“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, మే 2012, ఆదివారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - "బోర్ వెల్ లో నీళ్ళు ఎన్ని అడుగులలో పడతాయి?"


భవిష్యత్తులో మానవాళిని కబళించబోతున్న అనేక భూతాలలో నీటి ఎద్దడి ఒకటి. మనం చేస్తున్న అనేక పిచ్చిపనుల వల్ల ఇప్పటికే భూమిలో వాటర్ టేబిల్ అడుగంటి పోతున్నది. చంద్రబాబు హయాంలో ఇంకుడుగుంటలు ప్రతి ఇంటికీ ఉండాలని ఒక మంచిప్రయత్నం మొదలు పెట్టారు.దానివల్ల వర్షపు నీరు వృధాగా కాలవల్లో కలిసి పోకుండా భూమిలోకి ఇంకి భూనీటి మట్టం పెరుగుతుంది. కాని దానికి ప్రజలలో సరియైన స్పందన రాలేదు. దానిని అమలు చెయ్యడంలో అధికారులలో చిత్తశుద్దీ లేదు. కాంక్రీట్ రోడ్లు మాత్రం ఎక్కడికక్కడ వేసేసి నగరాలలో మట్టి నేల అనేది కనపడకుండా చేస్తున్నారు. దానితో భూమి నీటితో తడవక వేడి పెరిగి పోతున్నది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.


ఈ నేపధ్యాన్ని అలా ఉంచితే, ఈ మధ్య మా ఫ్లాట్స్ లో భూగర్భ జలం అడుగంటి, ఉన్న బోర్ వెల్ పనిచెయ్యడం ఆగిపోయింది. కొత్త బోర్ వెల్ వేయించవలసి వచ్చింది. ఆ సందర్భంలో, నీళ్ళు ఎంత లోతులో పడతాయి? అని ఒకరు ప్రశ్నించారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఆఫీస్ కి బయలుదేరుతూ ఉన్నాను. మనసులో ప్రశ్న చక్రం వేసి చూచాను. ఇలా మనసులోనే చక్రం వేసి చూడటానికి ప్రతిరోజూ గ్రహగతిని పరిశీలించే అలవాటు ఉండాలి. పాతకాలంలో ఉదయాన్నే లేచి గ్రహస్తితిని గమనించి పంచాంగ పూర్వక సంకల్పాన్ని నిత్యానుష్టానంలో చెప్పుకునేవారు. కనుక ఆరోజు ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అన్నది వారికి తెలిసేది. నేడు మనకా అలవాటు తప్పింది గనుక పంచాంగం చూచో లేకపోతే ఏదో సాఫ్ట్ వేర్ మీద ఆధారపడో గ్రహగతులను పరిశీలిస్తున్నాము. అలా కాకుండా కొంత అభ్యాసం చేస్తే, అప్పుడు ఏ లగ్నం నడుతున్నది ఏ హోర నడుస్తున్నది ఏ గ్రహం ఎప్పుడు ఏ నక్షత్ర పాదంలోకి మారుతుంది అన్న విషయాలు  మనసులోనే తెలుసుకోవచ్చు.

ఈ ప్రశ్న అడిగినవారికి జవాబుగా - "అనుకున్నట్లు వెంటనే నీరు పడదు. ఆలస్యం అవుతుంది. బోర్ వెల్ మిషన్ చెడిపోతుంది. మళ్ళీ ప్రయత్నిస్తే దాదాపు 300 అడుగుల లోతులో నీరు పడుతుంది." అని చెప్పి నేను నా పనిమీద బయలుదేరి వెళ్లాను.ఇక ఆ విషయం పట్టించుకోలేదు.

అదేరోజు రాత్రి బోర్ వెల్ వెయ్యడం మొదలు పెట్టారు. మామూలుగా పది పన్నెండు గంటలలో అయిపోయే పని పూర్తి కావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే,మధ్యలో డ్రిల్లింగ్ బిట్ చెడిపోయి ఆరుగంటల పాటు దాన్ని రిపేర్ చేసుకోవడమే సరిపోయిందిట. దాని తర్వాత మళ్ళీ ప్రయత్నించగా వీళ్ళు అనుకున్నట్లు 250 అడుగులలో నీళ్ళు పడకపోతే ఇంకా లోపలి పోగా 300 అడుగులలో నీళ్ళు పడ్డాయి. ఎందుకైనా మంచిదని 350 అడుగులవరకూ వెళ్లడం జరిగింది. 

