“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జూన్ 2015, ఆదివారం

ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు

ఈరోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరీష్ సూరపనేని గుంటూరుకు వచ్చాడు.

'ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను.మీ ఇంటి అడ్రస్ చెబితే వచ్చి కలుస్తాను.' అని ఫోన్ చేశాడు.

'ఏం పని మీద కలవాలనుకుంటున్నారు?' - ఇలా అడగడం కొంచం దురుసుగా అనిపించినా తప్పక అడిగాను.

'ప్రత్యేకంగా పనేమీ లేదు.ఊరకే కలుద్దామని వచ్చాను' అన్నాడు.

'పనేమీ లేకుంటే కలవడం ఎందుకు? పిచ్చాపాటీ కబుర్లు నేనిష్టపడను.' అన్నాను.

ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే, నా సాధనకే నాకు సమయం సరిపోదు.అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను. ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను. చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.ఇక వారివారి కష్టాలూ కాకరకాయలూ కుటుంబ విషయాలూ లోకాభిరామాయణమూ చెబుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

"ఇన్నాళ్ళూ నా భావజాలం చదివి ఇదా వీరు అర్ధం చేసుకున్నది?" అనిపిస్తుంది.కనుక వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.

అవతలనుంచి నిశ్శబ్దం. బహుశా చిన్నబుచ్చుకున్నాడేమో అనిపించింది.

'సరే.రండి.కానీ ఒక్క పదిహేను నిముషాలు మాత్రం మీతో మాట్లాడగలను.' అన్నాను.

కాసేపట్లో గిరీష్ ఇంటికి వచ్చి చేరాడు.

విజయవాడనుంచి హైదరాబాద్ వెడుతూ మధ్యలో నన్ను చూచి వెళదామని గుంటూరుకు వచ్చానని చెప్పాడు.శ్రీశైలం సాధనా సమ్మేళనానికి రావాలనుకుని కూడా రాలేకపోయానని అన్నాడు.

నేనేమీ రెట్టించలేదు.

కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక - 'ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. కాసేపయ్యాక మళ్ళీ ధ్యానం కొనసాగించవచ్చా?' అడిగాడు.

'అసలు చెయ్యవలసింది అదే. ఆలోచనలలో కొట్టుకుపోతున్నామన్న తెలివి వచ్చాక మళ్ళీ ధ్యానాన్ని సాగించాలి' అన్నాను.

అనవసరమైన కబుర్లు పెట్టుకోకుండా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు గనుక కొన్ని విషయాలు చెబుదామని అనిపించింది.

'పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో ఇదే అన్నారు. యోగానికి ఆయనిచ్చిన నిర్వచనం చిత్తవృత్తి నిరోధం.చిత్తం అనే పదానికి స్థూలంగా మనస్సు అని అనుకోవచ్చు.రెండూ నిజానికి ఒకటి కాకపోయినా సమానార్ధకాలే.

మనస్సులో ఆలోచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. చిత్తంలో అలా కాదు. అక్కడ ఎన్నో జన్మల సంస్కారాలు పోగుపడి ఉంటాయి.నవీన కాలపు సైకాలజీ చెప్పే "సబ్ కాన్షస్ మైండ్" నే చిత్తం అని అనుకోవచ్చు.అక్కడ ఉన్న సంస్కారాల అనుగుణంగా ఆలోచనలు తలెత్తి పైకి వస్తుంటాయి.ఒక సరస్సు అడుగున బుడగలు ఏర్పడి పైకి ఉబికి వచ్చినట్లు ఇది జరుగుతుంది.ఆ బుడగలకు మూలం సంస్కారాలు.అవి మనస్సు అడుగు పొరల్లో దాగి ఉంటాయి. అవి ఆలోచనలుగా రూపాంతరం చెందకుండా మూలంలోనే వాటిని ఆపడమే యోగం అని మహర్షి అన్నారు.అది చాలా లోతైన స్థాయి.మీరు అంత చెయ్యలేకపోయినా కనీసం ఆలోచనలలో పడి కొట్టుకుపోకుండా ఉంటే చాలు. ధ్యానం అదే కుదురుతుంది.' అన్నాను.

'ఆలోచన రాకుండా ఉండటం అనేది ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమేనా? ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలా? - అడిగాడు.

