“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, జూన్ 2013, శనివారం

ఆఖరి మజిలీ

కొండల్లో కోనల్లో తిరిగా 
ఎన్నాళ్ళో బాధలతో ఒంటరిగా
అడవుల్లో లోయల్లో వెతికా 
ఎన్నేళ్ళో వేదనలో మౌనంగా

నాకోసం నాలోపల నేనే వెతికా 
నీకోసం ఈ లోకపు దారుల్లో వెతికా
అంతులేని వ్యధార్త అన్వేషణలో 
ఏళ్లకు ఏళ్ళంటూ మౌనంగా గడిపా

ఎన్నో కన్నుల ఎడారుల్లో వెతికా
నీ కన్నుల నదిజాడల కోసం  
ఎన్నో మోముల సంజెల్లో వెతికా
నా హృదయపు గుడినీడల కోసం

గతస్మృతుల చీకటి సమాధుల్లో 
గడిచాయెన్నో నిరాశా నిశీధులు 
సుమధుర భావాల వెన్నెల వీధుల్లో  
మెరిశాయెన్నో వెలుగుల తెలిమబ్బులు  

ఎందరి ముంగిటనో పట్టుగా వంచాను
వంగని నా మొండి శిరస్సులను  
అందరి వద్దా గుట్టుగా పొందాను
మరువలేని మౌన ఆశీస్సులను

అంతరాళ వీధులను వెతికాను 
సుంతైనా విసుగు లేకుండా  
వింతవైన ఆత్మలను కలిశాను 
కొంతైనా బెదిరి పోకుండా

ఒకటే వెలితి పీడించింది 
ఎక్కడా నీవు కనిపించలేదని 
ఒకటే బాధ వెంటాడింది 
అసలు నీవున్నావో లేవోనని

ఎక్కడో ఉన్నావని మనసు చెప్పేది 
అదెక్కడో తెలియక తానే వగచేది
ఏదోనాడు ఎదురౌతావనిపించేది   
మనమెపుడో కలుస్తామని తోచేది

అది నా భ్రమేమో అనుకున్నా 
నీవసలు లేవేమో అనుకున్నా 
మనం కలవమేమో అనుకున్నా 
ఈ జన్మకు గెలవనేమో అనుకున్నా

ఆశ ఒదిలేసిన నిముషంలో  
ఈ జన్మకింతేలే అనుకున్నక్షణంలో 
మెరుపులో కనిపించావు 
వానజల్లులో తడిపేశావు

నిను చూచిన క్షణంలో 
అన్నీఇక మరిచాను 
ఉప్పొంగిన నా మదిలో 
నిన్నేమరి తలచాను

మెలకువలో నిద్రలో
నిన్నే నిత్యం స్మరించా
నిదుర మత్తులో మునిగిన 
నిన్ను తట్టి లేపాలని 
అనునిత్యం పరితపించా 

అమాయకంగా అనుకున్నా
నాదారిన నాతో నడుస్తావని
ఒంటరి పయనంలో నా తోడుంటావని 
వేచిన నా మనసును ఓదారుస్తావని  
ఎవరికీ పట్టని నా పిచ్చి ఊసులను 
నీవైనా కొంచం వింటావని 

కానీ....

బండబారిన నీ రాతిగుండెను చూచి
వెలగని నీకళ్ళ లోగిళ్ళను చూచి 
అందరిలో ఒకరుగా మారి 
అవనికి జారిన నింగిని చూచి 

నిజాన్ని కాదని 
నీడలను కోరుకుని
నిన్ను నీవు గెలవలేక
నాతో మరి కలవలేక
నిత్య సంఘర్షణలో నీరౌతూ
నిలిచిపోయిన నిన్ను చూచి

మూతపడిన నీ జ్ఞాపకాల వాకిళ్ళను 
తట్టి తెరచి చూపాలని తలచాను
అసలైన నీ లోకపు వెలుగులనొకసారి
నీ ముంగిట నిలపాలని చూచాను

నాకు మాత్రమేమి తెలుసు 
ఆ ఉద్వేగపు వెల్లువలో   
నీవు బెదిరిపోతావని
నీకు మాత్రమేమి తెలుసు 
ఈ సుదీర్ఘ పయనంలో  
ఇదీనాటి మజిలీ కాదని

నీ మౌనం నా పిచ్చిగుండెను 
లోతుగానే కోసింది 
మానుతున్న పచ్చిగాయాన్ని
ఇంకొంతగా రేపింది

