“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, అక్టోబర్ 2015, శుక్రవారం

అమరావతి - డొల్లకబుర్లు

అమరావతి అనే పేరుతో రాజధానిని ధూంధాం గా శంకుస్థాపన చేశారు. డిల్లీనుంచి వచ్చిన ప్రధానమంత్రి గారేమో పిడికెడు మట్టీ ఒక సీసాలో నీళ్ళూ ఇచ్చి,డబ్బుగురించి మాత్రం ఏ హామీలూ ఇవ్వకుండా వెనక్కు వెళ్ళిపోయారు.రాజధానిని కట్టడానికి డబ్బులు లేవంటున్నారు.

అందుకని,రాజధానికి కావలసిన ఇటుకల్ని ప్రజలను దానం చెయ్యమంటున్నారు."కేపిటల్ సెస్" పేరుతో ఒక ఇరవై ఏళ్ళ పాటో ముప్పై ఏళ్ళ పాటో ప్రజల్ని టాక్స్ కట్టమంటున్నారు.స్టీలూ, సిమెంటూ కూడా ఇంటింటినుంచీ అడుక్కుంటే ఇంకా బాగుంటుంది కదా !

మరోవైపు - ప్రజలను ఒప్పించి సేకరించిన భూములను ప్రభుత్వ రేటుతో బడా కంపెనీలకు కారుచౌకగా కట్టబెడతారు.గజాన్ని వందల్లో కొన్న ఆ సైట్లు కొనీ కొనకముందే కోట్లకు వెళ్ళిపోతాయి.బాగుపడేది ఎవరయ్యా అంటే సింగపూర్ జపాన్ మలేషియా కంపెనీలు.కాంట్రాక్టర్లు ఎలాగూ లోకల్ వాళ్ళే ఉంటారు, వారు ఎలాగూ అధికార పార్టీవారే అయి ఉంటారు గనుక వారూ బాగుపడతారు.రోడ్లు వేసిన డబ్బు తిరిగి రావాలి అంటూ అటువైపుగా వెళ్ళే ప్రజల దగ్గర టోల్గేట్ పేరుతో డబ్బు ఎలాగూ వసూలు చేస్తారు.

ఇంతా చేస్తే రాజధాని ఇంకా మొదలు కానేలేదు.అప్పుడే మంగళగిరిలో పనిమనుషులు దొరకడం మానేశారు.ఎందుకంటే వాళ్ళందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోయారట.గుంటూరు విజయవాడలలో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితులు అప్పుడే మొదలైపోతున్నాయి.గుంటూరులో ఒక ఫ్లాట్ కొనే డబ్బుతో ఈరోజు హైదరాబాద్ లో రెండు ఫ్లాట్లు కొనవచ్చు.అంత దారుణంగా ఇక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి.

వెరసి ఎటుచూచినా మోసపోయేదీ బాదుడుకు గురయ్యేదీ సామాన్యుడేనన్నమాట.పెద్దవాళ్ళ మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రకారం చీల్చబడిన రాష్ట్రహోమంలో సమిధ సామాన్యుడేనన్నమాట.

ఈ రాజకీయ చెదరంగం అలా ఉంచుదాం. ఇంకొక కోణంవైపు దృష్టి సారిద్దాం.ఇది మనుషుల డొల్ల అంతరంగాలనూ కపట స్వభావాలనూ మత వ్యాపారాలనూ హైలైట్ చేసే కోణం.

అమరావతి గురించి పేపర్లలో మీడియాలో ఎక్కడ చూచినా బుద్దుడిని హైలైట్ చేస్తున్నారు.రెండు వేల ఏళ్ళ క్రితం ఇక్కడ బుద్ధమతం ఘట్టిగా వేళ్ళూనుకుని ఉన్నది.వజ్రయానం అనబడే బౌద్ధతంత్రం ఇక్కడే విలసిల్లింది.మహాయానం ఇక్కడే పుట్టింది.నాగార్జునుడు గుంటూరు జిల్లావాడే.ధాన్యకటక విహారం ఒక పెద్ద విశ్వవిద్యాలయం.ఇది నలందాకూ తక్షశిలకూ విక్రమశిలకూ ఏమీ తీసిపోయినది కాదు. అంటూ బుద్ధమతాన్నీ బుద్దుడినీ నాగార్జునుడినీ హైలైట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