'ధ్యానంలో ఉన్నకాసేపు అలా ఉండి బయటకు రాగానే మామూలు అయిపోతే ఏమీ ఉపయోగం లేదు.ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలి.' అన్నాను.

'ఎప్పుడూ ఆలోచన అనేదే లేకుండా ఉంటే బయట ప్రపంచంలో ఫెయిల్ అవుతామేమో కదా?' అడిగాడు గిరీష్.

'అదేమీ ఉండదు.మొదట్లో అవగాహనా లోపం వల్ల అలా అనిపిస్తుంది.మన మనశ్శక్తిలో పదిశాతం ఉపయోగిస్తే చాలు.బయట పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు.అదే సమయంలో మిగతా 90% మనస్సును ధ్యానంలో ఉంచవచ్చు.ఇది సాధ్యమే.అయితే ఇలా చెయ్యగలగాలంటే దానికి తగినంత సాధనాశక్తి ఉండాలి.మాటలు తక్కువ, సాధన ఎక్కువ చెయ్యాలి.

సాధన మొదటి దశలలో ఉన్నప్పుడు ,లోపలా బయటా బేలెన్స్ చేసుకోవడం కష్టమౌతుంది.ఆ సమయంలో ఇలా అనిపిస్తుంది.అందుకే ధ్యానం ఇప్పుడే మొదలు పెట్టినవాళ్ళు బయట ప్రపంచంలో తప్పకుండా ఫెయిల్ అవుతూ ఉంటారు.కాలక్రమేణా నీకు సాధనలో పట్టుచిక్కిన తర్వాత ఈ బాధ ఉండదు. అప్పుడు అన్ని పనులూ చేస్తూ కూడా నిరంతరం ధ్యానంలో ఉండవచ్చు

అదీగాక సక్సెస్ - ఫెయిల్యూర్ అనేవాటి నిర్వచనాలు మనిషి మనిషికీ మారుతాయి.సక్సెస్ అనేదానికి లోకం ఇచ్చిన నిర్వచనాన్ని మనం అనుసరించవలసిన పనిలేదు.లోకం అనుకునే సక్సెస్ ఒక్కటే నీ గమ్యమైతే నీకు ధ్యానం కుదరదు.ఆధ్యాత్మికంగా నువ్వెప్పటికీ ఎదగనూ లేవు. మార్మికుల సక్సెస్ నిర్వచనం వేరుగా ఉంటుంది.' చెప్పాను.

'ధ్యానం కొన్నిసార్లు బాగా కుదురుతుంది.కొన్నిసార్లు కుదరదు.ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి.' అన్నాడు.

'సహజమే.మనసే సాధనకు అడ్డు పడుతూ ఉంటుంది. సాధనకు ఆలోచనలు అడ్డువస్తాయి.తీరని కోరికలు అడ్డు వస్తాయి.బలంగా ఉన్న సంస్కారాలు అడ్డువస్తాయి. ఇంద్రియాలు అడ్డు వస్తాయి.అది విచిత్రం  ఏమీకాదు.ఇదంతా మనసు చేసే గారడీ.

ఇంతాచేస్తే తప్పు మనస్సుది కాదు.అది ఒక పరికరం.ఒక కత్తి వంటిది. దానితో ఆపరేషనూ చెయ్యవచ్చు. హత్యా చెయ్యవచ్చు. ఇన్నాళ్ళూ నువ్వు దానితో హత్యలు చేస్తున్నావు.ఇప్పుడు ఆపరేషన్ చేద్దామని నిశ్చయించుకున్నావు.ఆ నిశ్చయం కూడా బలమైనది కాదు.ఒకరోజు గుర్తుంటుంది.మర్నాడు మర్చిపోతావు.మళ్ళీ హత్య చేస్తావు.ఇన్నాళ్ళూ హత్యలకు అలవాటు పడిన మొద్దుకత్తికి సానపెట్టి ఆపరేషన్ కు సరిపోయే విధంగా దానిని నీవు మార్చాలి.అలా మారడం దానికి ఇష్టం ఉండదు.అందుకే అది ఎదురు తిరుగుతుంది.

అసలు ధ్యానం చెయ్యాలంటే దీక్ష అనేది తప్పనిసరిగా తీసుకోవాలి.లేకపోతే ధ్యానం ఎలా చెయ్యాలో ఎలా తెలుస్తుంది?ధ్యానాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని వందల రకాలున్నాయి.వాటిల్లో మనకు సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.మనకంత తెలివి ఉండదు కనుక గురువు చెప్పిన బాటలో నడవాలి.పట్టుదలతో నడవగా నడవగా దారి అర్ధమౌతుంది.' అన్నాను.

'దీక్షకు కావలసిన అర్హతలు ఏమిటి" అడిగాడు.

'తపనే అర్హత.అది తప్ప వేరే అర్హతలు ఏమీలేవు.కులం, మతం, ప్రాంతం, వయస్సు,నీ స్టేటస్ - ఇవేవీ అర్హతలు కావు. దైవాన్ని చేరాలన్న తపనా, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనలే ముఖ్యం.' అన్నాను.

'అదెలా వస్తుంది?' అడిగాడు.

'ముందుగా మనిషికి కొన్ని ఆలోచనలు కలగాలి."మనిషి జీవితంలో మౌలికప్రశ్నలు"- అనే ఒక పోస్ట్ లో వ్రాశాను. అసలు ఈ జీవితం ఏమిటి? ఎందుకు పుట్టాను?చనిపోయిన తర్వాత ఏమౌతాను?పుట్టకముందు ఎక్కడున్నాను?ఇన్నాళ్ళూ బ్రతికిన ఈ బ్రతుకులో ఏం సాధించాను?ఈ బాంధవ్యాలూ స్నేహాలూ నిజమైనవేనా?నిలుస్తాయా? ఎవరు నిజంగా నావాళ్ళు?' మొదలైన ప్రశ్నలు మనిషి గుండెల్లోంచి పొంగి రావాలి.అప్పుడు తపన కలుగుతుంది.ఒకవిధమైన ఆరాటం లోలోపల ఏర్పడుతుంది.అది రావాలి.అది బాగా పెరిగి పెరిగి ఒక వేదనగా మారాలి.అప్పుడు భగవంతుని కరుణతో గురువు దర్శనం కలుగుతుంది.దీక్ష అనేది అప్పుడే సాధ్యమౌతుంది.అంతవరకూ సాధ్యం కాదు.ఈ లోపల తీసుకున్న సరదా దీక్షలవల్ల ఉపయోగం కూడా ఉండదు.' అన్నాను.

'కొన్నాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు గురువు పరిచయం అవుతుంది' అంటారు కదా? - అడిగాడు.

'అది సరికాదు.ఎలా చెయ్యాలో తెలీకుండా ఏం చేస్తావు? నడవాలంటే దారి కనపడాలి కదా.దారి తెలీకుండా ఎలా నడుస్తావు?ఆధ్యాత్మిక ప్రయాణం ఒక రహస్యమైన నడక.దాని రహస్యాలు ఎక్కడా పుస్తకాలలో ఉండవు.అవి సరాసరి గురువునుంచి శిష్యునికి ప్రసారం అవుతాయి.పుస్తకాలలో కనిపించేది అంతా పొట్టు మాత్రమే.అసలైన మార్గం రహస్యంగా ఉంటుంది. గురువు ద్వారా ఆ మార్గం సుగమం అవుతుంది.ఆ తర్వాత ఎక్కడా ఆగకుండా,మనసు చేసే మాయలకు లోబడకుండా,మనం ఎంత గట్టిగా ఆ దారిలో నడుస్తాం అనేదే ముఖ్యం.

ఎంత జాగ్రత్తగా ఉన్నా మనస్సు మనల్ని పడేస్తుంది.పడటం తప్పు కాదు. అందరూ పడతారు.కానీ తెలివి తెచ్చుకుని లేచి మళ్ళీ నడక సాగించాలి.ఈ సారి మళ్ళీ పడకుండా ఉండాలి.అప్పుడు మనస్సు ఇంకో రకంగా పడేస్తుంది.మళ్ళీ బుద్ధి తెచ్చుకుని నడక సాగించాలి.ఈ విధంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. తప్పులు చేస్తూ దిద్దుకుంటూ అది ముందుకు సాగుతుంది.' అన్నాను.

'ధ్యానంలో నిదర్శనాలు ముఖ్యమా?' అడిగాడు.

