“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జులై 2011, శుక్రవారం

సైంటిఫిక్ టెంపర్

"సైంటిఫిక్ టెంపర్" అన్న పదం మొదటగా వ్రాసింది నెహ్రూ అని CCMB మాజీ డైరెక్టర్ భార్గవ మొన్నీ మధ్య  చెప్పారు. చాలా గొప్ప విషయం. అంతటితో ఆయన ఆగితే బాగుండేది. హిందూ మతం మీదా, హోమియోపతీ సిస్టం మీదా ఆయన విరుచుకు పడి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. అది ఆయనలోని మేధోపరమైన డొల్లతనాన్ని బయట పెట్టుకున్నట్లు అయింది.

ఆయన చేసిన విమర్శలు ఎంత అల్పంగా ఉన్నాయంటే, ఏ మాత్రం బుర్ర ఉన్నచిన్న పిల్లవాడికి కూడా వాటిలోని  లోపాలు స్పష్టంగా కనిపించాయి. శాస్త్ర వేత్తలమీద ఆయన ఆరోపణ ఏమిటంటే పగలంతా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు సాయంత్రానికి గుళ్ళూ గోపురాలకు వెళుతూ దేవుణ్ణి నమ్ముతున్నారట. దేవుణ్ణి నమ్మితే సృష్టి దేవుడే చేసినట్లు అవుతుందనీ అప్పుడు డార్విన్ సిద్ధాంతం తప్పనీ ఆయన వాదన. శ్రీహరికోట రాకెట్ శాస్త్రవేత్తలు తమ ప్రయోగం ఏ విఘ్నమూ లేకుండా సాగాలని తిరుపతి వెళ్లి పూజలు చేయించారట. దానినీ ఆయన తప్పు బట్టాడు. శాస్త్రవేత్తలలో ఈ ద్వంద్వ ధోరణి మారాలని ఆయన ఆశట. ఆయన ఈ మధ్యన ఇచ్చిన ఉపన్యాసం ఈ ధోరణిలోనే సాగింది. అది చదివి నాకు నవ్వాగలేదు. ఇదీ మన శాస్త్రవేత్తల స్థాయి !!!  

దేవుడు అనేవాడు ఎక్కడో మేఘాల మాటున కూచుని ఆరు రోజులు సృష్టి చేసి ఏడోరోజునించీ శాశ్వత రెస్టు తీసుకుంటున్నాడని నమ్మే, కాలంచెల్లిన క్రైస్తవ సిద్ధాంతాన్ని పట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడని తెలిసిపోతున్నది. ఈ ధోరణి గత వందా ఏభై సంవత్సరాల పాశ్చాత్య శాస్త్రవేత్తల, నాస్తికమ్మన్యుల ఆలోచనా విదానమనీ, ఆయన ఏవో బూజు పట్టిన పాత యూరోపియన్ పుస్తకాలు చదివి ఈ మాటలు మాట్లాడుతున్నాడనీ, అటువంటి ఆటవిక అవగాహనను దాటి ప్రస్తుత సైన్స్ చాలా ముందుకు వచ్చిందనీ, అసలు హిందూమతం అంటే ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదనీ అర్ధమౌతున్నది. మతాన్ని గుడ్డిగా అనుసరించే వాళ్ళ కంటే, ఇలా అర్ధం చేసుకోకుండా మాట్లాడేవాళ్ళ వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. నేటి మోడరన్ ఫిజిసిస్టులు అద్వైత వేదాంతానికి చాలా దగ్గరగా వచ్చేసారని ఆయనకు తెలుసో లేదో మరి.

