“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మార్చి 2013, ఆదివారం

వివాహ పొంతనాలు-పెర్ఫెక్ట్ మేచింగ్

పెళ్లి ముందు ఇద్దరి జాతకాలు కలుస్తాయా లేదా చూడటం సామాన్యంగా జ్యోతిష్యాన్ని నమ్మే అన్ని దేశాలలోనూ జరుగుతుంది.ఇందులో ఎవరెవరి పద్దతులు వారికుంటాయి.జ్యోతిష్యాన్ని నమ్మేవారు వారి వారి విధానాల ప్రకారం జాతకాలు చూపిస్తారు.కుదిరితే చేసుకుంటారు.కాని ఈ విషయం తేల్చడం అనుకున్నంత తేలిక కాదు.

చూడటానికి సింపుల్ గా కనిపించే ఈ ప్రాసెస్ వెనుక చాలా చిక్కు ముళ్లుంటాయి.సాధారణ జ్యోతిష్కులకు అవి తెలియవు.అందుకని ఏవేవో మాయమాటలు చెప్పి 'నూరు అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్లి చెయ్యమన్నారు' అన్న సామెతమీద ఆధారపడి 'పరవాలేదు బాగానే ఉంది చేసుకోండి' అని చెబుతుంటారు.

సామాన్యంగా గణాలూ గుణాలూ చూచి 36 పాయింట్లకు ఎన్ని పాయింటులోచ్చాయో చూచుకుని దాని ప్రకారం కలిసిందనీ కలవలేదనీ అనుకుంటారు.ఇదే అన్ని చోట్లా అనుసరించే విధానం.కాని ఈ విదానం చాలాసార్లు బెడిసి కొడుతుంది. 

మొన్నీమధ్య ఒక తెల్సినతను రెండు జాతకాలు తెచ్చి మేచింగ్ అవుతుందో లేదో చెప్పమన్నాడు.ఇప్పటికే విజయవాడలో నలుగురు జ్యోతిష్కుల దగ్గరికి వెళితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారట.అదీగాక ఈ మధ్య పర్సంటేజీ విధానంలో చెబుతున్నారట.ఒకాయనేమో 50 శాతం మేచింగ్ అయింది అన్నాడట. మిగిలిన ముగ్గురూ 60,70 ఇలా వారికి తోచిన పర్సెంటేజీలు చెప్పారట.ఇతనికి అర్ధంగాక నా దగ్గరకొచ్చాడు. 

'కేపీ సిస్టం వారిని కలవక పోయారా.వాళ్ళైతే ఈ సందిగ్ధం లేకుండా తేల్చి చెబుతారు కదా?' అడిగాను.

'అదీ అయింది. ఒక కేపీ సిస్టం జ్యోతిష్కుని వద్దకూ వెళ్ళాము.వీళ్ళ జాతకాలు అస్సలు కలవలేదు.ఈ సంబంధం కుదరదు.వీళ్ళ పెళ్లి అయితే నేను మీసం తీసేస్తాను అని ఆయన చెప్పాడు.' అన్నాడు.

'వీళ్ళ పెళ్లి అయితే ఆయన మీసం తీసేయడం ఎందుకు? దానికీ దీనికీ ఏమిటి సంబంధం?' అనడిగాను.

సామాన్యంగా కేపీ జ్యోతిష్కులలో ఎందుకో గాని ఆవేశం పాళ్ళు ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి ప్రతిజ్ఞలు చాలా ఎక్కువగా వాళ్ళు చేస్తుంటారు. విషయాన్ని సింపుల్ గా సూటిగా చెప్పడానికి అంతగా ఆవేశపడవలసిన పని ఏముందో నాకైతే అర్ధం కాదు.

'పోనీ కేపీ సిస్టం లోనే సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోయారా?' అడిగాను.

'అదీ అయింది సార్.ఆ రెండో కేపీ జ్యోతిష్కుడు ఇవే జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయని చెప్పాడు.'మెడ్ ఫర్ ఈచ్ అదర్' అని చెప్పాడు.అందుకే పిచ్చి పుట్టి చివరిగా ఈ జాతకాలు మీ దగ్గరకి తీసుకొచ్చాం.' అన్నాడు.

