“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, జూన్ 2015, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-10





'తారాస్తోత్రమ్' ఆవిష్కరణ ముందు రోజున జిల్లెళ్ళమూడి వెళ్లి వచ్చాము.ఉదయం నుంచీ బయలుదేరుదామని అనుకుంటే అది కాస్తా మద్యాన్నం 3 కి గానీ కుదరలేదు.సరే ఇందులో కూడా ఏదో దైవసంకల్పం ఉందని మౌనంగా ఉన్నాము.

గుంటూరు నుంచి పెదనందిపాడు మీదుగా ప్రయాణం.దారిలో నాగులపాడులో కాసేపు ఆగి సుబ్రమణ్యస్వామి దర్శనం చేసుకొని,మళ్ళీ ప్రయాణం సాగించి 5 కల్లా జిల్లెళ్ళమూడి చేరుకున్నాము.

నాగులపాడు గ్రామం మా అమ్మాయికి బాగా నచ్చేసింది.ఆ ఊరిమద్యలో ఉన్న చెరువూ అందులోని కలువ పూలూ ఇంకా బాగా నచ్చేశాయి.

'నాన్నా.మనం ఇలాంటి ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉందాం నాన్నా' అంది.

నేను నవ్వుతూ-' చివరకు అదే జరుగుతుందమ్మా.రాజధాని దెబ్బకు ప్రస్తుతం భూముల రేట్లు ఎలా పెరిగాయో చూస్తున్నావు కదా.వాటిని మనం ఎలాగూ కొనలేము.కనుక నేను రిటైరయ్యాక చివరకు ఏదో ఒక మారుమూల పల్లెటూళ్ళో ఒక చిన్న గుడిసెలోనే మనం ఉంటామేమో?' అన్నాను.

మా సంభాషణను మా అబ్బాయి మాధవ్ మౌనంగా వింటున్నాడు.

మేము వెళ్లేసరికి జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆలయం మూసి ఉన్నది.ఆరు గంటలకు తెరుస్తారని అన్నారు.ఆలయం మూసి ఉన్నా తెరిచి ఉన్నా మనకు బాధ లేదు గనుక, మూసిన తలుపుల నుంచే అమ్మ దర్శనం చేసుకొని,ఆఫీస్ వారితో కొంత సేపు మాట్లాడి,మేడ పైన ఉన్న అమ్మ గదికి వెళ్లి కాసేపు మౌనంగా కూర్చుని క్రిందకు వచ్చాము.

ఆర్నెల్లక్రితం చూచినదానికీ ఇప్పటికీ అక్కడ చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు నిర్మాణంలో ఉన్న పనులు అన్నీ ఇప్పుడు దాదాపుగా పూర్తి అయ్యాయి.అన్నపూర్ణాలయం (డైనింగ్ హాల్) పైన కడుతున్న హాలు చాలావరకూ పూర్తయింది.ఆశ్రమ ముఖద్వారానికి ఉన్న 'అందరిల్లు' అనే బోర్డు ఇప్పుడు అన్నపూర్ణాలయానికి బదిలీ అయ్యింది.దాని స్థానంలో 'శ్రీ విశ్వజననీ పరిషత్' అన్న బోర్డు వచ్చింది.అయితే రెండో అంతస్తులో అమ్మ ఉన్న ఇల్లును మాత్రం మార్చకుండా అలాగే ఉంచారు.

శ్రీవిద్యారహస్యం పుస్తకాన్ని ఆఫీసులో ఒక కాపీ ఇచ్చాను.వారి లైబ్రరీకి కావాలంటే మరికొన్ని ఇస్తానని చెప్పాను.రాత్రికి భోజనం చేసి వెళ్ళమని వారన్నారు.అమ్మ కూడా అలాగే అనేది.ఎవరు తనను చూడవచ్చినా,భోజనం చెయ్యకుండా వెళితే అమ్మకు నచ్చదు.అందుకని వారి మాటను అమ్మ ఆజ్ఞగా భావించి ఆలస్యమైనా సరే భోజనం చేసే బయలుదేరుతామని చెప్పాను.

'శ్రీవిద్యారహస్యం' పుస్తకం పేజీలు  తిప్పి చూస్తూ --' మీరు గుంటూరు లోనేకదా ఉండేది.మీకు కుర్తాళం స్వామివారు తెలుసునా? ఆయనకూడా కవిత్వాలు వ్రాశారు.' అని ఆఫీస్లో ఉన్న అన్నయ్య అడిగారు. 