సైన్స్ లో స్థిరత్వం లేదనీ, అది రోజుకో మాట చెబుతుందనీ,  దానికి భిన్నంగా, వేదాంతం స్థిరమైన భావాలు కలిగినదనీ ఆయన మర్చిపోయినట్లున్నారు. ఇన్నేళ్ళ బయలాజికల్ రీసెర్చిలో, మెడికల్ రీసెర్చిలో, వెధవ మలేరియానూ, టైఫాయిడ్ నూ ఎందుకు నివారించలేకపోతున్నారో ఆయన వివరించి ఉంటె బాగుండేది. ఇన్ని మాట్లాడే ఆయన "భార్గవ" అని ఒక వేదరుషి పేరు ఎందుకు పెట్టుకున్నారో బహుశా ఆయనకే తెలియదు లాగుంది. ఒకవేళ ఆయన్ను ఇదే విషయం అడిగితే, ఆ పని చేసింది నేను కాదు, నాకు నేనెలా పేరు పెట్టుకోగలను? ఆ పని నా తల్లి దండ్రులు చేసారు. తప్పు వారిది. ఆ మాత్రం తెలియదా అంటూ ఎగతాళి చేసినా చేస్తాడు.  శాస్త్రవేత్తలు ఎంత చేసినా, chance factor అనేది ఒకటి ఎప్పటికీ ఉంటుందనీ, దానిని తమకు అనుకూలంగా చెయ్యమనే,  తిరుపతి వెళ్లిన శాస్త్రవేత్తలు విశ్వశక్తిని కోరుకున్నారనీ ఆయన గ్రహించలేకపోవడం వింతగా ఉంది. 

అసలు సైన్స్ కనుక్కున్న అనేక ఆవిష్కరణలు వారి గొప్ప కాదనీ, అవి వారి అంతచ్చేతన నుంచి ఉబికి వచ్చి వారి ముందు ప్రత్యక్షమైన విషయాలనీ ఆయన మర్చిపోయారా? అటామిక్ స్ట్రక్చర్, బెంజీన్ రింగ్ స్ట్రక్చర్ మొదలైన అనేక ఆవిష్కరణలు శాస్త్రవేత్తల  మనస్సులో మెరిసిన తళుకులనే విషయం బహుశా ఆయనకు తట్టలేదు.

హోమియోపతీ కూడా అసలు వైద్యం కాదనీ దానిలో డిగ్రీలివ్వడం ప్రభుత్వం ఆపాలనీ ఆయన వాదించాడు. "ప్లాసిబో ఎఫెక్ట్" వల్లే హోమియో పనిచేస్తున్నదన్న భ్రమ కలుగుతుందనీ అంతే కాని అది అసలు పని చెయ్యదనీ ఆయన వాదన. హోమియో ఔషధాలలో దేనినైనా సరే  హైయ్యర్ పోటేన్సీలో తీసుకుని రిపీటేడ్ గా ఒక మూడు నాలుగు డోసులు వేసుకుని చూస్తె అందులో పదార్ధం లేకున్నా అవి ఎలా పనిచేస్తాయో ఆయనకే విషయం అర్ధం అయ్యి ఉండేది. 

హోమియో ఔషధాలలో తాచుపాము విషం నుంచి తీసిన "నజా" అనే మందు ఒకటి ఉంది. అవగాడ్రో థీసిస్ ప్రకారం 6 పోటేన్సీ దాటితే హోమియో ఔషధాలలో మేటర్ ఉండదు కదా. పోనీ ఇంకాస్త వెసులుబాటు ఇద్దాం. 30 పోటేన్సీలో అయితే ఖాయంగా అసలు పదార్దమే ఉండదు.  అంటే పాము విషం ఉండదు. "నజా-30 " మందును గంటకొకసారి రెండు మాత్రల చొప్పున భార్గవగారిని  వేసుకుని చూడమందాం. 24 గంటల తర్వాత గుండె నొప్పి తదితర "నజా" లక్షణాలతో ఆయన హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చేరవలసి వస్తుందో లేదో ఆయనే చూడవచ్చు. పదార్ధం ఏమీలేని ఉత్త పంచదార గుళికలు ఎలా ఈ లక్షణాలను పుట్టిస్తాయో అప్పుడు ఆయనే చెప్పాల్సి ఉంటుంది.   
 
నీటి రుచి తెలుసుకోవాలంటే తాగి చూడాలి. అంతే కాని నీటిని చేత్తో తాకి నాకు నీటి రుచి తెలియలేదు కాబట్టి యిది నీరు కాదు అంటే ఎలా ఉంటుందో ఈయనగారు చెబుతున్నదీ అలాగే ఉంది. ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆ సబ్జెక్టుకున్న పరిధికి సంబంధించిన సూత్రాల ద్వారా చూడాలి. అంతేకాని వేరొక పరిధికి చెందిన సూత్రాలను ఇక్కడ అప్లై చేసి, నేను చిన్నప్పుడు నేర్చుకున్న సూత్రాలు ఇక్కడ పనిచెయ్యడం లేదుకనుక యిది అసలు సైన్సే కాదు అనడం హాస్యాస్పదంగా ఉంది. 

