“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, జూన్ 2013, ఆదివారం

కేదార్ నాథ్ రుద్రరూపం - అసలు కారణాలు

కేదార్ నాథ్ లో జరిగిన ప్రళయం అందరికీ తెలిసిందే.దీనిమీద మిత్రుడు సోమశేఖర్ తన 'హోరాసర్వం' బ్లాగ్ లో చక్కటి విశ్లేషణ వ్రాశాడు.యధావిధిగా అతనికి కొన్ని కామెంట్స్ వచ్చాయి.

'ముందుగా చెప్పి దీనిని నివారించవచ్చు కదా.వేలమంది ప్రాణాలు కాపాడవచ్చు కదా?ఇప్పుడు విశ్లేషణ చేసి ఉపయోగం ఏమిటి?'-ఈ తరహాలో ఊహించినట్లే కామెంట్స్ వచ్చాయని నాతో చెప్పాడు.దీనికి ఒక జవాబు ఇవ్వమని అతనికి చెప్పాను.అది ఇలా ఉంటుంది.

'అడ్డమైన పనులూ చేసి భయంకర చెడుఖర్మ పోగుచేసుకోటం మీ వంతు.దాని ఫలితం వచ్చినపుడు కాపాడటం మా వంతూనా? ఇక్కడే మీ స్వార్ధమూ, దురాశా కనిపిస్తున్నాయి.మీ ఆలోచనా ధోరణి ఇంత చండాలంగా ఉంది గనుకనే మీకు నిష్కృతి లేదు. మానుంచే కాదు భగవంతుడి నుంచి కూడా మీకు ఎటువంటి సహాయమూ ఉండదు.' అని జవాబివ్వమని చెప్పాను.

కొత్తకోణంలో ఒక విషయాన్ని చెప్పినపుడు కనీసం దానిని ప్రోత్సాహపరుస్తూ మెచ్చుకునే మంచిగుణం కూడా మనలో లేదు.ఇక్కడ ప్ర్రతివాడూ తన జెలసీనీ,గర్వాన్నీ,అతితెలివినీ బయట పెట్టుకునేవాడే.అన్నీ సక్రమంగా నడుస్తున్నపుడు వీళ్ళ అహానికి అడ్డూ ఆపూ ఉండదు.కాని కాలం ఎదురు తిరిగినప్పుడు మాత్రం ముక్కూ ముఖం తెలియనివారికి కూడా సాయం కావాలి.భలే వింత!!

కేదార్నాథ్ రుద్రభూమి.భగవంతుని యొక్క రుద్రస్వరూపం సంహారాత్మక మైనది.దానికి మనాతనా ఉండదు.చెయ్యకూడని పని చేసినప్పుడు ఆ వ్యక్తిని అమాంతంగా నిర్మూలించడమే రుద్రతత్త్వం.రుద్రుని ఫాలనేత్రాగ్ని జ్వాలల్లో చావులేని మన్మధుడే కాలిపోయి భస్మమయ్యాడు.అల్పులైన మనుషులెంత? 

నేనెప్పుడూ చెప్పేది ఇదే.మనవాళ్ళు చాలామంది రుద్రమూ, నమకమూ చమకమూ పారాయణం చేస్తుంటారు.కాని ఆ మంత్రాల భావాన్ని అర్ధం చేసుకుందామని ఎవడూ ప్రయత్నం చెయ్యడు.జీవితంలో ఆ భావాలను ఆచరిద్దామని అసలు ఎవడూ అనుకోడు. వీళ్ళకు తెలిసింది ఒక్కటే. పరమేశ్వరుని ఎదుట ఈ మంత్రాలన్నీ చదివేసి యధావిధిగా పక్కవాణ్ని మోసం చేస్తూ దోచుకుంటూ తమ కుళ్ళు బ్రతుకులు తాము బ్రతకడమే వీరికి తెలిసిన గొప్పవిద్య. కాని ప్రకృతి కళ్ళు మూసుకొని లేదు.దైవం కళ్ళు మూసుకొని లేదు.సమయం వచ్చినపుడు ఎవడికి పడే శిక్ష వాడికి ఖచ్చితంగా పడుతుంది.సృష్టిలోని సంహారతత్త్వం యొక్క ప్రయోజనం ఇదే.

"నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:" అంటూ రుద్రపారాయణ చేసేవారిని కొన్ని వేలమందిని నేను చూచాను.మాకు రుద్రం మొత్తం నోటికి వచ్చు అని ఎదుటివాళ్ళ దగ్గర గప్పాలు కొట్టేవాళ్ళనూ ఎంతో మందిని చూచాను. వారందరినీ చూస్తే నాకు జాలి కలుగుతుంది.ఎందుకంటే ఆ మంత్రాల అర్ధమూ వాళ్లకు తెలీదు.ఆ అర్ధాలను జీవితానికి అన్వయించుకుని ఆచరించాలనీ అప్పుడే ఫలితం వస్తుంది కాని ఊరకే నోరు నొప్పి పుట్టేటట్లు మంత్రాలు చదివితే ఏమీ కాదన్న సంగతి వాళ్లకు అర్ధం కాదు.ఇలాంటి మనుషులని మార్చడం దేవుడి తరం కూడా కాదు.

ఊరకే మంత్రాలు చదవడం కాదు.దానికి తగిన జీవితాలు జీవించాలి.అదీ అసలైన కీలకం.మంత్రాలు నోటికి వస్తే చాలదు.జీవితంలోకి రావాలి. ఆచరణలోకి రావాలి.మన మోసపు వేషాలు దైవం ఎదుట ఎందుకూ పనికి రావన్నది మనిషి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

చరిత్రను పరికిస్తే ఒక్క సత్యం కనిపిస్తుంది.'దురాశ' 'అత్యాశ' లేదా ఇంకేదైనా పెరు పెట్టండి.దానివల్లే ప్రపంచంలో ఎక్కడ చూచినా అనర్ధాలు ప్రాణనష్టాలూ జరిగాయి జరుగుతున్నాయి. చేతనైనంత డబ్బును దోచుకోగలిగితే చాలు ఎంతమంది  ప్రాణాలు ఏమై పోయినా నాకెందుకు? అన్న ఆలోచనే ఇటువంటి అనర్ధాలకు అసలైన కారణం.

ముస్లిములు మనం దేశంలో జరిపిన విధ్వంసాలలో ఎంతో దోపిడీ జరిగింది.మాలిక్ కాఫర్ దక్షిణాదిన చేసిన దోపిడీ విధ్వంసంతో కనీసం 250 ఏనుగుల మీద బంగారాన్ని మోయించి డిల్లీ పాదుషాకోసం తీసుకుపోయాడని చరిత్రకారులు చెప్తారు.దీనికి మతముసుగు వేసినా ఇంకేం చేసినా,మనిషిని మనిషి చంపి దోచుకోవడమేగా ఇది?

ఏభై ఏళ్లక్రితం జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో అయిదుకోట్ల మంది చచ్చారు. ఒక్క రష్యాలోనే రెండు కోట్లమంది చచ్చారు. ఎందుకు? ఒకరిమీద ఒకరు ఆధిపత్యం సాధించాలన్న తపనేగా దీనికి వెనుక మూలకారణం?

కనుక మానవ మనస్తత్వం లోనే ఒక ప్రాధమికమైన లోటు ఉన్నది. ఒక హింస ఉన్నది.ప్రతి మనిషిలోనూ ఒక మృగం ఉంటుంది.అది అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.ఎవరెన్ని మాటలు చెప్పినా అవకాశం వస్తే ఎవడూ ఎదుటివాడిని దోచుకోకుండా ఊరుకోడు.సామాన్యుడికి ఆ అవకాశం లేక అరుపులు అరుస్తూ ఉంటాడు.అదే అవకాశం వస్తే వీడూ నాయకులకంటే ఎక్కువగా విజ్రుంభీంచి దోపిడీ చెయ్యగలడు.నేడు నిస్సహాయస్తితిలో ఉన్న కేదార్నాధ యాత్రికులను ఎలా దోచుకుంటున్నారో చూస్తే నేను చెప్పేది నిజం అని ఎవరికైనా అర్ధమౌతుంది.

