“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, జులై 2012, సోమవారం

గురుపూర్ణిమ (గుండెధైర్యం లేనివాళ్ళు చదవొద్దు)

ఈరోజు ఉదయమే కొంతమంది నా దగ్గరకొచ్చి గురుపూర్ణిమ చందా అడిగారు. "సరే దాందేముంది ఇస్తాలేగాని దానితో ఏం చేస్తారు?" అని అడిగాను. సాయిబాబా గుళ్ళో ప్రత్యెకపూజ చేయిస్తామని చెప్పారు. "మామూలు పూజే వేస్ట్ అని నేననుకుంటుంటే ప్రత్యేకపూజ కూడానా?" అన్నాను. ఇంకొకసారి నా దగ్గరకొచ్చి ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. పరిస్తితి తేడాగా ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపాను. 

గురుపూర్ణిమ అంటూ రకరకాల గుళ్ళలోనూ, గురువుల సమక్షంలోనూ  చేసే తంతులన్నీ శుద్ధ పనికిమాలిన పనులు. ఈరోజుల్లో కులానికొక గురువు, వర్గానికొక గురువు, పనులు కావడానికొక గురువూ, పాస్ పోర్ట్ త్వరగా రావడానికొక గురువూ, గర్ల్ ఫ్రెండ్ త్వరగా కరుణించడానికొక గురువూ ఇలా వీధికొకరు, పనికొకరు, పనికిమాలిన గురువులు బ్రోకర్లలా  తయారయ్యారు. వీళ్ళందరూ అసలు "గురువు" అన్న పదానికి అర్హులేనా అని నాకు ఎప్పటినుంచో పెద్ద అనుమానం.

"అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిదీయతే" అంటూ అంధకారాన్ని తొలగించేవాడే గురువు అని శాస్త్రం చెబుతోంది. మరి ఇన్నేళ్ళ నుంచీ చేస్తున్న ఈ గురుపూజలవల్ల ఎవరికి ఏ అంధకారం ఎలా తోలిగిందో నాకైతే అర్ధం కాదు. నేను ఇన్నేళ్ళలో కొన్ని వందలమందిని క్లోజ్ గా గమనించాను.  గురుపూజా మహోత్సవాలు అని జరుపుకునే ప్రహసనాలు చాలా చూచాను. నాకు తెలిసి ఈ పూజలు చేస్తున్న ఎవరిలోనూ ఏ అందకారమూ తొలగలేదు. అహంకారరూపంలో ఇంకా బాగా దట్టంగా పట్టుకుంది. 

సమస్తలోకాలకూ ఆదిగురువు పరమశివుడు ఈ రోజున ఎవరికీ గుర్తురాడు. చిన్ముద్రాలంకృతుడై మౌనంగా అత్యుత్తమ జ్ఞానప్రసారం చేసి అనవసరపు  శాస్త్రజ్ఞానపు బరువుతో ముసలివగ్గులై పోయిన శిష్యులకు ఆత్మానుభవజ్ఞానాన్ని ప్రసాదించిన దక్షిణామూర్తి ఎవరికీ గుర్తురాడు. అనంతమైన వేదరాశిని ఆమూలాగ్రం అవగతం చేసుకొని దానిని ఋగ్యజుస్సామాధర్వణ భాగాలుగా విభజన చేసి పద్దెనిమిది పురాణాలనూ, ఉపపురాణాలనూ రచించి భరతజాతికి ఒక సంస్కృతిని ఇచ్చి ప్రాణంపోసిన వేదవ్యాసమహర్షి ఎవరికీ గుర్తురాడు.బ్రహ్మమానసపుత్రులై జన్మించి సంసారాన్ని తిరస్కరించి నిత్యమూ బ్రహ్మానుభూతిలో విరాజిల్లుతూ అయిదేళ్ళ పసిబాలురవలె వెలిగే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనబడే  జ్ఞానమూర్తులు ఎవరికీ గుర్తురారు. త్రిమూర్తుల ఔన్నత్యాన్నే పరీక్షించిన తపశ్శాలి భ్రుగుమహర్షి ఎవరికీ గుర్తురాడు.అరవైవేలమంది క్షత్రియయోధులను ఒక్క చూపుతో భస్మం చేసిన కపిలమహర్షి ఎవరికీ గుర్తురాడు. నిరంతర నారాయణనామస్మరణతో తన్మయుడై వైకుంఠానికి ఎప్పుడు బడితే అప్పుడు వెళ్లి రాగలిగిన మహాగురువు దేవరుషి నారదుడు ఎవరికీ గుర్తుకు రాడు. ఒకవేళ వచ్చినా మన దరిద్రపుకధలు సిగ్గులేని సినిమాల పుణ్యమా అని ఒక కమెడియన్ గా, ఒక తంపులమారిగా గుర్తొస్తాడు. కనీసం ద్వైతాద్వైత విశిష్టాద్వైత మత ప్రవర్తకులైన మధ్వ, శంకర, రామానుజులు కూడా గుర్తురారు. ఇదీ మన పరిస్తితి. 

