“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జూన్ 2013, శుక్రవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-4

కాసేపటికి ఆయన కుదుట పడ్డారు.

'మీరు శ్రీవిద్యోపాసకులే అని నాకిప్పుడు నమ్మకం కుదిరింది.మీ గురువు ఎవరో చెబుతారా? మీది మా సాంప్రదాయమేనా?' అడిగారు శర్మగారు. 

'నాకు ఈ సాంప్రదాయాలంటే నమ్మకం లేదండి.నా భావాలు మీకు కొంచం వింతగా ఉండవచ్చు.వీళ్ళందరూ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వారని నా భావన.ఇకపోతే నా గురువులు ఒక్కరు కాదు.ఒకరికంటే ఎక్కువమంది ఉన్నారు.వారు కూడా లోకానికి తెలిసిన ప్రసిద్ధులు కారు.వారికి ప్రచారం ఇష్టం ఉండదు.వారి జీవితాలు నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిశాయి.వారు నిజమైన మహనీయులు.నేటివారివలె దొంగగురువులు కారు.' చెప్పాను.

'పోనీలెండి.చెప్పకపోతే మీఇష్టం.కనీసం ఒకవిషయం చెప్పండి.మీరు శ్రీవిద్యాదీక్ష ఎప్పుడు తీసుకున్నారు?'నొచ్చుకున్నట్లుగా అడిగారు శర్మగారు.

పాపం పెద్దాయన అంతగా అడుగుతుంటే దాచడం బాగాలేదని అనిపించింది.

'నా పద్నాలుగోఏట నేను మొదటిసారిగా శ్రీవిద్యాదీక్ష తీసుకున్నాను. పద్దెనిమిదో ఏట ప్రపంచం అంటే విరక్తితో అన్నీ వదిలి సన్యాసం తీసుకుందామని అనుకున్నాను.గురువుగారు కూడా ఒప్పుకున్నారు.కాని కొన్ని కర్మబంధాల వల్ల కుదరలేదు.అలా అని నా సాధన మానలేదు.ఆ సంఘటన జరిగి ఇప్పటికి మూడు పుష్కరాలు గడిచాయి.' చెప్పాను.

ఆయన అమిత ఆనందపడ్డాడు.

'మీరు వయసులో నా కంటే చాలా చిన్నవారు.అయినా ఉపాసనలో  పెద్దవారే.ఇప్పుడు మీతో నా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కొంత చెప్పాలని, నన్ను వేధిస్తున్న నా సమస్య గురించి అడగాలని అనిపిస్తున్నది.మా గురువుగారు శరీరంతో ఉన్నట్లయితే ఆయన్ను అడిగేవాడిని.ఆయన  తర్వాత ఇలాంటి విషయాలు అంత అధికారికంగా చెప్పగలవారు నాకు మళ్ళీ కనిపించలేదు.అడగనా?' అన్నారు.

'చెప్పండి.' అన్నాను.

ఆయన సాధన గురించి,అందులో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య గురించి ఆయన చెప్పారు.చెబుతూ ఉన్నప్పుడే దాని విషయం నాకర్ధమైపోయింది. దానికి పరిష్కారం ఏమిటో ఆయనకు సూచించాను.నా సూచనలు విన్న తర్వాత ఆయన తృప్తిగా తలాడించాడు.ఆ వివరాలు ఆయన వ్యక్తిగతాలూ, సాధనాపరమైన రహస్య విషయాలూ గనుక ఇక్కడ వ్రాయడం లేదు.

'నా బాధ గమనించి మా గురువుగారే మిమ్మల్ని నా దగ్గరికి ఈ రూపేణా పంపినట్లున్నారు.' అన్నాడు.

'పోనీ అలాగే అనుకోండి' అన్నాను.

తర్వాత మా చర్చ గురుతత్వం మీదకు మళ్ళింది.