'సరే వివరాలిచ్చి రెండు రోజుల తర్వాత కలవండి.'అని చెప్పి పంపాను.

ఒక జాతకాన్ని నలుగురు జ్యోతిష్కులు చూస్తె నాలుగు రకాలుగా చెబుతారు. ఒకే రోగానికి నలుగురు డాక్టర్లు నాలుగు రకాల ట్రీట్మెంట్ లు ఇచ్చినట్లుగా ఉంటుంది.అలా కాకుండా ఎవరు చూచినా ఒకే విధంగా చెప్పగలగాలి.అదే అసలైన విద్య అని నేనంటాను. దీనికి కారణం జ్యోతిష్యం నేర్చుకునేవారికి ఒక నిర్ధారిత విధానం (standardization) అంటూ స్పష్టంగా లేకపోవడమే.

వివాహ మేళనంలో చాలామంది జ్యోతిష్కులకు తెలియని విషయం ఏమిటంటే జాతకాలు కలిసినంత మాత్రాన వారి వివాహ జీవితం సుఖంగా ఉండాలని రూలేమీ లేదు. ఈ రెండూ బొత్తిగా వేర్వేరు విషయాలు. అందుకే, వివాహ మేళనం కోసం రెండు జాతకాలు మన దగ్గరకు వచ్చినపుడు ముందుగా రెండు విషయాలు చూడాలి.

1.ఈ జాతకాలు కలిశాయా లేదా? అనేది ముందుగా చూడాలి. దీనికి అనేక పద్ధతులున్నాయి. వీటిలో కొన్ని పనిచేస్తాయి.కొన్ని థియరీ బాగుంటుంది గాని ప్రాక్టికల్ గా పనిచెయ్యవు.

2.వీరి వివాహ జీవితం ఎలా ఉంటుంది? అనేది తర్వాత చూడాలి. దీనికీ అనేక పద్ధతులున్నాయి.అవి అనుభవం మీద తెలుస్తాయి.

జాతకాలు కలిసినంత మాత్రాన వారి వివాహ జీవితం సుఖంగా ఉండాలని అనుకోవడం భ్రమ. ఇద్దరి వివాహ జీవితమూ నిత్యయుద్ధంగా ఉంటుంది అని ఇద్దరి జాతకాలూ చెబుతుంటే వారిద్దరి చార్టులూ బాగా కలిసినట్లే లెక్క. ఎందుకంటే ఒకరు తిడితే ఇంకొకరు కూడా వెంటనే తిట్లు లంకించుకోవాలి కదా.ఒకరు కొడితే రెండో వారూ తిరగబడి కొట్టాలి కదా. అంటే సమఉజ్జీలు ఐనారు గనుక ఆ రకంగా 'మెడ్ ఫర్ ఈచ్ అదర్' అన్నమాట.

అంటే 'కాకులు కాకుల గుంపులోనే చేరతాయి కొంగలు కొంగల గుంపులోనే చేరతాయి.హంసలు హంసల గుంపు లోనే చేరతాయి' అన్నట్లు రెండు చార్టులూ హంసలే అయితే అవి బాగా మేచ్ అయినట్లు అనుకోవాలి. లేదా రెండూ కాకులే అయినా అవికూడా బాగా మేచ్ అయినట్లే అనుకోవాలి.లేదా రెండూ కొంగలె అయితే కూడా బాగా మేచ్ అయినట్లే అనుకోవాలి. కాని హంసల కాపురమూ, కొంగల కాపురమూ,కాకుల కాపురమూ ఒకే విధంగా ఉండవు.హంసలు అన్యోన్యంగా సంతోషంగా ఉంటాయి.కొంగలు అప్పుడప్పుడూ తిట్టుకొని కొట్టుకున్నా మళ్ళీ కలిసి సర్దుకొని  జీవిస్తాయి. కాకులు ఎప్పుడూ గొడవలు గోలలు తిట్టుకోవడం కొట్టుకోవడం కాకిగోలతోనే సంసారం సాగిస్తూ ఉంటాయి. ఇది కూడా పర్ఫెక్ట్ మేచింగే. ఈ మూడు రకాలైన జాతకాలూ బాగా మేచ్ అయినట్లే చెప్పాలి.