మన గోత్రఋషులలో ఎవరి చరిత్ర ఏమిటో ఎవరికైనా తెలుసా? వారు ఎంతటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మహర్షులో ఎంతటి తపశ్శక్తి సంపన్నులో ఎంతటి చరితార్ధమైన జీవితాలను గడిపినవారో తెలుసా? మనవలె శిశ్నోదర పరాయణులై నిరర్ధక జీవితాలను గడిపినవారు కారని మనకు తెలుసా? కనీసం వారి మహోన్నత ఆదర్శమయ జీవితాలను తెలుసుకుందామనీ, అనుసరించే ప్రయత్నం చేద్దామనీ మనకు ఎన్నడైనా అనిపిస్తుందా? 

గురుపూర్ణిమ ఎలా చేసుకోవాలో మనకసలు తెలుసా? ఆ అర్హత మనకసలు ఉందా? మనకు తెలిసిందల్లా జనందగ్గర చందాలు వసూలు చేసి, పూజలంటూ ఏవేవో వస్తువులు పోగేసి వాటితో ఏవేవో దండగమారి పూజలు చేసేసి, ఏదన్నా సొమ్ము మిగిలితే దానిని స్వాహా చేసేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు పొంగిపోవటమే కాని, భరతజాతికి అసలు గురువులెవరు? వారేమి ఉపదేశించారు? ఎంతటి మహత్తర జ్ఞానసంపదను వారు మనకు అందించారు? అందులో మనకెంత అర్ధం అయింది? దానిని ఎలా ఆచరించాలి? అని ఒక్కసారైనా ఆలోచించిన పాపం చేశామా?

సాయిబాబా అంటే నాకేమీ ద్వేషంలేదు. కాని గురుపూర్ణిమ రోజున సాయిబాబా గుళ్ళలో జరిగే తంతులు చూస్తుంటే నాకు పొట్ట చెక్కలయ్యే నవ్వు వస్తుంది. ఈ మనుషుల మీదా సమాజం మీదా అసహ్యం  తీవ్రస్థాయిలో నాలో పెరిగిపోతుంది. నిత్యజీవితాలలో కుళ్ళూ కుత్సితాలతో పుచ్చిపోయిన దొంగభక్తులందరూ అక్కడ చేరి వారివారి కోరికల చిట్టాలు తెరిచి, తమకు అర్హత ఉందా లేదా అనేదికూడా చూచుకోకుండా, మాకదివ్వు ఇదివ్వు అంటూ ఒకటే ఊదరగొట్టి, నాలుగుడబ్బులు పడేసి, ఏదో ఘనమైన పూజలు ఆయనకు చేసినట్లు ఆత్మవంచన చేసుకుంటూ పొంగిపోతూ బయటకు వస్తుంటారు.సాయిబాబా కనుక జీవంతో ఉంటే, "పొండిరా దొంగల్లారా" అంటూ  తన చేతిలో ఉన్న కమ్చీతో తనకు ఓపిక ఉన్నంతవరకూ వీళ్ళను తరిమితరిమి కొట్టి ఉండేవాడు.

ఒక భక్తురాలు సాయిబాబాకు ఎన్నో ఏళ్లుగా ఎన్నో పూజలు చేసింది. కాని 29 ఏళ్ల ఆమె కూతురు ఈ మధ్యనే అకస్మాత్తుగా చనిపోయింది. "ఇన్నేళ్ళు పూజలు చేసినందుకు ఇదేనా బాబా నాకిచ్చే ప్రతిఫలం?" అంటూ నాతో వాపోయింది. ఎందుకలా చేసాడో బాబానే అడగమని ఆమెకు చెప్పాను. "ఆయన ఏమీ పలకడం లేదని" ఆమె చెప్పింది. "దానికి నేనేం చెయ్యను ఇన్నాళ్ళూ పలికినాయన ఇప్పుడెందుకు పలకడం లేదు?" అని అడిగాను.ఆమెకు బాధ కలిగినా ఇంకొకమాట కూడా అన్నాను. "మీ పూజలు కావాలని ఆయనేమైనా దేబిరించాడా? ఆ పూజలు చేసినందువల్ల మీకాయన బానిసగా ఉంటానని బాండ్ రాసిచ్చాడా?" అని అడిగాను."ఈ పూజల వల్ల ఉపయోగం ఏమిటి?" అని తప్పకుండా ఆమెకు సందేహం వచ్చి ఉంటుంది. ఈ సందేహాన్ని వదలకుండా పట్టుకుంటే అదే ఆమెకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. కాని ఆపని ఆమె చెయ్యలేదు. ఆమే కాదు. కోరికల చిట్టాతో కుళ్ళిపోతున్న మనుషులందరి పరిస్తితీ అంతే.