నేను కొన్ని ట్రెయిన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ప్రత్యక్షంగా చూచాను. మేము అక్కడికి చేరుకునేలోపు పక్కనే ఉన్న ఊళ్ళ జనం హడావుడిగా అక్కడికి వాలిపోయి శవాలమీది నగలను గబగబా దోచుకోవడమూ కొన్నిసార్లు దానికి పోలీసులు కూడా సహకరించడమూ నాకు తెలుసు.శవాలను కూడా వదలకుండా దోచుకునే మనస్తత్వం, మంచివాళ్ళు అనుకునే పల్లె ప్రజలలో ఉన్నది అన్న నగ్నసత్యం నాకు ప్రాక్టికల్ గా తెలిసింది.

ఈ దోపిడీ అనేది లౌకికంలోనూ ఉన్నది ఆధ్యాత్మికలోకంలో కూడా ఉన్నది. అయితే మతంపేరుతో చేసే దోపిడీ సూక్ష్మంగా ఉండి బయటకు కనపడదు.ప్రస్తుతం సమాజంలో ఉన్న దొంగ గురువులందరూ చేస్తున్నది ఆధ్యాత్మిక దోపిడీనే.

కేదార్నాద్ చుట్టూ ఎన్నో హైడల్ ప్రాజెక్టులు కట్టారు.అన్ని ప్రముఖ కంపెనీలూ, రాజకీయ నాయకుల కంపెనీలూ ఇందులో ఉన్నాయి.అలా కట్టడం పర్యావరణానికి తీవ్రప్రమాదం కలిగిస్తుంది అని ప్రకృతి పరిరక్షణవాదులు ఎందఱో మొత్తుకున్నారు.కాని ఎవరూ వినరు.ఎవరి స్వార్ధం వారిది. నాయకులూ వారి కమీషన్ల కోసం ఈ ప్రాజెక్టులు కట్టేవారినే సమర్ధిస్తారు. అందరూ కలిసి ప్రకృతిని నాశనం చేస్తున్నారు.ఏతావాతా చచ్చేది సామాన్యుడు మాత్రమే.మా డబ్బు మాకొస్తే చాలు ఎంతమంది చస్తే మాకెందుకు అనుకునే మనస్తత్వం నాయకులది.ఏదైనా విపత్తు జరిగినప్పుడు జరిగే సహాయ కార్యక్రమాలలో మళ్ళీ ఇంకా దోచుకోవచ్చు.వీటిల్లో ఎంత ప్రజాధనం స్వాహా అవుతుందో అందరికీ తెలిసిందే.

పేపర్లూ ప్రభుత్వమూ చెప్పే లెక్కలు సరియైనవి కావు.కనీసం 20,000 నుంచి 30,000 మంది మనుషులు గంగాదేవి ఆగ్రహానికి గురై అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారనేది వాస్తవం.

నిన్న ఒక ప్రముఖ వ్యాపారస్తుడు నాతో మాట్లాడుతూ 'నేను పోయినేడాది చార్  ధాం యాత్ర చేసివచ్చాను.' అన్నాడు.'నీ పాపం ఇంకా పండలేదు అందుకే బతికి పోయావు' అని మనసులో అనుకున్నాను.

హిమాలయాలు పవిత్ర భూములు.ఎన్నో వేల ఏళ్ల నుంచి లెక్కలేనంత మంది మహాయోగులు మునులు అక్కడ నివాసం ఏర్పరచుకుని తపస్సులో కాలం గడిపారు.అలాంటి వారు ఎందఱో ఈనాటికీ హిమాలయాలలో ఉన్నారు.అక్కడ పవిత్రమైన స్పందనలు అలముకుని ఉంటాయి.అలాంటి చోట్లకు అందరూ పిక్నిక్ కోసం వెళ్ళినట్లు వెళ్ళకూడదు. దానివల్ల ఆయా స్పందనలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.దాని ఫలితాలు విపరీతంగా ఉంటాయి.

మనవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు.క్రమేణా హిమాలయాలలో కూడా హోటళ్ళు వెలిశాయి.అక్కడ కూడా మధ్యపానమూ దూమపానమూ వ్యభిచారమూ జరుగుతున్నాయి.హరిద్వార్ లో అన్నీ దొరుకుతాయి.మనతోపాటు మన అంకచండాలం అంతా ఎక్కడికి పోయినా మన వెంటే వస్తుంది కదా.రుద్రుడు ఒక్కసారి కళ్ళు తెరిచాడు.ఆ చండాలం అంతా కొన్ని నిముషాలలో ప్రక్షాళన అయిపొయింది. కనీసం మూడేళ్ళ వరకూ ఎవరూ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్తితి కల్పించబడింది.

నేను ఎన్నో పాత పోస్ట్ లలో వ్రాశాను.మనుషులు తమ హిపోక్రసీని విడిచి పెట్టాలి.పద్ధతులు మార్చుకోవాలి.లేకుంటే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.దారుణమైన ప్రకృతి కోపానికి గురికావలసి వస్తుంది అని ఎన్నో సార్లు హెచ్చరించాను.ప్రస్తుతం నడుస్తున్న శపితయోగ పరిధిలో తీవ్ర జననష్టం జరుగుతుంది.ప్రక్షాళన జరుగుతుంది అని ఎన్నోసార్లు వ్రాశాను.ఇప్పుడు కళ్ళెదుట కనిపిస్తున్నది అదే.

మనిషిని మనిషి దోచుకోవడం అనేది మామూలు వ్యాపారాలకే పరిమితం కాదు.పుణ్యక్షేత్రాలలో కూడా ఇది చాలా ఘోరమైన స్థాయిలో జరుగుతుంది. దానిని చేసేవారందరూ కూడా మళ్ళీ భక్తులే.ఇక వారికి దైవం పైన ఏమి నమ్మకం ఉన్నట్లు? దీనికి తగిన శిక్ష ఎప్పుడో ఒకప్పుడు పడదా?

మా అమ్మగారు ఇరవై ఏళ్ల క్రితం కేదార్ నాథ యాత్రకు వెళ్లారు.అక్కడ గుర్రం మీద కూచుని కొంతదూరం ప్రయాణం చెయ్యాలి.తన దగ్గరున్న అయిదు వేల రూపాయలను ఒక పర్సులో ఉంచి గుర్రం జీనుకు ఉన్న జేబులాంటి దానిలో ఉంచారు.అలా ఉంచమని ఆ గుర్రం నడిపే వాడే చెప్పాడు.వారు గమ్యస్థానానికి చేరేసరికి గుర్రం నడిపెవాడి హస్తలాఘవం తో ఆ పర్సు మాయం అయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆమె నిస్సహాయ స్తితిలో అక్కడ నిలిచిపోయింది. చుట్టూ తనతో వచ్చిన బృంద సభ్య్లున్నారు గనుక సరిపోయింది.లేకుంటే కనీసం 'టీ' తాగుదామన్నా చేతిలో పైసా లేని పరిస్తితి. సాటి యాత్రికుల దగ్గర డబ్బు అప్పు తీసుకుని యాత్ర పూర్తి చేసి ఆమె తిరిగి వచ్చింది.తిరుగు ప్రయాణంలో విజయవాడ స్టేషన్లో రైలు వచ్చినపుడు నేను వెళ్ళి ఆ డబ్బులు వారికిచ్చాను.అప్పట్లో ATM,electronic money transfer మొదలైనవి లేవు.