ఇదంతా గమనిస్తున్న మా అమ్మాయి," ఎలా చెప్పగలిగావు నాన్నా?" అని అడిగింది.తనకూ జ్యోతిష్య విద్యలో కొంత ఆసక్తి ఉండటంతో ఆరోజు నేను మనసులో గుణించిన ప్రశ్న చక్రాన్ని వేసి చూపించి వివరించాను. 

ప్రశ్న సమయంలో శీర్శోదయ రాశి అయిన కన్యా లగ్నం ఉదయిస్తున్నది.   లగ్నాధిపతి అయిన బుధుడు నవమకోణంలో మంచిస్తితిలో ఉన్నాడు. కనుక పని జరుగుతుంది. కాని అతడు నపుంసక గ్రహం కనుక పరిస్తితి ఆశాజనకంగా లేదు. జలసంబంధ ప్రశ్నలలో జల కారక గ్రహాలైన చంద్రుడూ శుక్రుడూ బాగుండాలి.వీరిలో శుక్రుడు వక్ర స్తితిలో ఉన్నాడు. కనుక అనుకున్న పని వెంటనే జరగదు. పైగా లగ్నంలో వక్ర శని కూచుని ఉన్నాడు. కనుక ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుంది. శని చిత్తా నక్షత్రంలో ఉండటంతో మెషినరీ రిపేర్ వస్తుంది. కాని చంద్రుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉండటం వల్ల నీరు పడక తప్పదు. ఆర్ద్ర అంటేనే చెమ్మ, తడి అని అర్ధం కదా. కాని చంద్రుని మీద శని దృష్టి వల్ల అనుకున్న దానికంటే ఆలస్యం కాక తప్పదు.

ఇప్పుడు, అసలు ప్రశ్న విషయం అయిన - "ఎంత లోతులో నీరు పడుతుంది?" అన్నది చూడాలి. చతుర్దానికి పాతాళం అని ఇంకొక పేరు. నీరు ఉండేది పాతాళం లోనే. దానికి అధిపతి గురువు అయ్యాడు. ప్రస్తుతం గోచార రీత్యా బలమైన ఫలితాలు చూపిస్తున్న గ్రహం గురువే. ఆ గురువు జలకారక గ్రహమైన శుక్రుని యొక్క  నవమంలో ఉంటూ మంచిని సూచిస్తున్నాడు. అంతే కాక లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఆటంకాలు తొలగిస్తాడు.వృషభం భూతత్వ రాశి. కన్య కూడా భూతత్వ రాశే. కనుక భూమికి సంబంధించిన పని  జరుగుతున్నది. సంఖ్యా శాస్త్ర రీత్యా గురువు అంకె 3 కనుక 300 అడుగుల లోతులో నీరు పడవచ్చు. ఎందుకంటే చీరాల మొదలైన సముద్ర తీరాలలో పడేటట్లు గుంటూరులో 30 అడుగులలో నీరు పడే ప్రసక్తే లేదు. కనుక 300 కావచ్చు అని ఊహించాను.

అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పబోయే ముందు, ఇంత విశ్లేషణ చెయ్యవలసి ఉంటుందా అని మా అమ్మాయి ఆశ్చర్యపోయింది. అవునంటూ తలాడించాను. "నీవూ నేర్చుకోవచ్చు కదా" అంటే, "ఎందుకూ? ఏదైనా సందేహం వస్తే చెప్పడానికి నీవున్నావుగా" అని నవ్వేసింది.  నేర్చుకుందామని వెతికే వాళ్లకేమో నేర్పేవాళ్ళు దొరకరు. నేర్పుతాను అంటే శ్రద్దగా నేర్చుకునే వాళ్ళూ దొరకరు. అనేక ప్రాచీన విద్యలు ఇలాగే కాలగర్భంలో కలిసిపోయాయి.

ప్రశ్న శాస్త్రం ద్వారా ఇలాంటి విషయాలు కూడా గ్రహించవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ.