“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

మీకు జంధ్యం ఉందా?

చాలాకాలం ఇక్కడే పనిచేసి ఒక ఏడాది క్రితం సికింద్రాబాద్ కు బదిలీలో వెళ్ళిన ఒక కొలీగ్ ఆఫీసర్ మొన్న ఒక సందర్భంలో మళ్ళీ కలిశాడు.అతను సిగ్నల్ అండ్ టెలీకాం విభాగంలో ఇంజనీరు.యూపీ రాష్ట్రానికి చెందినవాడు.చాలా తెలివైనవాడు. ఒక స్టేషన్లో ఒక స్పెషల్ వర్క్ సందర్భంగా ఒకరోజు కలిసి పనిచేశాం,ప్రయాణమూ చేశాం.

ప్రయాణం పొడుగూతా అతను చాలాసేపు అవీ ఇవీ మాట్లాడుతూ ఉన్నాడు.వాటిల్లో దేశ రాజకీయాలూ,పే కమీషన్ విషయాలూ, షేర్ మార్కెట్ కబుర్లూ,ట్రేడ్ యూనియన్ల చేతగానితనమూ, ప్రభుత్వసర్వీసులోని కష్టాలూ అన్నీ దొర్లాయి.నేను యధావిధిగా మౌనంగా ఉండి వినీ వినకుండా మధ్యమధ్యలో వింటూ క్లుప్తంగా జవాబులు ఇస్తూ ఉన్నాను.

సంభాషణ అంతా ఇంగ్లీషూ హిందీలలో జరిగింది.

అన్ని టాపిక్సూ అయిపోయాక హటాత్తుగా తన మెడలో ఉన్న జంధ్యాన్ని చూపిస్తూ ఇలా ప్రశ్నించాడు.

'మీరు దీనిని ధరిస్తున్నారా?"

టాపిక్ ఇటువైపు మళ్ళుతున్నందుకు కుతూహలపడుతూ 'ఎందుకు?' అంటూ అడిగాను.అప్పటివరకూ అతను యూపీ బ్రాహ్మణుడని నాకు తెలియదు.

'అలా కాదు మీరు ధరిస్తున్నారా లేదా?' మళ్ళీ రెట్టించాడు.

'ప్రస్తుతానికి లేదు' జవాబిచ్చాను.

'ఎందుకని?' అడిగాడు.

'మొన్న ఒక డ్రామా వేసేటప్పుడు తొలగించాను.ఆ తర్వాత మళ్ళీ వేసుకోలేదు.వేసుకోవాలి.' చెప్పాను.

'అలా ఉండకూడదు.' అన్నాడు.

నేనేమీ మాట్లాడకుండా చూస్తున్నాను.

'ఇది ఒంటిమీద ఉంటేనే మీరు చేసే ఏ దీక్ష అయినా ఫలిస్తుంది.లేకుంటే ఫలించదు.' అన్నాడు.

నానుంచి మళ్ళీ అదే మౌనం ఎదురయ్యేసరికి - 'నేనీ మధ్యనే దీక్ష తీసుకున్నాను.' అన్నాడు.

'ఓ అదా సంగతి ! కొత్త బిచ్చగాడన్నమాట!' అనుకుంటూ - 'ఎవరి దగ్గర?' అని అడిగాను.

'ఘజియాబాద్ లో ఒక గురువు దగ్గర' అన్నాడు.

'ఆయనదేం సాంప్రదాయం?ఆయన మీ కులగురువా?ఆయనకేమైనా ఆశ్రమాలున్నాయా?' అడిగాను.

'అదేమీ లేదు.గురుత్వం ఆయన వృత్తి కాదు.ఆయన అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్.మామూలుగా లోకానికి తెలిసిన ప్రసిద్ధ గురువు కాదు.కానీ నిజమైన శక్తివంతుడు.ఆయన ఎవరికీ బడితే వారికి దీక్ష ఇవ్వడు.అలా ఆయన దగ్గర దీక్ష స్వీకరించాలంటే మనలో కొన్ని అర్హతలుండాలి' అన్నాడు.

నేనేమీ జవాబివ్వలేదు.

'మనం బ్రతుకుతున్న ఈ జీవితం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం.కానీ చనిపోయిన తర్వాత ఇవేవీ మన వెంట రావు.ఆ తర్వాతి జీవితం కోసం మాత్రం మనం ఏమీ చెయ్యం.అదే మనం చేసే పెద్ద పొరపాటు.' అన్నాడు మళ్ళీ.

అప్పటికీ నేను మౌనంగానే ఉన్నాను.

'మా గురువు గారు చాలా శక్తివంతుడు.కావాలంటే ఈ రైలును కూడా ఇప్పటికిప్పుడు ఆపెయ్యగలడు.కానీ అలాంటి మహిమలు ఊరకనే ప్రదర్శించరు.' అన్నాడు.

'అలాగా !' అన్నాను నిర్లిప్తంగా.

'ఆయన గురించి మీకు తెలుసుకోవాలని లేదా?' అడిగాడు.

