు

ఆంధ్రాలోనూ తెలంగాణాలోనూ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కొన్ని విషయాలు స్ఫురిస్తున్నాయి.సమాజంలో ఏదో మంచి మార్పు వస్తుంది అని ఆశించి ఈ రెండు ప్రభుత్వాలకూ ఓట్లేసిన అందరికీ మళ్ళీ ఆశాభంగం యధావిధిగా కలుగుతున్నది.వీరి పరిపాలన చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ బాగుపడే యోగం ఉన్నట్లుగా కన్పించడం లేదు.

కులగోలతో ఆంధ్రా, మతవిద్వేషంతో తెలంగాణా - వెరసి రండు రాష్ట్రాలూ రెండు అగ్నిపర్వతాల మీద కూచుని ఉన్నట్లు భవిష్యదర్శనం చెబుతున్నది. ఈ అగ్నిపర్వతాలు ఏదో రోజున తప్పకుండా పేలుతాయి. అప్పుడు జరిగే విధ్వంసంలో అమాయక ప్రజలు మిడతల్లా మాడిపోక తప్పదు.ఆరోజు ఎంతో దూరంలో లేదు.

తెలంగాణలో జరిగిన ఎన్నికలలో 45% మాత్రమే ఓట్లు పోలయ్యాయంటే దానర్ధం ఏమిటి? మిగతా అందరూ ఎందుకు ఒట్లేయ్యలేదు? ఇళ్ళలోనుంచి బయటకు రావడానికి భయపడి ఊరుకున్నారా?అలా భయపెట్టిన వారు ఎవరు? పౌరులు భయంతో ఒట్లేయ్యకుండా ఊరుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ రాష్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా?

పాతబస్తీలో నిన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే అది హైదరాబాద్ లో భాగమేనా లేక పాకిస్తాన్ లో భాగమా అనేది అర్ధం కావడం లెదు.రెండోదే కరెక్ట్ అనిపిస్తున్నది.ఈ మతోన్మాదం ముందుముందు విశ్వరూపం దాలిస్తే అప్పుడు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతాయో ఊహించడానికే భయం వేస్తున్నది.దేశానికి మరో పార్టిషన్ వస్తుందేమో?

అటుమొన్న తునిలో జరిగిన అరాచక చర్యలను చూచినా, మొన్న పాతబస్తీలో హైదరాబాద్ లో జరిగిన దౌర్జన్యాలు చూచినా ఒక్క విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది.ఈ రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు లేవు. ఒకవేళ ఉన్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి తప్ప ధర్మంగా న్యాయంగా క్రియాశీలంగా వ్యవహరించడం లేదు.ప్రభుత్వాలే ఇంత పిరికితనంగా ఉంటే ఎలా?

ఒక వందమంది గుంపు నీ వెనుక ఉంటే చాలు, ఇక నువ్వేం చేసినా అడిగేవారు ఉండరు. నువ్వేం మాట్లాడినా ఎదురు చెప్పేవారు ఉండరు. అప్పుడు నువ్వు చెప్పినదే న్యాయం.నువ్వు చేసినదే ధర్మం.ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం చెల్లుబాటు అవుతున్న న్యాయం ఇదే. ఇది ఆటవిక న్యాయమేగాని అసలైన న్యాయం కాదు. బలవంతుడు చేసినదే న్యాయం అయినప్పుడు ఇక రాజ్యాంగం ఎందుకు? చట్టాలు ఎందుకు? పోలీసు వ్యవస్థ ఎందుకు? న్యాయవ్యవస్థ ఎందుకు?

కులమూ మతమూ ఉగ్రవాదమూ అనేవి మూడూ మూడు విషసర్పాలు.ఈ విషసర్పాలను పెంచుకునేటప్పుడు అవి చాలా ముద్దుగా కనిపిస్తాయి.కానీ అవి పెరిగి పెద్దవై మన అదుపు తప్పినపుడు మన మాట వినవు. అప్పుడు అవి వేసే కాట్లు చాలా దారుణంగా ఉంటాయి.

