“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, మే 2012, గురువారం

మహావీరుల జాతకాలలో కుజకేతువుల ప్రభావం

యుద్ధ విద్యలకు కారకుడు అంగారకుడు లేదా కుజుడు.ఒక వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా వాటిలో ప్రావీణ్యం సంపాదించాలన్నా అతనికి కుజుని అనుగ్రహం ఉండాలి.కుజునికి అధిదేవత అయిన సుబ్రమణ్యస్వామిని దేవసేనాపతి అంటారని మనకు తెలుసు.దివ్యశక్తుల సైన్యానికి ఆయన సేనాపతి.కనుక యుద్ధవిద్యలు నేర్వాలంటే ఆయన అనుగ్రహం తప్పక ఉండాలి.కుజుడు ఆత్మకారకునిగా ఉన్న జాతకాల్లో ఇతర కాంబినేషన్స్ కలిస్తే ఆ జాతకునికి వీరవిద్యలు ఖచ్చితంగా వస్తాయి.

ఆయా యోగాలవల్ల ఏ విధమైన మార్షల్ఆర్ట్ ఆజాతకునికి వస్తుందో,అతనికి  ఆ విద్య ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు."కుజవత్ కేతు" అనే సూత్రం ప్రకారం, కేతువు కుజుని లక్షణాలు కలిగి ఉంటాడు. ఇక కుజ కేతువులు ఒక జాతకంలో కలిస్తే ఆ జాతకునికి మార్షల్ ఆర్స్ లో నైపుణ్యాన్ని తప్పక ఇస్తారు. ఒకరకంగా మార్షల్ ఆర్ట్స్ అనేవి హింసకు సంబంధం ఉన్న విద్యలే కనుక కుజ కేతువుల హింసా ప్రవృత్తి వీటిలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ జాతకులలో అమితమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు కొందరు ప్రముఖ వీరుల జాతకాల్లో కుజకేతువులను పరిశీలిద్దాం.

మొదటగా టైగర్ క్రేన్ కుంగ్ ఫూ లో ఉద్దండుడైన "వాంగ్ ఫే హంగ్" జాతకాన్ని చూద్దాం. ఈయన 9-7-1847 న చైనాలోని ఫోషాన్ లో జన్మించాడు.ఈయన కుంగ్ఫూ విద్యలో మహావీరుడే కాక, ఆక్యుపంచర్ లో మంచి ప్రజ్ఞాశాలి. ప్రముఖ వైద్యుడు,విప్లవవీరుడు. అయిదేళ్ళ వయసులో ఈయన కుంగ్ఫూ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పదమూడేళ్ళు వచ్చేసరికి ఒక మాస్టర్ గా ఎదిగాడు. ఈయన "షాడో లెస్ కిక్" అనే ఒక కిక్ ను కనిపెట్టాడు. ఈయన రకరకాల ఆయుధాలను వాడటంలో కూడా మంచి నైపుణ్యం కలవాడు. ఒకసారి చేతికర్రను ఆయుధంగా వాడి ముప్పైమంది బందిపోట్లను తరిమికోట్టాడు.   ఈయన మీద వందకు పైగా సినిమాలు వచ్చాయి. జెట్ లీ హీరో గా నటించిన "Once upon a time in China" సీరీస్ అన్నీ ఈయన జీవితాన్ని ఆధారంగా తీసుకొని నిర్మించినవే. జాకీ చాన్ హీరోగా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన "The young master" సినిమా కూడా ఆయన జీవిత గాధ ఆధారంగా తీసినదే. ఈయన జాతకంలో కుజకేతువులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో ఉండటం చూడవచ్చు. వారిద్దరూ మీనరాశి 22 డిగ్రీల మీద రేవతీ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు కర్కాటకరాశిలో స్వనక్షత్రం లో ఉండటం, చంద్రుడు ఉచ్చ స్తితిలో ఉండటం చూడవచ్చు. అందుకే ఈయనకు వీరవిద్యలతో బాటు మంచి వైద్యుడు అన్న పేరూ ఉంది. చైనీస్ మిలిటరీకి ఈయన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా,వైద్యుడిగా ఉండేవాడు. ఈయన 70 ఏళ్ళు పైన బతికాడు. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.

రెండవ జాతకానికి మనం మూడుసార్లు ప్రపంచ వూషూ చాంపియన్ అయిన గోల్డెన్ గర్ల్ "జు హుయిహుయి"జాతకాన్ని తీసుకుందాం. ఈమె 2008 ఒలింపిక్స్ లో "వూషూ" లో ప్రధమ స్థానంలో నిలిచింది. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పెరిగి తన తల్లి అడుగుజాడలలో నడిచి వీరవిద్యలు అభ్యాసం చేసింది. ఏళ్ల తరబడి అభ్యాసం తర్వాత తిరుగులేని వీరవనితగా రాటుదేలింది. తర్వాత ఈ అమ్మాయి అనేక సినిమాలలో నటించింది. ఈమె చేసే విన్యాసాలు చూస్తె అసలు ఈమె శరీరంలో ఎముకలు ఉన్నాయా లేవా అని అనుమానం కలుగుతుంది. వెపన్స్ ను ప్రయోగించడం లోనూ, వెపన్ లెస్ ఫామ్స్ చెయ్యడం లోనూ ఈమె వేగం అనితర సాధ్యం. ఈమె జాతకంలో కూడా కుజ కేతువులు 10 డిగ్రీల మీద ఉన్నప్పటికీ, వేర్వేరు రాశులలో ఉన్నారు. కుజుడు శనితో కలసి శని నక్షత్రంలో స్వరాశిలో ఉంటూ అమిత శ్రమకు ఓర్చి చెమటలు కార్చి నేర్చుకున్న వీరవిద్యలను సూచిస్తున్నాడు. కేతువు కుజునికి ద్వాదశంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు. 

వాంగ్ ఫే హంగ్ జాతకానికీ ఈమె జాతకానికీ తేడా ఏమిటంటే, వాంగ్ ఫే హంగ్ నిజజీవితంలో వీరుడు. ఈమె ప్రదర్శన కళ అయిన వూషూ లో నిపుణురాలు. నిజజీవితంలో ఈమె వీరవిద్యలను వాడే అవసరం రాలేదు. కాని వాంగ్ ఫే హంగ్ నిజజీవితంలో వీరుడే గాక మిలిటరీకి శిక్షకుడు. అందుకే ఆయన జాతకంలో కుజకేతువులు ఒకే డిగ్రీ మీద కలిసి ఉన్నారు. కాని ఈమె జాతకంలో అలా లేరు. సినిమారంగానికీ వినోదరంగానికీ చెందిన తులారాశిలో కేతువు ఉంటూ,శుక్రున్ని సూచిస్తూ ఈమెకు ఆయా వినోదరంగాలలో ప్రవేశం ఇచ్చాడు. అందుకే ఈమె సినిమాలకూ క్రీడలకూ అంకితం అయ్యింది. వాంగ్ ఫే హుంగ్ జాతకంలో కేతువు గురువును సూచిస్తున్నాడు. అందుకే ఆయన ఒక సాంప్రదాయబద్దమైన  మార్షల్    ఆర్ట్స్  గురువు అయ్యాడు.

ఈ విధంగా రకరకాల తేడాలున్న కాంబినేషన్స్ ద్వారా కుజకేతువులు వివిధ రకాలైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ఇస్తారని మనం ఒక జాతకంలో గమనించవచ్చు.