ఎలా చెప్పాలా? అని కాసేపు మౌనంగా ఉన్నాను.

చివరకు నోరువిప్పి -'ఆయన నాకు తెలుసు.కానీ వారిమార్గం నాకు నచ్చదు. అందుకని ఆ గ్రూపు దగ్గరకు నేను వెళ్ళను' అని చెప్పాను.

'ఓహో అయితే మీది పూర్తిగా ఆత్మమార్గం అన్నమాట'- అని ఆయన అన్నారు.

దానికి నేనేమీ జవాబివ్వలేదు.

'పుస్తకం చదవండి అన్నయ్యా.నా భావజాలం మీకు అర్ధమౌతుంది.' అని మాత్రం చెప్పాను.

వసుంధరక్కయ్య దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడదామని అక్కయ్య ఉండే ఇంటికి దారి తీశాము.అక్కయ్య ఆరుబయటే కూచుని ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే నవ్వుతూ సాదరంగా ఆహ్వానించారు.ఒక డాక్టరూ నర్సూ ఆమెను పరీక్ష చేస్తున్నారు.ఏమిటా అని అడిగాము.కొద్దిగంటల ముందుగా,నడుస్తూ నడుస్తూ,నేలమీద పరిచిన కడప స్లాబ్స్ ఎగుడుదిగుడు వల్ల,తూలి పడబోయి,నాలుగైదు అడుగులు వేసి,పక్కనే ఉన్న చెట్టును పట్టుకుని ఆగానని చెప్పారు.అక్కయ్యకు పెద్దవయసు వచ్చేసింది.70 పైనే ఉంటాయని అనుకుంటాను.ఆమెకు డయాబెటీస్ ఉన్నది.కనుక దెబ్బలు,బెణుకులు త్వరగా తగ్గవు.

'అక్కయ్యకు ఏదైనా హోమియో మందు సూచించు' అని మాతోనే ఉన్న మా అమ్మాయికి చెప్పాను.ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తను ఎమర్జెన్సీ హోమియో కిట్ వెంట తెస్తుంది.అందులోనుంచి ఏదైనా మందును ఇస్తుందని నా ఆలోచన.

అక్కయ్య నవ్వుతూ- ' నాదగ్గర మందులున్నాయి.మా తమ్ముడు KSN Murty హోమియో డాక్టరే.ఆయన పేరును విన్నావా?' అని మా అమ్మాయిని అడిగింది.

తను లేదన్నట్లుగా తలూపింది.

నేను నవ్వుతూ -'ఆ తరం వాళ్ళ పేర్లు ఇప్పటి పిల్లలకు తెలీవక్కయ్యా. అంతెందుకు? ఇప్పుడు హోమియో చదువుతున్న పిల్లలకు హోమియోవైద్య విధానపు పయనీర్ల పేర్లే తెలీవు.' అన్నాను.

అవునన్నట్లు అక్కయ్య తలూపి కొనసాగించింది.

"తమ్ముడిని హోమియోవైద్యం చదవమని చెప్పినది అమ్మే.ఆ తర్వాత ఇక్కడి గవర్నమెంట్ హోమియో డిస్పెంసరీ లోనే తను పని చేశాడు.అమ్మ ఉన్నప్పుడే ఒకసారి అతనికి నెల్లూరుకు బదిలీ అయింది.కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికే అమ్మ బదిలీ చేయించింది.అమ్మ పోయిన తర్వాత గుడివాడ కాలేజీలోనూ,హైదరాబాద్ లోనూ పనిచేసి రిటైర్ అయ్యాడు.

తను ఇక్కడ ఉన్నపుడు ఊరిలో జనానికి కూడా చాలా బాగుండేది.ఎవరికి ఏ బాధ వచ్చినా హోమియోతో తగ్గించేవాడు.ఇళ్ళకు వెళ్లి మరీ వైద్యం చేసేవాడు.ఊరిజనానికి ధైర్యంగా ఉండేది.డబ్బులు తీసుకునే వాడు కాదు.అందుకని ఊరిలో జనం బట్టలు పెట్టడం మొదలుపెట్టారు.ఒకరిద్దరు అలా బట్టలు పెట్టాక -'నన్ను అమ్మ బయటికి పంపిస్తుందేమో,జనం చేత బట్టలు పెట్టిస్తున్నది.' అన్నాడు. అన్నట్లుగానే కొద్ది నెలల్లో తనకు బదిలీ వచ్చేసింది.ఆ తర్వాత ఇక్కడ ఆ పోస్ట్ ఖాళీగా ఉండిపోయింది."

