నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

7, మే 2015, గురువారం

అంగారకుని రాశిమార్పు-మరిన్ని విలయాలకు సూచన?

3-5-2015 రాత్రి పదకొండు పన్నెండు మధ్యలో అంగారకుడు మేషరాశిని వదలి భూతత్వరాశియైన వృషభ
రాశిలో ప్రవేశించాడు.

ఆరోజునుంచి 15-6-2015 వరకూ అక్కడనే సంచరిస్తాడు.ఈ క్రమంలో వృశ్చికరాశిలో ఉన్న శనీశ్వరుడిని సప్తమదృష్టితో వీక్షిస్తాడు.అంతేగాక రోహిణీనక్షత్రం మీదుగా ఈ సమయంలోనే ఆయన సంచరిస్తాడు.మే 15 వ తేదీన అంగారక శనీశ్వరుల మధ్యన ఖచ్చితమైన సమసప్తకదృష్టి ఉన్నది.ఇది అమావాస్య పరిధిలో ఉంటున్నది.

ఈ 40 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతాయి.మే 10 నుంచి జూన్ 5 వరకూ నవాంశలో నీచస్థితిలో ఉండబోతున్న గురువు ప్రభావం ఈ అగ్నికి ఆజ్యం పోస్తుంది.రోహిణీశకట భేదనప్రభావం దీనికి సుడిగాలిని తోడుచేస్తుంది.

మనుషులు తలపొగరుతో చేసుకున్న పాపాలకు ఫలితాలు అనుభవించే సమయాన్ని గ్రహచారం నిర్దేశిస్తుంది.ఆయా గ్రహాల సంచార సమయంలో ఎవరు చేసుకున్న పాపాలకు శిక్షలు వారికి ఖచ్చితంగా పడతాయి.ఆ శిక్షలు రకరకాలుగా చిత్రవిచిత్రాలుగా ఉంటాయి.

కనుక ఆయా సమయాలలో ఊహించని ఈ క్రింది దుర్ఘటనలు తప్పకుండా జరుగుతాయి.

1.టెర్రరిస్టు,మాఫియా దాడులు- ప్రతిదాడులు.
2.అనేక వాహన ప్రమాదాలు,అగ్నిప్రమాదాలు.
3.ఇంకా ఉధృతమైన భూకంపాలు మళ్ళీ రావచ్చు.
4.దేశాల మధ్య,జాతుల మధ్య యుద్ధాలు జరుగుతాయి.
5.వ్యక్తిగత జీవితాలలో యాక్సిడెంట్లు దుర్ఘటనలు జరుగుతాయి.
6.అధికారులపైన,నాయకులపైన సామాన్యుల దాడులు,తిరగబడటం జరుగుతాయి.

ముఖ్యంగా ఈ దుర్ఘటనలు:--

మే 17 అమావాస్య,జూన్ 1 పౌర్ణమి,జూన్ 14 అమావాస్య లకు అటూ ఇటూగా ఖచ్చితంగా జరగడాన్ని గమనించవచ్చు.

కొన్ని ప్రమాదకర తేదీలు:--
మే 15-17, మే 22, మే 25 -28,మే 31- జూన్ 5,జూన్ 10,జూన్ 16.

వీటిని తప్పుకోవడం సాధ్యం కాదా అని ఒకరు నన్ను ప్రశ్నించారు.

సాధ్యంకాదు.కర్మఫలం అనేది సముద్రం అడుగున దాక్కున్నా వదలదు. వడ్డీతో సహా అనుభవింప చేస్తుంది.దీనిని ఎవరూ దాటలేరు.మార్చలేరు. పూజలవల్లా,తూతూ మంత్రపు రెమెడీల వల్లా ఇది పోదు.అలాంటి పిచ్చి రెమెడీలకు ఇది లొంగదు.

పైగా ఇది సామూహిక భౌగోళికకర్మ(global group karma).దీనిని మార్చడం ఎవరివల్లా కాదు.మార్చడం వీలయ్యే పనైతే మొన్న నేపాల్లో భూకంపం జరిగినప్పుడు అక్కడ హిమాలయాలలో ఉన్న బాబాజీ మొదలైన మహాసిద్ధులు దానిని ఎందుకు ఆపలేదు?అన్ని వేలమంది ప్రాణాలను ఎందుకు కాపాడలేదు?ఎందుకంటే, ఒకరి కర్మను మార్చడం ఆషామాషీ వ్యవహారం కాదు.అందులోనూ సామూహిక చెడుకర్మను మార్చడంలో సిద్ధపురుషులు కూడా అనవసరంగా జోక్యం చేసుకోరు.

మంచి చెబుతున్నప్పుడు ఎవరూ వినరు.పైగా హేళన చేస్తారు. కర్మఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం ప్రాధేయపడతారు.ఇది సామాన్య మానవుని నీచప్రవర్తన.కనుక ఈ సామూహిక కర్మను మార్చగల శక్తి ఉన్నా కూడా మహనీయులు ఇందులో జోక్యం చేసుకోరు.ఈ లోకంలో ఎవరి ఖర్మను వారు అనుభవించక తప్పదు. ఇది తిరుగులేని విశ్వనియమం.