“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, ఫిబ్రవరి 2016, సోమవారం

క్షుద్ర పూజలు

మనుషులు అబద్దపు నీడలో బ్రతకడానికే ఎప్పుడూ ఇష్టపడతారు గాని సత్యం యొక్క వెలుగులోకి రావడానికి ఏమాత్రం ఇష్టపడరు.కానీ సత్యాన్ని ప్రేమిస్తున్నట్లు మాత్రం బయటకు చక్కగా నటిస్తుంటారు. మనుషులలో ఎక్కువశాతం  మంది ఇలాగే ఉంటారు.మానవ మనస్తత్వంలో ఇదొక మౌలికమైన లోపం.

ఒకప్పుడు కర్ణపిశాచి మంత్రమూ ఇంకా అలాంటి మంత్రాలు కొన్నింటిని సాధన చేసిన ఒకాయన ప్రస్తుతం నన్ను అనుసరిస్తున్నాడు. అలాంటి పిచ్చి సాధనలు మానుకొమ్మని అతనికి నేను చెప్పాను.నేను సూచించే అసలైన తంత్రమార్గాన్ని అనుసరించమని చెప్పాను.

మొన్న ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో అతను నాకు కొన్ని వాట్సప్ మెసేజీలు పంపాడు.వాటి సారాంశం ఏమంటే - తంత్రం మీద నేను వ్రాసిన కొన్ని పోస్ట్ లను ఎవరో తస్కరించి తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడుట. అంతేగాక తను వ్రాసిన ఒక E-Book లో కూడా ఆ పోస్ట్ లు తనవిగా ప్రచురించుకున్నాడట. ఇది మనవాడు గమనించి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే - అతను ఏమాత్రం సిగ్గుపడకుండా రివర్స్ లో - 'అది నా మేటర్. మీ గురువే నా మేటర్ కాజేశాడు.నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నాకేం భయం లేదు.నాదగ్గర ఎన్ని విద్యలున్నాయో నీకు తెలీదు.నేను తలచుకుంటే నిన్నే అంతం చేస్తాను'- అని ఇంకేమేమో వాగాడని ఈ అర్ధరాత్రి మెసేజిల సారాంశం.

నాకు భలే నవ్వు వచ్చింది.

తనదిగా చెప్పుకున్నంత మాత్రాన తనది కానిది తనదెలా అవుతుందో నాకైతే అర్ధం కాలేదు. పైగా అతను గుంటూరుకు చెందిన ఒక కుహనా తాంత్రికస్వామి శిష్యుడట.అదీ సంగతి !!! వీళ్ళ స్థాయి ఎంతటిదో నాకు బాగా తెలుసు. యధాగురు తధాశిష్య: విషవృక్షానికి మధురఫలాలెలా కాస్తాయి? జుట్టుకు రంగేసుకున్నత మాత్రాన యవ్వనం ఎలా తిరిగి వస్తుంది? ఇదీ అంతే.ఎవరిదో తెచ్చి మనదని చెప్పుకున్నంత మాత్రాన మనదౌతుందా?నవ్వొచ్చింది. ఇలాంటి మనుషులను ఏమాత్రం పట్టించుకోవద్దు అతని అజ్ఞానానికి అతన్ని వదిలెయ్యమని చెప్పాను.

ఏవేవో మంత్రాలూ తంత్రాలూ సాధన చేసున్నామని చెప్పుకునే ఇలాంటి బాపతు మనుషులలో కనీసపు నైతిక విలువలు కూడా కనిపించక పోవడం నన్నెపుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.ఇక వీళ్ళు చేసేవి ఎలాంటి సాధనలో వీళ్ళ గురువులు ఎలాంటి వాళ్ళో తేలికగా మనం అర్ధం చేసుకోవచ్చు. మినిమం కేరక్టర్ లేని ఇలాంటి వాళ్ళను వాళ్ళ ఖర్మకే వదిలేద్దాం.

మొన్న స్పోర్ట్స్ మీట్ లో ఇలాంటిదే ఇంకొక సంఘటన జరిగింది.

దాంట్లో ఒక కొలీగ్ ఆఫీసర్ కలిశాడు.ఆయన శుద్ధ సాంప్రదాయ వైష్ణవుడు. ఆయన చేతిలో రమణమహర్షి పుస్తకం ఒకటి హస్తభూషణంలా ఉన్నది. అక్కడకు అలాంటి పుస్తకాన్ని ప్రదర్శిస్తూ రావడమే నా దృష్టిలో ఒక హేయమైన సంగతి. అదలా ఉంచితే - మాటల మధ్యలో ఆయనేం చెప్పాడంటే - జడ్జీల పక్షపాతం వల్ల ముగ్గుల పోటీలో వాళ్ళావిడకు రావలసిన ప్రైజు రాకుండా పోయిందని, లోకం పాడైపోయిందని, న్యాయానికి విలువ లేదని,ఈ ధోరణిలో ఒక పావుగంట సేపు ఒకటే ఊదరగొట్టాడు.నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

ఈ మధ్యకాలంలో ఇలాంటి మనుషులు ఎదురైతే నాకు కోపం రావడం లేదు.నవ్వు మాత్రమే వస్తున్నది.అప్పుడప్పుడూ జాలి కలుగుతున్నది.

