నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

7, ఏప్రిల్ 2013, ఆదివారం

ఉషోదయం

యుగయుగాల నిశిరాత్రికి 
చరమగీత మనిపిస్తూ 
చీకటి మనసున తేటగ 
వెలుగు పరచుకుంటోంది

అణగారిన అగ్నిజ్వాల 
హృదయాంతరాన ఎగసి 
స్వర్లోకపు పొలిమేరల
నిలిచి వేచి చూస్తోంది

మానవ జీవిత వ్యధలను 
ఆనందపు వెల్లువగా 
మార్చగలుగు శక్తి ఒకటి 
మదిని అడుగు పెడుతోంది 

మౌనరోదనాన కుమిలి 
మగ్గుతున్న మానసాన 
ఏకాంతపు లోగిలినొక 
మధువు తలుపు తట్టింది 

చీకటి మగ్గిన తూరుపు 
సీమనింక వెలిగిస్తూ  
దివ్యభాను బింబమొకటి  
కనుల ముందు నిలుస్తోంది 

ఊహాపోహల లోకపు 
చూపుల కందని దవ్వుల 
తేటయైన లోకమొకటి 
చెంతకు రమ్మంటోంది 

గంభీరపు అలలమీద  
తేలియాడు నాదమొకటి 
మనసు అంచులను తాకి
మత్తులోకి లాగుతోంది 

ఇంద్రజాల మర్మలోక  
రహస్యాలు వీడిపోయి 
చల్లని చిరునవ్వొక్కటి 
మోమును వెలిగిస్తోంది 

బాధలన్ని సమసిపోవు 
స్వర్గమొకటి ముందుందని 
గమనించిన లేతమనసు 
గంతులేసి ఆడుతోంది  

చావుపుట్టుకల మర్మపు 
ముద్రలింక విచ్చిపోయి 
నిశ్చలమగు ఎరుక ఒకటి 
నిదుర లేచి చూస్తోంది 

అంతులేని వ్యధలనుంచి 
ఆనందపు సీమలోకి 
రారమ్మని చేయిసాచి 
వెలుగొక్కటి పిలుస్తోంది 

నీటిచెలమ లోని నీరు 
సూర్యుని చేరంగ బోవ 
ఆవిరిగా మారునపుడు 
ఆనందం పొంగుతోంది

యుగయుగాల ఆవేదన 
అంతమయే ఘడియలలో  
జీవన సత్య సుగంధం  
మనసు నలముకుంటోంది

ఎరుపెక్కిన తూరుపుదెస 
ఎదురుచూచు కాంతి రేడు 
ఎదుట నిలుచు సమయమింక 
వచ్చెననుచు నవ్వింది