'నిజమైన గురుశక్తి ఇదేనండి.వారు శరీరంతో లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా మనకు సమాధానం ఇస్తారు.ఇలాంటి నిదర్శనాలు చూపిస్తారు.' అన్నారాయన.

అదీ నిజమే గనుక నేనేమీ జవాబు ఇవ్వలేదు.

చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు ఆయన లేచి అల్మారా వద్దకు వెళ్ళి ఒక ఫైల్ తీసుకుని వెనక్కు వచ్చారు.అందులో చాలా కాయితాలున్నాయి.

'నేను ఏదైనా చదివినప్పుడు నచ్చితే దానిని ఎత్తి వ్రాసుకుని ఫైల్ చేసుకోవడం ఎప్పటినుంచో నా అలవాటు.ఇప్పుడు జిరాక్స్ వచ్చింది.కనుక పని సులువుగా ఉన్నది.ఎక్కడైనా మంచి సంగతులు కనపడితే జిరాక్స్ చేసి ఫైల్ చేసుకుని తీరికగా చదువుకుంటాను' అంటూ 'ఈ వ్యాసం చూడండి.గురుతత్వం మీద బాగా వ్రాశాడు మా విద్యాసాగర్.' అని రెండు కాగితాలు నాకందించారు.

అవి చేతులోకి తీసుకుని ఒక్క లైన్ చదివేసరికి నేను ఆశ్చర్యపోయాను.అది నేను వ్రాసిన 'గురుపూర్ణిమ(గుండె ధైర్యం లేనివాళ్ళు చదవొద్దు)' అనే పోస్ట్ యొక్క ప్రింట్.

'విద్యాసాగర్ అంటే ఎవరు? చాలా బాగా వ్రాశారు.' అడిగాను పేపర్లు చేతిలో ఉంచుకుని.

'నాకు బాగా తెలిసినవాడు.అతనిదీ తెనాలే.ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాస్తూ ఉంటాడు' అన్నాడాయన.'అయితే ఒకటే చిక్కు,అతని వ్రాత కొంచం పరుషంగా ఉంటుంది.'అన్నాడు.

'ఇందులో అంత ఘాటు ఉందా? ఎవరినైనా విమర్శించాడా?' అడిగాను ఏమీ ఎరుగనట్లు.

'అవును.నేటి గురువులను అందరినీ ఏకి పెట్టాడు.' అన్నాడాయన.

'మరి మీ గురువుగారైన కల్యాణానంద భారతిస్వామి కూడా ఇలాగే అందర్నీ ఏకేవారని  మీరే ఇందాక అన్నారు కదా?'

'అవుననుకోండి.ఆయన శంకరాచార్యులు.జగద్గురువు. పైగా ఆయన ఎక్కడా పరుషంగా మాట్లాడలేదు.సౌమ్యంగా ఉండేవారు.విమర్శించినా సౌమ్యంగా విమర్శించేవారు.ఆయనకూ మామూలు మనుషులకూ పోలికేముంది?' అన్నాడు.

కొద్ది సేపటి క్రితం నేను చదివిన పుస్తకంలో విషయాలు గుర్తొచ్చాయి. 

'లేదండి.విమర్శించేటపుడు ఆయన చాలా ఘాటుగా పరుషంగా విమర్శించే వారు.తప్పు కనపడితే ఎవరినీ ఒదిలేవారు కారు.మహామహా వాళ్ళను కూడా ఆయన వదలలేదు.అటువంటి వారిని అలా తిట్టే సమయంలో కొన్నిసార్లు బూతులు కూడా వాడారు.' అన్నాను.

ఆయన నిర్ఘాంత పోయాడు.

'శర్మగారు.ఏంటి మీరంటున్నది?మా స్వాములవారు బూతులు మాట్లాడారా ?ఎప్పుడు?ఎక్కడ?మీరు ఆయనను చూడలేదు కదా?ఎలా చెబుతున్నారు? దయచేసి అలా అనకండి.' అడిగాడు కొంచం కోపంగా.