ఈ శాస్త్రవేత్తలతో వచ్చిన చిక్కే యిది. వారికి అర్ధమైన సూత్రాలతో ప్రపంచంలో ఉన్న అన్నింటినీ అర్ధం చేసుకోగలమని వారి భావన. ఈ భావన సైంటిఫిక్ స్పిరిట్ ఎలా అవుతుందో వారే చెప్పాలి. తనకు తెలిసిందే సర్వస్వం అన్న భావనే సరైనదైతే, ఇక రీసెర్చికి ఆస్కారం ఎక్కడుంది? మధ్యయుగాలలో  కోపెర్నికస్ నూ గెలీలియోనూ హింసించిన క్రైస్తవమతపిచ్చిగాళ్ళకూ ఈయనకూ తేడా ఏముంది? వారికి అర్ధం కానివాటిని వారు ఒప్పుకోలేదు. ఈయనకు అర్ధం కానివాటిని ఈయనా ఒప్పుకోడం లేదు. అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని మాత్రం వాళ్ళూ చెయ్యలేదు. ఈయనా చెయ్యడం లేదు. మధ్య యుగపు క్రైస్తవమతకిరాతకులు  ఆ కాలపు సైంటిష్టులను హింసించారు. ఈయన సైంటిష్టునని చెప్పుకుంటూ సైన్సుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ  సైంటిఫిక్ స్పిరిట్ ను  అపహాస్యం చేస్తున్నాడు. అదే తేడా.

హోమియో పోటేన్సీలు పని చేసే మాట వాస్తవం. యిది ఎన్నో సార్లు ప్రాక్టికల్గా రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎపిడెమిక్ రోగాలు ప్రబలినప్పుడు హోమియో ఔషధాలు బ్రహ్మాండంగా పనిచేసినట్లుగా ఎన్నో రుజువులున్నాయి. ఇంగ్లాండ్ రాజూ రాణీ హోమియో ఔషధాలనే వాడతారనీ, రాయల్ లండన్ హోమియోపతిక్ హాస్పిటల్ అనేది 1850 నించీ రాయల్ పేట్రోనేజ్ తో నడుస్తోందనీ ఆయన తెలుసుకోవాలి. "సర్ జాన్ వేయిర్" పేరును భార్గవ గారు విన్నారో లేదో నాకు తెలియదు. సర్ జాన్ వేయిర్ ప్రఖ్యాత హోమియో వైద్యుడే కాక, ఇరవయ్యో శతాబ్దపు అనేక యూరోపియన్ రాజ కుటుంబాలకు రాజవైద్యుడు. కింగ్ జార్జ్-5, కింగ్ జార్జ్-6 , కింగ్ ఎడ్వర్డ్ -8 , క్వీన్ ఎలజబెత్-2 మొదలైన రాజకుటుంబీకులకు ఈయన ఫామిలీ ఫిజీషియన్ అన్న సంగతి సైంటిస్ట్ భార్గవ గారికి తెలీదు కాబోలు. రాయల్ ఫేమిలీస్ పిచ్చివాళ్ళా హోమియోపతి వాడటానికి? మన మాత్రం తెలివితేటలు వాళ్లకు లేవని భార్గవ గారి ఉద్దేశమా? సర్ జాన్ వేయిర్ వ్రాసిన పుస్తకాలు కొన్నైనా చదివితే హోమియోపతి అనేది ఎంత గొప్ప వైద్య విధానమో మన మట్టి బుర్రలకు తెలుస్తుంది. 

హోమియో ఔషధాలు ఎలా పని చేస్తాయో భార్గవగారు పెట్టిన CCMB లాటి సంస్థలు ప్రయోగాలు చేసి నిరూపించాలి. ఆ పని చెయ్యకుండా, పోటేన్సీలలో పదార్ధం లేదు గనుక అవి పని చెయ్యవు అని మొండిగా వాదించడం ఎలా ఉందంటే గాలి నాకు కనిపించదు కనుక అసలు గాలే లేదు అన్నట్లు ఉంది. ఇదీ మన సైంటిష్టుల మేధో స్థాయి.