ఇంకొక భక్తురాలుంది. ఈమె శ్రీ రామకృష్ణుని ముప్ఫైఏళ్ళ పైగానే కొలిచింది. ముప్పై ఏళ్లక్రితం ఈమెకు పెళ్లయింది. అయిదేళ్ళ క్రితం భర్త గతించాడు. మామూలుగా భార్యాభర్తల మధ్యన ప్రేమ గట్టిగా ఉంటే ఇద్దరికీ ఒకేసారి పోవాలని అనిపించడం సహజం. కాని అలా జరగదు కదా. ఇద్దరూ ఒకేసారి పుట్టలేదుగా ఒకేసారి పోవడానికి. ఒకరు ముందూ ఒకరు వెనుకా ఎవరికైనా తప్పదు. కాని ఈ సంఘటనను జీర్ణించుకోలేక తాను ఇన్నేళ్ళుగా పూజిస్తున్న పటాలను తీసి పడేసింది. ఇప్పుడు పూజాలేదు ఏమీ లేదు. ఇన్నేళ్ళ ఆరాధన వల్ల వచ్చిన పరిపక్వత ఇదా అని నాకనిపించింది. అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతూ ఎక్కడా కష్టాలూ చావులూ లేకుండా లోకం ఉండాలంటే కుదురుతుందా? మనం చేసే దొంగపూజల వల్ల ఇక ప్రతివాడికీ అన్నీ అనుకున్నట్లు జరిగితే సృష్టి ఎందుకు? 

నాకు తెలిసి ఇంకొక భక్తురాలుంది. ఆమె సాయిబాబా భక్తురాలు కాదు. ఇంకొక మహాగురువును ఆరాదిస్తుంది. ఆమె తల్లిగారు ఒకరోజున దేవునికి హారతి ఇస్తూ ఆ మంట చీరకొంగుకు అంటుకుని గమనించే లోపల వళ్ళంతా కాలిపోయి సజీవదహనం అయి చనిపోయింది. తన తల్లి అలా చనిపోతే ఆ భక్తురాలు ఒక్కమాట అనలేదు. "మన ఖర్మ ఇలా ఉంటే దైవాన్ని నిందించి ఏమి ప్రయోజనం?" అన్నది. ఈ ముగ్గురూ భక్తులే. ముగ్గురికీ పెద్ద నష్టమే వాటిల్లింది. మరి దేవుడిలో తేడా ఉందా? భక్తులలో తేడా ఉందా? భక్తిలో తేడా ఉందా? లేక వీరి కర్మలో తేడా ఉందా?

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఒకరు ఇలా అడిగారు.
"అమ్మా. మన కష్టాలు తీర్చమని భగవంతుని కోరుకోవచ్చా?"
దానికి అమ్మ ఇలా చెప్పారు.
"ఆ. నీవిచ్చిన కష్టాలు నీవే తీసెయ్యమని అడగవచ్చు."

అమ్మ ఇంకా ఇలా అనేవారు. "సుఖాలు భగవత్ప్రసాదం అయితే మరి కష్టాలు ఎవరిస్తున్నారూ?". కష్టాలు కూడా ఆయనే ఇస్తున్నపుడు ఇంక వాటిని తీసెయ్యమని అడగడం ఎందుకు? ఎలా అడగాలి? అలా అడిగితే ఆయన మీద మనకు ప్రేమ లేదనే కదా. నీకన్నా నేనే తెలివైనవాడిని అన్న అహంకారం భగవంతుని దగ్గర ప్రదర్శించినట్లే కదా.