'ముఖ్యంకాదు.వాటికోసం మనం సాధన చెయ్యకూడదు.అవి వస్తాయి. కనిపిస్తాయి.కానీ వాటికోసం మనం చూడకూడదు. ప్రయాణం చేసేవాడికి గమ్యం మీద మాత్రమే దృష్టి ఉండాలి. కానీ మైలురాళ్ళ మీద దృష్టి ఉండకూడదు.దారిలో అవి వచ్చినపుడు 'ఓహో ఇంతదూరం వచ్చానా?' అని తెలుస్తుంది. కానీ అక్కడే ఆగరాదు.' అన్నాను.

'మనం సరియైన దారిలో నడుస్తున్నామా లేదా అని తెలుస్తుందా?' అడిగాడు.

'అలాకాదు.సరియైన దారిలోనే ఉంటాము.గురువు మనకు సరియైన దారిని కాకుండా తప్పుదారిని ఎందుకు సూచిస్తాడు?అది సరియైన దారే.కాకపోతే, మనం ఎంతవరకు వచ్చాము?మనలో దిద్దుకోవలసిన లోపాలు ఎన్ని ఉన్నాయి?ఎక్కడెక్కడ ఉన్నాయి?'--మొదలైన విషయాలు అర్ధమౌతాయి. వాటిని దిద్దుకుంటూ నడక సాగించాలి.

నిదర్శనాలు కూడా నీవున్న స్థాయిని బట్టి కలుగుతాయి.సాధనలో ఎన్నో లెవల్స్ ఉన్నాయి.నీవున్న స్థాయిని బట్టి నీకు నిదర్శనాలు కనిపిస్తాయి. తక్కువ స్థాయులలో ఉన్నపుడు కలలు మొదలైనవి వస్తూ ఉంటాయి.పై స్థాయిలలో అయితే దేవతాదర్శనాలు,మహనీయులు కనిపించి మాట్లాడటం, సూచనలు ఇవ్వడం,ఇతర లోకాలతో సంబంధం ఏర్పడటం మొదలైనవి కలుగుతాయి.కొన్ని శక్తులు కూడా వస్తాయి.ఎక్కడో ఎవరో చెప్పుకుంటున్న మాటలను నీవు వినవచ్చు.ఎక్కడో జరుగుతున్నవాటిని నీ మనస్సు తెరమీద స్పష్టంగా చూడవచ్చు.వీటినే దూరశ్రవణం,దూరదర్శనం అంటారు. ఇంకా ఎదిగితే, సంకల్ప మాత్రంతో ఎక్కడో ఉన్నవారికి నీవు సాయపడవచ్చు. వారు ఉన్నచోటికి నీవు సూక్ష్మశరీరంతో వెళ్ళవచ్చు.వారికి స్వప్నంలో నీవు కనిపించి సందేశాలు ఇవ్వవచ్చు.ఇవన్నీ సాధ్యాలే.అయితే వీటికోసం మనం ఆత్రపడకూడదు.కానీ మార్గమధ్యంలో అవి వచ్చే మాట వాస్తవమే.' అన్నాను.

గిరీష్ మౌనంగా వింటున్నాడు.

'మనిషి ఎక్కువగా బయట వస్తువులమీదా మనుషుల మీదా ఆధారపడతాడు.ఎప్పుడూ ఏదో ఒకటి కోరుతూ ఉంటాడు.అందుకే మన దృష్టి ఎప్పుడూ బయటవైపే ఉంటుంది.ఇదొక పెద్ద పొరపాటు.ఈ పొరపాటు క్రమేణా ఒక రోగంగా మారుతుంది.ఈ రోగం ముందుగా నయం కావాలి.ఈ అలవాటు ముందుగా మారాలి.

ఈ క్రమంలో కొందరు డబ్బుమీద ఆధారపడతారు.కొందరు పదవి మీద, ఇంకొందరు కులాహంకారం మీద, మరికొందరు అందచందాల మీదా, ఇంకొందరు ఆస్తిపాస్తులమీదా ఇలా రకరకాలుగా ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు.ఇవి పోవాలి.పోవాలంటే మనిషికి లోతైన చింతన ఉండాలి. ఆ చింతన నుంచి తపన బయలుదేరుతుంది.అంతేగాని ఏదో గాలివాటంగా బ్రతకకూడదు.