మరి అంత ఎత్తున హిమాలయాలలో ఆ గుర్రం నడిపేవాడు కూడా పొద్దున్న లేచి 'హరహర భం భం భోలే' అని అరిచి తన దినచర్య ప్రారంభిస్తాడు.కాని వాడు చేసిన పనేమిటి? కనుక మన దొంగప్రార్ధనలూ దొంగమంత్రాలూ భగవంతుడు లెక్కపెట్టడు.మనం ఏం చేస్తున్నాం అనేదే ఆయన పరికిస్తాడు అనేది నగ్నసత్యం.మన ఆచరణకూ ప్రవర్తనకూ తగిన ఫలితాలు మనకు ఇవ్వబడతాయి.అంతేగాని మన పూజలకూ దొంగప్రార్ధనలకూ ఏమీ జరగదు.

పుణ్య క్షేత్రాలలో ఎక్కువమంది దొంగలే ఉంటారు.వచ్చిన భక్తులను ఎడా పెడా దోచుకోవడమే వారి పని.ఇప్పుడు కూడా భోజనం పాకెట్ 1000 రూపాయలకు వాటర్ బాటిల్ 200 రూపాయలకు టీ 60 రూపాయలకు అమ్ముతూ అక్కడ నిలిచిపోయిన నిస్సహాయ భక్తులను అక్కడివారు దోచుకోవడమే నేను చెప్పేది పచ్చినిజం అన్నదానికి నిదర్శనం.

గతంలో తురుష్కులు దేవాలయాలు ధ్వంసం చేసి అన్నీ దోచుకు పోయారని మనం వాళ్ళను తిడుతూ ద్వేషిస్తూ ఉంటాం.మరి ఇప్పుడు మనవాళ్ళే అయిన హిందువులు చేస్తున్నదేమిటి? ఇది స్వార్ధానికి దురాశకూ పరాకాష్ట కాకుంటే ఇంకేమనాలి? అంటే,ఇక్కడ నాయకులకూ,ప్రజలకూ అందరికీ డబ్బే దైవం.ఎవడికీ నిజంగా దేవుడంటే భయమూ భక్తీ లేనేలేవు.ఎందరి ప్రాణాలు పోయినా ఎవడికీ పట్టదు. ఇలాంటి హిపోక్రసీతో నిండిన సమాజానికి ఇంతకంటే మంచి వరాలు ఎలా వస్తాయి?

చివరగా ఒక్కమాట.రుద్రుడు తన జటాజూటంలోని గంగాదేవిని కొంచం విదిల్చి మనుషులు చేసిన చండాలాన్ని శుభ్రం చేసుకున్నాడు.దీనికి ప్రస్తుతం నడుస్తున్న శపితయోగం సాయం చేసింది.కాని బ్రతికిఉన్న మిగిలిన ప్రజలను కుమారస్వామి కాపాడుతూ సహాయం చేస్తున్నాడు. సైన్యమూ, పారామిలిటరీ బలగాల రూపంలో సుబ్రమణ్యస్వామి శక్తి వారిచేత ఈపని  చేస్తున్నది. సైన్యానికి కుజుడు కారకుడు.కుజునికి అధిదేవత కుమారస్వామి.తండ్రి కోపాన్ని తనయుడు తగ్గిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు.ఈ మొత్తం సీన్ వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం ఇదే.

ప్రజల పాపాలకు శిక్ష పాలకులకు పడుతుంది అని మన ప్రాచీన స్మృతులు చెబుతున్నాయి.కాని ప్రస్తుత కలియుగంలో పాలకుల పాపాలకు శిక్షలు ప్రజలకు పడుతున్నాయి.అలాంటి నాయకులను ఎన్నుకోవడమే ప్రజలు చేస్తున్న పాపం."రాజ్యాన్తే నరకం ధ్రువం" - అని మనకు ఒక సూక్తి ఉన్నది.అది మాత్రం తప్పకుండా నిజం అవుతుందని నాకనిపిస్తున్నది.