“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జూన్ 2015, శుక్రవారం

మేం కుండలినిని రైజ్ చేస్తాం !!!

నిన్న పొద్దున్న ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది.

'హలో' అన్నాను.

'మేం యోగాచార్యులం మాట్లాడుతున్నాం' అని అవతలనుంచి ఒక స్వరం దర్పంగా వినిపించింది.

పొద్దున్నే మంచి జోక్ విన్నానుకున్నా.

'చెప్పండి' అన్నా నవ్వుకుంటూ.

'మేము యోగా శిక్షణ ఇస్తాము.రైల్వేవారికి శిక్షణ ఇద్దామని ఆఫీసులో కనుక్కుంటే మిమ్మల్ని అప్రోచ్ అవమన్నారు.అందుకని మీకు ఫోన్ చేస్తున్నాము' అన్నాడాయన.

ప్రధానమంత్రి మోడీగారు యోగాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల యోగా నేర్పెవారికి డిమాండ్ ఉన్నట్టుండి పెరిగిపోయింది.

'మీరు ఏ యోగాలో శిక్షణ ఇస్తారు?' అడిగాను.

'మా దగ్గర అన్నీ ఉన్నాయి.మా సంస్థకు ఎన్నో దేశాలలో బ్రాంచీలున్నాయి. ఎన్నో యూనివర్సిటీలతో మాకు సంబంధాలున్నాయి.'

'మంచిది.మీరు ముఖ్యంగా ఏం నేర్పుతారు?' అడిగాను.

'మేము మీ కుండలినిని రైజ్ చేస్తాము' అన్నాడాయన.

వస్తున్న నవ్వును ఆపుకుంటూ-"కుండలినా అదేంటి?" అనడిగాను.

'అదంతా మా క్లాస్ లో చెబుతాము.మీరు చేరితే అన్నీ వివరిస్తాము. కుండలినిని మేము ఆజ్ఞాచక్రం దాకా రైజ్ చేస్తాము.ఆ తర్వాత దానిని సహస్రారం వరకూ చేరుస్తాము.' అన్నాడాయన కుండలిని అంటే అదేదో తన సర్వెంట్ అయినట్లు.

నాకు విపరీతమైన నవ్వొచ్చింది.

నవ్వాపుకుంటూ -- 'మీరేమనుకోకపోతే ఒక్కవిషయం అడగవచ్చా?' అన్నాను.

 'అడగండి' అన్నాడాయన.

'నా చిన్నప్పటినుంఛీ ఇలా కుండలినిని రైజ్ చేస్తాం అని చెప్పేవారిని ఎంతోమందిని చూస్తున్నాను.కానీ అంత సమర్ధులను ఒక్కరిని కూడా ఇంతవరకూ చూడలేదు.మీరు నిజంగా ఆ పనిని చెయ్యగలను అంటే, నేనే మీ దగ్గరకు వెంటనే బయలుదేరి వస్తాను.కానీ మీరు చెప్పినట్లుగా చెయ్యలేకపోతే మాత్రం ఆ తర్వాత నాతో చాలా తేడా వస్తుంది.అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. రమ్మంటారా?' అన్నాను సీరియస్ గా.

ఆయన వెంటనే మాట మార్చేశాడు.

'అలా కాదండి.మేము టెక్నిక్ నేర్పిస్తాము. ఆ తర్వాత మీ శ్రద్ధను బట్టి మీ కుండలినిని మీరే రైజ్ చేసుకోవాలి.' అన్నాడు.

'అదేంటి? ఇప్పుడేగా మీ కుండలినిని మేం రైజ్ చేస్తాం అన్నారు.ఒక్క క్షణం కూడా కాకముందే ఇలా అంటున్నారేంటి? యోగమంటే మీ దృష్టిలో ఇలా మాట మార్చడమా?' అన్నాను.

ఏమనుకున్నాడో ఏమో -- 'రైల్వేలో ఉద్యోగులందరికీ యోగా నేర్పించవచ్చని ఫలానా ఆయనను మొదట కలిశాము.ఆయన మీ పేరును చెప్పారు.అందుకే మీకు ఫోన్ చేస్తున్నాము.' అని మళ్ళీ రికార్డ్ మొదటినుంచీ తిప్పడం ప్రారంభించాడు.

'మాకు కుండలిని వద్దండి.మామూలు యోగా చాలు.' అన్నాను.

'అదీ మాదగ్గరుంది మీక్కావాలంటే' అన్నాడు.

వస్తువు తమ దగ్గర లేకపోయినా బేరం వదులుకోలేని వ్యాపారస్తుడి లాగా అనిపించాడు ఆమాటతో.

ఈయనతో ఇంక మాటలు అనవసరం అని - 'సారీ.నేను మీకు సాయం చెయ్యలేను.నాకు ఫోన్ చెయ్యమని మీకు ఎవరైతే చెప్పారో వారినే కలవండి.' అని ఫోన్ కట్ చేశాను.