ఇవి మూడూ కాక, 'మార్జాల దాంపత్యం' అంటూ ఇంకొకటి ఉంటుంది.పిల్లులు భీకరంగా ఒకదాన్నొకటి కొట్టుకుని కరిచేసుకుంటూ ఉంటాయి.మళ్ళీ వాటికి పిల్లలు పుడుతూనే ఉంటాయి. ఇలాంటి సంసారాలు కూడా కోటానుకోట్లు ఉంటాయి.వీటికి క్షణం పడదు.వీరి జీవితంలో నిత్యయుద్ధం జరుగుతూ ఉంటుంది.భౌతికంగా కూడా ఒకరిపైన ఒకరు దాడిచేసి కొట్టుకుంటూ ఉంటారు.కాని విడిపోయి ఎవరి జీవితం వారు గడపరు. దీనిని మార్జాల దాంపత్యం అంటారు.ఇదీ పర్ఫెక్ట్ మేచింగే.నాకు తెలిసిన ఒక జంట గత నలభై ఏళ్ళుగా ఇలాగే సంసారం సాగిస్తున్నారు.నేటికీ రోడ్డెక్కి భీకరంగా గొడవ పడతారు.కాని విడిపోరు.

చదువరులకు ఒక విషయం అర్ధం అయి ఉండాలి. జాతకాలు కలవడం వేరు. సంసారం అన్యోన్యంగా ఉండటం వేరు.అన్యోన్యంగా ఉండేలాగా జాతకాలు కలవడం వేరు. ఈ మూడో రకం మేచింగ్ చాలా కష్టమైనది.చాలా అరుదుగా మాత్రమే జాతకాలలో కనిపిస్తుంది.జాతకాలు కలవడం అంటే వివాహ జీవితం బాగుండటం అని అర్ధం కాదు.మంచో చెడో ఇద్దరూ ఒకే దారిలో వెళ్ళడమే జాతకాలు కలవడం అంటే అసలైన అర్ధం. చాలాసార్లు అలాగే జరుగుతుంది కూడా.

అంటే, అబ్బాయి జాతకంలో నాశనం అయ్యే యోగం ఉంటె,అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇంకా త్వరగా నాశనం అయ్యేటట్లుగా అమ్మాయి జాతకం ఉంటే అది పర్ఫెక్ట్ మేచింగ్ అవుతుంది.అలా కాకుండా మంచి అమ్మాయిని తెచ్చి వీడికి కట్టబెడితే ఈ అమ్మాయి పుణ్యబలం వల్ల అతనికి మేలు ఖచ్చితంగా జరుగుతుంది.కాని అలాచేస్తే ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్లే అవుతుంది.తనకు తగిన జాతకుడిని ఈ అమ్మాయి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని ఆ అమ్మాయికి దూరం చెయ్యడం అన్యాయం చేయ్యడమేగా. అప్పుడా పాపఫలితం జ్యోతిష్కుని నెత్తిన కూచుంటుంది. 

అందుకే 'మనోనుకూలం ప్రధమం ప్రయత్నం' అని జ్యోతిష్య గ్రంధాలు చెప్పాయి.ఇరువురూ ఒకరి కొకరు మానసికంగా బాగా నచ్చితే జాతకాలు చూడనక్కరలేదు అని జాతక గ్రంధాలే చెప్పాయి.అయితే ఈ నచ్చడం అనేదాంట్లో కూడా మళ్ళీ తేడాలుంటాయి. ఈరోజు నచ్చిన వ్యక్తి రేపు నచ్చకపోవచ్చు.ఎందుకంటే కలిసి జీవించడం మొదలు పెట్టాక వారిలో మనకు నచ్చని అనేక కోణాలు బయట పడుతూ ఉంటాయి.ఈ క్షణికమైన నచ్చడం గురించి కాదు జ్యోతిష్యం చెప్పింది.ఇద్దరి మనస్సులూ సంస్కారాలూ ఒకే వేవ్ లెంగ్త్ లో నడుస్తుంటే ఇక జాతకాలు చూడనక్కర లేదని అవి చెప్పాయి.కొందరికి జాతకాలు లేకపోయినా అలాంటి మేచింగ్ జరుగుతుంది. వాళ్ళ సంసారాలు చాలా బాగా సాగుతూ ఉంటాయి. నా దగ్గరకు వచ్చినాయన చెప్పినది అదే.