ఆయన ఉక్రోషానికి నాకు నవ్వొచ్చింది.

'ఒక్క నిముషం ఉండండి.చూపిస్తాను.'అంటూ ఆ టీపాయ్ మీద ఆయనెదురుగానే ఉన్న'శ్రీ విద్యాస్త్ర పరంపర' అని1944 లో గుంటూరు నుంచి ప్రచురింపబడిన పుస్తకం తీసి ఒక పేజీ తెరిచి ఆయనకిచ్చి ' దీనిని ఒక్కసారి పైకి చదవండి.నేనూ వింటాను' అన్నాను.

కళ్ళజోడు పెట్టుకుని ఆయన పుస్తకంలోకి దృష్టి సారించాడు.

'కౌలమర్మ విభేదినీ' అనే అధ్యాయంలో ఇలా వ్రాసి ఉన్నది.

'ఇట్టి విధి ననుసరించి ప్రతి కులనిష్టుడును ప్రతి శుక్రవారమును తప్పక చండాలస్త్రీ గమనము చేసి తీరవలసినదే.కావున కులనిష్టులగు పురుషులు  చండాలస్త్రీ గమనమును నియతవ్రతముగా నాచరించువారలును వారల ఇండ్ల యందుండు స్త్రీలు కులజ్ఞులను నభిమానమును వహించినవారలతో వ్యభిచారము చేయుటకు బ్రేరేపణ చేయబడి యధేచ్చముగ జాతి కుల విచక్షణము లేకుండ తమ ఇచ్చవచ్చినటుల పురుషులతో చరించు లంజలు గను నలరారుచుందురనిచో నించుకేనియు నాశ్చర్యముండగూడదు.'

చదివిన శర్మగారు నోటమాట రాక అలా చూస్తుండి పోయారు.

ఆయన చేతిలో పుస్తకం తీసుకుని ఇంకో పేజీ తెరిచి 'ఇది కూడా కొద్దిగా చదవండి' అని చూపించాను.

'కులనిష్ట విక్లేదినీ' అనే అధ్యాయం నుంచి ఆయన ఇలా పైకి చదివారు.

'ఇట్టి కులనిష్ట యందుత్తమోత్తమము చండాలస్త్రీ పూజనము.తత్సహవాస సహభోజన సంసర్గాదికమునని సుప్రసిద్ధముగ దెలియవచ్చుచున్నది. రెండవది కులయోగికి తన చెలియలినో కూతునో భార్యనో అప్పగించి ఆనందించుట.ఇట్టి రెండు కృత్యములచే తనకు చండాలస్త్రీ సంబంధము,తన ఇంటి యాడువారికి చండాలాధముని కంటే నికృష్టుడగు త్రాగుబోతు సంబంధమును.దీనిని బట్టి కులనిష్టులందరును చండాలసదృశులే యనుట యందు ఇంచుకేనియు సందియము లేదు.'  

పుస్తకం మూసివేసిన శర్మగారు కాసేపు ఏమీ మాట్లాడలేదు.

'ఏంటండి ఇది? ఇలాంటి భాష ఈ పుస్తకంలో ఉన్నదేమిటి? ఇది వ్రాసినది మా స్వాములవారేనా?ఈ పుస్తకం దాదాపు 70 ఏండ్ల నుంచి మా ఇంటిలో ఉన్నది.నేనీ విషయాలు చదవనే లేదు.మీరు కాసేపటిలో ఎలా చదివారు?' అడిగారు మెల్లిగా గొంతు సవరించుకుంటూ.

నేను మెల్లిగా నవ్వాను.

'శర్మగారు.కంగారు పడకండి.నిదానంగా వివరిస్తాను.వినండి.' అంటూ నేనూ గొంతు సవరించుకున్నాను.

(మిగతాది తర్వాతి భాగంలో)