'ఎందుకలా ఖాళీగా ఉంది?' అని మా అమ్మాయి అడిగింది.

'ఈ పల్లెటూరిలో ఉండటానికి ఏ డాక్టర్ ముందుకొస్తాడమ్మా?మనలాంటి వారికైతే ఇక్కడ పోస్టింగ్ అంటే ఒక అదృష్టంగా పొంగిపోతాం.కానీ నేటి డాక్టర్లలో ఎంతమందికి ఆధ్యాత్మిక చింతన ఉన్నదో చెప్పు? అందరూ సాయంత్రానికి తాగుళ్ళూ తందనాలూ,మెడికల్ ప్రొఫెషన్ ఎంత ఘోరంగా  ఉన్నదో నీవు చూస్తున్నావు కదా.ఇప్పటి తరానికి అప్పనంగా కోట్లు వచ్చి పడాలి.ఒకటి రెండేళ్లలో ఊరు మొత్తాన్నీ కొనేయాలి.అలాంటి మనుషులకు ఇలాంటి పల్లెటూరిలో వచ్చి ఉంటూ ప్రజలకు నిస్వార్ధంగా సేవ చెయ్యమంటే నచ్చుతుందా? ఈ ఊరు ఒక నరకంగా వారికి కనిపిస్తుంది.ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా ఎవరూ రారు.ఏదో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మార్చుకుంటారు.ఒకవేళ తప్పకపోతే బాపట్లలో ఉండి వారానికి ఏ రెండు రోజులో మొక్కుబడిగా వచ్చిపోతుంటారు.ఇక్కడ ఉండి నిజంగా వైద్య పరమైన సేవ చెయ్యాలంటే వారికి నిజమైన ఆధ్యాత్మిక చింతన ఉండాలి.ప్రస్తుత తరంలో అది ఎవరికీ లేదు.అందుకే ఇక్కడకు ఎవరూ రారు.' అన్నాను.

అక్కయ్య కూడా అవునన్నట్లుగా చూచింది.

వసుంధరక్కయ్య ఉండే వరసలోనే చివరి ఇంటిలో మల్లు అన్నయ్య ఉంటాడు.ఆ ఇంటివైపు చూస్తూ -'మల్లన్నయ్య వాళ్ళు లేరా అక్కయ్యా? ఇల్లు తాళం పెట్టి ఉన్నది?' అడిగాను.

అక్కయ్య నిర్వికారంగా చూస్తూ ఇలా అన్నది.

'మే ఐదో తేదీన మల్లు చనిపోయాడు.నెల కావస్తున్నది.'

'అవునా?' మేం ఆశ్చర్యపోయాం.

'అవును.పెద్దగా బాధకూడా పడలేదు.పోవడానికి ముందు ఒక రెండు వారాలు కామెర్లతో బాధపడ్డాడు.తగ్గినట్లే అనిపించింది.చివరలో ఒకరోజు మాత్రం కొంచం సుస్తీగా ఉన్నాడు.ఆ రాత్రి చనిపోయాడు.అంతకు నాలుగైదు రోజుల ముందు అమ్మ పల్లకీ ఊరేగింపు జరిగితే తను వచ్చి మోశాడు కూడా.అనాయాసంగా పోయాడు.' అన్నది అక్కయ్య.

'అందరికీ సుగతే నాన్నా'- అన్న అమ్మ మాటలు గుర్తు రాగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.కాసేపు మౌనంగా ఉండిపోయాను.

'వారిది చాలా పెద్ద బలగం.పదోరోజున పెద్ద మీటింగ్ లాగా జరిగింది.వారి బంధువులూ అందరూ వచ్చారు.చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది.' అన్నది అక్కయ్య.

కాసేపు మౌనం తర్వాత -'గుంటూరులో అమ్మ పూజ జరుగుతూ ఉంటుంది.దానికి పెద్దగా ఎవరూ రావడం లేదు.మీరు రావచ్చుగా?' అని అక్కయ్య అడిగింది.

ఎలా చెప్పాలా అని కాసేపు సంశయించి చివరకు --'నాకీ సామూహిక పూజలూ అవీ ఇష్టం ఉండదక్కయ్యా' అని మెల్లగా చెప్పాను.