నా చిన్నప్పటి నుంచీ కొన్ని వందలమంది కుండలిని గురించి మాట్లాడేవారిని చూచాను.వారిలో పెద్ద పెద్ద గురువులు కూడా ఉన్నారు.కానీ వారిలో ఒక్కరికి కూడా దాని అసలైన రహస్యం తెలియదు.కుండలినిని ఇతరులలో రైజ్ చెయ్యడం అంటే కాఫీ త్రాగినంత సులభం అని వీరు అనుకుంటారు.అసలు అదేంటో వీరికి ఏమాత్రం తెలియదు.ఏవో నాలుగు పుస్తకాలు చదివి మూలాధారం ఆజ్ఞాచక్రం అని మాటలు చెబుతూ ఉంటారు.

అసలు ఒక మనిషిలో కుండలిని రైజ్ అయితే ఏమౌతుంది? అతనిలో ఏయే లక్షణాలు కనిపిస్తాయి? ఒక్కొక్క చక్రాన్ని దాటే సమయంలో ఏయే అనుభవాలు కలుగుతాయి? అన్న విషయం కరెక్ట్ గా అనుభవంతో చెప్పగల మనిషిని నేను ఇంతవరకూ చూడలేదు.ఇక ముందు చూస్తానని నమ్మకం కూడా నాకు లేదు.అలాంటి మనిషి ఒకడు ఈ ప్రపంచంలో నేడు జీవించి ఉన్నాడని కూడా నేననుకోవడం లేదు.

కుండలినిని తమ శరీరంలో రైజ్ చెయ్యడమే లక్షమందిలో ఒక్కడు మాత్రమె సాధించగలడు.అలాంటిది ఇతరులలో దానిని రైజ్ చెయ్యాలంటే --అది అవతార పురుషులవల్ల మాత్రమే అయ్యే అద్భుతం.రోడ్డుమీద పొయ్యే ఎవడుబడితే వాడు ఆపనిని చస్తేకూడా చెయ్యలేడు.

ఆ సంగతి నాకు బాగా తెలుసు.

కానీ నాలుగు మాటలు నేర్చిన ప్రతివాడూ శక్తిపాతం అనీ, కుండలిని రైజ్ చేస్తాం అనీ మాయమాటలు చెప్పి లోకాన్ని మోసం చేస్తున్నారు.దైవం దృష్టిలో ఇది మహా ఘోరమైన అపరాధం.ఆ సంగతి వీరికి అర్ధం కావడం లేదు.

యోగం అనబడే ఒక పెద్ద భాండాగారంలో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి.వాటిలో ఒకదానిని తీసుకుని ఒకాయన ఒక స్కూల్ పెడుతున్నాడు.ఇంకొక టెక్నిక్ ను తీసుకుని ఇంకొకాయన ఇంకొక స్కూల్ పెడుతున్నాడు.ఆయా టెక్నిక్స్ కు వారివారి బ్రాండ్ ముద్ర వేసుకుని ఈ గురువులు బ్రతుకుతున్నారు.కానీ అసలు ఈ టెక్నిక్స్ ను కనిపెట్టి కోడిఫై చేసి మనకు అందించిన మహాయోగులు మాత్రం ఊరూపేరూ లేకుండా పోయారు.వారు పేరు ప్రతిష్టలను ఆశించలేదు.మానవాళిని ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చగలిగితే చాలని వారనుకున్నారు.ఎంతో అద్భుతమైన యోగశాస్త్రాన్ని మనకు అందించి వారు మౌనంగా తెరచాటుకు వెళ్ళిపోయారు.వారిని మాత్రం నేడు ఎవ్వరూ స్మరించడం లేదు.కానీ వారిచ్చి పోయిన ఆస్తిని మాత్రం అనుభవిస్తున్నారు.

నేడు గురువులందరూ వారి వారి బ్రాండ్ యోగాను ప్రచారం చేస్తున్నారు కానీ ఈ బ్రాండ్ లూ,రకరకాల టెక్నిక్సూ అన్నీ ఎందులోనైతే అంతర్భాగాలో ఆ అసలైన 'యోగాన్ని' మాత్రం ఎవరూ చెప్పడం లేదు.

ఇలాంటి దొంగ గురువుల బారిన పడే అమాయకులు ఈరోజున సమాజంలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు.అది వారి ఖర్మ.బయట ప్రపంచంలో ఉన్నట్లే, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మాయ ఉన్నది.

స్వచ్చమైన మనస్సు,దైవం పట్ల అచంచలమైన విశ్వాసాలు మాత్రమె ఈ మాయనుంచి మనల్ని రక్షించగలవు.అవి లేనప్పుడు, ఇలాంటివారి మాయలో చిక్కుకొని విలువైన కాలాన్ని, జీవితాన్నీ పోగోట్టుకోక తప్పదు.