ఇన్నాళ్ళూ ఈ బుద్ధుడూ నాగార్జునుడూ మహాయానమూ వజ్రయానమూ ఏమైపోయాయి? ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? మా తాతలు నేతులు త్రాగారు. అని గప్పాలు కొడుతున్నారు కదా.మరి ఆ నేతివాసనలు ఇప్పుడేవి? ఆ బుద్ధమతం ఇప్పుడెందుకు ఇక్కడ భూతద్దంలో చూచినా కన్పించడం లేదు? అది ఎందుకు అదృశ్యమైపోయింది?

బుద్దుని బోధన ఏమిటో నేటి ఈ గప్పాలు కొడుతున్నవారికి ఏమైనా తెలుసా? నాగార్జునుడు ఏమి బోధించాడో అదైనా తెలుసా? మహాయానమూ వజ్రయానమూ ఏం బోధించాయో వాటి ఆచరణ విధానాలు ఎలా ఉంటాయో కనీసజ్ఞానమైనా ఈ ప్రచారాలు చేస్తున్నవారికి ఉన్నాయా?

పోనీ ఈ రకంగా బుద్ధభజన చేస్తున్న వారంతా, వారి హిందూమతాన్ని వదలిపెట్టి బుద్ధమతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? చస్తే ఆ పని చెయ్యరు. మారితే గీరితే క్రైస్తవమతంలోకి మారుతారు గాని బుద్ధమతం లోకి మారరు.ఎందుకంటే బుద్ధుడి దగ్గర డబ్బుల్లేవు.అటుచూస్తే క్రీస్తో పెద్ద భూస్వామి.క్రీస్తు దగ్గరైతే డబ్బులు రాలతాయి.బుద్దుడి దగ్గరేముంది బూడిద తప్ప?

అంబేద్కర్ ను ఫాలో అవుతామని చెప్పుకునే దళితులు కూడా క్రైస్తవంలోకి మారతారు గాని బుద్ధమతాన్ని స్వీకరించరు.అంబేద్కర్ బుద్ధమతాన్ని స్వీకరించాడు.కానీ ఆయన అనుచరులు క్రైస్తవంలోకి మారుతూ ఉంటారు.ఇదొక వింత.

అసలు హిందువులు గానీ, క్రైస్తవులు గానీ, ముస్లిములు గానీ, అనుసరించని బుద్ధుడి భజన సడన్ గా ఎందుకొచ్చిందయ్యా అంటే - ఒక్కటే కనిపిస్తున్నది.బుద్ధుడి పేరుతో సింగపూరు, జపాన్ మొదలైన దేశాలను దువ్వి  వాటి డబ్బులు ఇక్కడకు పెట్టుబడులుగా తేవాలని వీరి ప్లానేమో నాకైతే తెలియదుగాని, ఇలాంటి చెత్త ప్లాన్ లకు ఆయా దేశాలు ఎంతమాత్రం పడవని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.అవి పెట్టుబడిదారీ వ్యవస్థను ఫాలో అయ్యే దేశాలు.వాటికి మతం గితం ఏమీ లెక్క ఉండదు.వ్యాపారమే వాటి మతం.

అసలు మనిషనేవాడు ఫాలో అయ్యేది హిందూమతమూ కాదు, బుద్ధ మతమూ కాదు,క్రైస్తవమూ కాదు, ఇస్లామూ కాదు.మనిషి ఫాలో అయ్యేది డబ్బుమతం మాత్రమే.ఈలోకంలో అసలైన దైవం డబ్బే.దేవుళ్లంతా దాని ముందు బలాదూరే. ఎవరెన్ని మాటలు చెప్పినా ఇదే పచ్చినిజం.