కొన్నేళ్ళ క్రితం వాళ్ళబ్బాయికి వివాహం కోసం ఒక జాతకం నా వద్దకు తెచ్చారు.కానీ ఆయనిలా అన్నాడు.'సార్.మా పెళ్లి అయి ఇప్పటికి ముప్పై ఏళ్ళయింది.అప్పుడు జాతకాలు చూడలేదు.అసలు మా ఇద్దరి జనన తేదీలూ లేవు.ఎవరూ రికార్డ్ చెయ్యలేదు.స్కూల్ రికార్డులలో ఏదో ఒకటి ఉజ్జాయింపుగా రాయించారు.కనుక మా జాతకాలు లేవు.అయినా సరే ఈ ముప్పై ఏళ్ళుగా ఏ గొడవలూ లేకుండా చక్కగా సంసారం సాగుతున్నది.'

'మరైతే మీ అబ్బాయికి జాతకం చూడటం ఎందుకు? అతనికీ మీ పద్దతే అనుసరించవచ్చుకదా?' అని అడిగాను.

'ఏదో అదొక నమ్మకం.అందుకే మీ దగ్గరకి వచ్చాం' అన్నాడు ఆయన.

సరే నాకు తోచినదేదో ఆయనకు చెప్పి పంపాను.వాళ్ళబ్బాయికి పెళ్లి అయింది.ప్రస్తుతం బాగానే ఉన్నారు.ఇలాంటి వారు కొందరుంటారు.

నాకు వెంకటాద్రిగారని ఒక స్నేహితుడు ఉండేవాడు.2004 లో ఆయన చనిపోయాడు. ఆయన ఇలాంటివే భలే ప్రశ్నలు అడిగేవాడు. ఒకసారి మా చర్చలో ఇదే టాపిక్ వచ్చింది.

'ఒక అబ్బాయి జాతకంలో రెండో పెళ్లి కనిపిస్తుంటే, అమ్మాయి జాతకంలో కూడా రెండో పెళ్లి ఉంటె వాళ్లకు మేచ్ అయినట్లా? వాళ్ళ జాతకాలు కలిసినట్లు మనం చెప్పవచ్చా? లేకపోతే అటువంటి కర్మ లేని అమ్మాయి జాతకం ఇతరత్రా కొన్ని కోణాలలో కలిస్తే ఈ అబ్బాయికి మేచ్ అయినట్లు చెప్పవచ్చా? ఒకవేళ రెండో అమ్మాయిని ఇతను చేసుకుంటే అతనికి రాసిపెట్టి ఉన్న రెండో పెళ్లి తప్పిపోతుందా? 

అలాగే,ఒకమ్మాయికి వైధవ్య యోగం కనిపిస్తుంటే, మంచి ఆయుస్సు ఉన్న జాతకుడిని ఈ అమ్మాయికి మనం మేచ్ చెయ్యవచ్చా? అప్పుడు ఆ అమ్మాయికి వైధవ్యం తప్పిపోతుందా?లేకపోతే అమ్మాయి జాతకం బలంగా ఉంటె ఇతని ఆయుస్సు తగ్గిపోతుందా?ఏ విధంగా జరిగినా ఎవరిదో ఒకరి జాతకం తప్పినట్లే కదా? అసలు అలా చెయ్యగలమా? ఆ విధంగా ప్రతి కేసులోనూ మనిషి చెయ్యగలిగితే ఇక 'విధి' 'రాసిపెట్టి ఉండటం' అనే మాటలకు అర్ధాలు ఏమిటి? అసలు విధి అనేది ఉందా? ఉంటె దాని లిమిట్ ఎంతవరకు? అదెంతవరకూ పని చేస్తుంది? మన ఫ్రీ విల్ ఎంతవరకూ పనిచేస్తుంది? ఈ భేదాలు జాతకం చూచి ఎలా తెలుసుకోవాలి?