అంతా ఓపికగా విని ఆయనతో ఇలా చెప్పాను.

'నువ్వేమో సెంట్రల్ గవర్నమెంట్ లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో హాయిగా ఉన్నావు.మీ ఆవిడకు ముగ్గుల పోటీలో ప్రైజు రాకపోతే అది అంతసేపు చర్చించవలసిన విషయమా? మీరంతగా బాధ పడటానికి ఇవేమన్నా ఆస్కార్ అవార్డులా లేక నోబుల్ ప్రైజులా?ఈ ప్రైజులు వస్తే ఎంత? రాకుంటే ఎంత?ఒకవేళ ప్రైజు వస్తే దానితో ఏం చేస్తావు?మీ ఇంటిముందు శిలాశాసనం వేయించుకుంటావా?కావాలంటే నాకు యోగాలో వచ్చిన ప్రైజు మీకిస్తాను తీసుకోండి.అయినా మీ చేతిలో ఉన్న పుస్తకం ఏమిటి? మీరు చెబుతున్న మాటలేమిటి? రమణ మహర్షి చెప్పినది ఇదేనా? లేక ఆయన చెబుతున్న దానిలో మీరు అర్ధం చేసుకున్నది ఇంతేనా?'

నా మాటలతో ఆయన డంగై పోయాడు.

'నిజమే."ఆత్మజ్ఞాని అయినవాడు జయాపజయాలకు చెదరడు. అసలు వాటిని ఆశించడు".అని మహర్షి చెప్పారు అంటూ ఆ పుస్తకాన్ని తెరచి ఒక పేజీలో ఒక లైన్ చూపించాడు.

'మరి అది నిజమే అయితే ఇందాకటి నుంచీ మీ ఘోషకు అర్ధం ఏమిటి?' అన్నాను.

ఆయన నాకంటే తెలివైనవాడు.

'నేనింకా ఆత్మజ్ఞానిని కాలేదుగా.అందుకే ఈ ఘోష' అని నవ్వేశాడు.

నేనూ నవ్వుతూ -' కనీసం ప్రయత్నం చెయ్యండి.అప్పుడు ఇలా పుస్తకాలను అందరికీ ప్రదర్శిస్తూ తిరిగే బాధ తప్పుతుంది. అప్పుడు మీరే ఒక నడిచే పుస్తకం అవుతారు.' అని చెప్పాను.

ఆ తాంత్రికస్వామి శిష్యునికీ ఈ వైష్ణవ భక్తునికీ మధ్య నాకేమీ తేడా కనిపించలేదు.నిత్యజీవితంలోకి రాని బోధలూ వేదాంతమూ అసలెందుకు పనికొస్తాయి?

మనకు 'క్షుద్రపూజ' అని ఒక మాట ఉన్నది.నిషిద్ధ వస్తువులతో రాత్రిపూట శ్మశానాలలో చేసే పూజలనే క్షుద్రపూజలని సామాన్యంగా అంటారు.నా దృష్టిలో అసలైన క్షుద్రపూజలు అవి కావు.

పైన చెప్పిన తాంత్రికస్వామి శిష్యులూ, మా కొలీగ్ ఆఫీసర్ వంటి వారూ రోజూ ఇళ్ళల్లో చేసే పనికిమాలిన పూజలనే క్షుద్రపూజలని నేను భావిస్తాను. ఎందుకంటే వారు చేస్తున్న పూజల ఫలితాలు నిత్యజీవితంలోకి అనువదించ బడటం లేదు. ఆయా పూజల అసలైన అర్ధం వారి బుర్రలకు ఎక్కడం లేదు. పూజల దారి పూజలదే.జీవితం దారి జీవితానిదే.కనుక అవి క్షుద్రపూజల కంటే ఉన్నతమైనవి కానేకావు.వీటినే అసలైన 'క్షుద్రపూజలు' అని నేనంటాను.

మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం.

రోజుకు గంటలు గంటలు పూజలు చేస్తూ ఉంటారు.ఆ పూజల నుంచి లేచీ లేవకముందే భార్యను తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటారు.ఒక్కోసారి పూజ చేసే సమయంలోనే మధ్యమధ్యలో భార్యనూ పిల్లలనూ తిడుతూ విసుక్కుంటూ ఉంటారు.లేదా ఉద్యోగం సద్యోగం లేకుండా భార్య సంపాదన మీద ఆధారపడి జల్సాగా బ్రతుకుతూ ఉంటారు.లేదా తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు.లేదా అవినీతి సొమ్ము గడిస్తూ,అందులో కొంత వాటాను దేవుడి హుండీలో కూడా వేస్తూ ఉంటారు.