మనకు స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటింది. దేశం నలుమూలలా ప్రఖ్యాత సైంటిఫిక్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ 60 ఏళ్లలో ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేశారు. Ph D పట్టాలు పొందారు. వీరందరూ చేసిన, చేస్తున్న పరిశోధనలలో ప్రజలకు ఉపయోగపడేవి ఎన్నున్నాయో ఆయన చెబితే బాగుండేది. అలా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేసి ఉన్నట్లయితే ఇన్నాళ్ళబట్టీ   ప్రజా జీవితం ఇంత అద్వాన్నంగా ఎందుకుందో ఆయనే వివరించాలి. 

ఎంతసేపూ పాశ్చాత్యులు చేసిన ఆవిష్కరణలను కాపీ కొట్టి వాడుకుంటున్న మనం సైన్స్ కు ఏమి ఒరగబెట్టామో  ఆయన వివరించాలి. రామన్ ఎఫేక్టూ, చంద్రశేఖర్ లిమిటూ వంటి ఒకటి రెండు తప్ప మన శాస్త్రవేత్తలు సైన్సుకు ఒరగబెట్టిన మౌలికమైన ఆవిష్కరణలు ఏమీ లేవు.  మనవాళ్ళు చేస్తున్న పరిశోధనలన్నీ చాలావరకూ wasteful thesis లేననీ వాటిలో ప్రజాజీవితాన్ని సరాసరి మెరుగుపరిచే ఆవిష్కరణలు ఏమీ లేవనీ ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త నాకు చెప్పాడు. 

ప్రజాధనంతో ప్రజలకు పనికిరాని పరిశోధనలు ఏళ్ల తరబడి చేస్తున్న శాస్త్రవేత్తలు ఇతరులను విమర్శించడం, అందులోనూ తమకు అర్ధం కాని సబ్జెక్టుల మీద వ్యాఖ్యానం చెయ్యడం  గురివింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. మానవాళికి దొంగబాబాలు ఎంత ప్రమాదకారులో దొంగ సైంటిస్టులూ అంతే.

నిజమైన సైంటిస్ట్ కు స్థిరమైన అభిప్రాయాలు ఏమీ ఉండవు. ఎందుకంటే సృష్టిలో ఏదీ ఇదమిద్ధంగా నిర్ణయింపబడేది, నిర్వచింపబడేదీ కాదని అతనికి అర్ధమౌతుంది. దేన్నైనా నిరూపించబడనంతవరకూ నమ్మకపోవడం మంచిదే. కాని దానిని నిరూపించే ప్రయత్నమూ, అర్ధం చేసుకునే ప్రయత్నమూ చేసేవాడే సైంటిస్ట్. అంతేగాని ఊరకే ప్రతిదాన్నీ తెలిసినా తెలియకపోయినా విమర్శిస్తూ ఇంకేమీ చెయ్యకుండా కూచునేవాడికి  సైంటిఫిక్ స్పిరిట్ ఉన్నదని నమ్మలేం. అది బయాస్ అవుతుంది గాని సైంటిఫిక్ స్పిరిట్ అవ్వదు.  

హోమియో పోటేన్సీలు ఎలా పని చేస్తాయో తన అధీనంలో ఉన్న modern scientific infrastructure సహాయంతో కనుక్కునే ప్రయత్నాన్ని భార్గవగారు చేస్తే బాగుంటుంది. బూజుపట్టిన క్రైస్తవసిద్ధాంతాలను పక్కనపెట్టి వేదాంతాన్ని చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. There are no absolutes in this universe, even in Physics. -- అన్న ఐన్ స్టీన్ మాటలను   భార్గవగారు ఒక్కసారి మననం చేసుకుంటే, అవి వశిష్టగీత లోని వేదాంతభావాలతో ఎంత దగ్గరగా ఉన్నాయో ఆయనకు అర్ధం అవుతుంది.

అప్పుడైనా సైన్సుకూ భారతీయ వేదాంతానికీ ఎటువంటి ఘర్షణా లేదనీ, సైన్సు యొక్క తిరుగుబాటు అంతా జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాం వంటి ఎడారి మతాలలో ఉన్న "దేవుని" భావనతోనేననీ, ఆ భావన చాలా ప్రిమిటివ్ అనీ ఆటవికస్థాయిభావన అనీ కనీసం అప్పుడన్నా ఆయన తెలుసుకోగలుగుతారు.