పాయింట్ ఏమిటంటే, ఇద్దరి జాతకాలలోనూ ఒకే విధమైన చెడు కనిపిస్తే వాటిని ఓకే చెయ్యవచ్చా? కుజదోషంలో అలా చేస్తున్నాము కదా? లేక ఇద్దరికీ ఆ చెడును నివారించడానికి వీరిద్దరికీ అటువంటి దోషాలు లేని వేర్వేరు సంబంధాలు చేసుకోమని చెప్పాలా? అలా చేస్తే వాళ్ళ పార్టనర్ కు అన్యాయం చేసినట్లే కదా? మేచింగ్ చెయ్యడం అంటే వీటిల్లో ఏది సరియైన విధానం? అనేది ఆయన ప్రశ్న.

అంటే జ్యోతిష్కుడనేవాడు ఊరకే తటస్థంగా మాత్రమే ఉండి కర్మ ప్రకారం జరిగేది నిమిత్త మాత్రుడిగా చూస్తూ ఉండాలా లేక ఆయా జాతకుల కర్మలలో కలిగించుకొని వారి విధిని మార్చే ప్రయత్నం చెయ్యాలా? అనేది ప్రాధమికమైన ప్రశ్నగా తేలింది.

చెడు కనిపిస్తున్నపుడు దానిని నివారించడానికే కదా జ్యోతిష్యం యొక్క ఉపయోగం? కనుక అలా నివారించకుండా ఇద్దరి జాతకాలలోనూ విడాకులు రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ మేచింగ్ అయింది. ఈ వివాహం చేసుకోవచ్చు ముందు వివాహం చేసుకొని తర్వాత విడాకులు తీసుకోండి అని చెప్పవచ్చా? చెడిపోయే వివాహం అసలు ఓకే చెయ్యడం ఎందుకు?   

ఒకవేళ వాళ్లకు అలా అనుభవించే ఖర్మ రాసిపెట్టి ఉందీ అనుకుంటే అసలు జాతకాలు చూడటం ఎందుకు? ఎవరి ఖర్మ ప్రకారం ఎవరికి తగ్గ మనుషులు వారికి దొరుకుతారు.ఇక జాతకాల పాత్ర ఏముంది? ఎవరికి నచ్చిన వారిని వారు చేసుకొని వారి వారి ఖర్మానుసారం కష్ట సుఖాలు అనుభవించ వచ్చు కదా.

జాతకాన్ని చూచినప్పుడు దానిని prove చెయ్యడానికి జ్యోతిష్కుడు ప్రయత్నించాలా? లేక disprove చెయ్యడానికి ప్రయత్నించాలా? అసలు అలా ప్రయత్నించగలమా? అలా అయితే ఏఏ కేసుల్లో మనం విధికి ఎదురు వెళ్ళగలం? ఏఏ కేసుల్లో వెళ్ళకూడదు? ఈ భేదం ఎలా తెలుస్తుంది?

ఇలాటి core matters మీద చర్చలు మా మధ్య సాగేవి. ఆ చర్చలలో నుంచి పుట్టే జవాబులు వచ్చే పరిష్కారాలూ కూడా అద్భుతంగా ఉండేవి. ఇటువంటి పరిశీలనాత్మకమైన శోధన వల్లనే లోతైన రహస్యాలు అవగతం అవుతాయి.అంతేగాని ఏదో మేరేజ్ మేచింగ్ సాఫ్ట్ వేర్ పెట్టుకుని రెండు జాతకాలూ దానికి ఫీడ్ చేసి అది చెప్పిన ప్రకారం 'జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయి' చేసుకోండి అని చెప్పిన జాతకాలు ఏడాది తిరగక ముందే  కోర్ట్ కెక్కి విడాకులు తీసుకున్నవి ఉన్నాయి.

జ్యోతిష్యంలో కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి.అంతేగాని పుస్తకంలో ఉంది కదా అని అలాగే జరుగుతుంది అనుకోకూడదు. గోడ ఉందని చూసుకోకుండా పుస్తకంలో ఉందని ముక్కుసూటిగా పోతే ఏమౌతుందో అందరికీ తెలిసిందేగా.

మేరేజ్ మేచింగ్ అనేది పైకి కనిపించినంత సింపుల్ కానే కాదు అని చెప్పడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.