ఉదాహరణకు పదవినే తీసుకుందాం.పదవితో వచ్చే దర్పం ఎన్నాళ్ళు ఉంటుంది?మనం పుట్టుకతోనే పదవితో పుట్టామా?పోయాక పదవి ఉంటుందా?డబ్బైనా, అందమైనా,ఆస్తి అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా అంతేకదా?కొన్నాళ్ళకు ఇవన్నీ పోతాయి.అప్పుడు ఇన్నాళ్ళూ అవే సర్వస్వం అనుకున్న నీ గతేమౌతుంది?కనుక వాటిమీద నీవు ఆధారపడకూడదు. ఎప్పుడైతే నీకు వాటిమీద మోజు లేదో అప్పుడు నీవు ఎవరిమీదా ఆధారపడవు.ఏ వస్తువుమీదా ఆధారపడవు. నీమీదే నీవు ఆధారపడతావు. ఎప్పుడూ ఏమార్పూ లేకుండా ఉండే ఆత్మ మీదే నీవు ఆధారపడతావు. అప్పుడు నీ దగ్గర ఏ వస్తువున్నా లేకున్నా, ఎవరు నీతో కలసి ఉన్నా లేకున్నా,లోకం అనుకునే సక్సెస్ నీ దగ్గర ఉన్నా లేకున్నా - నీకేమీ తేడా ఉండదు.అలా నీవు ఉండగలిగితే అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా నీవు ఒక స్థాయికి చేరినట్లు లెక్క.ఆ తర్వాత ఇంకా పైనకూడా చాలా లెవల్స్ ఉన్నాయి.' అన్నాను.

'మీకుకూడా ఇంకా ధ్యానం అవసరమా? మీరు ఇప్పటికీ చేస్తూ ఉంటారా?' అడిగాడు.

నవ్వాను.

'చేస్తాను.నాకూ అవసరమే.నా ప్రయాణం ముగింపుకు రాలేదు.నడవవలసిన దారి ఇంకా చాలా ఉన్నది.నిజం చెప్పాలంటే ఈ దారికి అంతూపొంతూ కనిపించడం లేదు. దీనికి ఒక ముగింపు ఉందని కూడా నేననుకోవడం లేదు.నడచే కొద్దీ కొత్తకొత్త గమ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.ఒక శిఖరం అందితే,ఇంకా ఎత్తైన శిఖరాలు కన్పిస్తూనే ఉంటాయి.ఇదొక నిరంతర ప్రయాణం.కనుక ధ్యానం అవసరమే.

అది ఎవరికి అవసరం లేదంటే -- శ్రీరామకృష్ణులు,రమణమహర్షి, అరవింద యోగి,జిల్లెళ్ళమూడి అమ్మగారు వంటి కొందరికి మాత్రమే ధ్యానం యొక్క అవసరం ఉండదు.మిగతావారికి అది అవసరమే. ఎవరైనా సరే, మాకు ధ్యానం అవసరం లేదు.మేము ఆ స్థితిని దాటాము అని చెబితే నమ్మవద్దు.అది మోసం అయినా అయి ఉంటుంది.లేదా వాళ్ళు అజ్ఞానంతోనైనా మాట్లాడుతూ ఉంటారు.' అన్నాను.

ఆ తర్వాత తన చిన్నప్పుడు జరిగిన సంగతులు కొన్ని చెప్పాడు.అయిదేళ్ళ వయస్సులో తనొక చెరువులో మునిగిపోవడం,ముఖం మూసుకుని నీళ్ళలో ఉండికూడా ఊపిరి పీలుస్తూ ఉండటం, అయినా బ్రతికే ఉండటం, కాసేపటికి ఎవరో స్త్రీ నీళ్ళకోసం చెరువుకు వచ్చి నీళ్ళలో తేలుతున్న జుట్టును చూచి తనను బయటకు లాగారని చెప్పాడు.

"ధ్యానం చేస్తే నిబ్బరంగా ఉండగలుగుతాం, ఇంటర్వ్యూలలో బెదరకుండా చెయ్యగలుగుతాం"-అని విని,ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాననీ, మొదటిసారి ధ్యానం చేసినప్పుడు చాలా చక్కగా కుదిరిందనీ, తన మెడక్రింద శరీరం అంతా అసలు లేనట్టు అనిపించిందని, ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థితి రాలేదని చెప్పాడు.

నేనేమీ కామెంట్ చెయ్యలేదు.మౌనంగా విన్నాను.

కాసేపు మాట్లాడి సెలవు తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు.

నేను నా రోజువారీ కార్యక్రమాలలోకి ప్రవేశించాను.