“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, అక్టోబర్ 2014, బుధవారం

పురచ్చితలైవి డా|| జయలలిత జాతకం-ఒక పరిశీలన

ఒకప్పటి సినిమా నటి,నిన్నటి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత జాతకం చూడమని ఒక మిత్రుడు కోరాడు.ఆయనకు సినిమా వాళ్ళూ,తమిళనాడు రాజకీయ ప్రముఖులూ కొందరు తెలుసు.ఆమె కర్నాటక జెయిల్లో ఉన్నప్పుడే ఈ అభ్యర్ధన వచ్చింది.ఇంకా చెప్పాలంటే, కోర్టు తీర్పు విడుదల కాకముందే ఆయన నన్ను అడిగాడు. ప్రముఖులు వివాదాస్పద సమయాలలో ఉన్నపుడు, అందులోనూ కోర్టు వ్యవహారాలలో ఉన్నపుడు మనం జోక్యం చేసుకోరాదని నేను నిరాకరించాను.

జయలలిత జాతకాన్ని చూడమని ఆయన మరీమరీ కోరినమీదట,ఆమె జననసమయం కావాలని అడిగాను.నిన్నటితరం సినిమానటి జయంతిగారిని ఆయన ఫోన్లో అడిగి చెప్పిన వివరాల ప్రకారం జయలలిత 24-2-1948 న మధ్యాన్నం 12.30 కి మైసూరు మహారాజా ప్యాలెస్ లో పుట్టిందని తెలిసింది.ఇంకొక తమిళనాడు ఎమ్మెల్యే చెప్పిన వివరాల ప్రకారం తేదీ అదేగాని సమయం మధ్యాన్నం 14.51 కి శ్రీరంగంలో పుట్టిందని ఒక వివరం తెలిసింది.ఇంకొకాయన చెప్పిన వివరం ప్రకారం తేదీ అదేగాని,సమయం మధ్యాన్నం 14.51 అనీ జన్మస్థలం మాండ్యా జిల్లా మెల్కోటే అనీ తెలిసింది.

అనేక కారణాల వల్ల ప్రముఖులు తమతమ జననవివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు.ఆసలైన జననవివరాలు బయటకు తెలిస్తే ప్రత్యర్ధులు ఎవరైనా మంత్రగాళ్ళను ఆశ్రయించి ఏమైనా చేయిస్తారేమో అనే భయం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.జననవివరాలను బట్టి ప్రయోగాలు చేసే విధానం ఒకటి ప్రాచీన జ్యోతిష్యజ్ఞానంలో ఉన్నది.ఆంధ్రాలో అంతటి శక్తివంతులు లేరుగాని, తమిళనాడు కేరళలలో ఉన్నారు.కారణం ఏదైనా, ప్రముఖులు తమ అసలైన జననవివరాలను అంత త్వరగా బయటకు చెప్పరనేది సత్యమే.

జాతకం చూడమని ఎవరైనా నన్నడిగినప్పుడు వారు ఏ ఉద్దేశ్యంతో అడిగారో,వారిలో సిన్సియారిటీ ఎంతుందో నాకు వెంటనే తెలుస్తుంది.ఆ సిన్సియారిటీలో పాళ్ళను బట్టి వారికి జవాబు చెప్పాలా వద్దా,ఆ జాతకం చూడాలా వద్దా నేను నిర్ణయించుకుంటాను.తదనుగుణంగానే వారికి జవాబిస్తాను.జాతకుని ఖర్మగానీ అడిగినవారి ఖర్మగానీ చాలా బలంగా ఉంటే కూడా నన్ను ఆ జాతకాన్ని చూడనివ్వకుండా చేస్తుంది.అడిగినవారిలో ఉండవలసిన పద్ధతులు లేకుంటే కూడా నేను ఆ జాతకం చూడను.

నాకు పైన లభించిన రకరకాల డేటాను సంస్కరించి చూడగా జయలలిత జననసమయం 24.2.1948;12.30 hours;మెల్కోటే;మాండ్యాజిల్లా అని అనిపిస్తుంది.ఆ సమయానికి వేసిన చక్రం ఇక్కడ ఇస్తున్నాను.