'ఉంది.ఆయన గురువెవరు? అసలు మీది ఏం సాంప్రదాయం?' అడిగాను.

'మాది కబీర్ పంథా.మా గురువు గారి గురువు ఒక సూఫీ మహాత్ముడు.' అన్నాడు.

'అదేంటి మీ గురువు గారు బ్రాహ్మణుడై ఉండి ఒక ముస్లిం ను గురువుగా స్వీకరించాడా?' అడిగాను ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'మీకొక విషయం చెప్పనా?' అన్నాడు గొంతు తగ్గిస్తూ -'మన హిందూ మహాత్ముల దగ్గర నిజమైన సిద్ధి లేదు.అసలైన సిద్ధులు సూఫీ మహాత్ముల దగ్గరే ఉంటాయి.కొన్ని తరాల క్రితం ఉత్తర ప్రదేశ్ లో ఈ సూఫీ మహాత్ముడు ఉండేవాడు.తన వద్ద ఉన్నదానిని స్వీకరించే అర్హతలున్న ముస్లిం ఎవరూ అతనికి కనిపించలేదు.అందుకని ఒక హిందువును తన శిష్యునిగా స్వీకరించాడు.ఆయన దగ్గరనుంచి మా గురువుగారు తీసుకున్నారు.అలా మా సాంప్రదాయం మొదలైంది.' అన్నాడు.

నార్త్ ఇండియాలో హిందువులూ ముస్లిములూ కలసి మెలసి జీవించడం వల్ల వీటిలోని కొన్నికొన్ని ఆచరణాత్మక శాఖలు ఈ విధంగా కలసిపోయి కొత్తకొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఇది మధ్యయుగాలలో ఎక్కువగా జరిగింది.కబీర్ పంధా ఇలాంటిదే.

'కబీర్ పంథా మంచిదే.మీ సాధనా విధానం ఎలా ఉంటుంది? అది సాకారమా నిరాకారమా?మీ గురువుగారు మసీదులు సందర్శిస్తాడా?' అడిగాను.

'మేము మసీదుకూ వెళ్ళము.మందిరానికీ వెళ్ళము.మేము జపమూ ధ్యానమూ మాత్రమే ఎక్కువగా చేస్తాము.మాకు దైవం కంటే గురువే ముఖ్యం.మీకొక్క విషయం తెలుసా?సరియైన గురువు లేనిదే దైవానుగ్రహం కలగడం కల్ల.' అన్నాడు గొంతు బాగా తగ్గించి.

'అవునా?' అడిగాను ఆశ్చర్యంగా.

'అవును.అందరూ అనుకున్నట్లు దైవం మన ప్రార్ధనలు వినడు. దైవానికి వినిపించేటంతగా ప్రార్ధించే బలం మనకు ఉండదు. అందుకని ఒక సద్గురువు ద్వారా మాత్రమే దైవాన్ని మనం సమీపించాలి. గురువు అంటే మనిషి రూపంలో మనకోసం ఉన్న దైవమే.' అన్నాడు.

చిరునవ్వుతో అలాగే అతన్ని చూస్తున్నాను.

'మీరు తీసేసిన జంధ్యాన్ని వెంటనే మళ్ళీ వేసుకోండి.అప్పుడే మీరు చేసే జపమూ ధ్యానమూ ఫలిస్తాయి.లేకుంటే అన్నీ వృధా' అన్నాడు మళ్ళీ సీరియస్ గా.

'అలాగే చూద్దాంలే గాని,నాకొక సందేహం. సమాజంలో ఇతరకులాల వాళ్ళు ఎంతోమంది జంధ్యం లేకుండా ఉన్నారు కదా? మరి వాళ్ళ సంగతి ఏమిటి? వారికి సాధనార్హత లేదా?' అడిగాను.

'లేదు.నిజం చెప్పాలంటే ఈ నియమనిష్టలన్నీ బ్రాహ్మణుల కోసమే ఉద్దేశించబడ్డాయి.మిగతా కులాల వారికి అంత అవసరం లేదు.వారికి తగిన సులువైన నియమాలు సాధనలు వారికి ఉన్నాయి.కానీ వీరు చేసేవి వారు చెయ్యరాదు.అసలైన కష్టమైన నియమాలన్నీ బ్రాహ్మణుల కొరకే చెప్పబడ్డాయి.' అన్నాడు.

'అవునా?' అన్నాను నవ్వుతూ.

ఇంతలో మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది.

రైలు దిగిన తర్వాత నావైపు జాలిగా చూస్తూ - 'మళ్ళీ కలిసినప్పుడు ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్తాను.మీకు చాలా విషయాలు అర్ధమయ్యేటట్లు చెప్పాలి.మొదట్నించీ చెబితే కాని మీకివి అర్ధం కావు.' అన్నాడు.

'సరే అలాగే ! ఈ సారి కలిసినప్పుడు మీనుంచి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాను.' అన్నాను.

ఆనందంగా చెయ్యూపుతూ తన పనిమీద తను వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోతున్న అతనివైపు కాసేపు అలాగే చూచి, నవ్వుకుంటూ నా పని నేను మొదలు పెట్టాను.