నేటి సమాజంలో ఒక ప్రసిద్ధ గురువుగారున్నారు. పాతకాలంలో ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఒకసారి ఆయన్ని ఇలా అడిగాను. "మీరు ఏవేవో పూజలూ అవీ చెయ్యమని జనాలకు ఎందుకు పురెక్కిస్తారు? పైగా మీరు చెప్పే ఉపన్యాసాలలో ఏమీ సత్యం ఉన్నట్లు నాకు అనిపించదు. ఉన్న సత్యాన్ని ఉన్నట్లు జనానికి చెప్పవచ్చు కదా" అన్నాను. దానికాయన- "అలా చెప్తే మాదగ్గరకు ఎవరొస్తారు?" అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ మాటతో సత్యం ఆయనకు కూడా అనుభవం కాలేదని నాకు అర్ధమైంది. ఎందుకంటే సత్యసాక్షాత్కారం అయినవాడు, ఒకడు తన దగ్గరికి రాలేదనో, తనకు భజన చెయ్యలేదనో చస్తే అనుకోడు. అలా అనుకుంటున్నాడంటే అతను సత్యానికి ఆమడదూరంలో ఉన్నాడని అర్ధం. ఆరోజు తర్వాత నేనా గురువు దగ్గరకు మళ్ళీ పోలేదు. ఈ సంఘటన జరిగి ఇరవైఏళ్ళు దాటింది.

"గురుతు చెప్పేవాడే గురువు" అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. గురువు చెప్పిన గురుతును మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే ఆ ఉపదేశాన్ని మన జీవితంలో శ్రద్ధగా ఆచరించాలి. అది చెయ్యకుండా, ఆయనకు గ్రానైట్ విగ్రహం చేయించి, ఒక బంగారుకిరీటం పెట్టించి, ఏడాదికొకసారి ఊరేగిస్తే దానివల్ల ఏమిటి ఉపయోగం? ఆ గురువు ఆత్మ క్షోభించడం తప్ప? "గురువు శిష్యుడన్న గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినుర వేమా" అని వేమనయోగి మొత్తుకున్నాడు. ఆయన చెప్పినదానిలో కనపడని లోతైన అర్ధం ఉంది. గుడ్డిగా గురువు చెప్పినది నమ్మి ఆచరిస్తే అదే మనల్ని మహోత్తమస్థాయికి తీసుకెళుతుంది. ఆ ఆచరణే నేడు కరువైంది. ఒక రాయిని నమ్మినా, మన నమ్మకంలో లోపం లేకుంటే అదే మనకు మోక్షాన్నిస్తుంది. ఏకలవ్యుడికి,తిన్నడికీ,వాల్మీకికీ జరిగింది అదేకదా. అటువంటి తదేకదీక్షా, భక్తీ మనకు ఉండాలి.

"చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుమ్భినీధవు  జెప్పెడి గురుడు గురుడు"- అంటాడు ప్రహ్లాదుడు. దైవాన్ని చేరే మార్గం చూపేదే నిజమైన చదువు. అక్కడకు ఎలా చేరాలో ప్రాక్టికల్ గా చూపించేవాడే అసలైన గురువు. అంతేగాని ఫీజులు కట్టించుకొని పాదపూజలు చేయించుకునేవారు , షాపులు ఓపెన్ చెయ్యడానికి డబ్బులు తీసుకొని విచ్చేసే గురువులూ గురువులు కారు. వారు శిష్యుల విత్తాపహారులే గాని, చిత్తాపహారులూ కారు, చిత్త తాపహారులు అసలే కాలేరు. ఆత్మవిద్యను ఆమూలాగ్రం బోధించలేక ఏవేవో కాకమ్మకబుర్లు చెబుతూ శిష్యులను అంధకారంలో ఇంకా పడదోశేవారు "గురువు" అన్న పదానికి అనర్హులు.అలాంటి గురువులు చెప్పేది విద్య కాదు. మిధ్య. అలాంటి గురువులు మరణించిన తర్వాత నరకంలో ఎలాంటి బాధలు పడతారో ఒక నిజమైన సన్యాసి ఒకసారి చెప్పి బాధపడ్డారు. గడ్డాలు పెంచి రంగుబట్టలు వేసుకున్నంత మాత్రాన ఎవరూ గురువులు కాలేరు.

నలభై ఏభై ఏళ్ళక్రితం ఒక సంఘటన జరిగింది. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారు మద్రాసు వెళ్లారు.అక్కడ ఒక భక్తురాలి ఇంటిలో ఉన్నప్పుడు సినిమానటి సావిత్రి అమ్మ దర్శనానికి వచ్చింది. దర్శనం అయ్యిన తర్వాత వెళుతూ వెళుతూ, "అమ్మా. మా ఇంటికి కూడా ఒకసారి మీరు రావాలి" అని అడిగింది. అమ్మ మౌనంగా ఉంది. సావిత్రి ఏమనుకుందో ఏమో, "అలా రావడానికి మీరేం తీసుకుంటారమ్మా?" అనింది. ఆమెవైపు చూచి చిరునవ్వు నవ్విన అమ్మ, "నేను ఇచ్చే అమ్మనే గాని తీసుకునే అమ్మను కానమ్మా" అని జవాబు చెప్పింది. అదీ దైవత్వం అంటే. పాపం సావిత్రి తప్పుకూడా ఏమీ లేదు. ఆమెకు అప్పటివరకూ తారసపడిన గురువులూ బాబాలూ అందరూ ఇంకా ఇమ్మని అడిగి మరీ తీసుకున్నవారె గాని ఇస్తామంటే వద్దన్నవారు ఒక్కరూ లేరు. అందుకే ఆమె తెలీక అలా మాట్లాడింది.