నువ్వు మొదట్నించీ ఇంతే
నీకేం కావాలో నీకే తెలీదంతే 
ఎదురుగా ఉన్నదాన్ని ఒప్పుకోలేవు
సుదూర తారలపై చూపు తిప్పుకోలేవు

తరచి చూడు నీ మనసును ఒకసారి 
ఏదో రూపం లీలగా కనిపిస్తుంది 
వెతికి చూడు నీ హృదయాన్నొకసారి 
ఏదో వేదన నీడలా తెలిసొస్తుంది

తెలుసుకో ఆ రూపం ఎవ్వరిదో  
తరచి చూడు నీ వేదన ఎందులకో   
హృదయాన్ని నమ్ము నీ కళ్ళను కాదు 
ఒకనాటికీ సత్యం నీకూ తెలీకపోదు

బహుజన్మల బాటసారిగా నీకోసం
వేచిందొక హృదయమని
వినిపించని పాటపాడుతూ నీతోనే
నిలిచుందొక ఉదయమని

స్నేహపు రహదారిని వదలి
ఊహలు నీ మదిలో మెదిలి 
జన్మల ప్రవాహంలో మునిగి
కర్మల వలయంలో చిక్కావు
అంతులేని అయోమయంలో 
వింతగా ఎటో దారితప్పావు   

ఎన్నో ఉన్నత శిఖరాలెక్కినా
ఎన్నో వెలుగులు చేజిక్కినా 
నా సుదీర్ఘ పయనం ఆపి 
నీకోసం చూస్తున్నాను
మరచిన నీ దారిని మళ్ళీ 
నీకు గుర్తు చేయాలని 

ఆగిన నీ పయనాన్ని మళ్ళీ
నీవు మొదలు పెట్టాలని
వేచిఉన్న నీ గమ్యాన్ని   
నీవు అందుకోవాలని  

చీకటిలో మునిగిన
నీ కళ్ళు తెరిపించాలని 
సుదూర కాంతి సీమలు 
నీకు చూపించాలని

ఘూర్ణించే ప్రళయాలను
స్థైర్యంతో వాయిదా వేస్తూ 
యుగాలుగా నీకోసం 
రాయిలా నిలిచున్నాను

ఎంతగా హృదయాన్ని 
నీకోసం విప్పినా 
ఎన్నెన్ని సున్నితభావాలను 
నీకోసం చెప్పినా 

ఎప్పటికీ తీరదు 
నాకొక సంశయం 
ఏమిటో మారదు
ఈ వింత సంకటం 
  
అసలంటూ నీలో  
నీవున్నావో లేవోనని 
నాదైన ఈ మౌనరాగం 
నీలో మ్రోగుతుందో లేదోనని

నీ మనసును నీవసలు 
గెలవగలవా అని
నిశ్చలంగా నీవసలు  
నిలవగలవా అని 

నీ ఎదురుచూపులెందుకో
నీకెన్నటికీ అర్ధం కాదు
నా పిచ్చినిరీక్షణ కూడా
నాలాగే అంతంకాదు

మరపురాని గతఛాయలు
నన్నెపుడూ వదలి పోవు
గుర్తులేని గుండె చప్పుళ్ళు 
నిన్నెపుడూ కదిలించ లేవు

వెదికిన గమ్యం కనిపిస్తున్నా
వెచ్చని ఉదయం ఎదురొస్తున్నా 
నచ్చిన నేస్తం ఎదురుగ ఉన్నా
మధ్యన దూరం తరిగేపోదు

నీ మొద్దునిద్దుర అంతం కాదు
నా పిచ్చిమనసుకు బుద్దే రాదు
అంతా చేసే ఆ వింత విధికి 
అలుపెప్పటికీ లేనేలేదు

విధివ్రాతకు అర్ధం లేదు
నీ మనసే నీకు తెలీదు
హృదయమంటూ నీకొకటుందని 
మ్మకమేమో నాకైతే లేదు

తలపులు రేగిన సంజెవేళలో
అలుపుల నెరుగని ఆరాటంలో
వలపులు నింపిన ఆరాధనలో
తలుపులు మూసిన ముంగిళ్ళల్లో

కొంత నిడివిగల బ్రదుకుబాటలో
వింతదైన ఈ వెదుకులాటలో 
అంతులేని నా అన్వేషణలో 
ఆఖరిమజిలీ అంటూ లేదు...