“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, జులై 2012, గురువారం

ఇదా మానవత్వం?

నిన్న గాక మొన్న జరిగిన ఒక సంఘటన చూచాక మనుషుల మీద నమ్మకం నాకు పూర్తిగా నశించింది. మనుషుల్లో పచ్చి స్వార్ధం తప్ప ఇంకేమీ లేదనీ, మన బ్రతుకులన్నీ దొంగ బ్రతుకులేననీ, మనుషుల్లో మనుషులు లేరనీ ఉన్నవి జంతువులేననీ పూర్తిగా అర్ధం అయింది.

మొన్న గుంటూరులో ఒక వ్యానూ ఒక టూవీలరూ గుద్దుకుని, ఆ వ్యాను టూవీలర్ నడుపుతున్న వ్యక్తీ కాళ్ళ మీదుగా ఎక్కింది. అతనికి రెండు కాళ్ళూ నుజ్జు అయిపోయాయి. కుయ్యో మొర్రో అని ఏడుస్తూ రోడ్డు మీద పడి రక్షించమని అందరినీ ప్రాధేయపడుతుంటే, రోడ్డున పోతున్న వారుగాని, ఆటోలవాళ్ళు గాని, కార్లవాళ్ళు గాని ఎవరూ ఒక్కరుకూడా అతనికి సాయం చెయ్యలేదు. అతను అరిచీ అరిచీ రోడ్డుమీదే ప్రాణం కోల్పోయాడు. దీనిలో హైలైట్ ఏమిటంటే ఇది జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఒక టీవీ చానల్ వారు, అతని అరుపులు ఏడుపులు చక్కగా షూట్ చేస్తూ అతని ప్రాణం పోవడం కూడా స్టేజి బై స్టేజి ఎలా పోతోందో క్లియర్ గా బ్రాడ్ కేస్ట్ చేశారు. అతన్ని రక్షించి వెంటనే ఒక ఆస్పత్రి లో చేరుద్దామని మాత్రం ఒక్కరూ ప్రయత్నం చెయ్యలేదు.ప్రతివారూ ఒక్క చూపు చూచి తమదారిన తాము పోతున్నారు.

పాతకాలంలో అయితే పరిస్తితి ఇలా ఉండేది కాదు. వెంటనే ఎవరో ఒకరు స్పందించి సాయం చేసి ఉండేవారు. కాని ఇప్పుడు ప్రతివారిలోనూ స్వార్ధం విశ్వరూపం దాల్చింది. ఈ పని చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. అందుకే  కుటుంబసభ్యుల మధ్యన కూడా ఆర్ధికవ్యాపారమే తప్ప ప్రేమవ్యవహారం ఉండటం లేదు."లోకంలో ఉన్నవి ఆర్ధికపరమైన  సంబంధాలు మాత్రమే"అని మార్క్స్ అన్నది నిజమేనేమో అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలో అన్ని బ్రతుకులూ నాటకపు బ్రతుకులుగా తయారయ్యాయి. ఎంగిలి చేత్తో కాకిని విదిలించడు అనీ, పిల్లికి బిచ్చం పెట్టడు అనీ, విరిగిన వేలిమీద ఒంటెలు కూడా పొయ్యడు అనీ పల్లెటూర్లలో సామెతలు ఉండేవి.ఇప్పుడు నిత్యజీవితంలోనే అవి ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.ఒకవైపు భక్తి కూడా ఎక్కడచూచినా వికృతనృత్యం చేస్తున్నది. ప్రతి ఊళ్లోనూ గుళ్ళూ గోపురాలూ కిటకిటలాడుతున్నాయి. అది భక్తి కాదు, భయం అని నా అవగాహన చెబుతోంది. మనుషులలో స్వార్ధం మితిమీరినప్పుడు భయం కూడా ఎక్కువ అవుతుంది. తాము చేస్తున్నది తప్పని తమ అంతరాంతరాలలో తెలుసు కాబట్టి భయంతో గుడికెళ్ళి దేవుడికి లంచం ఇద్దామని ప్రయత్నం చేస్తాడు మానవుడు. దానిని భక్తిగా భ్రమిస్తాడు.తన కళ్ళు తాను పొడుచుకుని దేవుడి కళ్ళు కూడా పొడవడమే నేటి భక్తికి నిర్వచనం. భక్తిగా మనకు కనిపించేది నిజానికి మితిమీరిన స్వార్ధమూ భయమూ మాత్రమే.

మానవత్వం లేనివాడికి దైవత్వం అనేది ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని నేనెప్పుడూ చెబుతాను. స్వార్ధం వికృతరూపం దాలుస్తున్న నేటి సమాజంలో మానవత్వమే మృగ్యం అవుతుంటే ఇక దైవత్వం అనేది మానవుల ఊహకు కూడా అందదు అనేది నగ్నసత్యం. సాటిమనిషిలో దేవుని చూడమని వివేకానందస్వామి చెప్పాడు. కనీసం మనిషిని మనిషిగా చూడటం కూడా మనకు సాధ్యం కావడం లేదు. ఒక వస్తువుకంటే హీనంగా ఎదుటి మనిషిని చూస్తున్నాం. నేటి సమాజంలోని మానవమృగాలకు ఎప్పటికైనా నిష్కృతి అనేది ఉంటుందా అని నా అనుమానం.  

మన చుట్టూ మనుషులు లేరని, మనిషి తోలు కప్పుకుని పులులూ తోడేళ్ళూ నక్కలూ కుక్కలూ పాములూ ఎలుగుబంట్లూ తిరుగుతున్నాయని నేను ఎప్పుడూ అనుకుంటాను. అది నిజమే అని ప్రతిరోజూ నిర్ధారణ అవుతోంది.

భగవంతుడు ఎంత ఉన్నతమైన భావనతో మనిషిని సృష్టించాడు? చివరికి మనిషి ఎలా తయారయ్యాడు? ఏదన్నా ప్రళయం వచ్చి ఈ ప్రపంచం  అంతా త్వరగా సర్వనాశనం అయి, కొద్దిమంది మంచివాళ్ళు మాత్రమె మిగిలితే ఎంత బాగుంటుంది అని ఈ మధ్యన నాకు తరచుగా అనిపిస్తోంది.