నూట ఏభై ఏళ్ళ క్రితం శ్రీ రామకృష్ణులకు లక్ష్మీనారాయణ మార్వాడీ అని ఒక సంపన్న భక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆ భక్తుడు పదివేల బంగారు నాణేలను శ్రీ రామకృష్ణునికి కానుకగా ఇవ్వబోతాడు. "అలాంటి సంకల్పాలు పెట్టుకుంటే ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు" అని రామకృష్ణులు గట్టిగా చీవాట్లు పెట్టి పంపిస్తారు. అది నిజమైన దైవత్వం అంటే. ఆరోజుల్లో పదివేల బంగారు నాణేలు అంటే ఈరోజుల్లో ఎంతో మనం ఊహించుకోవచ్చు.

లోకం అంతా నకిలీగురువులతో నిండి ఉంది. ఎక్కడో కొన్ని ఆశ్రమాలు,కొందరు స్వాములూ తప్ప, మిగతా అన్ని చోట్లా ధనమూ అసత్యమూ కలిసి అసహ్యపు రికార్డింగ్ డాన్స్లు చేస్తున్నాయి.ఆశ్రమాలు వ్యాపారకేంద్రాలయ్యాయి. స్వాములు అసలైన వేదాంతాన్ని ఎక్కడా చెప్పడం లేదు. అలాంటి దొంగస్వాములను నమ్మిన జనం కొన్నేళ్ళకు తమ తప్పు తెలుసుకొనికూడా ఆ విషవలయం నుంచి బయట పడలేక కన్నంలో దొంగల్లా కిక్కురుమనకుండా జీవితాలు సాగిస్తున్నారు.స్వార్ధంతో నిండిపోయిన జనంకూడా తమతమ లౌకికపనులు అవుతాయి అనుకున్న గురువులు దేవుళ్ళ దగ్గరకే ఎగబడుతూ ఉన్నారుగాని సత్యాన్ని సూటిగా బోధించే గురువులు ఎవరికీ అవసరం లేదు. "హంసలు హంసలగుంపులో కలుస్త్తాయి. కాకులు కాకులగుంపులో కలుస్తాయి" అని ఊరకే అనలేదు. 

"యదా పత్నీ తదా పతి:  యదా శిష్యా తదా గురు:" భార్యకు తగిన భర్తలూ,శిష్యులకు తగిన గురువులూ కర్మానుసారంగా ఎవరికివారు దొరుకుతారు. చలంగారు ఒక మంచిమాట చాలాసార్లు అనేవారు. "ప్రతివాడూ తనకు సీతాదేవిలాంటి పతివ్రత భార్యగా కావాలని అనుకుంటాడు. కాని తాను శ్రీరామచంద్రుడేనా అన్నది మాత్రం ఎవడూ చూచుకోడు." అలాగే ప్రతివాడూ తనకు రామకృషుని వంటి గురువు కావాలని అనుకుంటాడు. అలా ఆశించడంలో తప్పులేదు. కాని తనకు వివేకానందునికున్న లక్షణాలు ఉన్నాయా లేవా అని మాత్రం ఎవడూ ఆలోచించడు. ఇదీ విచిత్రం.

సత్యాన్ని సూటిగా బోధించని గురువులు వేశ్యలవంటి వారు. వేశ్యకు ప్రేమ ఎలా ఉంటుంది? దాని దృష్టి అంతా విటుడు తెచ్చే దనం మీద ఉంటుంది. అలాగే నకిలీ గురువుల దృష్టికూడా, శిష్యుని సామాజిక స్థాయి మీదో, అతని పదవి మీదో, అతని వద్ద ఉన్న ఆస్తిమీదో ఉంటుంది. అలాగే ఈ శిష్యులకు కూడా ఆ గురువు వల్ల ఒనగూడే హై లెవల్ పరిచయాలు, ప్రయోజనాల  మీదే దృష్టి ఉంటుంది. ఇద్దరికీ దైవంతో మాత్రం పని ఉండదు. కనుక చివరికి ఇదొక అసహ్యకరమైన అక్రమసంబంధంగా మారుతుంది. ఒక విటునికి స్వచ్చమైన ప్రియురాలు ఎలా దొరుకుతుంది? అతనికి వెలయాలే దొరుకుతుంది. అలాగే, నకిలీ శిష్యులకు స్వచ్చమైన సద్గురువులు ఎలా దొరుకుతారు? వారికి తగిన గురువులే వారికి దొరుకుతారు.

రమణ మహర్షిని ఒకతను చాలా రోజులనుంచీ "మాయ అంటే ఏమిటి?" అని అడుగుతూ ఉండేవాడు. మహర్షి ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజున రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి దర్శనార్ధమై వచ్చారు.ఆశ్రమవాసులందరూ హడావుడి చేసారు. మహర్షి ముఖంలో మాత్రం ఏ మార్పూ లేదు. ఒక సామాన్యుడు వస్తే ఎలా  ఉన్నాడో రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నాడు. రాజేంద్రప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. దర్శనం అయిపోయాక రాష్ట్రపతి వెళ్ళేటప్పుడు అందరూ ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి పోలోమంటూ పరిగెత్తి పోయారు. మహర్షి దగ్గర ఎవరూ లేరు. ఈ సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అప్పుడు మహర్షి అతనితో " మాయ అంటే ఇదే " అని ఒక్కమాట మాత్రం చెప్పారు. వారు అసలైన గురువులు.

వివేకానందుడు ఎంతో మందిని " మీరు దేవుని చూచారా?" అని అడిగాడు. ఎవరూ ఆయనకు సూటిగా జవాబు చెప్పలేదు. ఒక్క శ్రీరామకృష్ణుడు మాత్రం " చూచాను. చూస్తున్నాను. నీకూ చూపగలను" అన్నాడు. అలా అంటూనే  నరేంద్రుని హృదయస్థానంలో చిన్నగా స్పర్శించి సమాధి స్తితిని, దైవానుభవాన్నీ ఒక్క క్షణంలో ప్రసాదించాడు. నరేంద్రుడు ఆ అనుభవం పొందిన తర్వాత "మీరు దేవుణ్ణి చూచారా?" అని ఇంకెవరినీ అడగలేదు. వారు నిజమైన గురువులు.

అలాంటి గురువులు చెప్పినదేమిటో మనం అర్ధం చేసుకోవాలి. దానిని జీవితంలో ఆచరించాలి. అనుభవాన్ని పొందాలి. అంతేగాని, మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాటితో ప్రత్యేకపూజలూ నా బొందపూజలూ చేయ్యడం వల్లనో గుళ్ళూ గోపురాలూ కట్టించి ఏడాదికోకసారి దేవుడికి పెళ్లి చేసి (వీలైతే ఆంజనేయుడూ వినాయకుడూ కుమారస్వామీ వంటి బ్రహ్మచారులకు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసి) ఉత్సవాలు చేసినంత మాత్రానో ఏమీ ప్రయోజనం లేదు. మనుషుల జీవితాలలో మార్పు రావాలి. వ్యక్తిత్వాలు ఉన్నతంగా ఎదగాలి. మనుషులలో దైవత్వం నిండాలి. బోధలు మాటలలో కాదు చేతలలో ప్రతిఫలించాలి. ఆచరణలు నిత్యజీవితంలో నిరూపింపబడాలి. అప్పుడే గురువులైనవారు సంతోషిస్తారు. వారు సంతోషించినప్పుడే నిజమైన గురుపూర్ణిమ. దైవం కూడా అప్పుడే సంతోషిస్తుంది.

"ఈయన నా గురువు" అని మనం డప్పు వాయించుకోవడం కాదు. "వీడు నా ప్రియశిష్యుడు" అని ఒక సద్గురువు తన నోటితో చెప్పినప్పుడే మనకు నిజమైన ఘనత. అదే నిజమైన గురుపూర్ణిమ. ఎందుకంటే అప్పుడే మనం గురువు యొక్క ఆకాంక్షను పూర్తి చేసినవారం అవుతాము. ఏ గురువైనా తన శిష్యుడు దైవానుభూతిని పొందాలనే కోరుకుంటాడు. తనను మించి తన శిష్యుడు ఎదగాలని కోరుకుంటాడు. శిష్యుడు అలా ఎదిగినప్పుడే ఆ గురువుకు పూర్ణిమ. అదే నిజమైన గురుపూర్ణిమ. అంతేగాని మనం ఇచ్చే బోడి బహుమతులూ, చేసే దొంగపూజలూ, మన బ్లాక్ మనీ తో చేయించే బంగారుకిరీటాలూ, మన సొల్లు పొగడ్తలూ, చొంగ కార్చే నంగివేషాలూ, ఏ సద్గురువూ ఆశించడు. మన పొగడ్తలు వారికి అగడ్తలుగా తెగడ్తలుగా కనిపిస్తాయి. ఒకవేళ వాటిని ఆశిస్తే అతను సద్గురువే కాదు, మామూలు "గురువు" అన్న పదానికి కూడా అతను అర్హుడు కాదు.

