“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఆగస్టు 2012, ఆదివారం

శనికుజయోగం - ఇంకొన్ని ఫలితాలు

ఊహించినట్లే గత రెండురోజుల నుండీ ఈ గ్రహయోగం అనేక ప్రమాదాలనూ, విధ్వంసాన్నీ ప్రపంచవ్యాప్తంగా కలిగిస్తున్నది. అవేమిటో కొంచం చూద్దాం.

పాకిస్తాన్ లోని కామ్రా ఎయిర్ బెస్ మీద తీవ్రవాదుల దాడి జరిగింది. అక్కడ అణ్వాయుధాలు కూడా స్టాక్ చేసి ఉన్నాయని అంటున్నారు. లాడెన్ హత్యకు ప్రతీకారంగానే ఈపని చేసామని వాళ్ళంటున్నారు. ఒకవేళ అవి తీవ్రవాదుల చేతికి చిక్కితే మొదట గురిపెట్టేది మన దేశం మీదనే. అప్పుడు మరో హిరోషిమా నాగసాకిలను మన దేశంలోనే ఎంచక్కా చూడొచ్చు. ఈ ముప్పు ఈరోజు కాకున్నా ఏదో ఒకరోజున మన దేశానికి తప్పదు.

అదే పాకిస్తాన్ లో సున్నీలు షియాల మధ్యన కొట్లాటలో జనం మిడతల్లాగా చంపబడుతున్నారు. ఇది పవిత్ర రంజాన్ మాసం కనుక ఏ విధ్వంసం జరిగినా ఏ దౌర్జన్యం జరిగినా దానిని పవిత్రంగానే భావించాలి. లేకుంటే మన మనస్సులే అపవిత్రాలని అన్నా మనం ఆశ్చర్యపోకూడదు. 

లక్నోలో శుక్రవారం ప్రార్ధనల అనంతరం జరిగిన అల్లర్లలో బుద్ధ విగ్రహం ధ్వంసం అయింది. ప్రార్ధనల అనంతరం 'దైవావేశం' లో మసీదునుంచి బయటకు వచ్చిన అల్లరి మూకలు చివరికి టూరిస్ట్ లనూ మీడియావారినీ కూడా వదిలిపెట్టకుండా దేహశుద్ధి చేసాయి. బహుశా వీరిద్దరిలో వారికి సైతాన్ కనిపించి ఉంటుంది. అందుకే అలా దేహశుద్ధి చేసి వదిలారు. కాని బుద్ధ విగ్రహం ఏం చేసింది పాపం? అందులో కూడా సైతాన్ కనిపిస్తే అది బయట ఎక్కడా లేదు, వారి మనస్సులలో ఉన్నట్లే లెక్క. ఇలాంటి వారిని ఏమీ చెయ్యకుండా వదిలేస్తుండబట్టే మన 'లా అండ్ ఆర్డర్' పరిస్తితి ఇలా ఉంది. బుజ్జగింపులకైనా ఒక హద్దుండాలి.

సౌత్ ఆఫ్రికాలో తమ హక్కుల కోసం డిమాండ్ చేసిన గని కార్మికుల్ని వరుసగా నిలబెట్టి పిట్టల్లా కాల్చేశారు.ప్రపంచ దేశాలు అడుగుతున్నా చేసినవారు నోరు మెదపడం లేదు.గని కార్మికులు శనికారకత్వాన్ని సూటిగా ప్రతిబింబిస్తారు.

ఆఫ్ఘనిస్తాన్ లో నాటో హేలికాప్టర్ ను తీవ్రవాదులు పేల్చేశారు. అందులో ఉన్న సైనికులు అందరూ పరలోక ప్రయాణం కట్టారు.

నార్త్ సిరియాలో బాంబు దాడులలో జనం మిడతల్లా  చస్తున్నారు.

ఇరాక్ లో తీవ్రవాదుల దాడులలో కారు బాంబు పేలుడులో కనీసం ఏభై మంది హరీమన్నారు. 

మన దేశంలో ఈశాన్య సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. పుకార్లతో జనం భయభ్రాంతులై తిరణాలలాగా అస్సాం కు వెళ్ళిపోతున్నారు.

కేరళలో కొత్తమంగళంలో లాండ్ స్లైడ్ జరిగి దాదాపు పది ఇళ్లను మొత్తం తుడిచి పెట్టేసింది. కనీసం  ఆరుగురు ఆ రాళ్ళూమట్టి ప్రవాహంలో ఇరుక్కుని భూసమాది అయ్యారు. ఫైర్ డిపార్ట్ మేంటూ, నేవీ బృందమూ సహాయక చర్యలలో ఉన్నారు.

ఫిలిప్పైన్స్ లో విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. అందులో ఉన్న అందరూ జలసమాధి అయ్యారు.

ఇక రోడ్ ఏక్సిడెంట్లు, చిన్నచిన్న ప్రమాదాలూ లెక్కే లేదు. ఈ రెండురోజుల్లో లోకల్ గా రోడ్ ప్రమాదాలలో చాలామంది అక్కడక్కడా చనిపోయారు. కనుక వాటిగురించి వ్రాయడం లేదు. మనుషుల జీవితాలలో కూడా హటాత్ గా గందరగోళ సన్నివేశాలు తెరమీదకు వస్తున్నాయి.గాబరాను సృష్టిస్తున్నాయి. గమనించుకుంటే ఎవరికీ వారికే అర్ధమౌతాయి. 

ఈ ఘోరాలూ విధ్వంసాలూ చికాకులూ అన్నీ ఈ గ్రహస్తితి ప్రభావమే. శనికుజుల యుతి ఇంతటి ప్రమాదాలను సృష్టించగలదా? అని అనుమానించే వారు ఇప్పుడు ఒకసారి పునరాలోచించుకోవాలేమో? ఈ త్రెడ్ లో పాత పోస్ట్ లు ఒకసారి చదవండి ఈ గ్రహప్రభావం ఎలా ఉంటుందో మీకే అర్ధమౌతుంది.