గతంలో అనేకమంది నాయకులు ఈ విషసర్పాల కాట్లకు బలైపోయారు. ఇందిరా గాంధీ ఇలాగే బలైంది. రాజీవ్ గాంధీ ఇలాగే బలయ్యాడు.వారిని చూసైనా మన నాయకులు బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా?మళ్ళీమళ్ళీ అవే విషసర్పాలను పాలుపోసి పెంచుతుంటే ఎలా?

నాయకుల్లారా !! మీ సంకుచిత దృష్టిని పక్కన పెట్టండి. విశాలదృష్టితో దూరదృష్టితో ఆలోచించండి.మీరు ఇప్పుడు నాటుతున్న విషబీజాలు ముందుముందు మీ సంతతినే నాశనం చేస్తాయి.అంతేగాక అమాయకులైన ప్రజలను కూడా నాశనం చేస్తాయి.ఆ పాపం మిమ్మల్నీ మీ వంశాలనూ ఖచ్చితంగా వెంటాడుతుంది.

మీ సంకుచిత స్వార్ధాల కోసం ఆలోచించకండి. దేశం కోసం నిష్పక్షపాతంగా న్యాయంగా ఆలోచించండి.ధర్మంగా పరిపాలన చెయ్యండి.కుళ్ళు రాజకీయాలను,స్వార్ధ రాజకీయాలను,వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టండి. న్యాయాన్ని నిలబెట్టండి.ఈ దేశాన్ని పరిపాలించే మహత్తరమైన అవకాశాన్ని దేవుడు మీకిచ్చాడు.దానిని దుర్వినియోగం చెయ్యకండి.మీకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని పాడుచేసుకుంటే,విశ్వశక్తులు మిమ్మల్ని క్షమించవు.అవి కళ్ళు తెరిచిన రోజున కలిగే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి.మనకేం కాదులే అనుకోకండి.ప్రకృతి ముందూ దైవం ముందూ మనిషి ఎల్లప్పుడూ అల్పుడే అన్న విషయాన్ని మర్చిపోకండి.మనల్ని కొన్ని అతీత శక్తులు గమనిస్తున్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోకండి.

మీరు చేస్తున్న ప్రతి పనీ రికార్డ్ అవుతున్నది.ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు.ప్రకృతి గమనిస్తున్నది.మీరు కొలుస్తున్న దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు.ఒకరోజున మీ ఖర్మను మీరు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. మర్చిపోకండి.

నేను చెబుతున్నవి పనికిరాని నీతుల్లాగా అనిపించి ప్రస్తుతం మీకు నవ్వు రావచ్చు.కానీ,మీరు చేస్తున్న తప్పుడు పనులకు దైవం ఇచ్చే ఫలితాలు ఎదురైన రోజున మాత్రం మీకు నవ్వు రాదు.అప్పుడు ఏడుపు వస్తుంది.కానీ ఎంత ఏడ్చినా అప్పుడు ఫలితం ఉండదు.

చేతులు పూర్తిగా కాల్చుకోకముందే కళ్ళు తెరవండి.ధర్మసందేశాన్ని వినిపించుకోండి.ఎందుకంటే మీరు సృష్టించిన పరిస్థితులు మీ చేతులు కూడా దాటిన రోజున మీరు కూడా ఏమీ చెయ్యలేరు.ఆ రోజు రాకముందే జాగ్రత్త పడండి.నేరస్తుల మీద కఠినచర్యలు తీసుకోడానికి భయపడకండి.ఓట్లకోసం దిగజారి ప్రవర్తించకండి.ఉగ్రవాదాన్ని, ఆయా వర్గాలనూ ప్రోత్సహించకండి. 

చెప్పడం వరకే నా ధర్మం. వినకపోతే --- మీ ఖర్మం.

ఎందుకంటే,మంచి చెప్పినపుడు విననివాడికి,ఆపత్సమయంలో దేవుడు కూడా సాయం చెయ్యడు మరి.