“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, జనవరి 2012, మంగళవారం

రివర్స్ పామిస్ట్రీ

నిన్న ఒక పెద్దాయన నా దగ్గరకి వచ్చి పరిచయం చేసుకున్నాడు.  

"నా పేరు ఫలానా. నేను కొన్నేళ్ళ క్రితం రిటైర్ అయ్యాను. మీరు జ్యోతిష్యం చెబుతారని తెలిసి పలకరిద్దామని వచ్చాను." అంటూ తన కార్డ్ ఇచ్చాడు.

ఆయన బాగా చదువుకున్నవాడూ డబల్ పీజీ, డాక్టరేటూనూ. సరే ఏం చెబుతాడో విందాం అనుకుంటూ "లేదండీ నేను ప్రొఫెషనల్ జ్యోతిష్కున్ని కాను. అడిగినవారందరికీ నేను చెప్పనుకూడా. జస్ట్ హాబీగా చూస్తుంటాను.నాకు జ్యోతిష్యవిద్య  పెద్దగా తెలీదు. ఏదో మిడిమిడి జ్ఞానం అంతే. కాకుంటే పదేళ్ళ క్రితం MA Astrology చేసాను. చేసాక అదొక టైంవేస్ట్ అని తెలిసింది." అన్నాను.

"నేను రివర్స్ పామిస్ట్రి  చెప్తాను." అన్నాడు పెద్దాయన ఏదో నములుతూ. బహుశా వక్కపొడి అనుకుంటా.

"రివర్స్ పామిస్ట్రీనా? అంటే? " అన్నాను.

"నేను అరిచేతులు చూచి జాతకం చెప్పను. చేతుల వెనుకభాగం చూచి జాతకం చెప్తాను" అన్నాడు అదోరకంగా చూస్తూ.

నాకు ఫకాల్న నవ్వొచ్చింది. కాని తమాయించుకున్నాను. అలా నవ్వు రావటానికి ఒక కారణం ఉంది. కొన్నాళ్ళ క్రితం రోడ్డుమీద పోతుంటే, నా ముందు ఒక కారు పోతోంది. దాని వెనుక గ్లాస్ మీద "ముఖ జ్యోతిష్కులు" అని పెద్ద  అక్షరాలతో వ్రాసుంది. అంటే ఆ కారులోనివాడు ముఖం చూచి జ్యోతిష్యం చెప్పేవాడన్నమాట. నా చిన్నప్పుడు  "ముఖంచూస్తె చెప్పవచ్చు" అని అంబడిపూడి వ్రాసిన పుస్తకం ఒకటి ఉండేది. బహుశా వీడూ ఆ బాపతు అయి ఉంటాడు. ఎవడి పిచ్చి వాడికానందంలే అనుకోని నా దారిన నేను వెళ్లాను.తర్వాత ఈసంగతి మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావు గారికి చెప్పాను. వెంకటేశ్వరరావుగారికి జ్యోతిష్యవిద్య తెలుసు. ఏడోభావం విషయాలు చెప్పటంలో ఆయన మంచిదిట్ట. ఒకప్పుడు జ్యోతిష్యాన్ని బాగా కుస్తీ పట్టి ప్రస్తుతం దానికి దూరంగా ఉంటున్నాడు. కాని చర్చలలో మాత్రం పాల్గొంటాడు. ఆయన కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయ్యాడు. ఆయన సర్వీసంతా ప్రకాశం జిల్లాలోనూ పల్నాడులోనూ గడిచింది. సర్వీసంతా పిటీషన్లూ, కోర్టులూ,గొడవలూ,ఇదే సరిపోయింది.   ఆ ఖర్మో ఏమోగాని ఆయన మాటల్లో పల్లెటూరి మోటుభాష కొంచం ఎక్కువగా  వాడుతూ ఉంటాడు. నేను చెప్పినమాటవిని ఆయన వెటకారంగాచూస్తూ"ముఖజ్యోతిష్కుడా?వాడి మొహమేం గాదూ?ముడ్డిజ్యోతిష్కుడని పెట్టుకోకపోయాడూ?"అని దీర్ఘంతీశాడు.ఆ డైలాగ్ కి అక్కడున్నవారంతా పడీపడీ ఒకటే నవ్వు.

ఆ సంగతి గుర్తొచ్చి నాకు మళ్ళీ చచ్చేనవ్వొచ్చింది. అయినా పెద్దాయన ముందు కారణం లేకుండా నవ్వడం బాగుండదని బలవంతాన నవ్వాపుకుని సీరియస్ గా ముఖం పెట్టాను.

"చేతులవెనుకభాగం చూచి జాతకం చెప్తారా?ఎందుకలా?" అనడిగాను.

"ఏమో నాకేతెలీదు. నేను గత నలభైఏళ్లనుంచీ దీనిని ప్రాక్టీస్ చేస్తున్నాను " అన్నాడు.

అతన్ని చూస్తే నాకు జాలేసింది. ఏదేమైనా గుంటూరోళ్ళకి పైత్యం బాగా ఎక్కువే అనుకున్నా. దీనికి నేనూ మినహాయింపు కాదనుకోండి.  

"ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ విద్యని?" అని అడిగాను. 

"ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. నేను బాబా భక్తుణ్ణి. ఆయనే నా గురువు. అన్నీ ఆయనే నేర్పిస్తాడు" అన్నాడు.

"భలేదొరికాన్రా నాయనా నీకుపొద్దున్నే" మనసులో  అనుకుంటూ "మరి బాబాకి పామిస్ట్రీ రాదుగా మీకెలా నేర్పించాడు?" అన్నాను.

"మూర్ఖుడా !!!"అన్నట్లు చూచాడు పెద్దాయన.

"బాబా ధ్యానంలోఉంటె అన్నీ అవే స్పురిస్తాయి " అన్నాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రేడిక్షన్సూ అవి ఎలా నిజమయ్యాయో ఆ సంగతులు చెబుతూ చాలాసేపు సుత్తికొట్టాడు.

"మీరు చెప్పినవాటిలో ఫెయిల్యూర్స్ ఏమీలేవా?" అడిగాను.

"ఉన్నాయి. కొన్ని 70% జరుగుతాయి. కొన్ని 80% జరుగుతాయి. కొన్నిసార్లు 50% వరకూ కూడా ఫెయిల్ అయ్యాయి. అన్నీ జరగవు." అన్నాడు 

ఈ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది. పరవాలేదు కాస్త ఓపెన్ మైండ్ ఉన్నవాడే అనుకున్నా.

"జరగబోయే వాటిని చాలావరకూ తెలుసుకోవచ్చు. రెమెడీస్ తో కొంతవరకూ వాటి తీవ్రత తగ్గించవచ్చు. కాని సమస్యని  పూర్తిగా తొలగించగలవాడికోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పటివరకూ అలాటివాడు దొరకలేదు." అన్నాడు.

"అలాటివాడి అడ్రస్ బాబాని అడక్కపోయారా? అన్నీ చెప్పే బాబా అదెందుకు చెప్పటంలేదో?" అందామని నోటిదాకా వచ్చింది. పోనీలే మొదటి సమావేశంలోనే షాక్ ఇవ్వడం ఎందుకు అని ఆలోచించి -"బహుశా అలాటివాడు ఎప్పటికీ దొరక్కపోవచ్చులెండి " అన్నాను.

"కావచ్చు. నేను ఇప్పటికి 4  నుంచి 5  లక్షలచేతులు(అంటే చేతుల వెనుకభాగాలు) చూశాను. నాకు 6000  మంత్రాలు తెలుసు. వాటిని ఉపయోగించి సమస్యల తీవ్రత తగ్గిస్తాను." అన్నాడు.

"అలాగా. మంచిదే." అన్నాను.

ఎన్ని చెప్పినా నేను అస్సలు ఇంప్రెస్స్ కాకపోవడంతో కాసేపటికి ఆయనకీ విసుగు పుట్టినట్లుంది. కనీసం నా చెయ్యి వెనుకభాగం చూడమని కూడా నేను అడగకపోతిని. ఇక చాల్లే అనుకున్నాడో ఏమో " వస్తానండీ మరి" అని లేచాడు.

"అలాగే మంచిది. వెళ్లి రండి.నాతో ఏదైనా పనుంటే చెప్పండి. నా పరిధిలో సాయం చెయ్యగలను " అని అన్నాను. ఆయన వెళ్ళిపోయాడు.

ఇలాంటి విచిత్రవ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన చెప్పే విద్యకు శాస్త్రప్రామాణికత లేదు. సాముద్రికశాస్త్రంలో మనిషిశరీరాన్ని గమనించి అతని మనస్తత్వాన్ని భవిష్యత్తునూ అంచనా వెయ్యవచ్చు. అంతేగాని రివర్స్ పామిస్ట్రీ, అబ్వర్స్ ఆస్ట్రాలజీ, వర్టికల్ వాస్తు, హారిజాంటల్ హేండ్ రీడింగ్ వగైరాలు ఎక్కడా లేవు. పైగా దీనికి బాబా ట్రేడ్ మార్క్ ఒకటి. ఆయనొకడు దొరికాడు ప్రతివాడికీ. ఎవడెవడి పైత్యానికీ సపోర్ట్ గా ఆయన్ని వాడుకుంటారు. పాపం బాబాకి కాపీరైట్ లేదుకదా. అడుక్కుండేవాడి దగ్గర్నించి అందరూ బాబాకింద షెల్టర్ తీసుకోవడమే. పాపం బాబాకి ఎంత గతిపట్టింది ఈ లోకంలో అని జాలేసింది నాకు. 

ఆరోజు సాయంత్రం మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావుగారు మళ్ళీ కలిశారు. కాని రివర్స్ పామిస్ట్రీ విషయం ఆయనకి చెప్పదలుచుకోలేదు. ఇది వింటే ఆయన ఇంకే డైలాగు వదులుతాడో ఖర్మ, అది వినలేక మనం చావాలి అని ఈ విషయం ఆయన దగ్గర ఎత్తలేదు.

మొదటిసారి గనుక మొహమాటం కొద్దీ ఊరుకున్నాను. రివర్స్ పామిస్ట్రీగారు ఈసారి కనిపిస్తే ఆయనకి రివర్స్ గేర్ తప్పదు మరి.