ఈమె పౌర్ణమి నాడు జన్మించింది.పౌర్ణమి నాడు జన్మించినవారి జాతకాలలో వివాహ జీవితం దెబ్బతింటుంది అని నా పరిశోధన అనేక జాతకాలలో ఋజువు చేసింది.ఆ సూత్రం ఇక్కడ కూడా స్పష్టంగా కనిపించడం గమనార్హం.

ఆమెకు 15 ఏళ్ళున్నప్పుడు (1962-63) మొదటిసారి సినిమాలలో నటించింది.అప్పుడామెకు శుక్ర/గురు దశ జరిగింది.లాభస్థానంలో ఉన్న ఉచ్ఛశుక్రుడూ, లాభాధిపతి అయిన అష్టమగురువూ కలసి ఆమెకు అవకాశాలు ఇచ్చారు. గురువు కేతునక్షత్రంలో ఉండటమూ ఆ కేతువు షష్ఠమంలోని శుక్రరాశిలో ఉండటమూ గమనిస్తే ఆమెకు సినిమా చాన్సులు అంత చిన్న వయసులోనే ఎందుకు వచ్చాయో తెలుస్తుంది.దశమం తర్వాత షష్టాన్నే వృత్తిస్థానంగా చూడాలి.

1972 లో దశమ రవిదశ మొదలవ్వగానే ఆమెకు అవార్డులు రావడం మొదలైంది.1973 లో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డ్ వచ్చినపుడు ఆమెకు రవి/కుజ దశ నడిచింది.కుజుడు చతుర్ధంలోనూ రవి దశమంలోనూ ఉండి పరస్పర సమసప్టక దృష్టిలో ఉన్నారని,రవి యోగకారకుడూ తృతీయంలో బలంగా ఉన్న శని నక్షత్రంలోనూ కుజుడు శుక్రుని సూచిస్తూ ద్వితీయవృత్తి స్థానంలో ఉన్న కేతువు నక్షత్రంలోనూ ఉన్న విషయాన్ని గమనించాలి.

1982 లో రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు చంద్ర/గురుదశ జరిగింది.వీరిద్దరి మధ్యనా శుభ పంచమ దృష్టి తో బాటు,గురువు కూడా శుక్రసూచకుడై ద్వితీయ వృత్తిస్థానంలో ఉన్న కేతువు నక్షత్రంలో ఉన్న విషయం గమనార్హం.అందుకే సినిమాల నుంచి ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది.దాదాపు ఇదే సమయంలో ఇంకొక సినిమా నటుడైన NTR కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టాడు.ఆ సమయంలో సహజ వృత్తి కారకుడూ,వీరిద్దరికీ యోగకారకుడూ అయిన శని,సినిమానటులకూ ఉన్నతాధికారులకూ సూచకమైన తులారాశిలోకి గోచారరీత్యా ప్రవేశించ బోతున్నాడు.

1984 లో రాజ్యసభకు నామినేట్ చెయ్యబడినప్పుడు ఆమెకు చంద్ర/బుధ దశ జరిగింది.బుధుడు రవితో కూడి దశమంలో ఉండటం చూడవచ్చు.

1988 లో మొదలైన కుజదశ ఆమెకు మళ్ళీ రాజకీయ వైభవాన్ని కట్టబెట్టింది.అయితే ఆ దశలోని కుజ,రాహు,గురు,శని అంతర్దశలు నానారకాల గొడవలతో గడిచాయి.తిరిగి 1991 లో కుజ/బుధ దశలో ఆమె ఎన్నికలలో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యింది.బుధుడు మళ్ళీ ఆమెను నిలబెట్టాడు.

ఒక ఫుల్ టర్మ్ చేసిన తర్వాత 1996 లో ఆమె అధికారం కోల్పోయి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది.దానికి కారణం 1995 లో మొదలైన రాహు మహాదశ.రాహువు శనీశ్వరుల దశలు జాతకంలో జరుగుతున్నపుడు ఆ జాతకుడు చాలా జాగ్రత్తగా పద్దతిగా బ్రతకాలి.ఎందుకంటే ఈ రెండు గ్రహాలకూ దయాదాక్షిణ్యం ఉండదు.చిన్న తప్పు చేసినా వీపు పగలగొడతాయి.కానీ చాలామంది మానవులు ఈ సమయంలోనే తప్పులు చేస్తుంటారు.ఫలితాలు అనుభవిస్తుంటారు.ఇదొక కర్మ నియమం.