డబ్బు సంపాదించే ప్రక్రియలో దేవుడినీ మతాన్నీ పాచికలుగా మనిషి వాడుకుంటాడు.ఇది నగ్నసత్యం.మతం పేరుతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఒక పెద్ద అనైతిక వ్యాపారం మాత్రమే.మన అమరావతిలో బుద్ధుడిని హైలైట్ చెయ్యడమూ ఇందులో ఒక భాగమేనని నా ఊహ.

బుద్ధుడి మీద నిజంగా అంత ప్రేమ ఉంటే - ఆయన చూపిన మార్గాన్ని వీరంతా ఎందుకు అనుసరించరు?బుద్ధుడు పూజలు వద్దన్నాడు, గుళ్ళూ గోపురాలూ వృధా అన్నాడు.యజ్ఞాలు యాగాలు వద్దన్నాడు,వేదాలు వల్లె వేస్తే దమ్మిడీ కూడా ఉపయోగం లేదన్నాడు.పురాణాలు పనికిమాలిన కధలన్నాడు.బలులు వద్దన్నాడు.పిచ్చిపిచ్చి నోములూ వ్రతాలూ దీక్షలూ తీసి అవతల పారెయ్యమన్నాడు.విగ్రహారాధన అసలే కూడదన్నాడు.మరి బుద్ధుడు బుద్ధుడు అని చించుకుంటున్న మనం, బుద్ధుడు చెప్పినదానిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన సూచించిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నామా? అమ్మో !! ఆపని మాత్రం చెయ్యం.ఆలాంటప్పుడు బుద్ధుడిని ఇలా హైలైట్ చెయ్యడం ఎందుకు? ఇది హిపోక్రసీ కాకుంటే ఇంకేమిటి?

బుద్ధుడిని నిజంగా ఫాలో అయితే - మనం ఇప్పుడు అనుసరిస్తున్న పాపులర్ హిందూమతమూ ఉండదు, క్రైస్తవమూ ఉండదు ఇస్లామూ ఉండదు.అసలైన బుద్ధమతం వీటన్నిటి కంటే ఉన్నతమైనది. మనం వీటిని ఒదులుకోలేము. కనుక మనం బుద్ధుడిని ఫాలో అవ్వలేము.మరి ఊరకే ఆయన్ను హైలైట్ చెయ్యడం ఎందుకు? ఆయన పేరుతో వ్యాపారం చెయ్యడానికా?

2006 లో అమరావతిలో కాలచక్ర సెరెమనీ జరిగింది.ఆ సమయంలో ఆ ఇరవై రోజులూ నేనూ అక్కడ ఉన్నాను.టిబెటన్ తంత్రమాస్టర్స్ తో పరిచయం చేసుకుని వారితో స్నేహం కోసం ఆ ఇరవైరోజులూ నేను ప్రతిరోజూ పొద్దున్నే గుంటూరు నుంచి అమరావతికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి రాత్రికి ఇంటికి చేరేవాడిని. అప్పుడు జరిగిన ఒక హాస్యాస్పదమైన సంఘటనకు నేను ప్రత్యక్షసాక్షిని.

వినండి.

ఒకరోజున దలైలామా అక్కడకు వచ్చారు.ఒక స్టేజీ మీద నుంచి ఉపన్యాసం ఇచ్చారు.ఆడియన్స్ లో నేనూ ఉన్నాను.స్టేజీకి చాలా దగ్గరగా ఉన్నాను. స్టేజీమీద దలైలామాతో బాటు రాజకీయ నాయకులు అందరూ ఆసీనులై ఉన్నారు.అందరూ ఏవేవో మాట్లాడుతున్నారు.వాళ్ళ మాటలు వింటుంటే నాకు చచ్చే నవ్వొస్తున్నది.ఎందుకంటే మతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు.కానీ దానిగురించి వాళ్లకు ఏమీ తెలియదు.

ఇంతలో ఒక MP గారు లేచి మాట్లాడటానికి మైకు అందుకున్నారు.ఒక అద్భుతమైన స్టేట్ మెంట్ వదిలారు.

'21 శతాబ్దానికి గాడ్ ఎవరయ్యా అంటే దలైలామానే." అన్నారు ఆ MP గారు.