చాలామంది ఇలాంటివాళ్ళు గురుస్వాముల మంటూ దొంగవేషాలు వేస్తూ ఉంటారు.వీళ్ళకు సమస్త వ్యసనాలూ ఉంటాయి.లేదా ఏవో దొంగ వ్యాపారాలూ,దొంగ వ్యవహారాలూ చేస్తూ ఉంటారు.ఆయా వ్యాపారాలలో వ్యవహారాలలో తాము అనుకున్న లాభాలు అప్పనంగా రావడానికి వారి గురువులను ఉపాయాలు అడుగుతారు.వారేవో హోమాలూ యాగాలూ చెయ్యమని చెబుతూ ఉంటారు.వీరు చేస్తూ ఉంటారు.వెరసి అవి చాలా గొప్ప సాధనలని వారు భావిస్తూ అహంతో విర్రవీగుతూ ఉంటారు.

ఇలాంటి వాళ్ళను చూస్తే నాకు చాలా అసహ్యం కలుగుతుంది.ఒక గజ్జికుక్కనైనా దగ్గరకు తీస్తానేమో గాని ఇలాంటి మనుషులను నేను నా ఛాయలకు కూడా రానివ్వలేను.

గుంటూరులో ప్రతి ఏడాదీ ఒక తంతు జరుగుతుంది.అదేమంటే లక్ష హనుమాన్ చాలీసా పారాయణ.కొన్ని వేలమంది కలిసి రోజంతా కూచుని ఈ పారాయణ నిర్వహిస్తారు.అందులో రెగ్యులర్ గా పాల్గొనే ఒకాయన నన్నూ దీనికి రమ్మని ఒకసారి అడిగాడు.

'లక్షసార్లు పారాయణ చేస్తే ఏమౌతుంది?' ఆయన్ను అడిగాను.

'అంతమంది కలిసి పిలిస్తే అప్పుడు మన పిలుపు ఆంజనేయస్వామికి వినిపిస్తుంది.స్వామి సంతోషిస్తాడు.మనకు మంచి జరుగుతుంది.' అంటూ జవాబొచ్చింది.

'అవునా? అంతమంది అలా అరుస్తూ అన్నిసార్లు పిలిస్తే గాని వినపడక పోవడానికి ఆంజనేయస్వామికి నీలాగా ఏమైనా చెవుడని అనుకుంటున్నావా?' అడిగాను.

అతను కోపంగా చూచి వెళ్ళిపోయాడు.

అసలైన మంత్రమూ ఇది కాదు.అసలైన తంత్రమూ ఇది కాదు.అసలైన ఆధ్యాత్మిక మార్గమూ ఇది కాదు.సత్యమైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంటే ముందుగా మనిషిలో ఉన్నతమైన మార్పు రావాలి.అతనిలో ఉన్నతమైన నైతిక విలువలు కనిపించాలి.అవి మాటల్లోనే కాకుండా చేతల్లో నిత్యజీవితంలో దర్శనం ఇవ్వాలి.అతనిలో కోరికలు బాగా తగ్గిపోవాలి.అహం అణగారిపోవాలి. అసత్యం మాయం కావాలి.దివ్యత్వం అతనిలో వికసించాలి.అప్పుడే అది అసలైన సాధన అవుతుంది.అవి నిజమైన పూజలూ అవుతాయి.

అలా కాకుండా,పూజల దారి పూజలదే,జీవితం దారి జీవితానిదే అయినప్పుడు,ఆయా హోమాలనూ యాగాలనూ సాధనలనూ పూజలనూ "క్షుద్రపూజలు" అనడం కరెక్టే కదూ?అలాంటి వాళ్ళను 'క్షుద్ర పూజారులు' అనడం కూడా కరెక్టే.ఈ రకంగా చూస్తె మన చుట్టూ ప్రతి ఇంట్లోనూ ఎంతమంది క్షుద్రపూజారులు కనిపిస్తారో?

మేం సరిగ్గానే ఉన్నాం అనుకుంటూ తప్పుదారిలో నడచే వాళ్ళతోనే ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నది.సోకాల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూచినా కుప్పలు తెప్పలుగా ఉన్నారు.ఇలాంటి మనుషులతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని పెద్దపెద్ద వాళ్ళే మార్చలేక పోయారు.ఇక మనమెంత?

ఇలాంటి వారిని చూచి సరదాగా నవ్వుకోవడమే మనం ప్రస్తుతానికి చెయ్యగలిగిన అసలైన పని.