గురువుకు ఉండవలసిన లక్షణాలను ఉపనిషత్తులు వివరించాయి.గురువు అనేవాడు శ్రోత్రియుడూ బ్రహ్మనిష్ఠ కలిగినవాడూ అయి ఉండాలి అని పిండితార్ధంగా అవి ఘోషించాయి. అంటే వేదములకు సరియైన అర్ధం తెలిసినవాడూ ఆ తెలిసినదానిని ఆచరణలో పెట్టగలిగినవాడూ అయి ఉండాలి అని అర్ధం. అంతేగాక అతడు కరుణా హృదయుడూ, విశాల భావాలు కలిగిన వాడూ అయిఉండాలి. ముండకోపనిషత్ అయినా వివేకచూడామణి అయినా ఇదే చెప్పాయి. 

మరి శిష్యునికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి కదా. అవేమిటి? సంసారం అంటే విరక్తి కలిగి దానిని ఎలాగైనా దాటాలి, తానెవరో దైవమేవరో తెలుసుకోవాలి అన్న బలమైన తపన శిష్యునకు ఉండాల్సిన ముఖ్యమైన అర్హత.అది అతని జీవితంలో మొదటి priority అయి ఉండాలి. ఏమీ తోచనప్పుడు కలిగే last priority కాకూడదు. దానికోసం అతడు ఏమైనా చెయ్యడానికి తయారుగా ఉండాలి. దారి చూపగల గురువుకోసం అవసరమైతే భూగోళం అవతలి అంచుకు కూడా వెళ్లి వెదకగల తపన ఉండాలి.ఆ దారి దొరికెంత వరకూ తిండి సహించక నిద్రపట్టక చికాకుతో అసహనంతో వేగిపోయే స్త్తితిలో శిష్యుడు ఉండాలి. ఆ తపన ముందు కుటుంబసభ్యులూ బందుత్వాలూ స్నేహాలూ అన్నీ గడ్డిపోచలలాగా కనిపించాలి. "నన్ను నేనెలా తెలుసుకోవాలి? దైవాన్ని ఎలా తెలుసుకోవాలి?" అన్న తపనే అతని జీవితంలో ప్రప్రధమస్థానాన్ని ఆక్రమించాలి. అది అతనికి నిద్రపట్టకుండా చెయ్యాలి. ఊపిరాడకుండా చెయ్యాలి. ప్రాణం పోతుందేమో అన్నంత తపనతో అతను వేగిపోవాలి. దానికోసం జీవితంలో అతడు ఇంక దేనినైనా వదులుకోగలిగే స్తితికి రావాలి. నిజమైన శిష్యునికి అలాంటి తపన ఉండాలి.

అటువంటి శక్తివంతుడూ కరుణాసముద్రుడూ అయిన గురువూ, ఇటువంటి నిరంతర తీవ్రతపన కలిగిన శిష్యుడూ ఒకచోట కలిసినపుడు అద్భుతాలు జరుగుతాయి. కానీ అలాంటివాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడో తప్ప ఉండరు కనుక మామూలుగా గురువూ శిష్యులూ అనుకునేవారిలో అలాంటి అద్భుతాలు ఏవీ జరగవు.ఎందుకంటే శిష్యునికి అలాంటి తపనా ఉండదు. గురువుకు అలాంటి జ్ఞానమూ,శక్తీ,కరుణా ఉండవు. కనుక వారి మధ్యన ఏమీ జరగదు. వ్యాపారాలు మాత్రం బాగా సాగుతూ ఉంటాయి. కాలక్షేపం కబుర్లు మాత్రం జరుగుతూ ఉంటాయి.