ఈ స్టేట్మెంట్ కు దలైలామా ఎలా స్పందిస్తాడా అని కుతూహలంతో నేను దలైలామా ముఖంవైపు చూచాను.దలైలామా ముఖంలో అప్పుడు కనిపించిన భావాన్ని నేను వర్ణించలేను.ఆ MP వైపు ఒక విధమైన అసహ్యంగా ఆయన చూచాడు.

'ఓరి వెర్రి వెంగళప్పా ! దేవుడనేవాడు ఎక్కడా లేడు అని చెప్పిన బుద్దుడిని ఫాలో అయ్యేవాడినిరా నేను.నన్ను దేవుడంటావేమిటిరా సన్నాసీ?' - అన్న భావం ఆయన ముఖంలో నాకు కనిపించింది. నవ్వుకున్నాను.

అసలు - ఒక్కొక్క సెంచరీకి ఒక్కొక్క దేవుడు ఉంటాడనేది ఆ MP గారి భావంగా నాకా స్టేట్మెంట్ తో అనిపించింది.నవ్వాలో ఏడవాలో తెలియక వారి వైపు అలా చూస్తుండిపోయాను.

ఇదే దలైలామా, కంచిశంకరాచార్య జయేంద్రసరస్వతి గారిని కూడా కలిశాడు.ఆ సమయంలో శంకరాచార్య ఒక హోమం చేస్తున్నాడు. దలైలామాను కూడా హోమానికి ఆహ్వానించాడు. ఆ హోమం జరుగుతున్నంత సేపూ దలైలామా మౌనంగా ధ్యానంలో ఉండిపోయాడు. వీరిద్దరిలో దలైలామానే నాకు నచ్చుతాడు.ఎందుకంటే ఆయన తన సిద్ధాంతానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాడు.పరమాద్వైతి అయిన ఆదిశంకరుల అనుచరుడైన జయేంద్రగారు హోమం చెయ్యడం ఏమిటి?విచిత్రం కాకపోతే?ఆ సమయంలో కూడా దలైలామా ఒక చూపు చూచాడు జయేంద్రగారి వైపు. అమరావతిలో MP వైపు ఆయన చూచిన చూపే ఆ ఫోటో చూచినప్పుడు కూడా నాకు గుర్తొచ్చింది. 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే - మతాల గురించి ప్రాధమిక అవగాహన కూడా లేని మన నాయకులూ ప్రజలూ గురువులూ మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి.ఇదంతా ఒక పెద్ద వ్యాపార ప్రహసనం.మనకు ఏదైనా వ్యాపార వస్తువే. 'కాదేదీ దోపిడీకనర్హం' అన్నదే వారి మూలసూత్రం.దీనికి దేవుడు కూడా మినహాయింపు ఏమీ కాడు.ఇంకా గట్టిగా చెప్పాలంటే మతమే ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార వస్తువు.

ప్రజల అజ్ఞానాన్నీ భయాన్నీ దురాశనీ తెలివైనవాళ్ళు వాడుకుని దాన్ని క్యాష్ చేసుకోవడమే ఏ మతంలోనైనా జరిగేది.ఏ పాపులర్ మతమైనా ఇంతే.ఈ గేం అస్సలు పనికిరాదని బుద్ధుడు చెప్పాడు.మతం పేరుతో మాయ వద్దన్నాడు. ప్రజలలో అజ్ఞానాన్నీ దురాశనీ ఇంకాఇంకా పెంచి పోషించవద్దన్నాడు. నిజం చెప్పిన పాపానికి ఆ బుద్ధుడినే మనం తీసి అవతల పారేశాం.ఎందుకంటే మనకు నిజాలు నచ్చవుగా మరి?

మనం పాటించని మతాన్నీ, ఆరాధించని మహనీయుడినీ, ఊరకే ప్రొజెక్ట్ చెయ్యడం ఎందుకో - రాజధాని పేరుతో ఈ మాయమతబాదుడు ఏమిటో - అర్ధం కాకపోవడం సామాన్యుడు చేసుకున్న పాపమా? లేక కలిమాయలో ఇది కూడా ఒక భాగమా?