'అది సామూహిక పూజ ఏమీ కాదు.ఒక ఇంట్లో జరుగుతుంది.ఎవరూ రావడం లేదు.అందుకని చెబుతున్నాను.మీరు వస్తే బాగుంటుంది.'-అని అక్కయ్య అన్నారు.

తనను నొప్పించడం ఎందుకని-'అలాగే ప్రయత్నిస్తాను అక్కయ్యా' అని మాత్రం అన్నాను.

'ఉండండి నాయనా.టీ పెట్టి ఇస్తాను.మీరేమి తాగుతారు? టీనా కాఫీనా?' అడిగింది అక్కయ్య.

'ఏమీ వద్దక్కయ్యా.ఇప్పుడే ఆఫీసులో టీ ఇస్తే త్రాగి వచ్చాము.మీరేమీ చెయ్యవద్దు.ఊరకే మాతో కాసేపు కూచోండి చాలు.' అన్నాను.ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలాగే అమ్మకు రాత్రి నైవేద్యం పెట్టడానికి ఉంచిన పాలతో మాకు టీ చేసి ఇచ్చింది అక్కయ్య.ఆ విషయం గుర్తొచ్చింది.

తను పుస్తకాలు చదువుతుందో లేదో అని నాకు అనుమానం. అందుకని 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకాన్ని తనకు చదవమని ఇచ్చే సాహసం చెయ్యలేక పోయాను.ఏ కంప్లెయింటూ దేనిమీదా లేకుండా,జీవితంలో జరిగే అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ,ప్రశాంతంగా, నిర్వికారంగా కనిపించే ఆమెకు,నేను వ్రాసిన పుస్తకాన్ని చదవమని ఇవ్వడానికి నాకు మనస్కరించలేదు.అమ్మతో అంతగా మమేకం అయిపోయిన ఆమెకు పుస్తకాల అవసరం ఏమీ లేదని, తను పుస్తకాల స్థాయిని ఎప్పుడో దాటిందని నా భావన.

ఆ చీకట్లో అలా కూచుని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత,-"అప్పారావన్నయ్యతో కాసేపు మాట్లాడి,భోజనం చేసి వెళతాం అక్కయ్యా.ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.'- అని చెప్పాను.

'అలాగే నాయనా.భోజనం చేశాక వెళ్లబోయే ముందు ఒకసారి రండి.నేను అంత త్వరగా నిద్రపోను.' అన్నారు తను.

అక్కడనుంచి కదిలి అన్నపూర్ణాలయం ఎదురుగా ఉన్న ఇసుక,కంకర దిబ్బలమీద వచ్చి కూచున్నాము.ఏసిగదుల్లో కుర్చీల మీదకంటే, ఆరు బయట చెట్లకిందా,నేలమీదే నాకు హాయిగా ఉంటుంది.

కరెంట్ వసతి కూడా సరిగ్గా లేని జిల్లెళ్ళమూడి గ్రామం అక్కడక్కడా కనిపిస్తున్న దీపాల మసక చీకటిలో చాలా బాగుంది.చుక్కలతో నిండిన నల్లని ఆకాశం క్రింద చీకట్లో కూచుని తలెత్తి ఆ ఆకాశంలోకి చూస్తుంటే ఈ ప్రపంచ స్పృహా,ఈ బాధలూ బాదరబందీలూ,కుళ్ళూకుత్సితాలూ,ఏమాత్రం లేకుండా అమ్మవడిలో చిన్నపాపగా హాయిగా నిశ్చింతగా పడుకున్న రోజుల ఫీలింగ్ మళ్ళీ కలుగుతుంది.

చిన్నప్పుడు తిరిగిన చీకటి పల్లెటూళ్ళూ,ఆ చీకటిలోనే నడుచుకుంటూ ఊరంతా తిరగడాలూ,లాంతరు వెలుగులో చదువుకోవడాలూ ఒక్కసారి గుర్తొచ్చాయి.

ఇంతలో అన్నపూర్ణాలయంలో భోజనం గంట మ్రోగింది.నిదానంగా అక్కడకు వెళ్లి అమ్మ ప్రసాదం స్వీకరించి లేచేసరికి రాత్రి తొమ్మిది అయింది.

"కొద్దిసేపు అప్పారావన్నయ్యతో మాట్లాడి,ఆయనకు మన పుస్తకాన్ని ఇచ్చి ఆ తర్వాత గుంటూరుకు బయలుదేరదాం.రండి.' అంటూ ఆయన ఇంటివైపు దారితీశాను.

(ఇంకా ఉంది)