ఏ గురువైనా శిష్యునిలో ఆత్మశక్తిని పెంపొందించాలి. తనను తాను  తెలుసుకునే దారి చూపించాలి. అంతేగాని ఎల్లకాలమూ గురువుమీద శిష్యుడు ఆధారపడి ఉండేటట్లు చెయ్యరాదు. అతన్ని తన చుట్టూ తిప్పుకొని తన అవసరాలకు అతన్ని వాడుకోకూడదు. లౌకిక వాసనలు వారిమధ్యన ఏవీ ఉండరాదు. ఇద్దరి ఆలోచనా "దైవానుభూతిని ఎలా పొందాలి" అన్న ఒక్క విషయం చుట్టూనే పరిభ్రమించాలి. భయమూ స్వార్ధమూ అపనమ్మకమూ అనవసర సంభాషణలూ వారిమధ్యన ఉండరాదు. ఒకరికొకరు సైకలాజికల్ బరువు దించుకునే చెత్తబుట్టలు కాకూడదు. అలాంటి గురుశిష్యుల బంధం నిజమైనది. "ఆశ్చర్యో వక్తా కుశలస్యలబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానువిష్ట:" అంటుంది కఠోపనిషత్తు. అలాంటి గురువూ శిష్యుడూ ఇద్దరూ ఆశ్చర్యకరమైనవారే అని అర్ధం. అటువంటివారి మధ్యనే బ్రహ్మానుభూతి అనే అద్భుతం ఆవిష్కరింపబడుతుంది.    

శ్రద్ధ కలిగిన శిష్యుని చూచినపుడు గురువు ఆనందంతో పరవశిస్తాడు. ఎందుకు? అలాంటి స్తితిలో తానూ కొన్నేళ్ళ క్రితం గందరగోళంలో ఉన్నాడు. తనకు దారి సులువుగా దొరికి ఉండవచ్చు లేదా చాలా కష్టం తర్వాత దొరికి ఉండవచ్చు. అలాంటి స్తితిలో ఇంకొక మనిషి ఇప్పుడు తన ఎదురుగా ఉన్నాడు. దారీ తెన్నూ కనపడక తపిస్తున్నాడు. అతనికి ఆ దారి చూపించాలి అని ఉప్పొంగిపోతాడు. వివేకానందుని మొదటిసారి చూచినపుడు శ్రీ రామకృష్ణుని మనసు ప్రపంచాన్ని అధిగమించి సమాధి స్తితిలోకి ఎగసిపోయింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంత మంచి ఉత్తమలక్షణ సమన్వితుడైన సాధకుడు వచ్చాడు కదా అని ఆనందంతో పరవశించింది. ఒరనుంచి తీసిన ఖడ్గం లాగా వైరాగ్యజ్వాలతో వెలుగుతున్న  నరేంద్రుని తన అక్కున చేర్చుకుంది.

అటువంటి గురువును వెదకి పట్టుకొని ఆ గురువు ఉపదేశించిన సాధనను అచంచలవిశ్వాసంతో, తదేకనిష్టతో, ఆచరించి ఫలితాన్ని పొంది గురువుకు ఆనందాన్ని కలిగించిననాడే నిజమైన గురుపూర్ణిమ. అంతేగాని స్వార్ధంతో కూడిన కోరికలతో జీవంలేని విగ్రహాలకు శవపూజలు చేసినంత మాత్రాన గురుపూర్ణిమ అనిపించుకోదు. అలాంటి పూజల వల్ల ఏ సద్గురువూ సంతోషాన్ని పొందడు.

నిజమైన గురువు మన మనసే. "శుద్ధమనసే అసలైన గురువు" అని శ్రీ రామకృష్ణులు అన్నారు. "మరి గురువును బయట వెదకడం ఎందుకూ?" అంటే "తెలియక" అని జిల్లెళ్ళమూడి అమ్మగారు జవాబు చెప్పారు. తగినంత పరిశుద్ధమైన మనసు మనలో లేదు కనుక బయట ఒక గురువు అవసరం అవుతుంది. దానికి తగినంత పరిపక్వతా శుద్ధతా వచ్చినపుడు అదే గురువు అవుతుంది. "కొన్నేళ్ళ సాధన తర్వాత నీ మనసే నీ గురువౌతుంది." అని బ్రహ్మానంద స్వామి అనేవారు. గురుశక్తీ దైవశక్తీ సాధకుని మనస్సులో ప్రవేశించినపుడు అంతా మనసులోనే అర్ధమౌతుంది.

గురుపూర్ణిమను ఎలా జరుపుకోవాలో ఇక మన ఇష్టం. వేదం సూచించిన మార్గాన్ని అనుసరించాలా లేక మన ఇష్టానుసారం పిచ్చిపనులు చేసుకుంటూ ఇదే సరైన దారి అనుకుంటూ కాలక్షేపం చెయ్యాలా మన ఇష్టం. "యం శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారకాత్ నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం", శాస్త్రం నిర్దేశించిన మార్గాన్ని వదలి తన ఇష్టానుసారం చేసేవాడు ఇహనికీ పరానికీ చెడి, రెంటికిచెడిన రేవడి అవుతాడు అని భగవానుడే గీతలో చెబుతాడు.