గ్రహాలకు పెద్దాచిన్నా రాజూపేదా అన్న తారతమ్యం ఉండదు.అవి దైవ స్వరూపాలు.మన హోదాలూ పదవులూ వాటిముందు ఏమీ పనిచెయ్యవు.ఎవరి కర్మను వారికి అందజెయ్యడమే వాటి పని.మన విషయాలు మనకు గొప్ప కావచ్చేమోగాని విశ్వశక్తులైన గ్రహాలకు అవి పూచికపుల్లలతో సమానం. 

2000-2003 మధ్యలో జరిగిన రాహు/శని శపిత యోగదశలో ఆమె నానా బాధలు పడింది.కోర్టు గొడవలు చుట్టుముట్టాయి.పదవి వరించి, ఊడిపోయి, మళ్ళీ వరించింది.2011 లో రాహు/చంద్రదశలో పదవి మళ్ళీ వరించినా వివాదాలు మాత్రం ఆమెను వదలలేదు.ఈ దశలో ఆమె మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం చతుర్ధంలోని చంద్రమంగళ యోగమే.

2014 లో గురు/గురు దశలో ఆమె అక్రమ ఆస్తుల కేసులో జైలుకెళ్ళడం ద్వారా పదవిని మళ్ళీ కోల్పోవలసి వచ్చింది.నవంబర్ 2004 లో రాహు/బుధ/రాహు దశ జరిగినప్పుడు కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేయించి జైల్లో నేలమీద కూచోబెట్టిన ఫలితమే ఈనాడు ఈ స్థితికి కారణం అని కొందరి ఊహ.ఎందుకంటే గురుదశ ప్రారంభం కావడంతోనే ఈమె కోర్టు కేసులో జైలుకెళ్ళి పదవిని కోల్పోవడం గురుశాపాన్ని సూచిస్తున్నది.

గురుదశలో ఎవరికైనా కష్టాలు మొదలయ్యాయంటే వారి జాతకంలో ఖచ్చితమైన గురుశాపం ఉంటుంది.అది ఈ జన్మది కావచ్చు,లేదా గత జన్మలది కావచ్చు.

మహనీయులను,గురువులను,హింసపెట్టడం,అవమానించడం మొదలైన పనులు గురుశాపానికి కారణం అవుతాయి.ఆయా గురువులు శాపాలను ఇవ్వకపోవచ్చు.ఉదారస్వభావంతో వారు క్షమించి ఊరుకోవచ్చు. కాని ప్రకృతి క్షమించదు.ఎందుకంటే ప్రకృతిలో నియమమే ఉన్నది గాని క్షమ అనేది లేదు.కాలగమనంలో ఆయా చర్యల ఫలితాలు తప్పనిసరిగా కనిపిస్తాయి.ఇది ఎంతటివారికైనా తప్పదు.సమయం వచ్చినప్పుడు ఎవరికి తగిన కష్టాలను వారు పడక తప్పదు.

ప్రస్తుతం శనిగోచారం వల్ల ఇంకొక నాలుగు రోజులలో ఈమెకు అర్దాష్టమ శని మొదలౌతున్నది.గురు మహర్దశలో ప్రస్తుతం జరుగుతున్న గురు అంతర్దశ, ఆ తర్వాత 2017 వరకూ జరిగే శని అంతర్దశ కూడా ఈమెకు మంచి ఫలితాలను ఇవ్వవు.ఆ తర్వాత వచ్చే బుధ అంతర్దశ మాత్రమే మళ్ళీ వెలుగును ఇవ్వగలదు.

అంతవరకు ఈ జాతకురాలికి కష్టకాలమే అని చెప్పాలి.

జాతకాన్ని స్థూలంగా మాత్రమే పరిశీలించడం జరిగింది.సూక్ష్మ వివరాలలోనికి కావాలనే వెళ్ళడం లేదు.